అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి.. టైంపాస్ వినోదం
- ADMIN
- Apr 14
- 3 min read

యాంకర్‌గా మంచిపేరు సంపాదించిన ప్రదీప్ మాచిరాజు.. ఇప్పటికే ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాలో హీరోగా నటించాడు. అది ఓ మోస్తరు ఫలితాన్నందుకుంది. తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మళ్లీ ఇప్పుడు ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రదీప్. కొత్త దర్శకులు నితిన్-భరత్ రూపొందించిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
ఓ పల్లెటూరిలో ఎన్నో ఏళ్ల తర్వాత పుట్టిన ఓ అమ్మాయి పుడుతుంది. తనే రాజకుమారి (దీపిక పిల్లి). తన రాకతో ఊరికి అదృష్టం పట్టిందని ఆమెను చాలా ప్రత్యేకంగా చూస్తారందరూ. ఆ అదృష్టం ఊరు దాటి పోకూడదని.. తన కంటే ముందు పుట్టిన 60 మంది అబ్బాయిల్లో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలని ఊరి పెద్దలు నిర్ణయిస్తారు. ఇందుకు రాజకుమారి తండ్రి అంగీకరిస్తాడు. దీంతో అపట్నుంచి ఆ 60 మంది అబ్బాయిలు.. చిన్నతనం నుంచే రాజకుమారి మనసు గెలవాలని గట్టిగా ప్రయత్నిస్తుంటారు. ఊరిలోకి బయటి అబ్బాయిలెవరినీ రానివ్వరు. అలాంటి పరిస్థితుల్లో ఆ ఊరికి ఒక ప్రాజెక్ట్ పని మీద వస్తాడు ఇంజినీర్ కృష్ణ (ప్రదీప్ మాచిరాజు). కొన్ని రోజులకు కృష్ణ-రాజకుమారి ప్రేమలో పడతారు. ఊర్లో వాళ్లకు విషయం తెలియకుండా దాచిపెట్టిన ఈ జంట.. తర్వాత అందరికీ దొరికిపోతుంది. మరి ఊరి కట్టుబాటును దాటి ఈ జంట ఎలా ఒక్కటైంది? ఈ క్రమంలో ఎదురైన అడ్డంకులేంటి? వాటిని ఎలా పరిష్కరించుకున్నారు? అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
అన్ని రసాల్లోకి కామెడీని పండిరచడమే అత్యంత కష్టమైన విషయం అంటారు ఫిలిం మేకర్స్. మిగతా రసాలు పండిరచడానికి కొన్ని టెంప్లేట్స్ ఉంటాయి.. వాటిని రిపీట్ చేసినా ఇబ్బంది ఉండదు. కానీ.. కామెడీ మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగానే ఉండాలి. ఒకసారి నవ్వించే జోక్ రెండోసారి వేస్తే అది నవ్వుల పాలు అయిపోతుంది. అందులోనూ జబర్దస్త్ లాంటి షోలు కామెడీ స్వరూపాన్నే మార్చేసి బుల్లితెర మీదే ప్రేక్షకులకు బోలెడంత వినోదాన్ని అందిచేస్తుండడంతో.. సినిమా ద్వారా నవ్వించడం పెద్ద సవాలుగా మారిపోయింది. దీంతో కామెడీ రాసే.. తీసే సినీ రచయితలు-దర్శకులు అంతకంతకూ తగ్గిపోతున్నారు. ఇలాంటి సమయంలోనూ అప్పుడప్పుడూ కొన్ని చిత్రాలు ప్రేక్షకులను నవ్వించగలుగుతున్నాయి. ఛలో.. సామజవరగమన.. మ్యాడ్.. లాంటి చిత్రాలు ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్నందించి బాక్సాఫీస్ దగ్గర జయకేతనం ఎగురవేశాయి. కథలో చమత్కారంగా అనిపించే ఒక పాయింట్ తీసుకుని.. దాని చుట్టూ ట్రెండీగా అనిపించే కామెడీ సీన్లు రాసుకుని ప్రేక్షకులను మెప్పించడం వీటిలో కామన్ గా కనిపించే పాయింట్. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ అనే పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ పెట్టుకున్న ప్రదీప్ మాచిరాజు చిత్రంలోనూ దర్శక రచయితలు అదే బాటను అనుసరించారు. బోర్ కొట్టకుండా ఓ రెండు గంటలు ప్రేక్షకులను కుదురుగా కూర్చోబెట్టగలిగారు. కొన్ని బలహీనతలున్నప్పటికీ టైంపాస్ వినోదానికి ఢోకా లేని సినిమా ఇది.
