ప్రభుత్వం నిర్వహించే ఆసుపత్రిలో అంత ఘోరమా?: మమత ప్రశ్న
దేశవ్యాప్తంగా నిరసనకారులు ప్రశ్నిస్తున్నది కూడా అదే కదా!
సమస్యను పరిష్కరించలేక అపసోపాలు పడుతున్న బెంగాల్ ముఖ్యమంత్రి
- దుప్పల రవికుమార్

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కలకత్తాలో జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసు తిరిగితిరిగి ఆ రాష్ట్ర ప్రభుత్వ మెడకు చుట్టుకున్నట్టే కనిపిస్తోంది. విధుల్లో ఉన్న ఒక జూనియర్ డాక్టరును అత్యంత పాశవికంగా నేరస్తుడు మానభంగం చేసి, హత్య చేసినా పట్టించుకునే నాధుడు కనిపించకపోవడం ఒక్క కోల్‌కతానే కాదు యావద్దేశాన్ని కదిలించింది. మెల్లగా నిరసనలు ఊపందుకుంటున్నాయి. హత్య జరిగిన తీరు చూస్తుంటే ఇది నిర్భయ కేసును మించిందనిపిస్తోంది. హతురాలి శరీరంపై 16 చోట్ల, లోపల అంతర్గత అవయవాలకు తొమ్మిది చోట్ల గాయాలైనట్టు పోస్ట్‌మార్టం నివేదిక చెప్తోంది. హత్య జరిగిన తర్వాత హాస్పిటల్ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం నడుచుకున్న తీరు మాత్రం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ హత్యపై సమగ్రమైన దర్యాప్తు నిర్వహించి, నిందితులను కఠినంగా శిక్షించడం ద్వారా సమాజానికి అద్భుతమైన సందేశం పంపించినట్టవుతుందని జూనియర్ డాక్టర్లు, ఇతర వైద్యులు, ప్రజా సంఘాలు కలకత్తాలో రోడ్డెక్కితే, వారి సందేహాలను నివృత్తి చేయాల్సిన ముఖ్యమంత్రి ఆశ్చర్యకరంగా మరొక నిరసన ప్రదర్శన తీయడం యావద్దేశాన్ని విచారంలోకి నెట్టింది.
ఇందులో విడ్డూరమైన విషయం ఏమంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసుపత్రులను నియంత్రించే ఆరోగ్య శాఖను మాత్రమే కాక ప్రజల శాంతి భద్రతలను కాపాడే హోం శాఖను కూడా స్వయంగా నిర్వహిస్తున్నారు. దర్యాప్తునకు ఆదేశించగల అధికారం చేతిలో ఉండి, ప్రజలకున్న అన్ని అనుమానాలను తొలగించగలిగే అవకాశముండి, నిందితులను కఠినంగా శిక్షించగలిగే హోదాలో ఉండి కూడా చేతులు ముడుచుకుని మమతా బెనర్జీ ఉండడం, నిస్సహాయంగా సిబిఐ విచారణకు డిమాండ్ చేయడం విచిత్రం. దాదాపు మూడు దశాబ్దాలకు పైబడి కమ్యూనిస్టులకు కోటగా ఉండిన పశ్చిమబెంగాల్‌లో అధికారం చేజిక్కించుకోవడం అంటే మాటలు కాదు. ఎంతో పోరాటం చేసి దుర్భేద్యమైన కోటలో ప్రవేశించిన ఫైర్‌బ్రాండ్ మమత, ఇలాంటి కీలకమైన సమయంలో చేష్ఠలుడిగి మౌనంగా నిల్చోవడం ఆమె అభిమానులతో పాటు సాధారణ ప్రజలు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. మమత పతనానికి బీజాలు పడ్డాయని సందేహిస్తున్నారు. దుర్ఘటన జరిగిన రోజు నుంచీ హతురాలి తల్లిదండ్రులు, ఇతర జూనియర్ డాక్టర్లతో పాటు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తోన్న అంశాలనే ఇప్పుడు పది రోజుల తర్వాత ముఖ్యమంత్రి కూడా డిమాండ్ చేయడం విస్తుగొలుపుతోంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్య శాఖ, పోలీసు శాఖ బదులివ్వాల్సిన అనేక ప్రశ్నలు కేవలం ఆమె నోరు విప్పితే కాని, ప్రజలకు తెలిసేవి కావు.
