top of page

అటు నుంచి ఇటు.. అసమ్మతి బదిలీ!

Writer: ADMINADMIN
  • `పాతపట్నంలో మారిన ఎన్నికల సీను

  • `అభ్యర్థిని మార్చి కష్టాల్లో పడిన తెలుగుదేశం

  • `వైకాపాకు కలిసిస్తున్న తాజా పరిణామాలు

  • `అసమ్మతిని అధిగమించి దూసుకుపోతున్న రెడ్డిశాంతి

  • `టికెట్‌ వివాదంతో గందరగోళంలో ప్రతిపక్షం

జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను మార్చి వివాదాలు రేపింది. వాటిలో శ్రీకాకుళం విషయాన్ని కాస్త పక్కన పెడితే పాతపట్నంలో అభ్యర్థి మార్పు వికటించి వైకాపా అభ్యర్థి, సిటింగ్‌ ఎమ్మెల్యే రెడ్డి శాంతిని విజయం వైపు అడుగులు వేయిస్తుందా.. అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. రాష్ట్రంలో అసంతృప్తి ఉన్నచోట, అభ్యర్థుల పనితీరు బాగులేనిచోట, గడప గడపకు కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించనివారికి టికెట్లిచ్చే ప్రసక్తి లేదని వైకాపా అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించినప్పటికీ జిల్లాలో అభ్యర్థులను మార్చలేదు. అదే సమయంలో తెలుగుదేశంలో సిటింగ్‌ ఇన్‌ఛార్జిలకే టికెట్లిస్తారని ప్రచారం జరిగినా రెండుచోట్ల మార్చేశారు. ఇందులో శ్రీకాకుళం అభ్యర్థి గొండు శంకర్‌ మొదటి రోజు నుంచి ప్రచారంలో దూసుకుపోతుండగా, పాతపట్నంలో మాత్రం మామిడి గోవిందరావు పార్టీ టికెట్‌ రాకముందు కనిపించినంతగా కూడా ఇప్పుడు నియోజకవర్గంలో అలికిడి లేకుండాపోయారు. అధికార పార్టీలో అసంతృప్తిని ఎదుర్కొన్న రెడ్డి శాంతి దీన్ని తనకు అనుకూలంగా మలచుకోవడంలో విజయం సాధించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కలమట రమణ రెండు రోజుల క్రితం మళ్లీ ఆ పార్టీ పెద్దలను కలిశారు. అయినా కూడా ఆయనకు భరోసా లభించనట్టే చెప్పుకుంటున్నారు. కానీ మరో రెండు రోజుల్లో పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్న భావనతో ఆయన ఉన్నారు. కానీ ఈలోగానే రెడ్డి శాంతి అన్నీ చక్కబెట్టేశారు. పార్టీ కలమట రమణకు టిక్కెటిచ్చినా లేక ఆయన ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నా తనకు వచ్చిన నష్టమేమీ లేదన్న రీతిలో ఆమె క్షేత్రస్థాయిలో నాయకులను కూడగట్టారు.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