కామెడీ ప్రధానంగా సాగే చిన్న సినిమాల్లో ఏదైనా టిపికల్ గా అనిపించే ఓ పాయింట్ ఉంటేనే ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి వీలుంటుంది. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ టీం అలాంటి పాయింటే ఎంచుకుంది. అనగనగా ఓ పల్లెటూరు. ఆ ఊరిలో వరుసగా 60 మంది అబ్బాయిలు పుడితే.. లేక లేక పుట్టిన ఓ కుటుంబంలో పుట్టిన అమ్మాయిని అదృష్ట దేవతగా భావించి ఆమెను ఆ ఊరిలోని అబ్బాయినే తను పెళ్లి చేసుకోవాలని కట్టుబాటు పెడితే.. సిటీ నుంచి వచ్చిన అబ్బాయితో ఆమె ప్రేమలో పడడం.. ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యల నేపథ్యంలో నడిచే కథ ఇది. ‘ఛలో’ సినిమాను గుర్తు చేసేలా ఉన్న ఈ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కామెడీ స్టైల్ చూసినా కూడా ‘ఛలో’ సినిమానే చాలా చోట్ల గుర్తుకు తెస్తుందీ సినిమా. కానీ కామెడీ సీన్లన్నీ ఆర్గానిగ్గా అనిపిస్తూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తాయి. ఆ ఒక్క అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి 60 మంది అబ్బాయిలు పడే పాట్లు.. బయటి అబ్బాయిల కళ్లు తన మీద పడకుండా వీళ్లు పెట్టే కండిషన్లు ఫన్నీగా అనిపిస్తాయి. హీరో పరిచయం తర్వాత త్వరగా ఈ కథ పల్లెటూరి బాట పడుతుంది. అక్కడ్నుంచే కథనం కూడా ఊపందుకుంటుంది. ఇటు కామెడీ సీన్లు.. అటు లవ్ ట్రాక్ రెండూ హుషారుగా సాగడంతో ప్రథమార్ధం వేగంగా సాగిపోతుంది. సత్య-గెటప్ శీను జోడీ నాన్ స్టాప్ కామెడీతో ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. కామెడీలో వీరి బలం తెలిసిన వీరి కాంబినేషన్లో మంచి సీన్లు రాసుకున్నారు. అవే సినిమాకు హైలైట్. ఒక సీన్లో ఇద్దరూ భయంతో పాస్ పోసుకుంటే.. సత్య-శీను ‘‘పాణీ అదిగో పానీ’’.. ‘‘బిలాల్.. అదిగో జలాల్’’ అని చెప్పే డైలాగ్స్ కడుపు చెక్కలు చేస్తాయి. ఇలాంటి పంచ్ డైలాగ్స్ సినిమాలో చాలానే ఉన్నాయి.
ఊరి కట్టుబాటుకు విరుద్ధంగా హీరోయిన్-హీరో ప్రేమలో పడి అందరికీ దొరికిపోయే సన్నివేశంతో విరామ సమయానికి కథ రసకందాయంలో పడుతుంది. హీరోకు ఎదురయ్యే రివర్స్ కండిషన్ తో ద్వితీయార్ధంలో ఈ కథను ఎలా ముందుకు తీసుకెళ్తారనే ఆసక్తి పుడుతుంది. కానీ అక్కడ్నుంచి మాత్రం అనుకున్నంత హుషారు కనిపించదు. రైటింగ్ పరంగా ప్రథమార్ధంలో కనిపించిన బలం ద్వితీయార్ధంలో మిస్ అయింది. కథ పల్లెటూరి నుంచి సిటీకి మారాక సినిమా గాడి తప్పుతుంది. మరీ తేలిగ్గా అనిపించే సీన్లతో ద్వితీయార్ధాన్ని ఏదో అలా లాగించేయాలని చూశారు. బ్రహ్మాజీ కాసేపు నవ్వించినా.. ప్రథమార్ధంలో మాదిరి కామెడీ డోస్ లేకపోయింది. వెన్నెల కిషోర్.. బ్రహ్మానందం లాంటి స్టార్ కమెడియన్లు వచ్చినా.. నవ్వులు అంతగా పండలేదు. హీరో తన టాస్క్ ను ఎలా పూర్తి చేస్తాడా అని చూస్తే.. ఆ విషయాన్ని చాలా సింపుల్ గా తేల్చేశారు. ముగింపు సన్నివేశాలను చాలా కన్వీనియెంట్ గా రాసుకున్నారు. కాకపోతే ద్వితీయార్ధంలో కామెడీ డోస్ తగ్గినా.. సన్నివేశాలు మరీ విసిగించేలా అయితే లేవు. ప్రథమార్ధంలో ఉన్న కామెడీ టికెట్ డబ్బులకు గిట్టుబాటు చేస్తుంది. ఒక చిన్న సినిమా బృందం చేసిన ఈ ప్రయత్నం నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు.
