రసకందాయంలో రైస్‌మిల్లర్ల కార్యవర్గం ఎన్నిక
వాసును మార్చాలని మంత్రి ఆలోచన
సిట్టింగ్‌నే కొనసాగించాలని హరిప్రసాద్ అభిలాష
అల్టిమేటం ఇస్తే ఎన్నికకు వెళ్తామంటున్న మిల్లర్లు
పాత అధ్యక్షుడి వైపే ఎక్కువ మంది మొగ్గు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లా రైస్‌మిల్లర్ల సంఘం.. సంఖ్యాపరంగా కేవలం 330 మిల్లులు మాత్రమే.. కానీ వాటి యాజమాన్యాలు మాత్రం జిల్లాలో మోస్ట్ పవర్‌ఫుల్. వీరు తీసుకునే నిర్ణయాలకు అధికార యంత్రాంగం అడ్డొస్తే ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడి నిమిషాల్లో బదిలీ చేయించగల బలమున్న సంఘం. కాబట్టి రాజకీయంగా పార్టీ గుర్తులతో ఎన్నికలు లేకపోయినా ఈ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించే వ్యక్తికి ఉండే గౌరవ మన్ననలు జిల్లాలో అంతా ఇంతా కాదు. తెలుగుదేశమంటే కమ్మల పార్టీ. వైకాపా లేదా కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ. కానీ విచిత్రంగా ఇక్కడ కమ్మ సామాజికవర్గానికి చెందిన వాసు తెలుగుదేశం అధికారంలో లేని సమయంలో జిల్లా రైస్‌మిల్లర్ల సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారంటే అందుకు కారణం కేవలం రెండు పంటలు మాత్రమే పండే శ్రీకాకుళం జిల్లాలో మిల్లర్ల ప్రతిష్ఠను రాష్ట్రస్థాయిలో నిలపడమే. ఇప్పుడు ఇటువంటి సంఘానికి తెలుగుదేశం ప్రభుత్వంలో అధ్యక్షుడ్ని ఏర్పాటు చేసుకునే ఎన్నికలొచ్చాయి. ఇన్నాళ్లు నామినేషనే లేకుండా జరిగే ఈ ఎన్నికలు ఈసారి పొలిటికల్ టర్న్ తీసుకుంటున్నాయి. దాని కథా కమామీషు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..
మిల్లర్ల సంఘం కార్యవర్గం ఎంపిక రసకందాయంలో పడిరది. ప్రభుత్వం మారిన ప్రతిసారీ రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నికపై చర్చ ప్రారంభమవుతుంది. ఈసారి అందుకు భిన్నంగా మిల్లర్లు స్వరం వినిపిస్తున్నారు. మిల్లర్లు సంఘానికి ప్రస్తుత అధ్యక్షుడిని మార్చాలని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు పట్టుపడితే ఎన్నిక అనివార్యం అవుతుందని మిల్లుర్లు అల్టిమేటం ఇస్తున్నారు. అసోసియేషన్‌కు ఎన్నికలు నిర్వహిస్తే మిల్లర్లే అధ్యక్షులుగా ఎవర్ని ఎన్నుకోవాలో నిర్ణయిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
2014 తర్వాత ఇది విపరీత ధోరణికి దారితీసిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు రైస్‌మిల్లర్లు ఏకాభిప్రాయంతో కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా జరుగుతూ వచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన ప్రతిసారీ ఆ పార్టీ పెద్దలు ఫలానా వ్యక్తిని అసోసియేషన్ అధ్యక్షులుగా కొనసాగించాలని అల్టిమేటం ఇచ్చి అధికారాన్ని కట్టబెడతారు. అందులో భాగంగానే తెలుగుదేశం అధికారంలో ఉంటే ఒకరు, వైకాపా లేదా కాంగ్రెస్ అధికారంలో ఉంటే మరొకరు అధికార పగ్గాలు చేపడతారు. ఈసారి ఎంపిక కాకుండా ఎన్నికే అనివార్యమయ్యేటట్టు ప్రస్తుత వాతావరణం తేటతెల్లం చేస్తుంది.
