top of page

అధికారం పోతే ఇట్టుంటదా?

Writer: NVS PRASADNVS PRASAD
  • దండం పెట్టే కార్యక్రమానికి ధర్మాన దూరం

  • మరొకరికి బాధ్యతలు అప్పగించని వైనం

  • అన్నతోనే నెట్టుకొచ్చేస్తున్న పరిస్థితి

  • ధర్మాన మౌనంతో పార్టీకి తీరని నష్టం


సత్యంన్యూస్‌, శ్రీకాకుళం

ఎన్నికల ముందు వరకు అధికార హోదాను అనుభవించి, మరో 30 ఏళ్లు తామే అధికారంలో ఉంటామని ఎగిరెగిరి పడిన జగనన్న సోదరులు ఇప్పుడు అధికారం పోయేసరికి ఉద్యమాల మాట దేవుడెరుగు, కనీసం దేవుడికి దండం పెట్టుకునే కార్యక్రమానికి కూడా హాజరవడానికి ఇష్టపడలేదు. ఇక రాష్ట్ర మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు సంగతి సరేసరి. తిరుపతి లడ్డూలో యానిమల్‌ ఫ్యాట్‌ కలపడం ద్వారా అపవిత్రమైందంటూ జనసేన ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతుంటే, చంద్రబాబు క్షుద్ర రాజకీయాలు మానుకొని బుద్ధిని ప్రసాదించాలని వైకాపా శనివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలకు పిలుపునిచ్చింది. జగన్మోహన్‌రెడ్డి యానిమల్‌ ఫ్యాట్‌ కలిపి అపచారానికి పాల్పడివుండరనే ఎక్కువ మంది నమ్ముతున్నారన్న భావనలోనే ఉన్నారు. కానీ అది వాస్తవమని నిరూపించే కార్యాచరణకు మాత్రం వైకాపా శ్రేణులు ముందుకు రాలేదు. ఉదయం 10.30 గంటలకు స్థానిక నారాయణతిరుమలలో పూజలు నిర్వహించడానికి పిలుపునిస్తే 11 దాటినా పట్టుమని 10 మంది అక్కడ కనిపించలేదు. దీనికి తోడు ధర్మాన ప్రసాదరావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని తెలియడంతో వెళ్తే ఏమవుతుందో, వెళ్లకపోతే ఏమవుతుందో అన్న సందిగ్ధంలో కేడర్‌ నారాయణతిరుమలకు రానట్టు తెలుస్తుంది. ఎన్నికల ఫలితాల తర్వాత ధర్మాన ప్రసాదరావు పూర్తిగా తన బంగ్లాకే పరిమితమైపోయారు. తెలుగుదేశం 100 రోజుల పాలనలో వైఫల్యాలను ఎండగట్టే కార్యాచరణను వైకాపా ఎలాగూ చేపట్టలేదు. ఇక కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినది వైఎస్‌ జయంతి, వర్ధంతి మాత్రమే. ఈ రెండు కార్యక్రమాలకూ ధర్మాన ప్రసాదరావు హాజరుకాలేదు. వీటిని కూడా తప్పనిసరి తద్దినంలా నిర్వహించారు. ఇప్పుడు తాజాగా ఆలయాల్లో పూజలు కార్యక్రమానికి కూడా ధర్మాన ప్రసాదరావు దూరంగా జరిగారు. దీంతో శ్రీకాకుళం నియోజకవర్గంలో కేడర్‌ కనిపించలేదు. జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ నరసన్నపేటలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి శ్రీకాకుళంలో నిర్వహించడానికి వచ్చారు. ఎందుకంటే.. తన తమ్ముడికి ఆరోగ్యం బాగులేదని చెబుతున్నారు. ఇదే విషయాన్ని కొద్ది రోజుల క్రితం జగన్మోహన్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో కూడా కృష్ణదాస్‌ చెప్పుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు శ్రీకాకుళం బాధ్యతలు కూడా ఆయనే నెత్తిన వేసుకోవాల్సి వచ్చింది. ధర్మాన ప్రసాదరావుకు ఆరోగ్యం సరిగా లేనప్పుడు శనివారం నాటి కార్యక్రమాన్ని నగరంలో ఒకరికి, రూరల్‌, గార మండలాల్లో మరో ఇద్దరికి అప్పగించి విజయవంతం చేయాలని అధికారం పోతే ఇట్టుంటదా?