నటీనటులు - పెర్‌ఫార్మెన్స్ :
ప్రదీప్ మాచిరాజు యాంకరింగ్ లో చూపించే హుషారునే హీరోగా కూడా చూపించాడు. కామెడీ సినిమా కదా అని ఎక్కువ హడావుడి చేయకుండా.. కృష్ణ పాత్రలో సటిల్ గా నటించాడు. కామెడీ సీన్లలో ప్రదీప్ టైమింగ్ ఆకట్టుకుంది. హీరో కదా అని ఎక్కువ బిల్డప్పులివ్వకుండా.. ఒక పాత్రధారిలానే కనిపించాడు. తన సింప్లిసిటీనే కృష్ణ పాత్రకు ఆకర్షణగా నిలిచింది. దీపిక పిల్లికి ఇది తొలి చిత్రమే అయినా ఈజ్ చూపించింది. కొత్తమ్మాయిలా అనిపించలేదు. పాటల్లో మాంచి హుషారుగా డ్యాన్స్ చేసిన దీపిక.. నటన పరంగా కూడా మెప్పించింది. ప్రదీప్-దీపిక జోడీ సినిమాకు పెద్ద ప్లస్. సత్య ‘మత్తు వదలరా-2’ తర్వాత బాగా నవ్వించిన చిత్రమిది. ప్రథమార్ధంలో అతడి కామెడీ మేజర్ హైలైట్. గెటప్ శీను కామెడీ కూడా బాగుంది. వెన్నెల కిషోర్.. బ్రహ్మాజీ ద్వితీయార్ధంలో కొంత సేపు నవ్వించారు. హీరో తల్లి పాత్రలో రోహిణి తనకు అలవాటైన రీతిలో నటించి మెప్పించింది. మురళీధర్ గౌడ్.. మిగతా ఆర్టిస్టులు కూడా బాగా చేశారు.
సాంకేతిక వర్గం - పనితీరు :
రధన్ సంగీతం సినిమాకు ప్లస్సే. చార్ట్ బస్టర్ సాంగ్స్ ఇవ్వలేదు కానీ.. సినిమాలో పాటలు బాగానే కుదిరాయి. నేపథ్య సంగీతం కూడా ఓకే. బాల్ రెడ్డి ఛాయాగ్రహణం సినిమాకు పెద్ద అసెట్. ప్రథమార్ధంలో పల్లెటూరి నేపథ్యంలో సన్నివేశాలను చాలా అందంగా చిత్రీకరించారు. ఆర్ట్ వర్క్ కూడా సింపుల్ గా ఆకట్టుకుంది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. సందీప్ బొల్ల కథ సింపుల్. కానీ దాన్ని తెరపై ప్రెజెంట్ చేసిన తీరు బాగుంది. తన డైలాగులు ట్రెండీగా.. ఫన్నీగా అనిపిస్తాయి. కామెడీ సీన్లలో పంచులు బాగున్నాయి. నితిన్-భరత్ కథనం సినిమాకు ప్లస్. కొత్త వాళ్లే అయినా కన్ఫ్యూజన్ లేకుండా నీట్ గా సినిమా తీశారు. ప్రథమార్ధంలో ఉన్న జోరు.. ఫన్.. ద్వితీయార్ధంలో కూడా కొనసాగించి ఉంటే ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ స్పెషల్ ఫిలిం అయ్యేది.
తుపాకి.కామ్ సౌజన్యంతో...
Comments