top of page

అదుపులో ఏడుగురు... లైన్‌లో నలుగురు

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • పలాస కుట్ర కేసులో వేగం పెంచిన పోలీసులు

  • టీడీపీ టౌన్‌ ప్రెసిడెంట్‌ హత్యకు ప్లాన్‌ వైకాపాదే

  • బడ్డ నాగరాజు వేధింపుల కారణంతోనే స్కెచ్‌?

  • గతంలో వైకాపా ఆగడాలను సీదిరి పట్టించుకోని ఫలితం

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

పలాస పట్టణ టీడీపీ అధ్యక్షుడు బడ్డ నాగరాజు హత్యకు కుట్ర పన్నినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న మరో ఇద్దర్ని పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ కేసులో మరో నలుగుర్ని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు సిద్ధమవుతున్నట్టు భోగట్టా. ఇప్పటికే చిన్నబాడాంలో వైకాపా మద్దతుదారులు నిరంజన్‌, సుందరరావు, రమణయ్యలకు పోలీసులు హింట్‌ ఇచ్చారని, కుట్ర కేసులో ఎవరెవరు ఉన్నారో స్వచ్ఛందంగా లొంగిపోవాలని, లేదంటే వారిని అప్పగించాలని పోలీసులు చిన్నబాడాంలోని వైకాపా నాయకులకు వార్నింగ్‌ ఇచ్చినట్టు తెలిసింది. ఈ కేసులో పోలీసుల అదుపులో ఉన్న కూర్మాపు ధర్మారావు, అంపోలు శ్రీనివాసరావును నరసన్నపేటలో విచారించిన పోలీసులు మరికొందరికి కూడా దీంతో సంబంధం ఉన్నట్టు గుర్తించినట్టు తెలిసింది. దీంతో మందస మండలం జిల్లుండి గ్రామానికి చెందిన చందు అనే యువకుడిని, చిన్నబాడాంకు చెందిన కోట శ్రీనివాస్‌ అనే యువకుడిని సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారని స్థానికులు చెప్పుకుంటున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న జిల్లుండి యువకుడు చందు బీహార్‌కు చెందిన సుపారీ గ్యాంగ్‌ ముగ్గురు సభ్యులకు ఆశ్రయం కల్పించి ఆహారం సరఫరా చేసినట్టు పోలీసులు గుర్తించారని విశ్వసనీయ సమాచారం. ముగ్గురు సుపారీ గ్యాంగ్‌ సభ్యులు టెక్కలి క్వారీ వద్ద గొడవపడి పోలీసులకు చిక్కినట్టు మొదట ప్రచారం జరిగినా అందులో వాస్తవం లేదని తెలిసింది. ఈ ముగ్గుర్ని పలాస సమీపంలోని కోసంగిపురం జంక్షన్‌ వద్ద అనుమానస్పదంగా తిరుగుతుండగా కాశీబుగ్గ పోలీసులు గుర్తించి తనిఖీ చేసి నాటు తుపాకీతో పాటు కొన్ని మరణాయుధాలు లభించడంతో విచారణ ప్రారంభించారు. దీంతో కుట్రకోణం వెలుగులోకి వచ్చినట్టు కూడా మంగళవారం నాటికి ప్రచారంలో ఉంది.

ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్న చిన్నబాడాంకు చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి కూర్మాపు ధర్మారావు ఆచూకీ తెలపాలని ఆయన భార్య, కుమారుడు సోమవారం పలాస డీఎస్పీని ఒక లాయర్‌తో వెళ్లి కలిశారు. ధర్మారావును ఎందుకు అదుపులోకి తీసుకున్నారో, ఎక్కడ ఉంచారో వెల్లడిరచాలని డీఎస్పీని కోరినట్టు తెలిసింది. అంతకు ముందు అంపోలు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు డీఎస్పీని కలిసి పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై వివరణ కోరారు. అన్ని విషయాలు కోర్టు ముందుంచుతామని డీఎస్పీ చెప్పడంతో బడ్డ నాగరాజు హత్యకు కుట్ర కేసులోనే వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తేలిపోయింది. ఈ కేసులో బీహార్‌ ముఠాకు చెందిన ముగ్గురుతో కలిపి మొత్తం 11 మంది వరకు ఉన్నట్టు ప్రచారం సాగుతుంది. ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్న సుపారీ గ్యాంగ్‌ సభ్యులు ముగ్గురితో పాటు చిన్నబాడాంకు చెందిన ముగ్గురు, మందస మండలం జిల్లుండికి చెందిన ఒక్కరు మొత్తం ఏడుగురు పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. మరో నలుగురుని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు సిద్ధమయ్యారని భోగట్టా.

సుపారీ ఇచ్చి టీడీపీ నాయకుడి హత్యకు కుట్ర చేయడంపై జిల్లాలో తీవ్ర చర్చ సాగుతుంది. జిల్లాలో సుపారీ ఇచ్చి హత్య చేయించే సంస్కృతికి తెరతీయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకోవడం, హత్యా రాజకీయాలకు పాల్పడడం సర్వసాధారణమైపోయాయి. ఇప్పుడది జిల్లాకు పాకడంపై, మరీ ముఖ్యంగా పలాసలో ప్రారంభం కావడాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలాస పట్టణ టీడీపీ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న బడ్డ నాగరాజు వ్యవహారం తీవ్ర ఇబ్బందికరంగా మారిందని ప్రచారం ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచే నాగరాజు చిన్నబాడాంలో అనేక మంది వైకాపా మద్దతుదారుల ఇళ్లపై దాడులకు తెగబడినట్టు తెలిసింది. నాగరాజు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. నాగరాజు అరాచకాలు మితిమీరడంతో గ్రామస్తులంతా మూకుమ్మడి దాడి చేయాలని నిర్ణయించినట్టు పలాసలో చర్చ కొద్ది రోజుల క్రితం సాగింది. ఈలోగా బీహారీ ముఠాను రంగంలోకి దించడం కలకలం సృష్టించింది.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page