అక్కడ సీజ్‌ఫైర్.. ఇక్కడేమో ఓపెన్ ఫైర్!
- DV RAMANA
- May 28
- 2 min read

పహల్గాంలో అమాయక టూరిస్టులపై ఉగ్రవాదులు సాగించిన మారణకాండ తర్వాత ఉగ్రవా దాన్ని పెంచి పోషిస్తూ తమ దేశం పైకి ఎగదోస్తున్న పాకిస్తాన్‌పై భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో నాలుగు రోజులపాటు యుద్ధం చేసింది. సైనిక చర్యలో ఆధిపత్యం సాధించి, గెలుపు ముంగిట నిలిచిన తరుణంలో చేతులెత్తేసిన పాకిస్తాన్ కోరిన వెంటనే కాల్పుల విరమణకు భారత్ అంగీకరిం చడంపై దేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే మావోయిస్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ం నారాయణపూర్ జిల్లా అబూజ్‌మడ్ అడవుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో సీపీఐ(మావోయిస్టు) పార్టీ ప్రధాన కార్య దర్శి, మోస్ట్ వాంటెడ్ నంబాల కేశవరావుతో సహా 28 మంది మావోయిస్టులు హతమయ్యారు. దీనిపై మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ జారీ చేసిన ఒక ప్రకటనలో కేంద్రం తీరును తప్పుపట్టింది. దేశంపైకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ మారణహోమం సృష్టిస్తున్న పాకిస్తాన్ ప్రతిపాదించిన వెంటనే కాల్పుల విరమణ(సీజ్ ఫైర్)కు అంగీకరించిన భారత ప్రభుత్వం.. తాము కొన్నాళ్లుగా కాల్పులు విరమించి చర్చలకు సిద్ధమని చెబుతున్నా పట్టించుకోకుండా ఆపరేషన్ కగార్ ద్వారా మారణకాండ సృష్టిస్తోందని విమర్శించింది. మరోవైపు తాజా ఎన్‌కౌంటర్‌లో నంబాల కేశవ రావు సహా 28 మంది మావోయిస్టులను హతమార్చడాన్ని ఘన విజయంగా, గర్వకారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు ప్రకటించడం ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న భద్రతా బలగాలను అభినందించడం ద్వారా ప్రజాస్వామ్యానికి, మానవత్వానికి మచ్చ తెచ్చేలా వ్యవహరించారని మానవ హక్కుల వేదికకు చెందిన డాక్టర్ తిరుపతయ్య విమర్శించారు. కేంద్రం కొన్ని నెలలుగా మావోయిస్టు పార్టీపై యుద్ధం ప్రకటించి, ఆపరేషన్ కగార్ పేరుతో దండ కారణ్యంతో దళాలపై విరుచుకుపడుతోంది. మావోయిస్టుల విధానాలతో చాలామంది విభేదించ వచ్చు. దేశ ప్రజలు గతంలో కంటే మెరుగ్గా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో సమసమాజ నిర్మా ణానికి మావోయిస్టు పార్టీ ఇప్పటికీ అనుసరిస్తున్న పాత విధానాలకు కాలం చెల్లిపోయింది. వారు చేపడుతున్న హింసాత్మక చర్యలు గిరిజన, అటవీ ప్రాంతాల్లో ప్రశాంతతను దెబ్బతీయవచ్చు. అదే సమయంలో వారు పాల్పడిన నిరర్థక హింస కంటే.. వారు అనుభవించిన రాజ్యహింసే ఎక్కువ అని ప్రజాసంఘాలు అభిప్రాయపడుతున్నాయి. సిద్ధాంతాల పేరుతో తుపాకీ పట్టిన మావోయిస్టులు తొలి నుంచీ పీడిత ప్రజల పక్షమే వహించారు. అయితే ప్రభుత్వం మాత్రం కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరుస్తూ వనరులు దోచుకునే అవకాశం కల్పిస్తోందన్నది ప్రధాన ఆరోపణ. ఈ అంశాలపై తుపాకు లకు విశ్రాంతినిచ్చి ప్రభుత్వంతో చర్చిస్తామని.. అందుకు అవకాశం కల్పించాలని రెండు నెలలుగా మావోయిస్టులు అభ్యర్థిస్తున్నా ఖాతరు చేయకుండా కేంద్ర ఏరివేత దిశగా సాగుతుండటాన్ని ప్రజా సంఘాల ప్రతినిధులు తప్పుపడుతున్నారు. అయితే ఈ యుద్ధంలో ఓటమి తప్పదని తేలిన తర్వాతే మావోయిస్టులు చర్చల ప్రస్తావన తెచ్చారని, వారేమీ శాంతికాముకులు కాదు కనుక చర్చలు జరపాల్సిన అవసరం లేదని ప్రభుత్వపక్షం వాదిస్తోంది. కానీ అందులో తప్పేముంది.. యుద్ధానం తర చర్చలన్నీ అలాగే జరుగుతాయి కదా! అని పలువురు గుర్తు చేస్తున్నారు. చర్చలు జరిగితే మరింత రక్తపాతం ఆగుతుంది కదా! అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పైగా బలహీనపక్షంపై బలంగా ఉన్న ప్రభుత్వం ఎన్ని షరతులైనా పెట్టవచ్చని అంటున్నారు. సమస్య ఏదైనా చర్చించి, రాజకీయంగా పరిష్కరించుకోవటం మానవీయ, ప్రజాస్వామ్య నీతి. కొన్ని సార్వజనీన, మానవీయ, ప్రజాస్వామ్య విలువలను, సూత్రాలను పరిపాలకులైనా, వారిని ధిక్కరించే వారైనా పాటించి తీరాలని కోరుకోవడం, ఆ రకమైన విమర్శ చేయడం పౌరసమాజం బాధ్యత. చైతన్యం నిండిన పౌరసమాజం కలిగిన దేశాల్లోని ప్రభుత్వాలే ప్రజలకు జవాబుదారీగా ఉండగలవు. ఆ దేశాల్లోనే ప్రభుత్వాలు తమ సొంత ప్రజలపై యుద్ధం చేయవు. అటువంటి దేశంలోనే ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు, భద్రత, జీవ వైవిధ్యం, పర్యావరణం, ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలు సజీవంగా ఉంటాయి. మన మధ్య అలాంటి విలువలను నెలకొల్పుకోగలమా? పాలకులు ప్రజాస్వామ్యం, చర్చల ప్రాముఖ్యతను గుర్తించేలా చేయగలమా?!
Comments