top of page

అక్కడ అలా.. ఇక్కడ ఇలా..

Writer: ADMINADMIN
  • హిండెన్‌బర్డ్‌ నివేదికపై 22న కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్త నిరసన

  • తెలంగాణలో అదే అదాని పెట్టుబడులతో ముందుకు

  • కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాలపై రాహుల్‌కు పట్టులేనట్టేనా?

దుప్పల రవికుమార్‌

నిన్న మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఒక ప్రెస్‌మీట్‌ చాలా ఆసక్తికరమైనది. భారత రాష్ట్ర సమితి నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు (కెటిఆర్‌) ఏర్పాటుచేసిన ఈ పాత్రికేయ సమావేశం తెలంగాణ సమాజాన్ని తీవ్ర ఆలోచనలో పడేసింది. కాంగ్రెస్‌ పార్టీ దేశంలో ఒక మాదిరి, తెలంగాణలో మరో మాదిరి ఆలోచిస్తున్నదని, ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నదని ఆయన రేవంత్‌ రెడ్డి సర్కారును దూదేకిపారేశారు. అసలే తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీపై కోపంతో ఉన్న కెటిఆర్‌ అవకాశం చిక్కినపుడు వినియోగించుకోకుండా ఉంటారా? ఒకవైపు బిఆర్‌ఎస్‌ శాసనసభ సభ్యులను ఒక్కరొక్కరిగా కాంగ్రెస్‌ పార్టీలోకి తీసుకోవడంతో బిఆర్‌ఎస్‌ అధినాయకత్వం గుర్రుగా ఉంది.

భారత ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెక్యూరిటీస్‌, కమోడిటీస్‌లను ప్రమత్తంగా నిర్వహించే సంస్థ చైర్మన్‌ మాధవి పురి బుచ్‌ కొంతకాలం కిందట అదానీ గ్రూపులో పెట్టుబడులు పెట్టారని హిండెన్‌బర్గ్‌ నివేదిక ఒక వార్తను లీక్‌ చేసింది. మాధవి భర్త ధవల్‌ బుచ్‌ అదానీకి చెందిన విదేశీ గ్రూపుసంస్థల్లో మదుపులు పెట్టారని హిండెన్‌బర్గ్‌ అనుమానించింది. అయితే దీని ప్రభావంతో షేర్‌ మార్కెట్‌ అల్లకల్లోలం అయ్యుండేదే. కాని, వార్తల్లో అదానీ కూడా ఉండడంతో మార్కెట్‌ ఎలాంటి ఒడిదొడుకులకు లోనుకాకుండా భారత ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టే కనిపించింది. ఇది చాలా ప్రమాదకరమైన ఆట. షేర్‌ మార్కెట్‌ బబుల్‌ బద్దలయితే ఏమవుతుందో వివిధ దేశాల్లోనూ, పలుమార్లు మనదేశంలోనూ మనం చూశాం. స్టాక్‌మార్కెట్‌ కుప్పకూలితే అందులో పెట్టుబడులు పెట్టిన మధ్యతరగతి ప్రజలు తీవ్రమైన ఆర్థిక నష్టాలకు గురవుతారు. దేశ ఆర్థికవ్యవస్థ అతలాకుతలం అవుతుంది. ఇందులో ఉన్న సీరియస్‌నెస్‌ను గుర్తించిన కాంగ్రెస్‌ పార్టీ వెంటనే దేశ ప్రజలకు ఉన్న అనుమానాలను తీర్చాలని కోరుతూ ఒకవైపు సుప్రీంకోర్టులో సమగ్ర దర్యాప్తు కోసం పిటిషన్‌ వేసింది. మరోవైపు ఈ నెల 22న దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీనికి ధీటుగా పాలక పక్షం కూడా సమాధానమిచ్చింది. దేశంలో తీవ్ర ఆర్థిక అస్థిరతను నెలకొల్పడానికి ప్రతిపక్షం ఇలాంటి కుట్రలు పన్నుతోందని భారతీయ జనతా పార్టీ విమర్శించింది. ఇండియా పార్టీలు మాత్రం తక్షణమే సెబీ చైర్మన్‌ను తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. సరిగ్గా ఈ సందర్భాన్ని వాడుకోవడానికా అన్నట్టు కెటిఆర్‌ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటుచేసారు. కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునివ్వడాన్ని స్వాగతిస్తూనే ఆ పార్టీ పాటిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టారు. ఒకవేళ అదానీ భారతదేశానికి సరికాకపోతే, అదే వ్యక్తి ఇచ్చిన పెట్టుబడులు తెలంగాణకు ఎలా ఆమోదయోగ్యమవుతాయని తీవ్రంగా ప్రశ్నించారు.

