అక్కచెల్లెళ్ల సంబరం.. చూడాలి వైభవం
- NVS PRASAD
- Jun 9
- 3 min read
పొలుమూరు కుటుంబీకుల నుంచి నూకాలమ్మ
మావూరి ఇంటి నుంచి పెద్దమ్మ
అంజలి రథం మీద కొండక కుటుంబం
1963 తర్వాత ఉత్సవాలకు బ్రేక్
పాతశ్రీకాకుళంలో మరికొద్ది గంటల్లో సిరిమానోత్సవం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
పదేళ్లకోసారొచ్చే పండగ.. పాతశ్రీకాకుళానికి పెద్దపండగ.. పెద్దమ్మతల్లి పండగ.. లాజిక్కులు వెతక్కపోతే నేటి తరానికి తెలియని కొత్త కథ. మహిమలు, అమ్మవార్లు, జంతుబలులు వంటి అంశాలను కాసేపు పక్కనపెట్టి చూస్తే ఆసక్తి కలిగించే కథ. మన పక్క జిల్లా విజయనగరంలో విజయదశమి తర్వాత వచ్చే మొదటి మంగళవారం పైడితల్లి అమ్మవారికి సిరిమానోత్సవం జరగడం మనకు తెలుసు. కేవలం సిరిమానును చూడ్డానికే మన జిల్లా నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివెళ్తారు. సిరిమాను మీద అమ్మవారి కోవెల ప్రధాన అర్చకుడు కూర్చుంటాడు. ప్రతీ ఏడాది ఈ సిరిమాను (ఒంపులు లేని పొడుగైన చింతమాను ఎక్కడుంటుందనేది అమ్మవారే అర్చకుడికి కలలోకి వచ్చి చెబుతుందని నమ్మేవారున్నారు. ఇన్నాళ్లయినా, ఇన్నేళ్లయినా ఇప్పటికీ అంత పెద్ద సిరిమానుకు చెట్టు దొరకడం విశేషమే. ఇక శ్రీకాకుళం నగరానికి ఈ సిరిమాను సంబరం అంటే ఏంటో తెలియదు. కానీ పదేళ్లకోసారి పాత శ్రీకాకుళం ప్రాంతం అంటే.. జిల్లాపరిషత్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వెనుక భాగం కునుకుపేట వరకు ఉండే ప్రాంతంలో ఈ సిరిమానోత్సవాన్ని జరుపుతున్నారు. 2015 తర్వాత 2025 అంటే.. ఈ ఏడాది జూన్ 10న సిరిమాను పాతశ్రీకాకుళం ప్రాంతంలో భక్తులకు దర్శనమివ్వబోతుంది. విజయనగరం మొత్తం ఒక సిరిమాను తిరిగితే.. పాతశ్రీకాకుళంలో రెండు సిరిమానులు తిరగనున్నాయి. ఐదుగురు అక్కచెల్లెళ్లుగా పేరొందిన పెద్దమ్మ, ముత్యాలమ్మ, నూకాలమ్మ, దుర్గమ్మ, సన్నాలపోలమ్మ అమ్మవార్ల పేరిట నిర్వహించే ఈ సిరిమానోత్సవంలో నూకాలమ్మకు, పెద్దమ్మతల్లికి రెండు సిరిమానులు మంగళవారం కనువిందు చేయనున్నాయి.
అనుగ్రహమో.. యాదృచ్చికమో?

