అనవసర ప్రసంగంతో అనర్థం!
- DV RAMANA

- Apr 17
- 3 min read

అనువుగాని వేళ అక్కరకు రాని విషయాలు మాట్లాడితే.. దాన్నే అప్రస్తుత ప్రసంగం అంటారు. ఇందులో ప్రసంగీకుల లక్ష్యం మంచిదే కావచ్చు గానీ.. సందర్భం లేకుండా ప్రస్తావిస్తే మాత్రం ఆ లక్ష్యం నీరుగారిపోవడమే కాకుండా.. విమర్శల తాకిడి పెరిగి ఉన్న పరువు పోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి లోక్‌సభ సాక్షిగా అధికార బీజేపీ పరిస్థితి అలాగే తయారైంది. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుల ఆమోదమే లక్ష్యంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. ఆ మేరకు గురువారం లోక్‌సభలో రాజ్యాంగ సవరణతో సహా మొత్తం మూడు బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. నియోజవర్గాల డీలిమిటేషన్ బిల్లును చర్చకు స్వీకరించాలా.. తిరస్కరించాలా.. అన్న అంశంపై మొదట పార్టీలు, సభ్యుల అభిప్రాయాలు స్వీకరించారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఇండియా కూటమి పక్షాలు నియోజకవర్గాల పునర్విభజన బిల్లును అనేక కారణాలతో వ్యతిరేకించాయి. సహజంగానే ఆ పార్టీల వాదనను బీజేపీ సహా ఎన్డీయే పార్టీలు తప్పుపట్టాయి. బిల్లును చర్చకు స్వీకరించడమే కాకుండా ఆమోదించాలని వాదించాయి. ఆ క్రమంలోనే బీజేపీకి చెందిన బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య బిల్లులకు మద్దతుగా సభలో మాట్లాడారు. అయితే బిల్లు అవసరాన్ని, లక్ష్యాన్ని వివరిస్తూనే.. దాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌ను ఏకిపారేయాలన్న ఉత్సాహంతో రెచ్చిపోయారు. ఆ ఆవేశంలో తన విమర్శల జడిని దారి తప్పించేశారు. సభలో జరుగుతున్న చర్చతో ఏమాత్రం సంబంధంలేని ఆంధ్రప్రదేశ్ విభజన గాయాన్ని రేపారు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తీరును ఎత్తిచూపుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో బ్రిటిష్ వారు దేశాన్ని విభజించిన తీరు కంటే దారుణంగా, అశాస్త్రీయంగా ఆనాడు ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేశారని మండిపడ్డారు. తెలుగు ప్రజల సెంటిమెంట్లను కాలరాసి, ఆర్థిక వనరులపై కనీస స్పష్టత లేకుండా కాంగ్రెస్ చేసిన ఆ చారిత్రక తప్పిదం వల్లే నేటికీ ఏపీ ప్రజలు కోలుకోలేని విభజన గాయాలతో సతమతమవుతున్నారని విరుచుకుపడ్డారు. ఆయన వాదన నిజమే.. తమ ఎంపీలు పట్టించుకోకపోయినా పొరుగు రాష్ట్ర ఎంపీ తమ బాధలను అత్యున్నత చట్టసభలో ప్రస్తావించడాన్ని ఏపీ ప్రజలు ప్రశంసిస్తున్నారు. అయితే తెలంగాణలో ఎదగాలన్న బీజేపీ లక్ష్యాలను ఇది దెబ్బతీస్తుందని ఆ పార్టీశ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. జీడీపీ ఆధారంగా రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లు పెంచాలన్న తెలంగాణ సీఎం రేవంత్ ప్రతిపాదనను కూడా తేజస్వి చెండాడారు. ఏటా మారిపోయే ఆర్థిక గణాంకాల ఆధారంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో సీట్లు కేటాయించడం అసాధ్యమన్నారు. ఆదాయమే ప్రాతిపదిక అయితే దేశంలో అత్యధిక పన్నులు కట్టే అంబానీకి లక్ష ఓట్లు.. సామాన్యుడికి ఒక్క ఓటే ఉండాలని రేవంత్ కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. రాజ్యాంగం కల్పించిన ‘ఒక వ్యక్తి - ఒక ఓటు’ అనే ప్రాథమిక హక్కును