ఆయన ఒక ప్రకటన విడుదల చేసుంటే ఈ కార్యక్రమం విజయవంతమైవుండేది. అలా కాకుండా ధర్మాన బంగ్లాకే పరిమితమైపోయి మరొకరికి బాధ్యతలు అప్పగించకుండా పార్టీని ఏం చేస్తున్నారని సోషల్‌మీడియా వేదికగా అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా కాళింగ సామాజికవర్గ గ్రూపుల్లో ధర్మాన మీద, ఆయన ఇటీవల వ్యవహరిస్తున్న తీరు మీద నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. కేవలం ధర్మాన తన వ్యాపారాలు కాపాడుకోవడం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి స్టేట్‌మెంట్లు ఇవ్వడంలేదని సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ బాధ్యతలు మరొకరికి అప్పగించకుండా తన సోదరుడ్ని ముందుపెట్టి గేమ్‌ ఆడుతున్నారని, రెండు మూడేళ్ల పాటు ఈ విధంగా నడిపేసి, ఆ తర్వాత మళ్లీ తానున్నానంటూ యాక్టివ్‌ అవుతారని, అటువంటి వారినే పార్టీ నమ్ముతుందని ఆ మధ్య టెక్కలి గ్రూపుల్లో కొన్ని కథనాలు సోషల్‌ మీడియాలో తిరిగాయి. వాస్తవానికి శ్రీకాకుళం నియోజకవర్గంలో కూడా కేడర్‌ ఇలాంటి భావనతోనే ఉంది. ఎన్నికలకు ముందు అయినదానికి, కానిదానికి పరామర్శించడం, సమస్యను పరిష్కరించామని చెప్పడం వంటి పబ్లిసిటీతో నిత్యం మీడియాలో కనిపించే ధర్మాన తనయుడు రామ్‌మనోహర్‌నాయుడు ఎన్నికల తర్వాత ఏమయ్యారని స్థానిక కేడర్‌ ప్రశ్నిస్తోంది. అసలింతకీ ధర్మాన పార్టీలో ఉన్నట్టా? లేనట్టా? అన్న సందేహం ఆ పార్టీ నేతల్లో కూడా ఉంది.

ఎన్నికల తర్వాత ధర్మాన అలకపాన్పుపై ఉన్నారన్న విషయం పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి తెలుసు. అలా అని ఏం జరిగిందని ధర్మానను అడిగే ప్రయత్నం ఆయన చేయడంలేదు. చేస్తారన్న నమ్మకమూ లేదు. ఎందుకంటే.. తన దగ్గరిబంధువు, తాను కాంగ్రెస్‌ను వీడినప్పుడు మంత్రి పదవిని సైతం వదులుకొని వచ్చిన బాలినేని శ్రీనివాస్‌ పార్టీ విడిచిపెట్టినప్పుడే పోతే పోనీ అని వదిలేసిన జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు అలిగినవారిని బుజ్జగిస్తారని ఊహించక్కర్లేదు. అలా అని ఈ జిల్లాలో ధర్మానను వదులుకోడానికి కూడా జగన్మోహన్‌రెడ్డి సిద్ధంగా లేరు. ఆయన లేకపోతే పార్టీకి జరిగే నష్టం జగన్‌కు తెలుసు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రి పదవుల షఫ్లింగ్‌ చేసినప్పుడు కృష్ణదాస్‌ను పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ లాగే మరో రెండున్నరేళ్లు కొనసాగిస్తారని చెప్పినప్పటికీ ధర్మాన ప్రసాదరావుకే ఆ పదవి ఇవ్వాలని ధర్మాన కృష్ణదాస్‌ చెప్పి, అందువల్ల పార్టీకి వచ్చే లాభాలను కూడా చెప్పినప్పుడే ఆయన సత్తా జగన్మోహన్‌రెడ్డికి తెలిసింది. ఆ తర్వాత మంత్రి పదవి ఇచ్చినా ఎక్కడా ప్రసాదరావుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆ మాటకొస్తే రాష్ట్రంలో ఏ మంత్రికీ జగన్మోహన్‌రెడ్డి పాలనలో కనీస గుర్తింపు లేదు. ఇప్పుడు కూడా ధర్మాన ప్రసాదరావు అలిగివున్నారనే కారణంతోనే కృష్ణదాస్‌ను మరోసారి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగించారు. వాస్తవానికి ఈ పదవిని తమ్మినేని సీతారామ్‌కు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ధర్మాన కృష్ణదాస్‌కు పదవిస్తే ధర్మానను యాక్టివ్‌ చేసే బాధ్యత ఆయన చూసుకుంటారని జగన్‌ భావించారు. ఇప్పుడు జగన్‌ ఎత్తుగడకు పైఎత్తు వేస్తూ అదే కృష్ణదాస్‌తో నియోజకవర్గంలో కార్యక్రమాలను ధర్మాన ప్రసాదరావు నడిపేస్తున్నారు. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కార్యకర్తలు డీలాపడిపోవడం సహజం. అలా అని పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీరేమైనా బావుకున్నారా అంటే.. అదీ లేదు. పార్టీ అధికారంలో ఉన్నా, లేకపోయినా వీరికి ఒకటే. కేవలం జిల్లా, నియోజకవర్గంలో ధర్మాన దృష్టిలో పడాలనే ఎక్కువమంది నాయకులు కార్యక్రమాలకు హాజరవుతుంటారు. ఇప్పుడు అటువంటి ధర్మానే పార్టీ నిర్దేశించిన కార్యక్రమానికి రాకపోవడంతో వెళ్లి ఏం సాధించాలన్న కోణంలో కనిపించడం మానేస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో 40 శాతం ఓటుబ్యాంకు వైకాపాకు ఉందని తేలడం వల్ల పార్టీ మారేందుకు ధర్మాన ఇష్టపడటంలేదని, ఆ సంఖ్య తగ్గివుంటే ఆయన కచ్చితంగా పార్టీ వీడిపోయేవారంటూ ధర్మాన వ్యతిరేకులు వాట్యాప్‌లలో ఊపేస్తున్నారు. శనివారం నారాయణ తిరుమలలో జరిగిన కార్యక్రమంలో ప్రస్తుతం పదవుల్లో ఉన్నవారు, రూరల్‌, గార మండలాలకు సంబంధించినవారు మినహా నగరంలో ధర్మాన బంగ్లా చుట్టూ గబ్బిలాల్లా వేలాడేవారు ఎవరూ కనిపించలేదు.

 
 
 

コメント


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page