రెండు సిరిమానుల్లో నూకాలమ్మ సిరిమానుకు సంబంధించిన నక్కవీధి సందులో ఉన్న తెలుకలవీధిలో పొలుమూరు వారి ఇంటి నుంచి బయల్దేరుతుంది. తరతరాలుగా నూకాలమ్మను కొలుస్తున్న ఈ కుటుంబ పెద్దే సిరిమాను మీద ఉండాలన్న సంప్రదాయం నడుస్తుంది. అమ్మవారి అనుగ్రహమో, లేదూ అంటే యాదృచ్చికమో తెలీదు గానీ ఈ ఏడాది పొలుమూరు వారి కుటుంబం నుంచి అచ్చుతరావు అనే వ్యక్తి ఈ సిరిమాను మీద కూర్చునే అవకాశాన్ని దక్కించుకున్నారు. సిరిమాను మీద కూర్చునే వ్యక్తిని సాక్షాత్తు అమ్మవారి లానే భక్తులు ఆ రోజు కొలుస్తారు. వాస్తవానికి పొలుమూరు కుటుంబానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి నూకాలమ్మ సిరిమాను మీద కూర్చోవాలి. కానీ హైదరాబాద్ ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసిన రామకృష్ణకు కొద్ది క్రితం రోడ్డు ప్రమాదంలో ఫ్రాక్చర్‌లు అయ్యాయి. అపోలోలో చికిత్స పొందిన తాను ప్రస్తుతం సిరిమాను మీద కూర్చోడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతున్నా జరగరానిది జరిగితే అసలు పొండగ వాతావరణం దెబ్బతింటుందని రామకృష్ణను కాదని అచ్చుతరావును ఇప్పుడు నూకాలమ్మ సిరిమాను మీద కూర్చోబెడుతున్నారు. రామకృష్ణకు ఈ అవకాశం కోల్పోగా, అచ్చుతరావు అనూహ్యంగా ఈ అదృష్టాన్ని దక్కించుకున్నారు. ఇక పెద్దమ్మతల్లి సిరిమానును మహిళా పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న మావూరు వారి కుటుంబ సభ్యులు అధిష్టిస్తారు. మావూరి చిట్టిబాలయ్య అనే వ్యక్తి పెద్దమ్మతల్లి సిరిమాను మీద కూర్చుంటారు. గత కొన్నేళ్లుగా ఆయనే కొనసాగుతున్నారు. రెండు నెలల క్రితం ఈయన అకస్మాత్తుగా చనిపోయారు. దీంతో కుమారస్వామి అనే వ్యక్తిని ఈ సిరిమాను మీద కూర్చోబెట్టడానికి సిద్ధం చేశారు. ఇది కాకుండా బాదుర్లపేట కొండక కుటుంబం నుంచి అంజలి రథం మీద ఒకరు కూర్చుంటారు. అసలు ఈ అంజలి రథం అంటే ఏమిటి? దీంతో పాటు దండివీధి నుంచి బయల్దేరే ఏనుగు ఎలా ఉంటుంది? నక్కవీధి నుంచి పయనమయ్యే పడవలో ఎవరుంటారు? కలెక్టర్ బంగ్లా దగ్గర నుంచి మొదలయ్యే మహిషాసురమర్ధినిని ఎవరు నడిపిస్తారు? వంటివి తెలుసుకోవాలంటే మంగళవారం మధ్యాహ్నం నుంచి మొదలయ్యే ఈ సిరిమానోత్సవాన్ని చూడాల్సిందే.
కమిటీ అధ్యక్షుడిగా డీపీ దేవ్ హ్యాట్రిక్

1985 నుంచి జరుగుతున్న సిరిమాను ఉత్సవాల కోసం ఇప్పుడున్న జనరేషన్‌లో కొందరికి తెలుసు. 1985లో డాక్టర్ సూర్యలింగం ఈ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆ తర్వాత పదేళ్లకు 1995లో డాక్టర్ వండాన శేషగిరిరావు నేతృత్వం వహించారు. అక్కడి నుంచి 2005, 2015, 2025ల్లో రిటైర్డ్ ఎమ్మార్వో డీపీ దేవ్ కమిటీ బాధ్యతలు మోస్తున్నారు. వరుసగా మూడు పర్యాయాలు సిరిమాను పర్యాయాలు సిరిమాను కమిటీ అధ్యక్షుడిగా ఉండటం ఒక రికార్డు 1932లో తొలిసారిగా పాతశ్రీకాకుళం ప్రాంతంలో సిరిమాను బయల్దేరింది. పాతబస్టాండు నుంచి కలెక్టర్ బంగ్లా వరకు ఉన్న ప్రాంతాన్ని అప్పట్లో పాత శ్రీకాకుళమనేవారు. ఆ తర్వాత అది జిల్లాపరిషత్ నుంచి కునుకుపేటగా నిర్ధారించారు. ఇప్పటికీ పాతబస్టాండ్ ప్రాంతం నుంచి కలెక్టరాఫీస్ వరకు ఉన్న నివాసాల్లో జనాల ఆధార్ కార్డులు తీస్తే పాతశ్రీకాకుళం వార్డు అనే ఉంటుంది. ఆర్టీసీ కాంప్లెక్స్ బలగ ప్రాంతానికి షిప్ట్ అయిన తర్వాత మాత్రమే శ్రీకాకుళంలో కొత్త ప్రాంతాలు ఏర్పడ్డాయి. అప్పట్లో అక్షరాస్యత తక్కువగా ఉండటం వల్ల కలరా, మలేరియా వంటి వ్యాధుల నుంచి రక్షించేది అమ్మవార్లేనని నమ్మేవారు. అందుకే 1932 ప్రాంతంలో పాతశ్రీకాకుళం ఏరియాలో ఈ వ్యాధులు ప్రబలినప్పుడు ఈ ఐదుగురు అక్కచెల్లెళ్లకు పండగలు నిర్వహిస్తే తగ్గుతుందన్న నమ్మకంతో సిరిమాను పండగ ప్రారంభమైందని చెబుతారు. ఆ తర్వాత పదేళ్లకు జరిగిందో తేదో తెలీదు గానీ 1963లో మాత్రం ఒకసారి సిరిమానోత్సవం జరిగింది. అయితే స్థానికులు కొట్టుకోవడంతో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని కొన్నాళ్లపాటు సిరిమానును నిర్వహించలేదు. ఆ తర్వాత మళ్లీ 1985లో ఈ పండగలు ప్రారంభం కాగా, ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తున్నాయి.
