top of page

అట్టుంటది మనతోని!

  • Writer: DUPPALA RAVIKUMAR
    DUPPALA RAVIKUMAR
  • Oct 3, 2024
  • 3 min read
  • ఉత్తరప్రదేశ్‌ బరేలీ న్యాయమూర్తి దివాకర్‌ విచిత్రమైన తీర్పు

  • జ్ఞానవాపి మసీదులో వీడియో తీయడానికి అనుమతి ఇచ్చింది ఈయనే!

  • హిందుత్వవాదుల కంటే చురుగ్గా ఆలోచించే న్యాయమూర్తి

(దుప్పల రవికుమార్‌)

లవ్‌ జిహాద్‌ పేరు విన్నారు కదా! వేరు వేరు మతాలకు చెందిన వారు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడాన్ని నిషేధిస్తూ, ఈ ప్రేమ వ్యవహారాలలో ముస్లింలను దోషులుగా చూపిస్తూ, కరడుగట్టిన హిందుత్వవాదులు సృష్టించిన ఒక కుట్ర సిద్ధాంతం ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బరేలీ కోర్టులోకి చొరబడిరది. ఆ కోర్టుకు ఒక రేప్‌ కేసు వచ్చింది. ఒక హిందూ అమ్మాయిని తాను హిందువునని నమ్మబలికి లోబరుచుకున్న ముస్లిం కుర్రాడి కేసది. దీనిని లవ్‌ జిహాద్‌ కేసుగా పరిగణిస్తూ ఆ న్యాయమూర్తి కుర్రాడికి శిక్ష విధించారు. ఈ కేసులో ఎవరూ మతం మారనప్పటికీ, ఉత్తరప్రదేశ్‌లో అమలులో ఉన్న బలవంతపు మతమార్పిడి కేసును ఆ ముస్లిం యువకుడు మహమ్మద్‌ ఆలింపైన పెట్టనందుకు పోలీసులపై విరుచుకుపడ్డారు ఆ న్యాయమూర్తి రవికుమార్‌ దివాకర్‌. వివాదాలకు కొత్తకాని జడ్జి దివాకర్‌ అక్కడితో ఆగకుండా మరిన్ని ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. ఒక పద్ధతి ప్రకారం ముస్లిం మగవారు, హిందూ స్త్రీలను బలవంతంగా మతం మార్చడానికి వీలుగా ప్రేమ వల విసిరి లోబరుచుకుంటున్నారని, ఇది లవ్‌ జిహాద్‌ కిందకు వస్తుందని, దీనిని అరికట్టాలన్నారు.

ప్రేమ ముసుగులో, మోసపూరితంగా ముస్లిం యువకులు హిందూ స్త్రీలను పెళ్లి చేసుకుని వారిని ఇస్లాం మతంలోకి మారుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇవి ఎలాంటి ఆధారాలు లేకుండా కొన్ని సంవత్సరాలుగా రెండు మతాల మధ్య విభేదాలు సృష్టించడానికి, మతాంతర వివాహాలలో రక్తపాతం సృష్టించడానికి హిందుత్వవాదులు వాడుతున్న వాదనలే కావడం విచారకరం. సెప్టెంబరు 30వ తేదీన ఆయన వెలువరించిన 42 పేజీల తీర్పులో ఇలాంటి వ్యాఖ్యలు అనేకం చేసారు. ‘ఒక అంతర్జాతీయ కుట్ర ప్రకారం మన దేశమ్మీద ఒక నిర్దిష్ట మతం ఆధిపత్యం సంపాదించడానికి ఎక్కుపెడుతున్న జనాభా యుద్ధంలో ఇది ఒక భాగం’ అని అందులో పేర్కొన్నారు. ఇలాంటి లవ్‌ జిహాద్‌ల ద్వారా జరిగే మతమార్పిళ్లను కేంద్ర ప్రభుత్వం ఆపలేకపోతే ఈ దేశం దారుణ విపరిణామాలను ఎదుర్కొంటుందని ఆ తీర్పులో రాసుకొచ్చారు. ఈ మతమార్పిళ్ల ముఠా ముస్లిమేతరులైన గిరిజనులు, దళితులతో పాటు వెనుకబడిన తరగతులకు చెందిన యువతులను లక్ష్యంగా చేసుకుని, రకరకాలుగా లోబరుచుకుంటున్నారని, బ్రెయిన్‌ వాష్‌ చేస్తున్నారని, మానసికంగా వత్తిడి చేసి, మతం మారుస్తున్నారని, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లాంటి పరిస్థితులు ఈ దేశంలో తయారుచేస్తున్నారని జడ్జి దివాకర్‌ అన్నారు. లవ్‌ జిహాద్‌లకు విదేశీ నిధులు అందే వీలును కొట్టిపారేయలేమన్నారు. ఈ దేశ ఐక్యతకు, సమగ్రతకు, సార్వభౌమాధికారానికి ఈ చట్టవ్యతిరేకమైన మత మార్పిడులు తీవ్ర విఘాతం కలిగిస్తాయని ఈ తీర్పులో వ్యాఖ్యానించారు.

