అత్యూత్సాహం చూపారు.. అడ్డంగా దొరికిపోయారు!
- BAGADI NARAYANARAO

- Jul 8
- 3 min read
విచారణ ఆయనపైనే.. వెళ్లింది ఆయనతోనే!
నవ్వులాటగా మారిన బీసీ సంక్షేమ శాఖ విచారణ తంతు
ఆరోపణలకు గురైన వారికి ముందుగానే సమాచారం
ఫొటో షూట్‌తోనే మమ అనిపించేసిన ఏబీసీడబ్ల్యూవో`1
బదిలీల్లోనూ అంతులేని అవకతవకలు
వాటికి ప్రజాప్రతినిధుల సిఫార్సు అన్న ముద్ర

(సత్యం న్యూస్, శ్రీకాకుళం)
బీసీ సంక్షేమ శాఖపై వస్తున్న ఆరోపణలు, పత్రికల్లో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని చాటుకునేందుకు ఆ శాఖ అధికారులు అత్యుత్సాహం చూపారు. తామే అడ్డంగా దొరికిపోయారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారినే వెంటబెట్టుకు వెళ్లి విచారణ తతంగం జరపడం విస్మయం కలిగించింది. ‘అతడి కబందహస్తాల్లో బీసీ శాఖ బందీ!’ అనే శీర్షికతో సంచలన సాయంకాల పత్రిక సత్యంలో సోమవారం ప్రచురితమైన కథనానికి స్పందించిన ఆ శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారి అయిన డీబీసీడబ్ల్యూవోను వివరణ కోరడంతో భుజాలు తడుమున్న సదరు అధికారి తక్షణమే విచారణ తతంగాన్ని నడిపే బాధ్యతను ఏబీసీడబ్ల్యూవో`1(అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్) చంద్రమౌళికి అప్పగించారు.
ముందుగానే సమాచారమిచ్చి..
ఆ మేరకు రణస్థలం మండలం జీరుపాలెం బాలికల వసతి గృహ సందర్శనకు బయల్దేరిన ఏబీసీడబ్ల్యూవో`1 చంద్రమౌళి ఆ సమాచారాన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న, శాఖతో సంబంధంలేని ఆచారికి ముందుగానే చేరవేశారు. దాంతో సదరు ఆచారి హాస్టల్ వార్డెన్ గుణవతిని వెంటబెట్టుకుని కారులో జీరుపాలెం వసతి గృహానికి చేరుకున్నారు. అక్కడ చంద్రమౌళి వార్డెన్ గుణవతి, హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులతో గ్రూప్ ఫోటోలు తీసుకుని విచారణ అయ్యిందనిపించేశారు. ఈ తతంగం జరుగుతున్నంత సేపు షాడో వార్డెన్‌గా వెలగబెడుతున్న ఆచారి అక్కడే కారులో ఉండటం చర్చనీయాంశమైంది. ఏది కాదని చెప్పాలనుకున్నారో.. అదే నిజమని తేలిపోయింది. అనధికారికంగా జీరుపాలెం, కేవీ పేట వసతి గృహాల నిర్వహణను వార్డెన్ గుణవతికి బదులు ఆచారి చూస్తున్నట్టు తేటతెల్లమైంది. ‘సత్యం’లో వచ్చిన కథనంపై స్పందించిన ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డీబీసీడబ్ల్యూవోను వివరణ కోరినట్టు తెలిసింది. ఇప్పటికే ఈ శాఖలో జరిగిన బదిలీలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఏ ప్రాతిపదికన బదిలీలు చేశారన్న విషయాన్ని తెలియజేస్తూ మొత్తం జాబితా ఇవ్వాలని కోరడంతో ఆ శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
తమ అక్రమాలకు సిఫార్సుల ముసుగు
బీసీ శాఖలో అవినీతికి అంతులేకుండా పోయింది. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే.. అధికార పార్టీ నాయకులు చెప్పడం వల్లే చేశానని ఆ శాఖ జిల్లా అధికారి సమాధానమిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన బదిలీల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని బాధితులు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా సదరు అధికారి పట్టించుకోలేదు. ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలనూ ఖాతరు చేయడంలేదు. ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా బదిలీలు చేసి డబ్బు దండుకున్నారని ఆ శాఖ ఉద్యోగులే బహిరంగంగా చెబుతున్నారు. కొందరిని బదిలీ చేసినట్టే చేసి డిప్యూటేషన్లతో వెనక్కి తీసుకొచ్చారు. పరిపాలన సౌలభ్యం కోసం బదిలీలు చేసినట్టు చెబుతున్న శాఖ అధికారి ఉన్నతాధికారులకు చెప్పకుండానే ప్రీ కౌన్సెలింగ్ పేరుతో బదిలీ కావాల్సిన అధికారులు, ఉద్యోగులను పిలిపించి వారి నుంచి ఆప్షన్ తీసుకొని సంతకాలు పెట్టించి పంపించినట్టు తెలిసింది. ఇదంతా గుట్టుగా జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్‌లో బదిలీలు చేస్తున్నామని చెప్పినప్పుడు కౌన్సెలింగ్ నిర్వహించకూడదు. ఈ తతంగమంతా ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా జరిగిందనే విమర్శలు ఉన్నాయి. బీసీ సంక్షేమ శాఖలో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించాలని డీఆర్వో వెంకటేశ్వరరావును కలెక్టర్ ఆదేశించారు. ఆ తర్వాత ఏమైందో గానీ డీఆర్వో కాకుండా బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారే బదిలీ ప్రక్రియ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు జరిగినా ఉన్నతాధికారులు కూడా ఏమీ పట్టనట్టు వ్యవహరించడం చర్చనీయాంశమైంది.
నిబంధనలకు విరుద్ధంగా
బదిలీలు ఎంత ఏకపక్షంగా జరిగాయంటే.. దరఖాస్తు చేయని పలువురికి స్థానచలనం చేశారు. జిల్లా మంత్రి, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే పేరు చెప్పి బదిలీల తంతు కానిచ్చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివిధ కేటగిరీల్లో మొత్తం 21 మందిని బదిలీ చేశారు. వారిలో 11 మంది వార్డెన్లు ఉన్నారు. రాజాం కాలేజీ బాలికల వసతి గృహం వార్డెన్ పావని ఆరేళ్లుగా అక్కడే పని చేస్తున్నారు. అయినా ఆమెకు రిటెన్షన్ ఇచ్చి అక్కడే కొనసాగనిచ్చారు. ఇది బదిలీ మార్గదర్శకాలకు పూర్తి విరుద్ధం. పలాస కళాశాల బీసీ వసతి గృహం వార్డెన్ ఉపేంద్రను రణస్థలం కాలేజీ వసతి గృహానికి బదిలీ చేసినా అక్కడి నుంచి ఎంఎస్ పల్లికి డిప్యూటేషన్ ఇవ్వడంతోపాటు రాజపురం హాస్టల్ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. పోస్టుమెట్రిక్ హాస్టల్ నుంచి ప్రీమెట్రిక్ హీస్టల్‌కు బదిలీ చేయాలన్నా, డిప్యూటేషన్ ఇవ్వాలన్నా ఆ శాఖ డైరెక్టర్ అనుమతి అవసరం. కానీ డైరెక్టరేట్‌కు సమాచారం ఇవ్వకుండానే బదిలీ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఉపేంద్రకు ఇచ్చిన పోస్టింగ్ ఆర్డర్‌లో మంత్రి అచ్చెన్నాయుడు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ సిఫార్సు మేరకు డిప్యూటేషన్ వేసినట్టు పేర్కొనడం చర్చకు దారి తీసింది. పోస్టింగ్ ఆర్డర్‌లో సిఫార్సు చేసిన ప్రజాప్రతినిధుల పేర్లు పేర్కొనడం ప్రభుత్వ ప్రోటోకాల్‌ను ధిక్కరించడమేనని వాదనలు ఉన్నాయి. వార్డెన్ ఉపేంద్ర డీబీసీడబ్ల్యూవో ఇంటికి అవసరమైన వ్యవహారాలు చూసుకుంటాడని, అందుకే నిబంధనలను తుంగలో తొక్కి అతనికి డిప్యూటేషన్, ఇన్‌ఛార్జి బాధ్యతలు ఇచ్చారని చర్చ జరుగుతోంది. రణస్థలం కాలేజీ బాలుర వసతిగృహనికి అదే కేంద్రంలో ఉన్న బాలికల వసతి గృహ వార్డెన్ సీహెచ్ ప్రవీణను నిబంధనలకు విరుద్ధంగా ఇన్‌ఛార్జిగా నియమించినట్లు విమర్శలు ఉన్నాయి.