అడకత్తెరలో ఇరుక్కున్న రేవంత్‌

ఈ ఏడాది జనవరిలో జరిగిన ఒక ఒప్పందంలో అదానీ గ్రూపు తెలంగాణ ప్రభుత్వంతో నాలుగు ఒప్పందాలు చేసుకుంది. విభిన్న రంగాలలో 12,400 కోట్ల రూపాయలను పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది. దేశంలో అదానీ వ్యాపార విస్తరణను తీవ్రంగా నిరసిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం, దాని అధినేత రాహుల్‌ గాంధీ.. అందులో భాగంగా తెలంగాణలో అదానీ ఒప్పందాలను వెనక్కి తీసుకోగలుగుతారా అని కెటిఆర్‌ విమర్శించారు. తెలంగాణ భవిష్యత్తు కోసం బిఆర్‌ఎస్‌ ఎప్పుడూ చెక్కుచెదరని సంకల్పంతో ఉంటుందని, అలాంటి పట్టుదల కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రదర్శించగలదా అని ప్రశ్నించారు. కాగా రేవంత్‌ రెడ్డి తన పదిహేను రోజుల విదేశీ పర్యటన ముగించుకుని వచ్చారు. ఈ ఏడాది జనవరిలో దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకానమిక్‌ ఫోరమ్‌ సదస్సుకు హాజరైనప్పుడు వచ్చినంత మీడియా హైప్‌, కవరేజి ఈసారి జరిపిన విదేశీ పర్యటనకు ఎందుకో గాని రాలేదు. దావోస్‌ సమ్మిట్‌లో నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు చెరువులో చేపలు పట్టినట్టు రేవంత్‌ పట్టుకొచ్చేసారని గప్పాలు కొట్టిన తెలంగాణ పత్రికలు, ఈసారి విదేశీ పెట్టుబడిదారులు డబ్బులు కుమ్మరించేసారని ఎందుకో గాని పెద్దగా రాయలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి జరిపిన ఈ విదేశీ పర్యటన పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

బిఆర్‌ఎస్‌ హయాంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఒక విధంగా పని విభజన చేశారు. వ్యవసాయం, సంక్షేమం వంటి కార్యక్రమాలు తాను పర్యవేక్షిస్తూ, ఐటి పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణ వంటి కార్యకలాపాలు తనయుడు కెటిఆర్‌ను పర్యవేక్షించమనేవారు. నీటి పారుదల బాధ్యతలను మేనల్లుడు హరీష్‌రావుకు, విద్యుత్‌ రంగాన్ని జగదీశ్‌ రెడ్డి, ఇలా తాను ఎంపిక చేసిన కొంతమందికి వివిధ బాధ్యతలు అప్పజెప్పారు. అయితే రేవంత్‌ వద్ద ప్రస్తుతం అలాంటి యంత్రాంగం గాని, మంత్రాంగం గాని లేవు. నిజానికి జనవరిలో జరిగిన దావోస్‌ సమావేశానికి చివరి క్షణం వరకూ ఆ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెళ్తారని అనుకున్నారు. చివరి క్షణంలో వారివెంట ముఖ్యమంత్రి కూడా బయల్దేరారు. ఈసారి పదిహేను రోజుల అమెరికా పర్యటనలో మాత్రం మునుపటి జోష్‌ కనిపించలేదు. పైగా పర్యటనలో జరిగిన చాలా ఒప్పందాలు వివాదాస్పదంగా మారాయి. వెయ్యికోట్ల రూపాయల ఒప్పందం జరుపుకున్న ఒక కంపెనీ స్వయంగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులదని అక్కడి ఎన్నారైలు సాక్ష్యాలు చూపించారు.

ఎన్నారైల చొరవతో చీకటి ఒప్పందాలు వెలుగులోకి!

వివిధ సంస్థలతో ఎలాంటి ఒప్పందాలు జరిగాయో, నిధులు ఎంతవరకు సమీకరించారో పూర్తి వివరాలు తెలంగాణ ప్రభుత్వం ఇంకా వెల్లడిరచలేదు గాని, అమెరికాలో ఉంటున్న ప్రవాస తెలంగాణ విద్యాధికులు మాత్రం రాహుల్‌గాంధీకి ఒక బహిరంగ లేఖ రాశారు. ఇందులో గడచిన పదిహేను రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన వాణిజ్య ఒప్పందాలు భవిష్యత్తులో తలనొప్పులు తెచ్చిపెట్టగలవని హెచ్చరించారు. పనిలోపనిగా ఐటి శాఖామాత్యులు శ్రీధర్‌బాబుకు కూడా ఎన్నారైలు అక్కడ జరిగిన ఒప్పందాల మీద బోల్డన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ, వీటన్నింటికి వీలైనంత దూరంలో ఆయన ఉండడమే శ్రేయస్కరమని హితవు పలికారు. ముఖ్యమంత్రి వెళ్లిన ప్రైవేట్‌ జెట్‌లో అనధికార వ్యక్తులు విహారం చేసిన ఫోటోలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వైరల్‌ అవుతున్నాయి. ప్రత్యేకంగా రేవంత్‌ రెడ్డి తమ్ముడు ఎనుముల తిరుపతి రెడ్డి అనేక ఒప్పందాల చిత్రాలలో కనిపించడం ఆ రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారింది. తమ్ముడిని రాజ్యాంగేతర శక్తిగా తయారుచేస్తున్నాడని సొంత పార్టీలోని రేవంత్‌ రెడ్డి వ్యతిరేక వర్గం దుమ్మెత్తి పోస్తోంది.

మోదీ వ్యతిరేక పోరాటంలో ప్రస్తుతం తలమునకలుగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన పర్యవేక్షకుడు రాహుల్‌ గాంధీ తెలంగాణలో ఏం జరుగుతుందో పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. దాంతో రేవంత్‌ రెడ్డికి పార్టీ హైకమాండ్‌ నుంచి ఎలాంటి అదిలింపులు బెదిరింపులు చేరినట్టు ప్రస్తుతానికి కనిపించడం లేదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page