ఇంతకుముందూ వివాదాస్పద తీర్పులే

ఇదే ఏడాది మొదట్లో ఈయన వార్తల్లోకి ఎక్కడానికి కారణం ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనధ్‌ను ‘ఆధునిక తాత్విక చక్రవర్తి’ అని పొగిడి, ఈ దేశంలో మతపరమైన దాడులు జరిగినప్పుడు రాజకీయ పార్టీలు ముస్లింలను బుజ్జగించడాన్ని ఖండిరచారు. ఈ వ్యాఖ్యలను తరువాత అలహాబాద్‌ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. చేయకూడని రాజకీయ వ్యాఖ్యానంగా అభివర్ణిస్తూ, న్యాయమూర్తి తన వ్యక్తిగత అభిప్రాయాలను ఇలా తీర్పులలో ఇమడ్చడాన్ని నిరసించింది. ఇదే దివాకర్‌ 2022లో వారణాసి కోర్టులో న్యాయమూర్తిగా ఉన్నప్పుడు జ్ఞానవాపి మసీదులో వివాదాస్పదమైన తీర్పునిచ్చారు. సీనియర్‌ డివిజన్‌లో సివిల్‌ జడ్జిగా ఉండగా, కొంతమంది హిందుత్వవాదులు అక్కడి చెరువులో శివలింగం ఉందని కోర్టుకొస్తే, మెఘలుల కాలంనాటి మసీదులో కొంత భాగాన్ని మూసివేయమని ఉత్తర్వులిచ్చారు. ఆ సమయంలోనే కోర్టు నియమించిన కమిషనర్‌ సాయంతో మసీదులోపల వీడియో తీయడానికి అనుమతినిచ్చింది ఈయనే. మసీదు పడమటి గోడను ఆనుకుని మాతా శృంగార దేవి ఆలయం ఉందని, అక్కడ నిత్యపూజకు అనుమతివ్వమని అదే హిందుత్వవాదులు డిమాండ్‌ చేశారు.