2.50 కిలోమీటర్లు సిరిమాను యాత్ర

గత నెల 5న గ్రామ దేవతల సిరిమాను ఉత్సవం ప్రారంభం కాగా, మంగళవారం దీని అనుపుతో ముగుస్తుంది. జిల్లాపరిషత్ కార్యాలయం నుంచి ప్రారంభమై దేసెళ్లవీధి, నక్కవీధి, దండివీధి, సంతోషిమాత జంక్షన్, మావూరివీధి, బాదుర్లపేట, కొత్తపేట, కునుకుపేట వరకు వెళ్లి మళ్లీ జిల్లాపరిషత్‌కు చేరుకుంటుంది. సుమారు 2.50 కిలోమీటర్లు సాగే ఈ సిరిమాను యాత్ర కోసం కమిటీ అధ్యక్షుడు డీపీ దేవ్, కార్యదర్శి మావూరి శేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్లు నక్క శంకరరావు, కళ్లేపల్లి సోంబాబు, ఎల్.రామలింగేశ్వర స్వామి, కర్రి రంగాజీదేవ్, దేసెళ్ల గోవింద మల్లిబాబు, ముప్పన శ్రీనివాసరావు, గుంటముక్కల పాపారావు, మిండ్రాన రమేష్, అడపాక రాంబాబు, దాసరి తిరుమలరావు, సాధు గణేష్, గెంజి తాతారావు, గంగు పెద్దరమణ, ఆదినారాయణ, అశ్వినీకుమార్, నక్క రవికుమార్, లోకనాధం నాగరాజు అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
సిరిమానును ఇలా గుర్తించారు..

ఒక్కో సిరిమాను 32 అడుగులు పొడవుండాలన్న సూత్రం నడుస్తుంది. అది కూడా చింతమాను అయివుండాలని గతం చెబుతుంది. 32 అడుగుల చింతచెట్టు ఎక్కడుంటుందని నిర్వాహక బృందం వెతికితే అంపోలులో ఉన్నట్టు గుర్తించారు. అయితే అంత చెట్టును నరికిన దగ్గర్నుంచి నగరానికి తరలించేవరకు దాని పవిత్ర చెడకుండా తీసుకురావాలి. ఎందుకంటే నెల రోజుల పాటు ఈ సిరిమానును స్థానికులు పూజిస్తారు. దీంతో కష్టతరమవుతుందని భావించిన నిర్వాహక బృందం మరింత ధీటుగా అన్వేషించగా ఖాజీపేట పంప్‌హౌస్‌లో ఉన్నట్టు తెలియడంతో అక్కడి నుంచి తీసుకువచ్చారు. అయితే ఇప్పుడు ఈ రెండు సిరిమానులను నిలబెట్టి ఊరేగించే బళ్లు కావాలి. స్వయంగా అమ్మవారిని తమ బండి ఎక్కించి తిప్పుతామన్న భావన ఇప్పటికీ బలంగా ఉండటం వల్ల బూరవిల్లి నుంచి ఒక బండి, సారవకోట మండలం కిన్నెరవాడ నుంచి మరో బండి ఇద్దరు దాతలు ఇచ్చారు.
Comments