పార్టీలకు అతీతంగా మిల్లర్లంతా ప్రస్తుతం అధ్యక్షులుగా కొనసాగుతున్న వాసు పేరును సిఫార్స్ చేస్తూ.. ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. జిల్లాలో ప్రధాన పార్టీల నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు సోదరుడు హరివరప్రసాద్ శాశ్వత అధ్యక్షులుగా, ధర్మాన కృష్ణదాస్ గౌరవ అధ్యక్షులుగా జిల్లా మిల్లర్లు అసోసియేషన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది కాకుండా అధ్యక్షుడు మాత్రమే మారుతుంటారు. ప్రస్తుత జిల్లా కార్యవర్గానికి రెండేళ్ల టెర్మ్ పూర్తయింది. గడువు ముగిసేలోగా కొత్త కార్యవర్గం ఎన్నుకోవడం మిల్లర్లకు ఆనవాయితీగా వస్తుంది. ఈసారి పాత కార్యవర్గం ముగిసిపోయిందని జనరల్‌బాడీ సమావేశంలో పేర్కొన్నారు కానీ, కొత్తగా ఎవరు అధ్యక్షులవుతారన్నదానిపై రిజల్యూషన్ చేసుకోలేదు. అందుకు కారణం ఈసారి ఎంపిక ద్వారా కాకుండా ఎన్నిక ద్వారా అధ్యక్షుడ్ని తెచ్చుకోవాలని భావిస్తుండటమే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్షుడ్ని మార్చాలన్న ఏకైక లక్ష్యంతో మంత్రి అచ్చెన్నాయుడు గత రెండు నెలలుగా పావులు కదుపుతున్నారు. కానీ ఎవరిని నియమించాలన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు.
ఏకాభిప్రాయం లేదు
ప్రస్తుత అధ్యక్షుడు వాసును కొనసాగించే అంశంలో కింజరాపు సోదరుల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాసుకు మరో అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో కింజరాపు హరివరప్రసాద్ ఆలోచిస్తున్నారని మిల్లర్లు చెబుతున్నారు. ధర్మాన కుటుంబంతో వాసు సన్నిహితంగా మెలుగుతున్నారు కాబట్టే అచ్చెన్నాయుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కొందరు చెబుతున్నారు. ఇదే కారణంతో 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోటబొమ్మాళికి చెందిన బోయిన రమేష్ అచ్చెన్నాయుడు అండదండలతో కుర్చీ ఎక్కారు. అయితే అనుకున్న లక్ష్యాన్ని రమేష్ అప్పుడు అందుకోలేకపోయారని అసంతృప్తితో అచ్చెన్నాయుడు ఉన్నారని సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల ఇదే అంశంపై వారి మధ్య జరిగిన చర్చలో రమేష్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించడానికి విముఖత చూపినట్టు తెలిసింది. నరసన్నపేటకు చెందిన తంగుడు జోగారావు గతంలో అధ్యక్షులుగా కొనసాగినా మిల్లర్ల అంచనాలను నెరవేర్చలేకపోయారు. దీంతో మిల్లర్లకు అధ్యక్షులుగా వాసు తప్ప ఎవరూ న్యాయం చేయలేరన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా మిల్లర్ల సంఘానికి అధ్యక్షులుగా ఫలానా వ్యక్తిని నియమించాలని అచ్చెన్నాయుడు ఇప్పటికీ ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నారట.
అందరికీ ఆయనే కావాలి
మిల్లర్ల సంఘానికి అధ్యక్షులుగా కొనసాగుతూ వస్తున్న వాసుతో మిల్లర్లకు ఎటువంటి సమస్య ఉత్పన్నం కాలేదని మిల్లర్లు చెబుతున్నారు. ఈ అంశంలో రాజకీయ జోక్యం అవసరం లేదన్న వాదన కొందరు వినిపిస్తున్నారు. ఆయా ప్రభుత్వలు అమలుచేసే విధానాలకు అనుగుణంగా మిల్లర్లు వ్యవహరిస్తారని, దీన్ని రాజకీయ కోణంతో చూడకూడదని మిల్లర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో బలమైన మిల్లర్ల సంఘంగా గుర్తింపునకు నోచుకోవడానికి వాసే కారణమని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జాతీయ, రాష్ట్ర మిల్లర్ల సంఘాలతో సత్సంబంధాలు నెరుపుతూ జిల్లాలో సంఘం ఔన్నత్యాన్ని పెంపొందించే లక్ష్యంతో పని చేశారన్న అభిప్రాయాన్ని మిల్లర్లు వ్యక్తం చేస్తున్నారు.