బరేలీ కేసులో అయితే నిందితుడు ఆలింను ఐపిసి సెక్షన్‌ 376 (2) కింద ముద్దాయిని చేసారు. అతడి తండ్రి సాబిర్‌కు ఐపిసి సెక్షన్‌ 504కింద రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. ఓ యువతి ఫిర్యాదుమేరకు 2023లో ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌ నమోదయింది. ఆనంద్‌ అనే పేరుతో పరిచయమైన ఆలిం తనతో అనేకమార్లు శారీరకంగా కలిసాడని, గర్భవతి అయ్యాక వారింటికి వెళ్లినపుడు అతడు ముస్లిం అని తనకు తెలిసిందని, 2022లో తన నుదుటిపై సిందూరం పెట్టి తనను పెళ్లి కూడా చేసుకున్నాడని, తరువాత కాలంలో తనను మతం మారమని బలవంతం చేసారని ఆ యువతి అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తీరా కేసు 2024లో కోర్టుకు వచ్చేటప్పటికి ఆ యువతి అసలు విషయం బయటపెట్టింది. తన తల్లిదండ్రులు, మత పెద్దల బలవంతం మీద తాను అలా ఫిర్యాదు చేసినట్టు అంగీకరించింది. ఈ కీలక వ్యాఖ్యలను జడ్జి దివాకర్‌ పట్టించుకోలేదు సరికదా, కోర్టులో ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆలిం బలవంతంగా ఇప్పించాడని నమ్మారు. తల్లిదండ్రులకు ‘దూరంగా ఉన్న’ ఆ యువతి ఖరీదైన ఆండ్రాయిడ్‌ ఫోన్‌, దుస్తులతో కోర్టుకు రావడాన్ని ప్రశ్నించారు. ఆలిం ఇప్పటికీ ఆర్థికంగా సహాయపడుతున్నాడని వ్యాఖ్యానించారు.

జడ్జి దివాకర్‌ ఈ తీర్పు ప్రతులను బరేలీ ఎస్పీ కార్యాలయానికి ఒక కాపీ పంపించి, అన్ని పోలీస్‌ స్టేషన్లకు సమాచారం చేరవేయమని ఆదేశించారు. యుపి చట్టవ్యతిరేక మత మార్పిడి నిషేధ చట్టం 2021ని అనుసరిస్తూ తమ పరిధిలో నమోదైన కేసుల పరిష్కారానికి ఈ తీర్పు తోడ్పడగలదని అందులో హితవు పలికారు. తమ రాష్ట్రం రూపొందించుకున్న చట్టాలను పకడ్బందీగా అమలు చేయడానికి ఈ తీర్పు ఎంతగానో సహకరిస్తుందని, అందుకుగాను ఈ తీర్పు ప్రతులను ఆ రాష్ట్ర డిజిపి దొరవారికి, హోం శాఖ కార్యదర్శికి, ఇతర పెద్దలకు పంపించాలని కూడా కోరారు.

కొసమెరుపు

కరడుగట్టిన మతోన్మాద హిందుత్వవాదులు ముస్లింలపై అనవసర ద్వేషం పెంచడానికి సృష్టించిన ఈ లవ్‌ జిహాద్‌ పదం ఇప్పుడు మెయిన్‌స్ట్రీం మీడియా కూడా వాడుతోంది. ఎలాంటి న్యాయపరమైన పునాది లేని ఈ పదానికి గుర్తింపు లేదు. ఆ మతమార్పిడి నిషేధ చట్టంలో కూడా ఎక్కడా ఈ పదం వాడబడలేదు. కాని తన 42పేజీల తీర్పులో జడ్జి దివాకర్‌ ఈ పదం అనేక పర్యాయాలు వాడడం విడ్డూరం. చాలా విచిత్రమైన విషయం ఏమిటంటే ప్రయాగరాజ్‌కు చెందిన ఒక లాయర్‌ ఈ మత మార్పిడి నిషేధ చట్టపు రాజ్యాంగబద్దతపై ఉత్తరప్రదేశ్‌ సర్వోన్నత న్యాయస్థానంలో 2021లో ఒక కేసు వేసారు. అప్పుడు ఇదే ఆదిత్యనాద్‌ ప్రభుత్వం అలహాబాద్‌ హైకోర్టుకు సమర్పించిన ఒక అఫిడవిట్‌లో ఈ లవ్‌ జిహాద్‌ పదం తమ చట్టంలో ఎక్కడా వాడలేదని స్పష్టంగా చెప్పింది. ఈ చట్టం కేవలం మతాంతర వివాహాల పైనే కాకుండా ఇతర అనేక రూపాలలో జరుగుతున్న బలవంతపు మత మార్పిడి గురించి పట్టించుకుంటుందని చెప్పారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page