అదే పద్ధతి.. అదే అరాచకం!
- NVS PRASAD
- Oct 29, 2024
- 3 min read
‘విశ్వసముద్ర’ స్థానంలో ఏఎమ్మార్
అనుమతులు లేకుండా సీనరేజ్ వసూళ్లు
అక్రమ తరలింపు నుంచి సొంత లాభం
దృష్టి సారించిన విజిలెన్స్ విభాగం
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

జిల్లాలో మైనింగ్ (గనులు)పై సీనరేజ్ వసూళ్లలో పెద్దస్థాయి కుంభకోణం జరుగుతున్నట్టు తెలుస్తుంది. క్వారీలకు తరలించే రాయి, జిల్లా నుంచి వేరే ప్రాంతాలకు వెళ్తున్న గ్రానైట్, కంకర తవ్వకాలపై విధించే సీనరేజ్ వసూళ్లలో ఏమాత్రం పారదర్శకత లేకుండా కోట్లాది రూపాయలు చేతులు మారిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై దృష్టి సారించే సమయం జిల్లాలో మంత్రి, ప్రజాప్రతినిధులకు లేకపోవడంతో సీనరేజ్ వసూళ్ల కోసం ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకున్నామంటూ ఏఎమ్మార్ అనే సంస్థ పెద్ద ఎత్తున వసూళ్ల పర్వానికి తెర లేపింది. అసలు ఏఎమ్మార్‌కు అనుమతులు ఎవరిచ్చారు, ఎంతకిచ్చారు, ఎన్నాళ్లకిచ్చారు? అన్న పత్రాలేవీ ఈ సంస్థ కింద పనిచేసే ఉద్యోగులు ఇక్కడ చూపించలేకపోతున్నారు. సీనరేజీని మాత్రం పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారు. ఇందుకు ప్రతిగా ఓ చిత్తుకాగితం మీద రెండు ముక్కలు రాసి రశీదుగా ఇస్తున్నారు. ఇప్పుడు ఇది జిల్లావ్యాప్తంగా వివాదాంశంగా మారింది. దీంతో విజిలెన్స్ అధికారులు కూడా అటువైపు దృష్టి సారించారు. వివరాల్లోకి వెళితే.. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గనుల నుంచి సీనరీలు వసూలు చేసే కాంట్రాక్ట్‌ను జిల్లాలో విశ్వసముద్ర సంస్థకు అప్పగించారు. అప్పట్లో ప్రతీ మైనింగ్ ఏజెన్సీ నుంచి వీరు పెద్ద ఎత్తున సీనరేజ్ వసూలు చేశారు. ఇందుకోసం ఆన్‌లైన్ మైనింగ్ పర్మిట్ బిల్లులు కూడా జనరేట్ చేశారు. అయితే కూటమి ప్రభుత్వ వచ్చిన తర్వాత విశ్వసముద్ర సంస్థకు సీనరేజ్ వసూలు చేయొద్దని చెప్పడంతో ఈ ఏడాది జూన్ 4 తర్వాత ఈ స్థానంలో ఏఎమ్మార్ అనే మరో సంస్థ వచ్చింది. వాస్తవానికి గత ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు విశ్వసముద్రకు 2025 మార్చి వరకు అగ్రిమెంట్ ఉందని కొందరు, లేదూ ఆగస్టు వరకు ఉందని మరికొందరు చెబుతున్నారు. అయితే ప్రభుత్వమే విశ్వసముద్రను ఈ బాధ్యతల నుంచి తప్పుకోమన్న తర్వాత సీనరేజ్ వసూలుచేయడం కష్టమవుతుందని భావించి, తనకు బదులుగా ఏఎమ్మార్ అనే సంస్థను తెర మీదకు తెచ్చినట్లు తెలుస్తుంది. గత లెక్కల ప్రకారం నెలకు దాదాపు రూ.13 కోట్లు (జీఎస్టీతో కలుపుకొని) ప్రభుత్వానికి చెల్లించి, ఆ మేరకు జిల్లాలో మైనింగ్ పర్మిట్లు ఇచ్చి సీనరేజ్ వసూలు చేసుకోడానికి విశ్వసముద్ర ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇందులో ఎన్ని నెలలు విశ్వసముద్ర ప్రభుత్వానికి ఒప్పందం మేరకు సొమ్ములు చెల్లించింది, ఇంకా ఎంత బకాయి ఉందన్న లెక్కలు పబ్లిక్ డొమైన్‌లో కనిపించడంలేదు. జిల్లాలో సీనరేజ్ వసూలుతో పాటు మూలపేట పోర్టు పనులను కూడా విశ్వసముద్రే దక్కించుకుంది. సముద్రంలో బ్యాక్ వాటర్స్ కోసం జిల్లాలో అనేక కొండలను ఎటువంటి అనుమతులు లేకుండా తవ్వేసి, ఆ రాళ్లతో పోర్టు బ్యాక్‌వాటర్స్ పనులు పూర్తి చేసింది. ఇందుకు సంబంధించి ఎంత రాయల్టీ చెల్లించారు, ఎన్ని కొండలకు పర్యావరణ అనుమతులు తీసుకున్నారన్న లెక్కలేవీ అప్పటి ప్రభుత్వం వద్ద లేవు, ఇప్పటి ప్రభుత్వంలో ఎవరూ అడగడంలేదు. కేవలం విశ్వసముద్ర జిల్లాలో రాయల్టీ వసూలు చేయడం వల్ల ప్రతీ నియోజకవర్గంలోనూ కనీసం 5వేల ఓట్లు వైకాపాకు మైనస్ అవుతాయన్న భావన అప్పట్లో అందరు