తక్కువ చేసే ఏ ప్రయత్నమైనా అజ్ఞానమే అవుతుందని సూర్య హెచ్చరించారు. స్వతహాగా మంచి వాగ్ధాటి కలిగిన తేజస్వి సూర్య ప్రసంగం వైరల్‌గా మారింది. ఆయన కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టినా ఆ పార్టీ కంటే బీజేపీలోనే ఎక్కువ వైరల్ అయ్యింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తప్పుపట్టినట్లున్న తేజస్వి వ్యాఖ్యలు అక్కడ బీజేపీని ఇరకాటంలోకి నెట్టి ఆత్మరక్షణలో పడేశాయి. ఈ వ్యాఖ్యల దుమారాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో రంగంలోకి దిగిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా తప్పులో కాలేశారు. వివాదాల మంటను ఆర్పబోయి మరింత ఆజ్యం పోశారు. తేజస్వీ వ్యాఖ్యలను భూతద్దంలో చూడొద్దని హితవు పలికారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ చేసిన జాప్యం వల్లే ఉద్యమంలో వందలమంది ప్రాణాలు కోల్పోయారంటూ తాను కూడా సంబంధం లేని అంశాలను ఎత్తుకున్నారు. గతంలో వాజ్‌పేయి నేతత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలను వివాదాలకు తావు లేకుండా ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తలాతోకా లేనివిధంగా చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాన్ని మరింత జటిలం చేశాయి. అటు కాంగ్రెస్, ఇటు బీఆరఎస్ నేతలు రెండువైపుల నుంచి బీజేపీపై విమర్శలు దాడి తీవ్రతరం చేశాయి. ఫలతంగా నష్టనివారణ సంగతేమో గానీ తెలంగాణ రాజకీయం రచ్చరచ్చగా మారింది. భావోద్వేగాలను రెచ్చగొట్టిన ఈ వాతావరణంలో ఏదో ఒకటి మాట్లాడి వివాదాన్ని సద్దుమణిగించేద్దామని ప్రయత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మరింతగా దీన్ని వివాదం చేసి.. సమర్థన పేరుతో తన అసమర్థతను చాటుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. తేజస్వీ మాట్లాడిన నేపథ్యాన్ని వక్రీకించి, లేని సందర్భాన్ని కూడా జోడించి ఏదో చెప్పబోయి ఇంకేదో చెబుతూ, విమర్శించిన రాజకీయ నేతలనే తప్పుబట్టి.. తిట్టి.. హితబోధలతో రామచంద్రరావు ప్రెస్‌మీట్ ముగించేశారు. ఆయన తీరు పరిస్థితిని మరింతగా తీవ్రం చేసింది. పుండు మీద కారం చల్లినట్లు వివాదం మరింత రాజకుంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందిస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ప్రసంగంలోని వివాదాస్పద అంశాలను లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించి, సదరు ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇంత అలజడి రేగుతున్నా బీజేపీపై దాడి పెరిగినా రాష్ట్రానికి చెందిన ఆ పార్టీ ఎంపీలు ఏమీ పట్టనట్లు మౌనంగా తెర వెనుకే ఉండిపోవడం తెలంగాణ ప్రజలను అసంతప్తి, ఆగ్రహానికి గురిచేస్తున్నది. వారిలో ఏ ఒక్క ఎంపీ అయినా మీడియా ముందుకు వచ్చి ‘తేజస్విసూర్య వ్యాఖ్యలు తప్పు.. అసందర్భం’ అని ఒక్క వివరణ ఇచ్చి ఉంటే రాష్ట్రంలో పార్టీకి వచ్చే నష్టమేమీ ఉండేది కాదు. కానీ తెలంగాణలో పార్టీని కాపాడుకోవడం కంటే పార్టీ జాతీయ నాయకత్వం ఏది చెబితే అదే కరెక్టని సమర్థించే ధోరణే తెలంగాణ బీజేపీకి మరింత నష్టం కలగజేస్తుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇది ఇక్కడితో ఆగేలా లేదు. ఆ పార్టీ, ఆ ఎంపీ దిష్టిబొమ్మలు తగులబెట్టేదాకా పోయింది పరిస్థితి.






Comments