top of page

అధికారుల గుండెల్లో బదిలీల గంట

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • ఇప్పటికే వంశధార ఎస్‌ఈ, ఈఈలకు స్థానచలనం

  • వీఆర్‌కు ముగ్గురు ఎస్సైలు.. మరికొందరికి త్వరలోనే

  • అనుకూలమైన స్థానాల కోసం జోరుగా పైరవీలు

  • పాత స్థానాలకు రావడానికి జిల్లా నుంచి వెళ్లిన పలువురి యత్నాలు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారులు, ఉద్యోగులను భారీగా బదిలీ చేయడం సర్వసాధారణం. ఆ మేరకు ఇప్పటికే రాష్ట్రస్థాయిలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీ ప్రక్రియ సాగుతుండగా.. ఇప్పుడు జిల్లాస్థాయి అధికారుల గుండెల్లో బదిలీల గంట మోగుతూ గుబులు పుట్టిస్తోంది. ఈ నెల 18న కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు నిర్వహించిన జిల్లా అధికారుల సమీక్షలో అధికారులు, ఉద్యోగుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తూనే జిల్లాలో వ్యవస్థలను సమూలంగా ప్రక్షాళన చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. దీనికి కొనసాగింపుగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు పని చేస్తున్న వారిని సాగనంపి తమవారిని, తమకు అనుకూలంగా ఉండేవారిని జిల్లాకు తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో స్థానచలనం తప్పకపోవచ్చని అన్ని శాఖల జిల్లా, మండలస్థాయి అధికారులతోపాటు ఉద్యోగులు మానసికంగా సిద్ధమైపోయారు. ప్రభుత్వం కొలువుదీరక ముందే ముగ్గురు ఎస్సైలను వీఆర్‌కు పంపించారు. ఈఎస్‌ఐ కేసులో అచ్చెన్నాయుడును అరెస్టు చేసిన సమయంలో టెక్కలి ఎస్సైగా ఉన్న గణేష్‌ (నిజాయితీ గల అధికారి), కోటబొమ్మాళి ఎస్సైగా ఉన్న రవికుమార్‌, సంతబొమ్మాళి ఎస్సైగా ఉన్న ఎస్‌.లక్ష్మణరావులను వీఆర్‌కు పంపిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. (అప్పటి ప్రభుత్వం పీకమీద కత్తి పెట్టడంతో వీరికి చేయకతప్పలేదు.) వీరితో పాటు అరెస్టు సమయంలో పలాస డీఎస్పీగా పని చేసిన శివరామరెడ్డిని కూడా వీఆర్‌కు పంపించారు.

ఇప్పటికే కొందరికి స్థానచలనం

ఇప్పటికే ఉన్నతాధికారుల కోటాలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్‌ తమీమ్‌ అన్సారియాను ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఆమె స్థానంలో ఎవరు వస్తారన్నదానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా జలవనరుల శాఖకు సంబంధించి వంశధార ప్రాజెక్ట్‌ ఎస్‌ఈ(ఎఫ్‌ఏసీ) డోల తిరుమలరావు, టెక్కలి సర్కిల్‌ ఈఈ (ఎఫ్‌ఏసీ) కె.శ్రీకాంత్‌లను తప్పించి 2014లో ఇవే పోస్టుల్లో పనిచేసిన ఎస్‌ఈ రాంబాబు, ఈఈ శేఖర్‌లను వెనక్కి రప్పిస్తూ ఈ నెల 14న ప్రత్యేక జీవోలు విడుదల చేశారు. తమీమ్‌ అన్సారియా బదిలీ కావడంతో ఆమె భర్త, జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీని కూడా ఫౌజ్‌ కోటాలో బదిలీ చేయొచ్చన్న చర్చ సాగుతోంది. వీరితో పాటు జేసీ నవీన్‌కు బదిలీ తప్పదని సంకేతాలున్నాయి. ఈయనది కూడా ఇదే సమస్య. విజయనగరం జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించిన జేసీ భార్య నాగలక్ష్మి కృష్ణా జిల్లాకు బదిలీ కావడంతో ఫౌజ్‌ కోటాలో ఆయన బదిలీ ఖాయంగా కనిపిస్తోంది. వీరితో పాటు ఎస్పీ రాధికను జిల్లా నుంచి సాగనంపడానికి అధికార పార్టీ సిద్ధమైంది. డీఆర్వోతో పాటు పలాస, శ్రీకాకుళం ఆర్డీవోలు, టెక్కలి సబ్‌ కలెక్టర్‌కు బదిలీ తప్పదన్న సంకేతాలు ఉన్నాయి.

