పొలంగట్లు దాటి.. పంటకాలువ ఈది కిక్కు కోసం పరుగు
ఇప్పటికి మూడుసార్లు అడ్రస్ మార్చిన షాపు
నిబంధనలు కాదన్నా లైసెన్స్ జారీ
ఆందోళనలో స్థానికులు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

లాటరీ విధానంలో వైన్‌షాపులు దక్కించుకోవడం ఎంత అదృష్టమో, వచ్చిన షాపును సరైన సెంటర్‌లో పెట్టడం అంతకు మించిన పెద్ద టాస్క్ అయిపోయింది మద్యం వ్యాపారులకు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మద్యం షాపులు ఎక్కడైతే నడిచాయో, ఐదేళ్ల పాటు ఆ ప్రాంతం అలవాటవడంతో అదే షాపులు దక్కించుకోవడం కోసం బిల్డింగ్ యజమానులను తమ మద్యం వ్యాపారం పార్టనర్లుగా చేసుకున్న ఘటనలు కూడా జిల్లాలో ఉన్నాయి. అలాగే మెయిన్ సెంటర్‌లో షాపులు బ్లాక్ చేసి, అందులో తమకు లైసెన్స్ వస్తే తప్ప బయటివారికి ఇవ్వమని తెగేసి చెప్పినవారూ ఉన్నారు. అంటే.. షాపులకు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. నగరంలో అనేక సెంటర్లలో ఎక్కువ వ్యాపారం జరిగేచోట షాపులు కావాలంటే భవన యజమాని కూడా పార్టనర్ కావాల్సి వచ్చింది. స్థానిక మారుతీ థియేటర్ వద్ద ఉన్న షాపు నగరంలో ఎక్కువ సేల్ ఇస్తుందని తెలుసుకున్న మద్యం వ్యాపారులు ఆ షాపు యజమాని చెప్పినవారితోనే కలిసి అక్కడ వ్యాపారం చేస్తున్నారు. మరికొందరికి షాపులు లేక తాత్కాలిక రేకుషెడ్లు ఏర్పాటుచేసి మద్యాన్ని అమ్ముతున్నారు. గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వమే మద్యం విక్రయించడం వల్ల ఎక్సైజ్ అధికారులకు మామూళ్లు రాకపోవడంతో ఎండిపోయారు. ఇప్పుడు ప్రైవేటు వ్యాపారులు వచ్చేసరికి వారు ఎక్కడ పెడుతున్నారు, ఎలా పెడుతున్నారన్నది ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ఎందుకంటే.. ఇప్పుడు లాభాలైతే ప్రభుత్వ వ్యక్తులవి గాని, వ్యాపారం చేయించాల్సింది మాత్రం ఎక్సైజ్ అధికారులే. ఇందుకు ఓ తాజా ఉదాహరణ చూద్దాం.
జిల్లాలో 158 మద్యం దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించారు. ఆయా దుకాణాలు గతంలో మాదిరిగా కాకుండా వాటి సర్కిల్ పరిధిలో ఎక్కడ వీలైతే అక్కడ పెట్టుకొనే వెసులుబాటు కల్పించారు. దీంతో కొందరు జనావాసాల మధ్య ఏర్పాటుచేశారు. అనేక చోట్ల స్థానికులు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో వాటిని వేరొక చోటకు తరలిస్తున్నారు. మరికొందరికి అనుకూలమైన చోట అద్దెకు షాపులు దొరక్కపోవడంతో సమీపంలో ఖాళీ స్థలాలను లీజుకు తీసుకొని రేకుల షెడ్ వేసి మద్యం దుకాణాలను తెరిచారు. ఇంకొన్ని చోట్ల బడి, కాలేజీ, గుడి, చర్చి, మసీదు, 30 పడకల ఆసుపత్రికి 100 మీటర్ల దూరంలో ఉండాలన్న నిబంధనను పక్కన పడేశారు. కొందరికి అనుకూలమైన ప్రదేశం దొరక్క పొలాల్లోనూ ఏర్పాటుచేశారు.
కంటైనర్‌లో మద్యం అమ్మకాలు