దరఖాస్తు చేయనివారికీ స్థానచలనం
మండలం యూనిట్‌గా బదిలీలు జరపాలన్న ఆదేశాలు ఉన్నా గుణవతి విషయంలో వాటిని ధిక్కరించారు. రణస్థలం మండలం కేవీ పేట నుంచి జీరుపాలేనికి, అంతకుముందు జీరుపాలెం నుంచి కేవీ పేటకు బదిలీ చేస్తూ ఏళ్ల తరబడి ఆమెను అక్కడే విధులు నిర్వహించేలా సర్దుబాటు చేస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగి ఆచారి ప్రమేయం, ఒత్తిడితోనే ఆమె విషయంలో నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. నరసన్నపేట బీసీ కాలేజీ వసతి గృహ వార్డెన్ బి.రమణను శ్రీకాకుళానికి తీసుకురావడానికి మంత్రి అచ్చెన్నాయుడు సిఫార్సు చేశారని చెబుతూ శ్రీకాకుళం`1 కాలేజీ బాయ్స్ వసతి గృహం వార్డెన్‌గా పనిచేస్తున్న త్రివేణిని.. ఆమె దరఖాస్తు చేయకపోయినా, అర్హత లేకపోయినా అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ పేరుతో బలవంతంగా నరసన్నపేట కాలేజీ హాస్టల్‌కు పంపించేశారు. శ్రీకాకుళం`4 కాలేజీ బాలికల వసతిగృహ వార్డెన్ లలితను పాతపట్నం బదిలీ చేసి అక్కడ నుంచి ఆమదావలసకు డిప్యూటేషన్ వేశారు. లలిత స్థానంలో పాతపట్నం వార్డెను బదిలీ చేశారు. పాతపట్నానికి ఆమదాలవలస వార్డెన్‌ను తీసుకువచ్చారు. ఇలా బదిలీకి దరఖాస్తు చేయని పలువురిని, వసూళ్ల కోసం మరికొందరిని బదిలీ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కారుణ్య నియామకాల్లో మాయ
సంతకం చేయించేశారు.
ఈ శాఖలో కారుణ్య నియామకాల్లో అవకతవకలకు పాల్పడినట్లు మే 26న గ్రీవెన్స్‌లో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణకు కలెక్టర్ ఆదేశించినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేకపోగా ఆ జాబితాలో అనర్హుడైన కె.రామారావును ఉంచి ఓకే చేసేశారు. అర్హత ఉన్నా జాబితా నుంచి తప్పించిన బుంజు పాపారావుతో పాటు మరో ఇద్దరి పేర్లు కలిపి కొత్త జాబితా తయారు చేసి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రితో రెండు రోజుల క్రితం సంతకం చేయించేశారు. నాలుగేళ్లుగా పెండిరడ్‌లో ఉన్న ఈ ప్రక్రియలో ఆరుగురినే కారుణ్య కోటాలో నియమించాల్సి ఉండగా ప్రజాప్రతినిధులు చెప్పారంటూ అర్హతలు లేని ముగ్గురిని అదనంగా చేర్చి వ్యవహారాన్ని చక్కబెట్టేశారు. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో నగదు చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయి.










Comments