అదిగదిగో విశాఖ రైల్వేజోన్
రూ.149 కోట్లతో టెండర్లకు ఆహ్వానం
ముడసర్లోవలో 52 ఎకరాలు సిద్ధం
2వేల మందికి పరిపాలనా భవనం
11 అంతస్తుల నిర్మాణానికి రెండేళ్ల గడువు

విశాఖకు రైల్వేజోన్ వచ్చేస్తుందని కొద్ది రోజుల క్రితం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రకటించారు. ‘ఎప్పట్నుంచో ఉత్తరాంధ్ర ప్రజల స్వప్నంగా ఉన్న రైల్వేజోన్ వస్తే కొత్త రైళ్లొస్తాయా? శ్రీకాకుళం లాంటి ప్రాంతాల్లో పాత రైళ్లు ఆగుతాయా?’ ..ఇవి సగటు ప్రయాణీకుడిలో కలిగే సందేహాలు. కేవలం రైల్వేజోన్ రావడమంటే రైళ్లు రావడం మాత్రమే కాదు.. 3వేల మంది ఇక్కడ ఉద్యోగానికి వస్తారు. ముడసర్లోవ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నందున ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందుతుంది. ఈ కార్యాలయానికి అనుబంధంగా అనేక సంస్థలు ఏర్పాటవుతాయి. విశాఖపట్నంలో స్టీల్‌ప్లాంట్ పెట్టడం వల్ల రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లా వరకు ఎంతమందికి ఉపాధి లభించిందో మనకు తెలుసు. ఇప్పుడు అంత పెద్ద ఎత్తున కాకపోయినా విశాఖ రైల్వేజోన్ వల్ల ఎకనామికల్ డెవలప్‌మెంట్ కచ్చితంగా ఉంటుంది.
జోన్ కార్యకలాపాలు ప్రారంభించాలంటే ఒక జనరల్ మేనేజర్, ఆయన సపోర్టింగ్ స్టాఫ్, కొన్ని కార్యాలయాలు ఉంటే చాలు. మొత్తంగా దీనికి 2వేల మంది ఉద్యోగులు అవసరమవుతారు. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించే నాటికి వారి సంఖ్య క్రమంగా 3వేలకు చేరుతుంది. ఇప్పటికే ఇక్కడ పని చేస్తున్నవారు కొందరు ఉన్నారు కాబట్టి డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఆపరేటింగ్ డిపార్ట్‌మెంట్, కంట్రోల్ రూం, ఆడిటోరియం, మెకానికల్.. ఇలా మొత్తం 18 రకాల విభాగాలు, దానికి సంబంధించిన అనుబంధ కార్యాలయాలలో పని చేయాల్సి ఉంటుంది.
వచ్చే నెల 27లోగా టెండర్లకు అవకాశం
రైల్వేజోన్ కార్యాలయం నిర్మాణానికి రైల్వేశాఖ టెండర్లను ఆహ్వానించింది. అర్హత కలిగిన సంస్థలు డిసెంబర్ 27లోగా టెండర్లు దాఖలు చేయాలని ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. టెండర్లు దక్కించుకున్న సంస్థలు రెండేళ్లలో భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని తెలిపింది.
తొలి బీజం ఎక్కడ పడిరది?
2019 ఫిబ్రవరి 27న కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. 2019 మార్చి 8న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) నియమించారు. 2019 సెప్టెంబర్ మొదటి వారంలో రైల్వే జోన్‌కు సంబంధించిన డీపీఆర్‌ను రైల్వే బోర్డుకు అందజేశారు. ఆ తర్వాత కూడా జోన్‌కు సంబంధించిన ఎటువంటి పనులు ప్రారంభం కాలేదు. రైల్వేజోన్ కార్యాలయం కోసం కేటాయించిన భూములపై వివాదం నెలకొనడమే పనులు ప్రారంభం కాకపోవడానికి కారణమంటూ కేంద్ర, అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకొచ్చాయి.
