బీసీ స్టడీ సర్కిల్ తరలింపుపై మీనమేషాలు
కొత్త భవనంలోకి మార్చడానికి ససేమిరా
వైటీసీలో శిక్షణ.. అరకొర వసతులతో అభ్యసన
ఉన్నదానికి దిక్కులేదు.. 10 ఎకరాల్లో డిజిటల్ లైబ్రరీ పెడతారట
మండిపడుతున్న బీసీ సంఘాలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లాకు బీసీ స్టడీ సర్కిల్ మంజూరై దశాబ్దం పూర్తయినా ఇంతవరకు శాశ్వత భవనానికి నోచుకోలేదు. కొన్నాళ్ల పాటు అద్దె భవనంలో స్టడీ సర్కిల్ నిర్వహించిన అధికారులు తర్వాత సాంఘిక సంక్షేమశాఖ బీసీ బాలికల కాలేజీ వసతి గృహంలో రెండు గదుల్లో నెట్టుకొస్తున్నారు. తరగతులు మాత్రం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఉన్న వైటీసీలో అసౌకర్యాల నడుమ నిర్వహిస్తున్నారు. 2019లో జనవరి 12న అప్పటి బీసీ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు రూ.5 కోట్లతో నగరంలోని 80 అడుగుల రోడ్డులో బీసీ భవన్‌కు శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంలోనే బీసీ స్టడీసర్కిల్‌ను ఇందులోనే నిర్వహించడానికి అనుమతులు మంజూరుచేస్తున్నట్టు బీసీ మంత్రిగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన చేశారు. అందుకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఉత్తర, ప్రత్యుత్తరాలు నిర్వహించిన ఫైల్‌ను బీసీ సంక్షేమ శాఖ నుంచి మిస్ చేశారని ఆరోపణలున్నాయి. దీన్ని సాకుగా చూపించి బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారిని అనురాధ స్టడీ సర్కిల్‌ను బీసీ భవన్‌లో నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీసీ భవనం ప్రారంభోత్సవానికి పూర్తిస్థాయిలో ముస్తాబవుతున్న వేళ స్టడీ సర్కిల్‌కు ఈ భవనంలో అవకాశం లేకుండా పోతోందని బీసీ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. శ్రీకాకుళంతో పాటు అనేక జిల్లాల్లో బీసీ భవనాలకు శంకుస్థాపన జరిగినా చిత్తూరులో మాత్రమే బీసీ భవనం అందుబాటులోకి వచ్చింది. మంత్రి అచ్చెన్నాయుడు 2019 జనవరిలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు చిత్తూరులో బీసీ భవన్‌లోనే బీసీ స్టడీసర్కిల్‌ని ఏర్పాటుచేశారు. అక్కడ లేని అభ్యంతరం ఇక్కడే ఎందుకన్న అనుమానం విద్యార్ధులు, బీసీ సంఘాలు లేవనెత్తుతున్నాయి.
అసౌకర్యాల నడుమ తరగతులు
జ్యోతిబా పూలే స్టడీ సర్కిల్ పేరుతో ప్రారంభమైన బీసీ స్డడీ సర్కిల్‌కు శాశ్వత భవనం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నా 2013 నుంచి ఇప్పటి వరకూ స్టేట్‌లోనే ఉత్తమ ఫలితాలు సాధించిన చరిత్ర జిల్లాకు ఉంది. 2013లో బీసీ స్టడీ సర్కిల్‌ను ఏడురోడ్ల జంక్షన్ దగ్గర ఒక అద్దె భవనంలో ప్రారంభించారు. శబ్ధకాలుష్యం కారణంగా క్ల్లాసులకు ఇబ్బంది ఎదురవుతుందని 2014లో ముద్దాడ చిన్నబాబు హాస్పిటల్ వెనుక గాంధీనగర్‌లో అద్దెకు ఒక భవనాన్ని తీసుకొని ఎనిమిదేళ్ల పాటు అరకొర వసతుల మధ్య నడిపించారు. ఆ తర్వాత జిల్లా ఉన్నతాధికారులు బీసీ భవనం పూర్తయ్యే వరకు స్థానిక 80 అడుగుల రోడ్డు వాంబే కాలనీకి ఆనుకొని ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ బాలికల కాలేజీ వసతి గృహంలో రెండు గదులు కేటాయించారు. ఇందులోనే డైరెక్టర్ కార్యాలయం, లైబ్రరీ, తరగతులు నిర్వహించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉన్న భవనంలో విద్యార్థులు, సిబ్బందికి టాయ్‌లెట్స్ ఉన్నా వాటికి రన్నింగ్ వాటర్ కనెక్షన్ లేక ఇబ్బందులు పడుతున్నారు. తాగడానికి, వాడుక కోసం మంచినీళ్లు లేవు. అయినా విద్యార్ధులు అసౌకర్యాల నడుమ నెట్టుకొస్తున్నారు. బ్యాంకు, డీఎస్సీ, గ్రూప్`2 కోచింగ్స్, తరగతుల కోసం ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ఉన్న వైటీసీ భవనాన్ని ఆశ్రయిస్తున్నారు, వైటీసీలోనూ సరైన వసతి సౌకర్యాలు అందుబాటులో లేవు. అయినా అక్కడే నిర్వహిస్తున్నారు. వైటీసీలో బీసీ స్టడీ సర్కిల్ కోచింగ్ కోసం వచ్చే విద్యార్థినులు టాయిలెట్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థినిలు బాయ్స్ హాస్టల్‌లోని టాయిలెట్స్‌ని వినియోగిస్తున్న పరిస్థితి.
