top of page

అధికార బదిలీకి రామయ్య ‘సిద్ధ’ం

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • May 28
  • 2 min read

కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం కర్ణాటకలో ఎట్టకేలకు అధికార బదిలీకి మార్గం సుగమమైంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 2023 నుంచి మెజారిటీ పార్టీ అయిన కాంగ్రెస్‌లో సీఎం పీఠంపై ముసుగులో గుద్దులాట జరుగుతూనే ఉంది. అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, సీనియర్ నేత సిద్ధరామయ్య మధ్య కేంద్రీకృతమైన పదవీ పోరాటం సుమారు మూడేళ్లుగా సందర్భం వచ్చినప్పుడల్లా తెరపైకి వస్తూనే ఉంది. ఆనాడు కుదిరిన ఫిఫ్టీ - ఫిఫ్టీ పదవీకాలం అనే ఒప్పందం కూడా సిద్ధరామయ్య మంకుపట్టు కారణంగా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైనప్పటికీ ముఖ్యమంత్రి పదవి విషయంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్యల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో ఐదురోజులపాటు ప్రతిష్టంభన నెలకొంది. వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించడానికి ఢిల్లీ వేదికగా పార్టీ అధిష్టానం తీవ్ర ప్రయత్నాలు చేసి చివరికి సిద్ధరామయ్య సీఎం అయ్యేందుకు మార్గం సుగమం చేసింది. అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీని విజయపథంలో నడిపిన శివకుమార్‌ను ఏకైక ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తామని హామీ ఇచ్చి ఒప్పించింది. దాంతోపాటు ఐదేళ్ల పదవీకాలాన్ని సిద్ధరామయ్య, శివకుమార్‌లు చెరో రెండున్నరేళ్లు పంచుకునేలా పెద్దమనుషుల ఒప్పందం కూడా కుదిర్చింది. ఆ ప్రకారం తొలి రెండున్నరేళ్లు సిద్ధరామయ్యను సీఎం సీటులో కూర్చోబెట్టేందుకు అంగీకారం కుదరడంతో ఆయన నేతృత్వంలో 2023 మే నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. అయితే ప్రభుత్వం గత ఏడాది చివరిలో రెండున్నరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంది. ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకొని శివకుమార్‌కు మార్గం సుగమం చేయాల్సి ఉంది. కానీ సిద్ధరామయ్య రకరకాల కారణాలతో బీసీ ముఖ్యమంత్రి కార్డు ప్రయోగిస్తూ సీఎం పదవిని వీడకుండా ఇంతవరకు నెట్టుకొచ్చారు. సిద్ధరామయ్య వెనుక ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న భావన, బీసీ ముఖ్యమంత్రి అర్థంతరం తొలగించారన్న విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో ఇంతకాలం వెనుకంజ వేస్తూ వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో దక్షిణాదికి సంబంధించి సానుకూల ఫలితాలు సాధించిన ఊపులో దక్షిణ భారతంలో పట్టు బిగించే క్రమంలో ముందు కర్ణాటకలో మÖడేళ్లకుపైగా కొనసాగుతున్న పదవీ పోరాటానికి ముగింపు పలికి.. అధికార బదిలీ సజావుగా జరిగేలా పార్టీ అధిష్టానం వేగంగా పావులు కదిపి ఎట్టకేలకు విజయం సాధించింది. గత రెండుమÖడు రోజులుగా ఢిల్లీలో జరిగిన మంతనాల్లో పదవిని త్యజించి అధికార మార్పిడికి లైన్‌క్లియర్ చేయమని అధిష్టానం సిద్ధరామయ్యకు స్పష్టంగా సూచించింది. ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ సోనియా నివాసానికి వెళ్లి ఆమెతో పాటు ప్రియాంకతోనూ కర్ణాటక సంక్షోభంపై చర్చించారు. దీనిపై సోనియా స్పందిస్తూ మÖడేళ్ల క్రితం శివకుమార్‌కు హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. అధిష్టానం మాటను మన్నించి ఇన్నాళ్లూ ఓపికగా వేచి చూసిన ఆయనకు న్యాయం చేయాలన్నట్లుగా ఆమె మాట్లాడటంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేతలు కేసీ వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలల సమక్షంలో సిద్ధరామయ్య, డి.కె.శివకుమార్‌లతో చర్చించి సిద్ధరామయ్య తప్పుకునేలా.. శివకుమార్ పదవి చేపట్టేలా ఒప్పించారు. సీఎం పదవిని వదులుకున్న సిద్ధరామయ్యకు రాజ్యసభ పదవి ఇచ్చి పెద్దల సభలో ప్రతిపక్ష నాయకుడి హÃదా కట్టబెట్టడం, ఆయన కుమారుడికి రాష్ట్ర కేబినెట్‌లో స్థానం కల్పించడం వంటి అంశాలతో ఒప్పందం కుదిర్చినట్లు తెలిసింది. అయితే పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోవడం, సిద్ధరామయ్య కూడా మౌనం పాటిస్తూ ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం కావడంతో అధికార మార్పిడిపై సందేహాలు రేగాయి. అయితే గురువారం ఉదయం తన కేబినెట్‌ను సమావేశపర్చిన సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కేబినెట్ రద్దుకు నిర్ణయించానని, ఆ మేరకు గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరినట్లు ప్రకటించడంతో కర్ణాటకలో అధికార మార్పిడికి మార్గం సుగమమైంది. అయితే సిద్ధరామయ్య స్థానంలో శివకుమార్ ఎప్పుడు సీఎంగా ప్రమాణం చేస్తారన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఆ విధంగా కర్ణాటకలో రెండేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుంచే పార్టీని సన్నద్ధం చేయడానికి ప్లాన్ వేసిన కాంగ్రెస్ అధిష్టానం పార్టీని ముందునుంచీ కాపు కాస్తున్న దక్షిణాదిలో మళ్లీ పాగా వేసేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తున్నది. మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బెంగాల్, అసోం రాష్ట్రాల్లో చేదు ఫలితాలు చవిచూసినప్పటికీ దక్షిణాదిలో మాత్రం ఆశాజనక ఫలితాలు సాధించింది. ముఖ్యంగా కేరళలో దశాబ్దం తర్వాత కమÖ్యనిస్టు కూటమి(ఎల్డీఎఫ్)ని మట్టి కరిపించిన కాంగ్రెస్ కూటమి (యÖడీఎఫ్) థంపింగ్ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి రావడం శుభపరిణామంగా భావిస్తున్నది. మరోవైపు తమిళనాడులో ఎన్నికల వరకు అధికారంలో ఉన్న డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్ ఫలితాల తర్వాత ప్రాప్తకాలజ్ఞత ప్రదర్శించింది. ఓడిపోయిన డీఎంకే కూటమిని పట్టుకుని వేలాడకుండా మెజారిటీ సరిపోక అధికారానికి కొన్ని అడుగుల దూరంలో నిలిచిపోయిన సినీనటుడు విజయ్ పార్టీ టీవీకేకు మద్దతు ప్రకటించడం ద్వారా స్నేహహస్తం అందించి ప్రభుత్వంలో భాగస్వామిగా మారింది. ఇక తెలంగాణలో ఇప్పటికే పార్టీ అధికారంలో ఉంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిని మినహాయిస్తే ఇక దక్షిణాదిలో మిగిలింది ఆంధ్రప్రదేశే. అంటే దాదాపు దక్షిణ భారతమంతా మళ్లీ కాంగ్రెస్ ఏలుబడిలోకి వచ్చినట్లే! ఏపీలోనూ పాగా వేసేందుకు ఇటు డీకే శివకుమార్, అటు విజయ్‌ల ద్వారా కాంగ్రెస్ పావులు కదపవచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page