ఈ కలప రవాణాకు టేకు మాదిరిగానే ఆంక్షలు
కానీ అటవీ అధికారుల సహకారంతోనే జిల్లా దాటింపు
లారీకి రూ.50 వేలు దండుకున్న రేంజ్ అధికారులు
మొత్తం పది లారీలు అనకాపల్లి ప్రాంతానికి తరలింపు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

గృహావసరాలకు వినియోగించే కలపలో అత్యంత విలువైన టేకు తర్వాత స్థానంలో ఉన్నది అకేసియా జాతి కలప. టేకు చెట్లు ఎదిగిన తర్వాత వాటి కటింగ్, సా(కోత) మిల్లులకు తరలింపు వ్యవహారంలో అటు రెవెన్యూ, ఇటు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ల పరంగా ఎన్ని నిబంధనలు పాటించాలో, అకేసియా చెట్ల విషయంలోనూ అదే మాదిరిగా వ్యవహరించాలి. కానీ జిల్లాలో అకేసియా ప్లాంటేషన్ పెద్ద ఎత్తున జరిగిన జిరాయితీ భూముల్లో అటు రెవెన్యూ, ఇటు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అనుమతులు లేకుండానే అటవీశాఖ అధికారుల ప్రమేయంతోనే యథేచ్ఛగా జిల్లా దాటించేస్తున్నారు. నిబంధనల ప్రకారం అకేసియా చెట్టు పెరిగి మాను అయిన తర్వాత దాన్ని కటింగ్ చేయాలంటే.. జిరాయితీ భూమిలో పెంచితే రెవెన్యూ శాఖ అనుమతులు తీసుకొని, ఆ పర్మిట్‌తో అటవీ శాఖ నుంచి సా మిల్లుకు తరలించేందుకు అనుమతి కూడా తీసుకుని పంపాల్సి ఉంటుంది. కానీ కుప్పిలి నుంచి లావేరు మండలం సుభద్రాపురం వరకు ఎచ్చెర్ల నియోజకవర్గంలో పెద్ద ఫారెస్ట్ టెరిటరీగా ఉన్న ఈ ప్రాంతంలో అకేసియా చెట్లను పెద్ద ఎత్తున పెంచుతున్నారు. అయితే ఎదిగిన తర్వాత ఈ చెట్ల కటింగ్, ట్రాన్స్‌పోర్ట్‌కు పర్మిషన్లు తెచ్చుకోవడం అంత సులభం కాదని భయపెట్టిన ఆ అటవీ టెరిటరీ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు లారీకి రూ.50వేలు తీసుకుని రెండు రోజుల క్రితం పది లారీల లోడును అనకాపల్లి వరకు ఉన్న సా మిల్లులకు తరలించేందుకు సహకరించినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల భోగట్టా. బయటి వ్యక్తులకు అనుమానం రాకుండా అకేసియా దుంగల మీద ఉన్న బెరడును చెక్కించేసి నీలగిరి దుంగలుగా చూపించి జిల్లా బోర్డర్ దాటించేశారట. విచిత్రమేమిటంటే.. ఈ కథలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా ఉంటూ వ్యవహారాన్ని చక్కబెట్టిన ఉద్యోగి పాతపట్నం రేంజ్‌లో పని చేస్తున్నప్పుడు రిజర్వ్ ఫారెస్ట్‌లో టేకు మొక్కలను అక్రమంగా అమ్మేసిన కేసులో కొద్దికాలం సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత ఎంతోకొంత అపరాధ రుసుము చెల్లించి ఈ రేంజ్‌కు బీట్ ఆఫీసర్‌గా వచ్చినట్లు తెలిసింది. పది లారీల అకేసియా దుంగలను తరలించుకుపోతున్నారని ఫారెస్ట్ స్క్వాడ్ విభాగానికి తెలియడంతో చివరి రోజు ఒక లారీని రోడ్డు మీద పట్టుకున్నారు. అయితే వీరి వద్ద నుంచి స్క్వాడ్ కూడా సొమ్ములు తీసుకొని వదిలేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే కొందరు మాత్రం అపరాధ రుసుము కింద సొమ్ములు వసూలు చేశారని, దాన్ని డిపార్ట్‌మెంట్‌కు జమ చేస్తారని చెబుతున్నారు.
Comments