అభ్యర్థులను ప్రకటించక ముందు బలంగా కనిపించిన టీడీపీ ఇప్పుడు పూర్తిగా వెనుకబడిపోయింది. రెడ్డి శాంతిని వ్యతిరేకిస్తున్న గ్రూపు కలమట రమణకు టీడీపీ టికెటిస్తే మద్దతు తెలుపుదామని భావించింది. పార్టీ టికెట్‌ దక్కకపోవడంతో ఇప్పుడాయన ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు మద్దతిచ్చి చేతులు కాల్చుకోవడం కంటే వైకాపాతోనే కొనసాగడం మంచిదన్న ఆలోచనతో అసమ్మతి నేతలు ఉన్నారు. కలమట రమణ ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారట. ఈమేరకు శుక్రవారం అభిమానులతో సమావేశం నిర్వహించాలనుకున్నా దాన్ని శనివారానికి వాయిదా వేశారు. దీంతో పాతపట్నంలో త్రిముఖ పోటీ తప్పనట్టే కనిపిస్తోంది. ఎన్నికల బరిలో నిలవాలన్న లక్ష్యంతో మామిడి గోవిందరావు కొన్నేళ్లుగా ఛారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను మాత్రం కలమట రమణ చేస్తూ వచ్చారు. దీంతో పార్టీ క్యాడర్‌ ఆయనతోనే ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆయనే ఇండిపెండెంట్‌గా బరిలో నిలిస్తే తెలుగుదేశం ఓట్లే చీలిపోతాయి. దీన్ని గ్రహించిన వైకాపా అసమ్మతివాదులు మనసు మార్చుకుని రెడ్డి శాంతి కోసం పని చేయడం ప్రారంభించారు. ఇప్పటికే మామిడి శ్రీకాంత్‌ వర్గం బేషరతుగా ఆమెతో తిరుగుతుండగా, గ్రామాల్లో గ్రూపుల వల్ల కాస్త అటూఇటుగా వ్యవహరించినవారంతా కూడా ఆమె ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు జరిపిన అనేక సర్వేల్లో కొన్ని వైకాపాకు, కొన్ని టీడీపీకి అనుకూలంగా రిపోర్టులు ఇచ్చినా, అన్నింటిలోనూ కామన్‌గా పేర్కొన్న అంశం ఒక్కటే.. ఎస్సీ, ఎస్టీ ఓటర్లు ఎక్కువ శాతం అధికార వైకాపాతో ఉన్నారన్నదే. రెడ్డి శాంతికి కలిసొచ్చిన అంశం కూడా అదే. పాతపట్నం నియోజకవర్గంలో గిరిజన ప్రాంతాలు ఉండటం వల్ల సంక్షేమ పథకాల ప్రచారంతో ఆమె ముందుకెళ్తున్నారు.

అటు ప్రచారం.. ఇటు బుజ్జగింపులు

జిల్లాలో ఇచ్ఛాపురం తర్వాత ప్రచారంలో ముందు వరుసలో ఉన్న నియోజకవర్గం పాతపట్నం. వైకాపా అభ్యర్ధి రెడ్డిశాంతి ఇప్పటికే అన్ని గ్రామాల్లో ఒక విడత ప్రచారం పూర్తి చేశారని తెలిసింది. ఒకవైపు రెడ్డిశాంతి, మరోవైపు ఆమె కుమారులు శ్రావణ్‌, ఓం శ్రీకృష్ణ గుడ్‌మార్నింగ్‌ పాతపట్నం పేరుతో గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. స్థానిక వైకాపా నేతలతో కలిసి కొత్తూరు మండలంలోని గిరిజన గూడల్లో పర్యటిస్తున్నారు. టీడీపీలో నెలకొన్న సందిగ్ధత ను ఉపయోగించుకుని ఆ పార్టీ నుంచి వైకాపాలోకి చేరికలను ప్రోత్సహిస్తున్నారు. అదే సమయంలో సొంత పార్టీలోని అసమ్మతి నాయకులను బుజ్జగిస్తూ వారి మద్దతుతో కుటుంబం మొత్తం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అసమ్మతి నేతలతో సమావేశమై బుజ్జగిస్తూ మద్దతు కూడగడుతున్నారు. అప్పటికీ బెట్టు చేసే నేతలతో పార్టీ అధిష్టానం ఆదేశాలతో పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి చిన్న శ్రీనుతో సంప్రదింపులు జరుపుతున్నారు. 2019 ఎన్నికల్లో రెడ్డిశాంతి విజయం వెనుక ఆమె భర్త రెడ్డి నాగభూషణం ముఖ్య భూమిక పోషించారు. ఆయన కోవిడ్‌తో మృతిచెందిన తర్వాత ఆ బాధ్యతను పెద్ద కుమారుడు శ్రావణ్‌ భుజస్కందాలపై వేసుకున్నారు. నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేస్తూ ప్రజల ఆశీర్వాదం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.