జవాబు చెప్పాల్సిన ప్రశ్నలు
ఆ వైద్యురాలి శరీరంపై రక్తమోడుతున్న అన్ని గాయాలు ఉన్నాయి. శరీరం కింది భాగంపై ఎలాంటి దుస్తులూ లేవు. అయినప్పటికీ ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆసుపత్రి వర్గాలు ఆమె తల్లిదండ్రులకు ఎందుకు చెప్పారు? అందరినీ పట్టిపీడిస్తోన్న అసలు ప్రశ్న ఇదే. ఆమె తల్లిదండ్రులతో పాటు ఉన్న దగ్గరి బంధువు లల్లంతాప్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం మృతదేహం కాళ్లు ఒకదానికొకటి 90 డిగ్రీల ఎడంలో పరుచుకుని ఉన్న పరిస్థితిలో వారు చూసినట్టు తెలిపారు. క్రైం సీన్ ఫోటోలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. ఆ రాత్రి ఆర్‌జి కార్ ఆసుపత్రి నుంచి ఆమె తల్లిదండ్రులకు రెండుసార్లు ఫోన్ వెళ్లింది. మొదట ఆమె పరిస్థితి బాగా లేదని వెంటనే బయలుదేరి రావాలని కోరారు. కాని, కాసేపట్లోనే ఆసుపత్రిలో ఆమె ఆత్మహత్య చేసుకుందని కబురందించారు. ఈ రెండు పొంతనలేని వాదనలు ఆసుపత్రి వర్గాలు ఎందుకు చేసినట్టు?
ఆసుపత్రికి వచ్చిన ఆమె తల్లిదండ్రులు తమ కూతురి మృతదేహాన్ని చూడనివ్వమని పోలీసులను ఎందుకు బతిమాలుకోవాల్సి వచ్చింది? ఒక లోకల్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆమె తల్లి విగతజీవిగా మారిన తమ బిడ్డ ఆఖరిచూపు చూసుకుంటామని పోరాడాల్సి వచ్చిందని చెప్పారు. పోలీసులు ఈ వాదనను ఖండిరచారు. కాని, వాస్తవమేమిటంటే గంటల తరబడి వేచిచూసాక మాత్రమే తల్లిదండ్రులను ఆ మృతదేహం వద్దకు పంపించారు. వీరు అంతసేపూ ఆసుపత్రిలో ఛాతీ విభాగం వద్ద నిరీక్షిస్తున్నారు. వీళ్లను కలుసుకోవడానికి ఆసుపత్రి వర్గాలు రాలేదు. కాని, నిలువరించడానికి పోలీసులను పంపారు. కాగా, ఈ విషయంలో పబ్లిక్‌ను తప్పుదోవ పట్టిస్తున్నాయని సోషల్ మీడియాపై పోలీసులు విరుచుకుపడుతున్నారు. ఈ ఇంటర్వ్యూలు ప్రసారం చేసిన చానెళ్లపై కేసులు పెడుతున్నారు. దుర్ఘటన జరగడానికి ఒకరోజు ముందే వైద్యురాలి కారును ధ్వంసం చేసారని ఆ ఛానెళ్లు చెప్తున్నాయి. బంధువులను ఆసుపత్రి నుంచి తరమడానికి పోలీసులు తమ కళ్లెదుటే కారును ధ్వంసం చేసారని మృతురాలి తల్లి ఆరోపిస్తోంది.
అనుమానాలకు తావిస్తోన్న ప్రిన్సిపాల్ వైఖరి
విలేకరుల సమావేశంలో పదేపదే తన పేరును ప్రస్తావించిన ఆసుపత్రి కళాశాల ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు పోలీసులు ఇప్పటి వరకూ ఏమైనా నోటీసులు పంపించారా? దుర్ఘటన జరిగినప్పటి ఆర్‌జి కార్ ప్రిన్సిపాల్ చట్టవిరుద్ధంగా పలుమార్లు ఆమె పేరును ప్రస్తావించారు. ఇలాంటి హేయమైన సంఘటనలు జరిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ బాధితురాలి ఐడెంటిటీని వెల్లడిరచకూడదని చట్టంలో ప్రముఖంగా ప్రస్తావించినప్పటికీ, దానిని అత్యంత నిర్లక్ష్యంగా ఉల్లంఘిస్తూ, ఆ మరునాడు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తొమ్మిది సార్లు బాధితురాలి పేరు ప్రస్తావించారు. కాగా కోల్‌కతా పోలీసులు ఇప్పటిదాకా సుమారు 200 నోటీసులు వివిధ సోషల్ మీడియా ప్రతినిధులకు పంపించారు. అనేక మందిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసారు. మరి బాధితురాలి గురించి వివరాలు వెల్లడిచేసిన ప్రిన్సిపాల్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఇప్పటికీ తెలియడం లేదు.