ఆమదాలవలస ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో షాపు నెంబర్ 39ని మెట్టక్కివలసకు చెందిన సనపల స్వరూపారాణి పేరిట దక్కించుకున్నారు. ఈ మద్యం షాపును దూసి గ్రామం పరిధిలో కేటాయించారు. దూసి గ్రామంలో అమ్మకాలు జరగవన్న కోణంతో దాన్ని రాగోలుకు షిప్ట్ చేశారు. ఇది శ్రీకాకుళం సర్కిల్ పరిధిలోకి రావడంతో పాటు, స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధి సూచనతో ఆమదాలవలస మండలం తోటాడ పంచాయతీ పరిధిలో కొత్తరోడ్డులో జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఎదురుగా ఏర్పాటు చేశారు. స్థానికులు వ్యతిరేకించడంతో దాన్ని తీసుకువచ్చి ఆమదాలవలస రోడ్డులో హనుమాన్ ఫంక్షన్ హాల్ వెనుక భాగంలో శ్రీ వెంకటేశ్వర కాలనీ రోడ్డులో ఆర్మీ కేంటీన్‌కు వెళ్లే మార్గంలో గెడ్డగట్టుకు ఆనించి మూల రాము, రుషి వేసిన వెంచర్లో కంటైనర్‌ను పెట్టి దుర్గావైన్స్ పేరుతో మంగళవారం నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభించారు. ఈ మద్యం షాపునకు శాశ్వత ప్రాతిపదికన ఎక్కడా ఏర్పాటు చేయకముందే రెండేళ్లకు శాశ్వత లైసెన్స్ మంజూరు చేసేశారు. షాపుల ఏర్పాటును పరిశీలించిన తర్వాతనే రెండేళ్లకు శాశ్వత అనుమతులు మంజూరుచేస్తారు. మద్యం షాపును ఏర్పాటుచేసిన షెడ్డు, లేదంటే భవనానికి సదరు యజమాని నుంచి లీజ్ డీడ్, షాపు డ్రాయింగ్ (కొలతలు) తీసుకున్న తర్వాతనే సదరు షాపునకు శాశ్వత అనుమతులు మంజూరుచేయాలి. షాపు నెంబర్ 39కి శాశ్వత అనుమతులు మంజూరుచేసిన తర్వాత వారానికి ఒక ప్రాంతంలో ఏర్పాటుచేస్తూ వచ్చారు. చివరికి ఆమదాలవలస మండలం తోటాడ రెవెన్యూ పరిధిలో వెంకటేశ్వర కాలనీకి వెళ్లే మార్గంలో ఉన్న పొలాల్లో రోడ్డు పక్కనే ఏర్పాటు చేయడానికి ఎక్సైజ్ అధికారులు ఓకే చెప్పారు.
స్థానికుల ఆందోళన

మంగళవారం సాయంత్రం అక్కడకు మందుబాబులు చేరుకొని మద్యం షాపు వద్ద హంగామా చేయడంతో వెంకటేశ్వర కాలనీలో నివాసముంటున్నవారు ఉలిక్కిపడ్డారు. అప్పటి వరకు ఏంజరుగుతుందో అర్థం కాలేదు. మంగళవారం రాత్రికి మద్యంషాపు ఏర్పాటు చేసినట్టు తెలియడంతో స్థానికుల్లో ఆందోళన ప్రారంభమైంది. అక్కడ నివాసం ఉంటున్నవారంతా ఉద్యోగులు కావడంతో వారంతా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. లే అవుట్‌లో ఏర్పాటుచేసిన మద్యం షాపు రోడ్డు మీదుగా స్థానికంగా నివాసముంటున్న వారంతా రాకపోకలు చేస్తుంటారు. విద్యార్థులు సైకిల్‌పై అదే తోవలో పాఠశాల, కాలేజీలకు రాకపోకలు సాగిస్తుంటారని స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. పగలంతా కాలనీలో ఉన్న అన్ని అపార్ట్‌మెంట్లలో మహిళలు, వృద్ధులు మాత్రమే అందుబాటులో ఉంటారని స్థానికులు చెబుతున్నారు. షాపును తొలగించాలని ఉద్యమించేందుకు సమీపంలో ఉన్న అపార్ట్‌మెంట్‌వాసులంతా సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్థానికులు చెబుతున్నారు. కోటబొమ్మాళిలో ప్రభుత్వ పాఠశాలకు దగ్గరలోనే ఒక వైన్‌షాపును నడుపుతున్నారు. నిబంధనల ప్రకారం బడికి, గుడికి 100 మీటర్లు దాటాకే వైన్‌షాపులు పెట్టాలి. కానీ ఇక్కడ అవి పట్టించుకోలేదు.
ความคิดเห็น