2014`19 మధ్య మిల్లర్ల ఖాతాల్లో జమ కావాల్సిన రూ.16 కోట్లు ధాన్యం రవాణా ఛార్జీలను న్యాయస్థానాన్ని ఆశ్రయించి 2022లో జమ చేయించారు. దీనికోసం టీడీపీ హయాంలో నాయకులంతా ప్రయత్నించినా అప్పటి కలెక్టర్ లక్ష్మీనృసింహ మెలిక పెట్టడంతో రవాణా ఛార్జీలు నిలిచిపోయాయి. ప్రభుత్వ పెద్దలతో మాట్లాడినా విడుదల చేయడానికి నిరాకరించడంతో న్యాయబద్దంగా మిల్లర్లకు చెల్లించాల్సిన రవాణా ఛార్జీలను ఏళ్ల తరబడి చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని న్యాయస్థానాన్ని ఆశ్రయించి, వాటిని తిరిగి తెచ్చుకున్నారు. దీంతో మిల్లర్లకు వాసుపై మరింత విశ్వాసం పెరిగింది. వాసునే తిరిగి సంఘం అధ్యక్షులుగా ఎంపిక చేయాలని కొందరు మిల్లర్లు మంత్రి అచ్చెన్నాయుడుపై ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్రస్థాయిలో టీడీపీ ప్రజాప్రతినిధులతో వాసుకు ఉన్న పరిచయాలు మంత్రి అచ్చెన్నాయుడుపై ఒత్తిడి పెరగడానికి కారణమవుతున్నాయి.
మిల్లర్లకు శాశ్వత చిరునామా
వాసు అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత సంఘం గౌరవప్రదంగా నిర్ణయాలు తీసుకుంటుందని మిల్లర్లు అభిప్రాయపడుతున్నారు. మిల్లర్లు ఊహకు అందని విధంగా శ్రీకాకుళం నగరంలో భవనాన్ని మూడేళ్లలో కట్టించి సంఘానికి ఒక గ్రాండ్ చిరునామాను ఇచ్చారని కొందరు మిల్లర్లు చెబుతున్నారు.
అయితే వాసు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, ఎవరి సపోర్టు లేకుండా మిల్లర్ల అసోసియేషన్‌లో ఏకచత్రాధిపత్యాన్ని కొనసాగిస్తున్నారని కోటబొమ్మాళి, నరసన్నపేటకు చెందిన కొందరు మిల్లర్లు ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న మాట వాస్తవమే. మిల్లర్లలో అన్ని సామాజిక వర్గాలకు చెందినవారు ఉన్నా, అందులో మెజార్టీ కళింగకోమట్లు ఉన్నారు. అయితే గతంలో కళింగకోమట్లకు చెందిన మిల్లర్లు అధ్యక్ష స్థానంలో కూర్చున్నా వారివల్ల వీరికి ఎటువంటి ప్రయోజనం సమకూరలేదని స్వయంగా ఆ సామాజికవర్గానికి చెందిన మిల్లర్లే మాట్లాడుకుంటున్నారు. అందువల్ల వారే వాసు నాయకత్వాన్ని కోరుకున్నారు. వాసును తప్పించాలనే మంత్రి ఆలోచన వెనుక నరసన్నపేటకు చెందిన కొందరు కళింగకోమట్ల ప్రమేయం ఉందని ప్రచారం సాగుతుంది. అయితే వారికి ఆ పదవిని కట్టబెట్టాలన్న ఆలోచన మాత్రం అచ్చెన్నాయుడు చేయడం లేదని తెలిసింది. పదవిని అలంకరించే వ్యక్తి వల్ల ప్రభుత్వానికి, మిల్లర్లకు నష్టం కలగకూడదన్న ఆలోచనతో అచ్చెన్నాయుడు ఉన్నారని భోగట్టా. అయితే వాసును మార్చితే అంత సమర్ధుడు దొరకడం కష్టం అని తెలిసినా ఆయనతో అంటిపెట్టుకొని తిరిగే వ్యక్తుల మాటలకు అచ్చెన్నాయుడు ప్రభావితం అవుతున్నారని మిల్లర్లు చెవులు కొరుక్కుంటున్నారు.
Comments