పని ప్రదేశంలో హింస జరపడంపై, అవినీతి ఆరోపణలున్న ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్‌ను శిక్షించకపోగా, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సత్కరిస్తోంది? ఈ ప్రశ్న మనల్నే కాదు, ఏకంగా కోల్‌కతా హైకోర్టునే విస్మయపరుస్తోంది. విచ్చలవిడి అవినీతి, హుందాగా లేని ప్రవర్తన, విద్వేషపూరితమైన పని విధానం వంటి అనేక ఆరోపణలు ఎదుర్కొంటోన్న సందీప్‌కు తృణమూల్ పార్టీతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఇంతకుముందు అతని భారీ అవినీతిపై రాష్ట్ర విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదులందినా ఎలాంటి చర్యలూ లేవు. ఆ సమయంలో కేసు నమోదు చేసిన ఆర్‌టిఐ కార్యకర్త అక్తర్ అలీని ఆసుపత్రి నుంచి బదిలీ చేసారు. ఇప్పుడు అక్తర్ అలీ ప్రిన్సిపాల్‌ను మాఫియా డాన్ అని పిలుస్తున్నాడు. వైద్య విద్యార్థుల వద్ద డబ్బులు సేకరించడం, టెండర్ల ప్రక్రియను నీరుగార్చడం, ఆసుపత్రిని అవినీతిమయం చేయడం చేస్తున్నాడని గట్టిగా ప్రచారం చేస్తున్నాడు. ఘోష్‌ను ఇదివరలో రెండుసార్లు బదిలీ చేసినప్పటికీ, చాలా విచిత్రంగా చిటిక వేసేలోగా మళ్లీ ఆర్‌జి కార్ ఆసుపత్రికే ప్రిన్సిపాల్‌గా వచ్చేసాడు. ఈ దుర్ఘటన జరిగిన తర్వాత జరుగుతున్న పరిణామాలను పరిశీలించి తన పదవికి రాజీనామా చేసాడు. కాని, అదే రోజు నేషనల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఉద్యోగం వచ్చేసింది. కోల్‌కతా హైకోర్టు ఆపకపోయుంటే ఆ కాలేజీకి ప్రిన్సిపాల్ అయ్యేవాడే. ఆయనకు రక్షణ కావాలని వేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ‘ఈ వ్యక్తి చాలా శక్తిమంతుడు. రాష్ట్రమే అతని పక్షాన ఉంది. అతనికి రక్షణ కావాలంటే పోలీసులు అందిస్తారు. ఆయన 500 మంది పోలీసులు కావాలని కోరుకున్న మరుక్షణమే 500 మంది పోలీసులు ఆయన ఇంటిగుమ్మం ముందు నిల్చుంటారు. అతనికెందుకయ్యా రక్షణ!’ అని ఆగ్రహంగా వ్యాఖ్యానించారు.
ఇంకా కేసు దర్యాప్తు జరుగుతుండగా, ఆసుపత్రి ఛాతీ విభాగం వద్ద పునర్నిర్మాణ పనులు ఎందుకు మొదలుపెట్టినట్టు? బుధవారం ఈ కేసును సిబిఐకి అప్పగించారు. కాని, అప్పటికే ఆ ఛాతీ విభాగంలో మరమ్మతు పనులు చాలా కంగారుగా మొదలుపెట్టేసారు. వైద్యురాలి మృతదేహం పడిఉన్న చోటనే మరమ్మతు పనులు ఎందుకు చేపట్టినట్టు? కేవలం సాక్ష్యాలను చెరిపేయడానికేనా! వైద్యురాలి మృతదేహం లభించిన చోటున్న గది, దానిని ఆనుకుని ఉన్న మూత్రశాలను కొట్టేయాల్సిందిగా దుర్ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఆదేశాలు తయారుచేసినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రాసింది. దీనినే జూనియర్ డాక్టర్లు, ఇతర వైద్య విద్యార్థులు తీవ్రంగా అనుమానిస్తున్నారు.
ఆ రోజు రాత్రి జరిగిన దుర్ఘటనను వ్యతిరేకిస్తూ వైద్య విద్యార్థులు నిరసన తెలుపుతున్నప్పుడు అల్లరి మూకలు వారితో చేరి ఆసుపత్రిపై దాడి చేసాయి. ఈ పని కచ్చితంగా భారతీయ జనతా పార్టీ, సిపిఐ (ఎం) పార్టీ చేసిందని ముఖ్యమంత్రి అభియోగం మోపారు. కాని, మీడియా తీసిన ఫోటోలలో దాడులకు పాల్పడిన వారంతా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతో సంబంధాలు ఉన్నవారే ఉండడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. నిర్భయ దుర్ఘటన జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా రాజుకున్న చిచ్చు కాంగ్రెస్ పార్టీకి మంగళం పాడడానికి దారితీసింది. బహుశా ఇప్పుడు దుర్ఘటన జరిగిన తీరును పరిశీలించినప్పుడు కూడా పశ్చిమ బెంగాల్‌లో మమత పరిపాలన అంతానికి ఇది ఆరంభంలా కనిపిస్తోంది.
Comments