విశాఖలో రైల్వేజోన్ కార్యాలయం నిర్మాణానికి కావాల్సిన 52 ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వం తమకు అప్పగించలేదని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ 2024 ఫిబ్రవరి 2న ఢల్లీిలో చెప్పడం అప్పట్లో పెద్ద సంచలనానికి తెరలేపింది. కానీ ముడసర్లోవలోని శ్రీకృష్ణాపురంలో సర్వే నెంబరు 26లోని జీవీఎంసీ భూమిని సిద్ధం చేశామని అప్పటి కలెక్టర్ చెప్పారు. అక్కడ భూమికి సరిహద్దులు నిర్ణయిస్తూ పొడవాటి గోతులు కూడా తవ్వామని, ఆ భూమినే కేంద్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధం చేశామని, ఆ విషయాన్ని కేంద్రానికి తెలియజేశామని అప్పటి విశాఖ కలెక్టర్ ఎ.మల్లికార్జున ప్రెస్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయితే రైల్వే జోన్ కార్యాలయాలు, ఇతర నిర్మాణాల కోసం రైల్వే శాఖ ఆ భూములను పరిశీలించగా.. అవి విశాఖ తాగునీటి అసవరాలను తీర్చే ముడసర్లోవ రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ భూములను తీసుకునేందుకు రైల్వేశాఖ నిరాకరించింది. కానీ భూముల విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవని, ఈ భూములనే కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు మల్లికార్జున చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మళ్లీ రైల్వే జోన్‌పై ఎటువంటి ప్రకటనలు రాలేదు. ఇంతలో ఏపీలో ప్రభుత్వం మారింది.
రైల్వే భూమినే రైల్వేశాఖకు కేటాయించారు
జోన్ కార్యాలయం ఏర్పాటు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించాలి. కానీ గత ప్రభుత్వం రైల్వేకు ఇచ్చిన భూమిని మళ్లీ జోన్ కోసం కేటాయించినట్టు ప్రకటించడం వల్లే తమకు భూమి ఇవ్వలేదని అశ్వనీ వైష్ణవ్ చెప్పుకొచ్చారు.
పదేళ్ల కిందట రెండు బీఆర్టీఎస్ (బస్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం) రోడ్ల నిర్మాణం కోసం రైల్వే భూములను జీవీఎంసీ (గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్) తీసుకుంది. అంతేకాకుండా 1987 నుంచి 2007 వరకు వివిధ అవసరాల కోసం రైల్వే భూములను ఏపీ ప్రభుత్వం తీసుకుంది. దీంతో ఆ భూములకు బదులుగా ముడసర్లోవలోని శ్రీకృష్ణాపురంలో 52 ఎకరాలను జీవీఎంసీ ద్వారా రైల్వేకు కేటాయించింది. అయితే ఈ భూముల హక్కుదారులమంటూ అక్కడున్న కొందరు గిరిజనులు ఆందోళనలు చేశారు. అధికారులకు అర్జీలు పెట్టుకున్నారు.
1975లో అగ్నిప్రమాద బాధితులకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 52 ఎకరాల భూములను కేటాయించారు. మొత్తం ఇక్కడ 78 ఎకరాల భూమిపై గిరిజనులకు డి-పట్టాలున్నాయి. డి-పట్టా అంటేనే ప్రభుత్వానికి ఎప్పుడు అవసరముంటే అప్పుడు వెనక్కు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ జీవీఎంసీ అధికారులు అదే చేశారు. గిరిజనుల డి-పట్టా భూములు, రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలో భూముల వివాదం నడుస్తూ రైల్వే జోన్ పనుల ప్రక్రియలో ఎటువంటి కదలిక కనిపించలేదు.
ప్రస్తుతం టెండర్లను ఆహ్వానించి దక్షిణ కోస్తా రైల్వేజోన్ కార్యాలయాలను రూ. 149.16 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. గతంలో రైల్వేశాఖకు ఏపీ ప్రభుత్వం కేటాయించిన ముడసర్లోవలోని 52 ఎకరాల స్థలంలోనే ఈ నిర్మాణాలు జరగనున్నాయి. రిజర్వాయర్ పక్కనే ఉండటంతో ఏమైనా ఇబ్బందులు వస్తాయేమోనని గతంలో రైల్వేశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే అటువంటి ఇబ్బందేమీ రాదని రాష్ట్రప్రభుత్వం స్పష్టతనివ్వడంతో ఇప్పుడు ఆ భూములను ఓకే చేసింది. మొత్తం 11 అంతస్తుల్లో భవన నిర్మాణం జరగనుంది. ఇందులో రెండు సెల్లార్ పార్కింగ్ ఫ్లోర్లు ఉండనున్నాయి.
Comments