కీలక శాఖలపైనే అందరి కళ్లు

రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన ప్రతి సందర్భంలోనూ జిల్లా ఉన్నతాధికారులు, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారుల బదిలీ తప్పడం లేదు. వైకాపా హయాంలో ప్రధాన పోస్టుల్లో కొలువుదీరిన వారికి స్థానచలనం తప్పదంటూ టీడీపీ నేతలు సంకేతాలు పంపిస్తున్నారు. కీలక శాఖలైన డ్వామా, మెప్మా, డీఆర్‌డీఏ పీడీలు, జెడ్పీ సీఈవో, పంచాయతీ అధికారి, బీసీ, సాంఘిక సంక్షేమశాఖల డీడీలు, బీసీ, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీలు, వ్యవసాయ శాఖ దాని అనుబంధ శాఖలు, విద్యాశాఖ, వైద్యఆరోగ్య శాఖ, డీఎస్‌వో, డీఎంసీఎస్‌, గృహనిర్మాణ సంస్థ, గ్రామీణ నీటి సరఫరా, నీటిపారుదల, గనులు తదితర శాఖల అధికారుల మార్పు తప్పదు. వీరి స్థానంలో అధికార పార్టీకి అనుకూలమైన వారికి పోస్టింగ్‌లు ఇవ్వడానికి రంగం సిద్ధమవుతోంది. ముందుగా రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు బదిలీలు పూర్తి చేసిన తర్వాత జిల్లాల స్థాయిలో బదిలీలు చేపట్టనున్నారు. స్థానచలనం తప్పదని సంకేతాలు ఉన్నవారు ఇతర జిల్లాల్లో పోస్టింగ్‌ల కోసం ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకొనే పనిలో నిమగ్నమయ్యారు. 2019 వరకు జిల్లాలో విధులు నిర్వహించి, వైకాపా వచ్చిన తర్వాత ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిపోయిన వారంతా తిరిగి జిల్లాకు రావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు ప్రస్తుతం జిల్లాలో వివిధ హోదాల్లో పని చేస్తున్న అధికారులు ఇక్కడే కొనసాగడానికి మంత్రులు అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌ నాయుడు, స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సుల కోసం రాజకీయ ప్రయత్నాలు చేస్తున్నారు.

కసరత్తు చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

బదిలీలు తప్పవన్న సంకేతాలతో ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగేందుకు పలువురు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కొన్ని కీలక శాఖలకు జిల్లా అధికారులుగా ఉన్న వారిలో ఎవరిని కొనసాగించాలి, ఎవరిని సాగనంపాలి, వారి స్థానంలో ఎవరిని తీసుకురావాలన్న అంశంపై జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు కసరత్తు ప్రారంభించారని విశ్వసనీయ సమాచారం. వీరితో పాటు కీలకమైన రెవెన్యూ, మండల పరిషత్‌, పోలీసు, ఎక్సైజ్‌ శాఖలపై మంత్రులు, ఎమ్మెల్యేలు దృష్టి సారించారు. మండలాల్లో కీలకంగా ఉండే ఈ మూడు వ్యవస్థల్లో అనుకూలమైన అధికారులు, ఉద్యోగులకు పోస్టింగులు ఇవ్వాలని భావిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు జిల్లా నుంచి విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, మన్యం, అల్లూరి జిల్లాలకు బదిలీపై వెళ్లిపోయిన తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సీఐ, ఎస్‌ఐలు తిరిగి జిల్లాకు రావడానికి ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం జీవో జారీ చేసిన వెంటనే మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులతో తాము కోరుకున్న స్థానాల్లో పోస్టింగులు దక్కించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే తహసీల్దార్‌, ఎంపీడీవో, ఎస్సైలుగా ఎవరిని తీసుకురావాలన్న జాబితాను ఎమ్మెల్యేలు సిద్ధం చేసుకున్నారని సమాచారం. పోస్టింగులు కోరుకుంటున్నవారు ఫలితాలు వచ్చిన వెంటనే అభినందనల పేరుతో ఎమ్మెల్యేలను కలుసుకున్నారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారి వద్దకు కూడా క్యూ కట్టారు. ఇక తహసీల్దారు, ఎంపీడీవో కార్యాలయాల్లో కీలకమైన సీట్లలోకి ఎవరిని తీసుకురావాలన్న దానిపై ఎమ్మెల్యేలు ఇప్పటికే క్లారిటీతో ఉన్నారు. దీని కోసం ఉద్యోగులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. గ్రామ కార్యదర్శి, వీఆర్వో, వీఆర్‌ఏ స్థాయి నుంచి జిల్లా ఉన్నతాధికారుల వరకు బదిలీలు తప్పనిసరి కానున్నాయి. ఈ బదిలీలు తర్వాత మరో రెండేళ్లు వీరితోనే పని చేయించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.

Kommentare


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page