అధికారం ఇక్కడ.. ఆస్తులు అక్కడ!
- DV RAMANA

- Oct 10
- 2 min read

మన దాయాది, పొరుగు దేశమైన పాకిస్తాన్ నిరంతరం ఏదో ఒక సంక్షోభంలో మగ్గిపోతుంటుంది. రాజకీయాధికారం, సైనిక పెత్తనం మధ్య జరిగే సంఘర్షణలు ఒక ఎత్తయితే.. వాటి కారణంగా గత కొన్నేళ్లుగా చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం మరో ఎత్తు. ఫలితంగా పాకిస్తాన్ ప్రజ పేదరికంతో అల్లాడిపోతున్నారు. కానీ విడ్డూరమేమిటంటే.. వారిని ఉద్ధరిస్తామంటూ గద్దెనెక్కిన పాలకులు మాత్రం కోట్లకు పడగలెత్తినవారే. కానీ స్వదేశంలో వారి ఆస్తులు పెద్దగా కనిపించవు. ఇక్కడ వ్యాపారాలు, రాజకీయాల ద్వారా కూడబెట్టిన ఆస్తులను అమెరికా, ఇంగ్లండ్, కెనడా, ఆస్ట్రేలియా, గల్ఫ్ వంటి దేశాల్లో పోగేస్తూ వీలు చిక్కినప్పుడల్లా ఆ దేశాల్లో వాలిపోతూ విలాసాలు, విహారాల్లో మునిగితేలుతుంటారు. ఇక్కడి ప్రజలు రోజు గడవడమే కష్టమై అల్లాడిపోతుంటే.. ఈ నేతల పిల్లలు, కుటుంబాలు మాత్రం విదేశాల్లో జల్సా చేస్తుంటారు. ఈ పరిస్థితి ఇప్పుడు మన రాష్ట్ర నేతలకూ వర్తిస్తుందన్న చర్చ మొదలైంది. ఆంధ్ర రాష్ట్ర పాలకుల తీరు పాక్ పాలకులను తలపిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణలు రెండు రాష్ట్రాలుగా విడిపోయి పదకొండేళ్లు దాటింది. మన రాష్ట్రంలో ఇప్పటికే రెండు ప్రభుత్వాలు కాలపరిమితి ముగించుకుని మూడో ప్రభుత్వం కొనసాగుతోంది. కానీ ఇప్పటికీ పాలకులు ఆయారాం.. గయారాం.. అన్నట్లు తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచే రాకపోకలు సాగిస్తూ ఇక్కడ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. పాలకులు, నాయకులు జనం మధ్య, జనంతో ఉంటేనే సమస్యలు తెలుస్తాయి. కర్తవ్యం బోధపడుతుంది. పరిపాలన సులువవుతుంది. కానీ మన పాలకులు వారాంతాల్లో అమరావతి నుంచి ఎగిరిపోయి హైదరాబాద్‌లో వాలిపోతున్నారు. ఒక అంచనా ప్రకారం.. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 70 సార్లు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ 122 సార్లు, ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న మంత్రి నారా లోకేష్ 77 సార్లు గన్నవరం`హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించారు. 2014`19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కరకట్టపై ఉన్న భవనంలో తాత్కాలిక నివాసం ఉంటూనే వారాంతాల్లో హైదరాబాద్‌కు వెళ్లిపోయేవారు. దీనిపై అప్పట్లో వైకాపా విమర్శలు గుప్పించడంతో రెండోసారి సీఎం అయిన తర్వాత తన సొంత నియోజకవర్గం కుప్పంలో సొంత భవన ం సమకూర్చుకుంటున్నారు. అయినా ఇప్పుడూ అదే తంతు కొనసాగుతోంది. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఎన్నికలకు ముందు పిఠాపురంలో నివాసం ఉంటానంటూ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. కానీ ఎన్నికల తర్వాత అటువైపు చూడటంలేదు. ఇక ప్రతిపక్ష హోదా కోసం పట్టుపడుతున్న వైకాపా అధినేత, మాజీ సీఎం జగన్ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లిలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నా పదవి కోల్పోయిన తర్వాత తాడేపల్లి నివాసంలో కంటే హైదరాబాద్, బెంగళూరులలోనే ఎక్కువగా గడుపుతున్నారు. యథా రాజా.. తథా ప్రజా.. అన్నట్లు అధినేతలే ఈ తీరున ఉండటంతో ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా అదే ఫాలో అవుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచీ ఇదే దుస్సంప్రదాయం కొనసాగుతోంది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు ప్రత్యేక రాష్ట్రం ఇమ్మని అడగడానికి ప్రతి వారం డిల్లీ వెళ్లి సోనియాగాంధీ పడిగాపులు పడేవారు. నిజంగా తెలంగాణ కావాలనే కోరికతో వెళ్లేవారో లేక కేసీఆర్‌కే క్రెడిట్ దక్కకూడదని వెళ్లేవారో తెలియదు గానీ.. ఆ పేరుతో పాట్లు పడేవారు. అవే రోజుల్లో ఆంధ్ర కాంగ్రెస్ ఎంపీలు మాత్రం సొంత పనులు చక్కబెట్టుకోవడానికి, కాంట్రాక్టులు దక్కించుకోవడానికి తాపత్రయపడేవారు. ఒక్కరంటే ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చేస్తే ఆంధ్ర ప్రజల పరిస్థితి ఏమిటని కనీసం ఆలోచించలేదు. ఆంధ్ర ప్రాంత అభివృద్ధికి ఫలానావి కావాలని కూడా అడగకపోగా.. రాష్ట్రానికి, తమ నియోజకవర్గాలకు వచ్చి తెలంగాణ రాదు అని గొప్పలు చెప్పుకొనేవారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం నాయకులదీ అదే పరిస్థితి. రాజకయ ఆటలో అరటిపండు అని జనాలు నవ్వుకున్న చిరంజీవే వీరందరి కంటే కొంత నయం. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే బాగుంటుందని కాంగ్రెస్ హైకమాండ్‌ను కోరింది ఆయనొక్కరే. ఆంధ్ర ప్రాంత పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, నాయకులు ఎంతసేపూ ప్రత్యేక తెలంగాణ ఇవ్వడం జరగని పని అని ఎవరికివారుగా నిర్ణయించేసుకుని.. ఆ మత్తులోనే ఉండిపోయి తెలంగాణ ఇచ్చిన సోనియాను నిందించారే తప్ప తమకు తెలంగాణలోనే బతకాల్సిన ఖర్మ ఏమిటి? మన ఆంధ్ర రాష్ట్రంలోనే మనం ఉందాం.. అక్కడే మన వ్యాపారాలు, పరిశ్రమలు పెంచుకుందాం అని అనుకోలేదు. ఇప్పటికీ ఆ ఆలోచన ఎవరికీ రావడంలేదు. హైదరాబాద్‌లోనే ఉంటూ ఆ రాష్ట్ర వనరులు, ఉపాధి, ఆస్తులు, ఆదాయం పెంచుతున్నారు. అదేమిటంటే రాజధానే లేని రాష్ట్రం అని ఒక సాకు చెబుతుంటారు. పరిశ్రమలు పెట్టడానికి, వ్యాపారాలు విస్తరించడానికి, ఇతర సంస్థల ఏర్పాటుకు రాజధానితో ఏం పని.. వనరులు ఉన్నాయా లేదా అన్నది చూస్తే సరిపోదా? ఈ పాపంలో ప్రజలకు కూడా వాటా ఉందని చెప్పకతప్పదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక నయా పైసా కృషి కూడా ఖర్చు చేయకుండా హైదరాబాద్‌లో ఆస్తులు పోగేసి ఆంధ్రకు టూరిస్టులుగా వస్తున్న నాయకులనే నెత్తిన పెట్టుకుని అధికారాన్ని పువ్వుల్లో పెట్టి అప్పగిస్తున్నారు మన ఉదారవాద ఆంధ్రులు. ఇలాంటి పరిస్థితి మరే రాష్ట్రంలోనూ, మరే దేశంలోనూ ఉండకపోవచ్చనడంలో అతిశయోక్తి లేదు. ఈ నిర్వాకాల వల్లే కదా.. మన రాష్ట్రం పేదాంధ్రగా వర్థిల్లుతోంది!










Comments