తప్పుదోవ పట్టిస్తున్నారు
ఇటీవల బీసీ భవన్ పనులను పరిశీలించడానికి వెళ్లిన స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌కు బీసీ స్టడీసర్కిల్ నిర్వహించే విషయంపై తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదారి పట్టించినట్టు బీసీ సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వైటీసీ భవనంలో సౌకర్యాలు లేకపోయినా పట్టుపట్టి అక్కడ బీసీ స్టడీసర్కిల్ ఆధ్వర్యంలో ఇటీవల డీఎస్సీ కోచింగ్ క్లాస్‌లను నిర్వహించినట్టు విమర్శలు ఉన్నాయి. సరైన వసతి సౌకర్యాలు లేక వైటీసీ వరండా, పోర్టికో కింద కోచింగ్ క్లాసులు చెప్పించినట్టు ఆరోపణలున్నాయి. బీసీ భవన్‌లో స్టడీ సర్కిల్ ఏర్పాటుచేస్తే విద్యార్ధులు రావడానికి దూరం అవుతుందని, ఆర్టీసీ కాంప్లెక్స్‌కు సమీపంలో వైటీసీ ఉండడంతో ఇక్కడ బీసీ స్టడీ సర్కిల్ కోచింగ్ క్లాసులు నిర్వహించడం వల్ల విద్యార్థులకు అందుబాటులో ఉంటుందని స్టడీ సర్కిల్ డైరెక్టర్ అనురాధ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు ఒప్పిస్తున్నారని బీసీ సంఘాలు చెబుతున్నాయి.
ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారు
2019 జనవరి 12న శంకుస్థాపన చేసిన బీసీ భవన్ పనులు వైకాపా పభుత్వం హయాంలో కొంత సాగినా, ఆతర్వాత నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. బీసీ భవన్ ప్రారంభమైనా అందులో బీసీ స్టడీ సర్కిల్ మార్చడానికి అవకాశం లేదని డైరెక్టర్ అనురాధ చెబుతున్నట్టు విద్యార్ధులు, బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చిత్తూరులో అందుబాటులోకి వచ్చిన బీసీ భవన్‌లోనే బీసీ స్టడీ సర్కిల్‌కి ప్రత్యేకంగా గదులు కట్టి వసతి కల్పించారు. దాని మాదిరిగానే జిల్లాలోని బీసీ భవన్‌లో బీసీ స్టడీసర్కిల్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ వినిపిస్తుంది. వైటీసీలో పాఠాలు విని, లైబ్రరీ కోసం బీసీ స్టడీ సర్కిల్‌కు 80 అడుగుల రోడ్డుకు రావడం సాధ్యమవుతుందా అని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల బీసీ స్టడీ సర్కిల్ ద్వారా కోచింగ్ తీసుకుంటున్న విద్యార్ధులకు లైబ్రరీని ఉపయోగించుకొనే అవకాశం కోల్పోతారన్న కొత్త వాదన తెరపైకి వచ్చింది. బీసీ భవన్‌లోనే అన్నిరకాల సౌకర్యాలు కల్పించినప్పుడు.. వైటీసీలో తరగతులు చెప్పించడం ఎందుకని బీసీ సంఘాలు డైరెక్టర్ అనురాధ తీరును తప్పుపడుతున్నాయి.
పునఃపరిశీలించాలి..
బీసీ స్టడీ సర్కిల్ కోసం ప్రత్యేకంగా 10 ఎకరాల స్థలం సేకరించి డిజిటల్ లైబ్రరీతో సహా అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేస్తామని ప్రజాప్రతినిధులు హమీలు ఇవ్వడాన్ని బీసీ సంఘాలు, విద్యార్ధులు తప్పుపడుతున్నారు. బీసీల కోసం శాశ్వత భవనం ఉన్నప్పుడు అందులోనే బీసీ స్టడీ సర్కిల్ ఎందుకు ఏర్పాటు చేయడం లేదన్న ప్రశ్నను బీసీ సంఘాలు లేవనెత్తుతున్నారు. 10 ఎకరాలు సేకరించి డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసినంత వరకు కోచింగ్ క్లాసులు, లైబ్రరీ కోసం ప్రస్తుతం బీసీ భవనంలో స్టడీసర్కిల్‌ని కొనసాగించాలని విద్యార్ధులు ప్రాధేయపడుతున్నారు. తరగతులు అయిన తర్వాత రిఫరెన్స్ కోసం లైబ్రరీని ఆశ్రయించడానికి అవకాశం ఉంటుందని విద్యార్ధులు చెబుతున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు బీసీ స్టడీ సర్కిల్ విషయంలో పునఃపరిశీలించాలని కోరుతున్నారు.
Comments