top of page

అనుకున్నదొక్కటి.. అవుతున్నదొక్కటి!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Sep 10, 2024
  • 2 min read

రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేరు. అలాగే నాయకులు కూడా ఎల్లప్పుడూ ఒక్క పార్టీనే అంటిపెట్టుకుని ఉంటారనుకోవడం కూడా భ్రమే. దీనికి కొద్దిమంది మినహాయింపు అను కున్నా.. అధికశాతం నాయకులు సొంత లాభం చూసుకునేవారే కావడం ప్రజాస్వామ్యానికి ప్రమాద సంకేతం అనే చెప్పాలి. కొంత కాలం క్రితం వరకు పార్టీలు, ప్రజల సంగతెలా ఉన్నా తాము పదవుల్లో ఉంటే చాలనుకునేవారు నాయకులు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. అధికారంలో ఉన్న పార్టీలోనే ఉండాలని కోరుకునేవారు పెరిగిపోతున్నారు. ఉన్న పదవులకు రాజీనామా చేసి మరీ అధికార పార్టీలోకి జంప్‌ అయిపోయి అధికార హోదా వెలగబెట్టాలని తాపత్రయపడుతున్నారు. నిన్న మొన్నటి వరకు అధి కారంలో ఉన్న వైకాపా నుంచి ఎమ్మెల్సీ, రాజ్యసభ తదితర ఉన్నత పదవులు పొందినవారు.. రాజకీయం తారుమారైన పరిస్థితుల్లో తాము కూడా మారిపోవాలని మంత్రాంగం నెరుపుతున్నారు. ప్రస్తుతం ప్రభు త్వంలో భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం, జనసేనలతో సంప్రదింపులు జరుపుతూ అటునుంచి గ్రీన్‌ సిగ్నల్‌తో పాటు పదవులపై భరోసా వచ్చిన వెంటనే జంప్‌ అయిపోవడానికి సిద్ధపడుతున్నారు. అయితే పార్టీలోకి రావాలనుకునేవారు ప్రస్తుతం అనుభవిస్తున్న పదవులను వీడితేనే.. వారి నడవడిక బాగుందని పిస్తేనే పార్టీలోకి చేర్చుకుంటామని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు స్పష్టం చేయడంతో దానికి కూడా పలువురు నేతలు సిద్ధపడటమే కాకుండా వెనువెంటనే తమ పదవులకు రాజీనామా చేసి పడేసి.. మేం సిద్ధం అన్న సిగ్నల్స్‌ పంపారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్‌రావులు ఎంపీ పదవులకు రాజీనామా చేసి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. అదేవిధంగా ఎమ్మెల్సీలు పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ్‌చక్రవర్తి తమ పదవులకు రాజీనామా చేసేశారు. తాము టీడీపీలో చేరనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. కానీ ఇంతవరకు టీడీపీ అధిష్టానం నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో అటు ఉన్న పదవులు పోయి.. ఇటు ఏ పార్టీలోనూ లేకుండా గాల్లో ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిరది. అయితే ఆలస్యమైనా వారు టీడీపీలో చేరడం ఖాయమేనన్న సంకేతాలు ఉన్నప్పటికీ ప్రస్తుత డోలాయ మాన స్థితికి వైకాపా వారిని పార్టీలో చేర్చుకునే విషయంలో టీడీపీలో ఎదురవుతున్న ప్రతిఘటనలే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు పదవులు పొంది అధికార దర్పంతో విర్రవీగిన నేతలు అప్పట్లో టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని, చంద్రబాబు, లోకేష్‌ సహా పార్టీ నేతలకు తీవ్రంగా దూషించారని, అటువంటివారికే జగన్‌ ఏరికోరి పదవులు ఇచ్చారన్నది మెజారిటీ టీడీపీ శ్రేణులు వాదనగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు కన్నూమిన్నూ కానకుండా రెచ్చి పోయినవారు ఇప్పుడు తగుదునమ్మా అంటూ తిట్టిన పార్టీలోకే వచ్చి మళ్లీ పదవీభోగాలు అనుభవించాలని ఆశపడుతున్నవారిని పార్టీలో చేర్చుకోవద్దని ఆయా ప్రాంతాల నేతలు, కార్యకర్తలు టీడీపీ అధిష్టానానికి తెగేసి చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తమను అణచివేసి.. ఇప్పుడు మళ్లీ పార్టీలోకి వచ్చినవారికే పదవులు ఇస్తే.. కష్టకాలంలో ఎదురీది పార్టీ కోసం శ్రమించినవారి సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో అయితే వైకాపా నేతల చేరికను వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు రోడ్లపైకి కూడా వచ్చాయి. కొన్ని జిల్లాల్లో ఆందోళనలు కూడా చేశారు. కాదు.. కూడదని వైకాపావారిని పార్టీలో చేర్చుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా అధిష్టానానికి హెచ్చరికలు పంపారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన వైకాపా నాయకురాలు, ప్రకాశం జిల్లాకు చెందిన పోతుల సునీత విషయంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పార్టీకి చేసిన సూచనే దీనికి నిదర్శనం. సునీత లాంటి ఊసరవెల్లులను పార్టీలో చేర్చుకోవద్దని శిరీష బహిరంగంగానే చంద్రబాబుకు సూచించారు. ఇలాంటి వ్యతిరేకతలే పలు జిల్లాల్లో కనిపించడం, అవి తమ దృష్టికి రావడంతో టీడీపీ అధిష్టానం ఆలోచనలో పడిరది. దీనిపై ఆచితూచి అడుగులు వేయాలన్న భావనతో ప్రస్తుతానికి చేరికలను వాయిదా వేసింది. దీనికితోడు గత పదిరోజులుగా రాష్ట్రాన్ని ముట్టడిరచిన వరదల కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా సహాయ పునరావాస కార్యక్రమాల పైనే దృష్టి కేంద్రీకరించారు. దాంతో ప్రస్తుతానికి రాజకీయాలు, చేరికల ఊసు వినిపించడంలేదు. వరద కష్టాల నుంచి తెరిపిన పడిన తర్వాత మళ్లీ చేరికల అంశం తెరపైకి రావచ్చు. అప్పుడు టీడీపీ అధిష్టానం ఏం చేస్తుందన్నది ఆసక్తికరం. ఇదే అంశం ఇప్పటికే పదవులకు రాజీనామా చేసి పార్టీ మారడానికి సిద్ధమైన నేతలను ఉత్కంఠకు, ఆందోళనకు గురిచేస్తోంది. సాధారణంగా పార్టీలోకి వస్తామని ముఖ్యమైన నేతలు ముందుకొస్తే ఎదుటి పార్టీవారు సంతోషంగా ఆహ్వానిస్తారు. కానీ దానికి భిన్నంగా తమ రాకను టీడీపీ శ్రేణులు వ్యతిరేకిస్తుండటం, రోజులు గడుస్తున్నా ఆ పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాకపో వడం వలసబాటలో ఉన్న నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అధికారమే పరమావధిగా ఉన్న పదవులను వదులుకుని పార్టీ మారడానికి సిద్ధమైతే.. ఆ పార్టీలో పదవులందుకోవడం సంగతి దేవుడెరుగు.. ఉన్న పదవి పోగొట్టుకుని.. అధికార హోదా లేకుండా ఇలా ఎన్నాళ్లు గడపాలో అర్థంకాక వలస నేతలు కొట్టు మిట్టాడుతున్నారు. ఇది కొరకంగా పదవీ లాలస ఉన్న నేతలకు గుణపాఠం లాంటిదే.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page