
ముస్లిం దేశాల్లో సహజంగానే మహిళలపై అనేక కట్టుబాట్లు.. సవాలక్ష ఆంక్షల చట్రాలు ఉంటాయి. పురు షులతో సమానంగా మహిళలను గౌరవించే పరిస్థితి చాలా దేశాల్లో లేవు. అయితే అంతర్జాతీయ మహిళాల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, యూనిసెఫ్ వంటి ఐక్యరాజ్యసమితికి చెందిన సంస్థలు ఏళ్ల తరబడి చేస్తున్న పోరాటాలు, అవగాహన కార్యక్రమాల పుణ్యాన ఇప్పుడిప్పుడే ఆ దేశాల మహిళలు కొంతవరకు స్వేచ్ఛను అను భవించగలుగుతున్నారు. ఈ తరుణంలో ఇరాక్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఒక చట్టం ఆ దేశంలో మహిళల హక్కులపై తాజా వివాదానికి తెరలేపింది. బాల్యవివాహం ఒక అనాచారమని, దానివల్ల అనేక దుష్ఫలితాలు ఎదురవుతాయని ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు అంగీకరించే విషయమే. అందుకే బాల్యవివాహాల సంప్రదాయాన్ని నిషేధించి.. స్త్రీపురుషుల వివాహానికి కనీస వయోపరిమితిని విధించాయి. యువతులకు 18 ఏళ్లు, యువకులకు 21 ఏళ్లు నిండిన తర్వాతే పెళ్లి చేయాలనే నిబంధన దాదాపు అన్ని దేశాల్లోనూ అమల్లో ఉంది. ఇరాక్‌లోనూ అదే వయోపరిమితి ఉన్నా.. ఇప్పుడు అది తగ్గిపోనుంది. ఇరాక్ ప్రభుత్వం యువతీ యువకుల పెళ్లీడు వయసును తగ్గిస్తూ ఆ దేశ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు సర్వత్రా విస్మయానికి, ఆగ్ర హానికి గురిచేస్తోంది. అమ్మాయి కనీస వివాహ వయసును తొమ్మిదేళ్లకు, అబ్బాయి వయసును 15 ఏళ్లకు కుదించాలని ఈ బిల్లులో ప్రతిపాదించడం విమర్శలకు గురవుతోంది. ఆ మేరకు పర్సనల్ స్టేట్ లాను సవ రిస్తూ ఇరాక్ న్యాయమంత్రిత్వ శాఖ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టింది. ఈ చర్య ఒక విధంగా బాల్యవివా హాలను చట్టబద్ధం చేయడమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. లింగ సమానత్వంతో పాటు ఇప్పటివరకు మహిళా హక్కుల విషయంలో సాధించిన పురోగతిని ఈ బిల్లు మట్టిలో కలిపేస్తుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవు తోంది. హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. యుక్తవయసు వచ్చే వరకు వివాహ వ్యవస్థ, భార్యాభర్తల సంబంధాలు, పిల్లలను కనడం, వారిని పోషించడం వంటి వాటిపై సరైన అవ గాహన ఉండదు. అదీగాక చిన్నవయసులోనే పెళ్లిళ్లు చేసేస్తే గర్భం దాల్చడం, ప్రసవం వంటి వాటి వల్ల చిన్న తనంలోనే మహిళల ఆరోగ్యంపై పెను ప్రభావం పడుతుంది. శారీరకంగా వారు దుర్బలులవుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే సనాతనంగా ఉన్న బాల్యవివాహ వ్యవస్థను ఆధునిక యుగంలో రద్దు చేశారు. పెళ్లికి కనీసం వయసును అంతర్జాతీయంగా చట్టబద్ధ పరిమితి విధించారు. ఇప్పుడు ఇరాక్ ఈ పరిమితులను సడలించి మళ్లీ బాల్యవివాహాల దిశగా వెళ్తునట్లు కనిపిస్తోంది. ఈ బిల్లు ఆమోదం పొంది చట్టం అమల్లోకి వస్తే సమాజంలో అనేక దుష్ఫలితాలు కనిపిస్తాయంటున్నారు. ముఖ్యంగా విద్య, ఆరో గ్యం, ఉద్యోగ ఉపాధి రంగాలపై వ్యతిరేక ప్రభావం పడుతుందంటున్నారు. డ్రాపౌట్లు పెరగడంతో పాటు బాల్య వివాహాలు వాటితో పాటు గృహహింస పెరిగిపోతాయని హక్కుల కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ఐక్యరాజ్య సమితికి యూనిసెఫ్ నివేదికల ప్రకారం ఇప్పటికే ఇరాక్‌లో కనీస వయోపరిమితిని పట్టించుకోకుండా 28 శాతం బాలికలకు బాల్యవివాహాలు చేసేస్తున్నారు. వయోపరిమితి తగ్గిస్తే.. ఇక వాటికి అడ్డూఅదుపూ ఉండదు. ఈ చట్టం దేశప్రగతిని అడ్డుకుంటుందని హ్యూమన్ రైట్స్ వాచ్ పరిశోధకురాలు సారా సస్బర్ వ్యాఖ్యానిం చారు. ఈ బిల్లులో పలు అభ్యంతరకరమైన నిబంధనలు ఉన్నాయని మానవహక్కుల న్యాయవాదులు చెబుతు న్నారు. కొత్త చట్టం అమల్లోకి వస్తే కుటుంబ సంబంధిత నిర్ణయాలు, వివాదాల్లో మతపరమైన అధికారులు లేదా పౌర న్యాయవ్యవస్థ జోక్యం పెరిగిపోతుందంటున్నారు. అలాగే వారసత్వం, విడాకులు, పిల్లల సంరక్షణ హక్కులను మహిళలు కోల్పోయే ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. బిల్లును పార్లమెంటు ఆమోదిస్తే ఆరు నెలల్లోగా షియా, సున్నీ ఎండోమెంట్‌లు చట్టపరమైన తీర్పుల కోడ్‌ను రూపొందించి పార్ల మెంటుకు సమర్పించాల్సి ఉంటుంది. ఇది వివాహ వ్యవస్థ పర్యవేక్షణను కోర్టుల నుంచి షియా, సున్నీ ఎండో మెంట్ కార్యాలయాలకు అప్పగించేస్తుందని పలువురు వాదిస్తున్నారు. షియా కోడ్ జఫరీ న్యాయశాస్త్రంపై ఆధారపడి ఉంటుంది. ఇది తొమ్మిదేళ్లకే బాలికలకు, 15 ఏళ్లకు బాలురకు వివాహం చేసేందుకు అనుమతి స్తుంది. ఇప్పుడు దీన్నే ఇరాక్ ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంది. అయితే ఈ బిల్లును సమర్థిస్తున్నవారు కూడా ఉన్నారు. ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగా ఈ బిల్లును రూపొందించారని చెబుతున్న సమర్థకులు.. దీని ద్వారా అనైతిక సంబంధాల రొంపి నుంచి యువతులను రక్షించడానికి వీలవుతుందని వాదిస్తున్నారు. అయితే పసలేని వాదనలతో బిల్లును సమర్థిస్తున్నవారు బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలను విస్మరిస్తున్నారని వ్యతి రేకులు విమర్శిస్తున్నారు. బిల్లును ప్రవేశపెట్టిన స్వతంత్ర ఎంపీ రేద్ అల్ మాలికి చరిత్ర కూడా వివాదాస్ప దమైనదేనని అంటున్నారు. స్వలింగ సంపర్కం, లింగమార్పిడి శస్త్రచికిత్సలతో పాటు వ్యభిచార నిరోధక చట్టం వంటి వివాదాస్పద సవరణలను ప్రతిపాదించిన చరిత్ర ఆయనకు ఉందని విమర్శిస్తున్నారు. ముసాయిదా బిల్లులో ముస్లిం పురుషులు ముస్లిమేతర మహిళలను వివాహం చేసుకోకుండా నిషేధించడం, వైవాహిక అత్యా చారాలను చట్టబద్ధం చేయడం, భర్త అనుమతి లేకుండా మహిళలు ఇల్లు దాటి బయటకు రాకుండా ఆంక్షలు విధించడం వంటి నిబంధనలు చేర్చడంపై మహిళా సంఘాలు, హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. ఈ చర్యలు దేశాన్ని మళ్లీ వెనుకబాటుతనంలోకి నెట్టివేయడమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Commenti