ఎమ్మెల్యేలు వ్యక్తం చేసినా జగన్మోహన్‌రెడ్డి పట్టించుకోలేదు. ఇప్పుడు విశ్వసముద్ర ఏ పనైతే చేసిందో, అదే పనిని చేయడానికి ఏఎమ్మార్ అనే సంస్థను తెచ్చి ఇక్కడ పెట్టారు. వీరికి, ప్రభుత్వానికి మధ్య ఏమేరకు ఒప్పందం జరిగిందన్న పత్రాలు చూపించడంలేదు కానీ, సీనరేజ్ మాత్రం వసూలు చేస్తున్నారు. అసలు మీకు సీనరేజ్ వసూలు చేయడానికి ఉన్న అధికారమేమిటి, హక్కు ఎవరిచ్చారని ప్రశ్నిస్తే ఎదురుతిరగడం తప్ప దీనికి సమాధానం చెప్పడంలేదు. గతంలో సీనరేజ్ వసూలు చేయడానికి విశ్వసముద్ర ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బిల్లులు ఇచ్చేది. కానీ ఏఎమ్మార్ మాత్రం సొమ్ములు తీసుకొని ఎందుకూ పనికిరాని ఓ చిత్తుకాగితాన్ని ఇస్తుంది. ఇటీవల పొందూరు మండలం రాపాక నుంచి వెళ్తున్న మెటల్‌కు సీనరేజ్ వసూలు చేస్తూ ఇలాగే ఓ చిత్తుకాగితం ఇవ్వడంతో ఇప్పుడది జిల్లా వ్యాప్తంగా వివాదాస్పదమైంది. అక్రమంగా తవ్వుతున్న క్వారీలు, క్రషర్లను ఇటీవల విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పరిశీలిస్తే తామేమీ అక్రమంగా తవ్వడంలేదని, సీనరేజ్ కడుతున్నామంటూ ఓ చిత్తుకాగితాన్ని రాపాక క్వారీ యజమానులు చూపించారు. వాస్తవానికి దీనికి ఎటువంటి చెల్లుబాటూ లేదు. ఇది తెలుసుకున్న క్వారీ యజమానులు ఆ మరుసటి రోజు నుంచి ఏఎమ్మార్‌కు ప్రభుత్వంతో కుదిరిన ఒప్పంద పత్రం చూపిస్తేనే సీనరేజ్ చెల్లిస్తామని తేల్చి చెప్పారు. ఇది జరిగి 15 రోజులవుతున్నా ఏఎమ్మార్ సంస్థ ఎటువంటి ధ్రువపత్రాన్ని చూపించలేకపోయింది. దీంతో విజిలెన్స్ అధికారులు కూడా అటువైపు దృష్టి సారించాల్సి వచ్చింది. జిల్లాలో దాదాపు 105 క్రషర్లు ఉన్నాయి. ఇందులో 20 క్రషర్లకు మాత్రమే పర్యావరణ శాఖ, పొల్యూషన్ శాఖ అనుమతులు తీసుకున్న క్వారీలు (కొండలు) ఉన్నాయి. ఇలా అనుమతులు తీసుకున్నందుకు ఒక క్యూబిక్ మీటరు రాయిని తీసుకొని క్వారీకి తరలించడానికి ప్రభుత్వానికి వీరు సొమ్ములు చెల్లిస్తుంటారు. కానీ ఇప్పుడు ఏఎమ్మార్ లేదా అంతకు ముందు విశ్వసముద్ర సంస్థలు తమ వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం లీగల్, ఇల్లీగల్ మైనింగ్ రెండిరటినీ ఒకే గాటన కట్టి సీనరేజ్‌ను వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు ఉన్న తమకు సీనరేజ్ వసూళ్లలో రాయితీ ఇవ్వాలని క్రషర్ యజమానులు నాలుగు రోజుల క్రితం ఏఎమ్మార్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడినా అందుకు సమ్మతించలేదని భోగట్టా. మరోవైపు ఏఎమ్మార్ సంస్థకు సీనరేజ్ వసూలు చేసే అధికారం లేదంటూ ఎటువంటి అనుమతులు లేని కొందరు ఎంచక్కా మెటల్‌ను తరలించుకుపోతున్నారు. వాస్తవానికి ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్న వారి నుంచి కూడా ఆన్‌లైన్ బిల్లు జనరేట్ చేసి, ఆ సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తేనే ప్రైవేటీకరణకు ఫలితముంటుంది. అలా కాకుండా అనుమతులు ఉన్నవారి క్వారీల నుంచి వసూలు చేస్తున్నది మాత్రమే ప్రభుత్వానికి చూపించి అనధికారిక తరలింపునకు మాన్యువల్ బిల్లులు ఇచ్చి, ఆ సొమ్మును సంబంధిత సంస్థలు తమ సొంత ఖాతాలో వేసుకుంటున్నాయి. అటువంటప్పుడు కోట్ల రూపాయలు వసూలుచేసి ప్రైవేటు సంస్థలను పోషించి, ఓటుబ్యాంకును కోల్పోవడం అవివేకం. గతంలో టెక్కలి కేంద్రంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను కార్యాలయం ఎదురుగా పెట్టిన విశ్వసముద్ర కార్యాలయంలోనే ఇప్పుడు ఏఎమ్మార్ కార్యాలయం కూడా నడుస్తుంది. విశ్వసముద్ర బోర్డును తీసేసి ఏఎమ్మార్ అని కొత్త బోర్డు పెట్టడం మినహా మిగిలినదంతా సేమ్ టు సేమ్.

留言