top of page

అధిక వడ్డీకి ఆశపడి మోసపోయారు..?

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • డబ్బులు రాబట్టుకోవడానికి బాధిత కుటుంబం నిరసన

  • ఉద్యోగాలు వేయిస్తానని మోసం చేశారంటూ ఫిర్యాదు



అధిక వడ్డీకి ఆశపడి గొల్లవీధికి చెందిన గోపిదలై దమయంతి, కోడలు గాయత్రి బారినపడి సంతబొమ్మాళికి చెందిన పందిరి సన్యాసమ్మ, అప్పన్న దంపతులు నిండా మునిగిపోయారు. రూ.18.60 లక్షలు ఇచ్చి మోసపోయామని లబోదిబోమంటూ బాధితులు సన్యాసమ్మ, అప్పన్నతో పాటు కుమార్తె శ్రావణి, కుమారుడు కార్తీక్‌తో కలిసి గాయత్రి ఇంటి ముందు శుక్రవారం నిరసనకు దిగారు. తన బిడ్డలకు రైల్వేలో ఉద్యోగాలు వేయిస్తానంటూ గాయత్రి డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. డబ్బులు ఇవ్వకుండా పోలీసులు, లాయర్లతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సన్యాసమ్మ వంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్యహత్యకు ప్రయత్నించింది. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సన్యాసమ్మను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వివరాల్లోకి వెళితే..

సంతబొమ్మాళికి చెందిన పందిరి సన్యాసమ్మ, అప్పన్న ఊరూరా తిరుగుతూ గాజులు, పూసలు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆ క్రమంలోనే టెక్కలి గొల్లవీధికి చెందిన గోపిదలై దమయంతితో పరిచయం ఏర్పడిరది. ఆ పరిచయంతో దమయంతి ఆమె కోడలు, వరుసకు మనుమరాలు అయిన గాయత్రి ఎంటరై 10 రూపాయలు వడ్డీకి డబ్బులు ఇప్పిస్తే కమీషన్‌ ఇస్తామని సన్మాసమ్మకు నమ్మబలికారని తెలిసింది. దీంతో ఆమె మొదట లక్ష రూపాయలు రూ.10 వడ్డీకి ఇవ్వగా, కమీషన్‌ కింద రూ.10వేలు ఇచ్చినట్టు తెలిసింది. దీనికి ఆశపడిన పందిరి సన్యాసమ్మ గాయత్రి అకౌంట్‌లో రూ.6లక్షలు విడతల వారీగా జమ చేసి వడ్డీ తీసుకున్నట్టు తెలిసింది. ఆ తర్వాత కూడా అదే మాదిరిగా రూ.18.60 లక్షలు ఇచ్చినట్టు సన్యాసమ్మ చెబుతుంది.

పోలీసుల వద్ద ‘పంచాయితీ’

ఈ వ్యవహారంపై టెక్కలి, సంతబొమ్మాళి పోలీస్‌ స్టేషన్లలో ఇరువురి మధ్య పంచాయితీ నడిచినట్టు తెలిసింది. ఆ సందర్భంలోనే టెక్కలి, సంతబొమ్మాళి పోలీస్‌ స్టేషన్లలో పోలీసుల సమక్షంలోనే గాయత్రి బాధితురాలు పందిరి సన్యాసమ్మకు డబ్బులు బాకీ ఉన్నట్టు స్టాంప్‌ పేపర్లపై రాయించి సంతకాలు చేయించారని సమాచారం. పంచాయితీ గడువు ముగిసినా గాయత్రి డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితురాలు సన్యాసమ్మ కుటుంబ సభ్యులంతా కలిసి నిరసన తెలిపారు. అధిక వడ్డీకి ఆశపడి రూ.18.60 లక్షలు ఇవ్వడానికి స్వగ్రామంలో ఉన్న ఇంటిని, బంగారాన్ని విక్రయించి నగదును గాయత్రీ ఖాతాలో జమ చేయగా, నేరుగా కొంత మొత్తం కూడా ఇచ్చారని, ఆ తర్వాత అసలు, వడ్డీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న గాయత్రి తన ఇద్దరు పిల్లలకు రైల్వేలో ఉద్యోగం వేయిస్తానని డబ్బులు తీసుకున్నట్టు పోలీసు ఉన్నతాధికారులకు బాధితురాలు సన్యాసమ్మ ఫిర్యాదు చేశారు. గాయత్రి కుటుంబంలో కొందరికి మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్యంటూ స్థానికులు చెబుతున్నారు. వీరి మాయ మాటలతో అధిక వడ్డీకి ఆశపడి సన్యాసమ్మ మోసపోయింది. అన్యాయానికి గురైన సన్యాసమ్మ పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోకపోవడంతో ఉద్యోగాల పేరుతో మోసం చేసినట్టు ఫ్లెక్సీ ఏర్పాటు చేసి గాయత్రీ ఇంటిముందు సన్యాసమ్మ కుటుంబ సభ్యులు శుక్రవారం ఆందోళనకు దిగారు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page