గందరగోళం మధ్య సాగని టీడీపీ ప్రచారం

దీనికి విరుద్ధంగా టీడీపీ అభ్యర్ధి మామిడి గోవిందరావు ప్రచారం సోసోగా సాగుతోంది. మూడడుగులు ముందుకేస్తే ఆరడుగులు వెనక్కి అన్న చందంగా ఉంది. ఆయన్ను అభ్యర్థిగా ప్రకటించినా పార్టీ అధిష్టానం రోజుకోరకంగా ఫీలర్లు వదులుతూ తికమకకు గురిచేస్తుండడంతో ఎన్నికల ప్రచారం సాఫీగా ముందుకు సాగడంలేదని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనకు టికెట్‌ దక్కనందుకు అసంతృప్తితో రగిలిపోతున్న కలమట వెంకటరమణ నియోజకవర్గంలో బలప్రదర్శన చేయడం, స్వతంత్రంగా కార్యక్రమాలు చేపట్టడంతో అధిష్టానం తరఫున పరిశీలకులు నియోజకవర్గంలో పర్యటించి వివరాలు సేకరించారు. దీంతోపాటు ఐవీఆర్‌ఎస్‌ సర్వే చేయించారు. టికెట్‌ ప్రకటించిన తర్వాత కూడా ఇవన్నీ జరగడంతోపాటు కలమటను చంద్రబాబుతో కలిపించడం కూడా జరిగినా ఇంతవరకు మామిడిని తప్పించి కలమటకు టికెట్‌ ఇస్తారన్న భరోసా లేకపోవడంతో ఆ వర్గంలో ఉన్న పలువురు అధికార పార్టీ వైపు చూస్తున్నట్టు భోగట్టా. దీన్నే రెడ్డి శాంతి అనుకూలంగా మలచుకుంటున్నారు. కలమట రమణకు టికెట్‌ ఇవ్వరని బలంగా ప్రచారం చేస్తున్న మామిడి గోవిందరావు వర్గం అధికార పార్టీ అభ్యర్థికి ధీటుగా జనంలోకి మాత్రం వెళ్లలేకపోతున్నారు. ఐదేళ్లుగా మామిడి ప్రజల్లో తిరుగుతూ అనేక కార్యక్రమాలు చేసినా తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోలేదన్న వాదనలు ఉన్నాయి. గుడులు, గోపురాలకు, శుభకార్యాలకు ఆర్ధిక సాయం చేయడం తప్ప సొంత క్యాడర్‌ను తయారుచేసుకోవాలన్న ఆలోచన చేయలేదు. ఇవి పార్టీ టికెట్‌ రావడానికి ఉపకరించినా పార్టీలో సీనియర్‌ నాయకులను తనవైపు తిప్పుకోవడానికి ఉపయోగపడలేదు.

అభ్యర్థిని మార్చినా ప్రయోజనం శూన్యం

ఎక్కువ కేసులు ఉన్నవారికే టీడీపీ ప్రభుత్వంలో పదవులు వస్తాయని స్వయంగా నారా లోకేషే తన పాదయాత్రలో ప్రకటించారు. ఆ లెక్కన చూస్తే కలమటపై 73 కేసులు ఉండగా, మామిడిపై కేవలం ఒక్క కేసే ఉన్నట్లు గుర్తించారు. 73 అక్రమ కేసులు బనాయించడమంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటానికి గీటురాయిగా భావించాలని ఆయన వర్గం ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ అభ్యర్ధి మార్పు అనివార్యం అయితే కలమటకు మామిడి గోవిందరావు సహకరించే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. తనను వ్యతిరేకించి స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో నిలవాలని ఆలోచిస్తున్న కలమటకు ఎందుకు సహకరించాలని మామిడి వర్గం ఇప్పటికే ప్రశ్నిస్తోంది. అన్ని రకాలుగా టీడీపీలో రచ్చ పీక్‌కు చేరడంతో మామిడినే కొనసాగించాలన్న నిర్ణయానికి పార్టీ వచ్చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. కలమట ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా, కలమటకే మళ్లీ టికెట్‌ ఇచ్చినా వైకాపాకే లబ్ధి చేకూరుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అభ్యర్థిని ప్రకటించిన వారం పది రోజుల్లో మార్పులు చేస్తే కొంతవరకు ఫర్వాలేదు. కానీ నెల రోజుల తర్వాత మళ్లీ మార్పులు అంటే వ్యతిరేక ప్రభావమే అధికంగా ఉంటుంది.

 
 
 

댓글


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page