(సత్యంన్యూస్, నరసన్నపేట)

ఫెయింజల్ తుపాను ప్రభావం జిల్లాలో పెద్దగా లేకపోయినా అడపా దడపా కురిసిన ఆ చిన్నపాటి వర్షం జిల్లాలో అన్నదాత వెన్ను వంచేసింది. గడిచిన కొన్నేళ్లుగా ఖరీఫ్ సీజన్‌లో అకాల వర్షాల వల్ల అన్నదాత నష్టపోతున్నాడు. ఫెయింజల్ తుపాను ఉందని వారం రోజుల ముందు వాతావరణ శాఖ హెచ్చరించినా, ఆ సమయానికి ఎండలు కాయడం వల్ల, తుపాను చెన్నై దాటాక తీరం దాటుతుందని ప్రకటించడం వల్ల జిల్లాలో రైతులు ధీమాపడిపోయారు. కానీ కల్లాల్లో ఉన్న ధాన్యం కుప్పలు, పొలాల్లో ఉన్న వరి కంకులు వర్షానికి పూర్తిగా నానిపోయాయి. పొలాల్లో ఉన్నవి కోతకు పనికిరాకుండాపోయాయి. సోమవారం కూడా ఎండ లేకపోవడంతో మంగళవారం నాటికి ఇవి మొలకెత్తుతాయని రైతులు చెబుతున్నాయి. కల్లాల్లో ఉన్న ధాన్యం, ఆరేసిన ధాన్యం తడిసిపోకుండా టార్పాలిన్లు పరిచినా కొంతభాగం నానిపోయింది. శుక్రవారం నుంచి జిల్లాలో టార్పాలిన్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడిరది. ఎన్ని చేసినా రైతు నష్టాన్ని మాత్రం నివారించలేకపోయారు. సోమవారం ఉదయం కూడా వర్షం కురవడంతో రైతులు పూర్తిగా ఆశ వదిలేశారు. ఇప్పుడిప్పుడే లెవీ ప్రారంభమైంది. 80 కేజీల బస్తాకు 84 కిలోల ధాన్యం తీసుకుంటున్న మిల్లర్లు ఇప్పుడు వర్షానికి తడిచిన పంట కొనుగోలు చేస్తారా, లేదా అన్నది ఇంకా తేలలేదు. వర్షానికి తడవని ధాన్యం ఉన్నా, అందులో తేమశాతం పెరిగిపోయిందని మరెన్ని అదనంగా తీసుకుంటారోనని రైతులు భయపడుతున్నారు. పొలాల్లో కొయ్యకుండా ఉన్న పంట వెన్ను పూర్తిగా వంగిపోయింది.
తుపాను ప్రభావంతో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోకుండా జిల్లా అధికార యంత్రాంగం వారిని అప్రమత్తం చేసింది. రెండు రోజుల వరకు కోతలు కోయవద్దని అధికారులు రైతులకు సూచించారు. కానీ ఆ తర్వాత వర్షం పడటంతో రైతులు నష్టపోయారు. ఆరబెట్టిన ధాన్యాన్ని తేమశాతం 19 వరకు ఉన్నా బస్తాల్లో నింపి మిల్లులకు తరలించే చర్యలను చేపట్టారు.
తుఫాన్ ప్రభావంతో వీస్తున్న ఈదురుగాలులకు వరి పొలాలు నేలకొరిగాయి. పొలాల్లో వర్షపునీరు చేరడంతో వర్షాలు తగ్గుముఖం పట్టినా వారం రోజుల వరకు పంటపొలాలు ఆరితే తప్ప కోసే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. యంత్రాలతో కోసిన ధాన్యం ఆరబోసేందుకు కల్లాలు కూడా ఆరాల్సిన పరిస్థితి తలెత్తిందని రైతులంటున్నారు. ఇప్పటికే రెల్లరాల్చు, కత్తెరపురుగు సోకి దిగుబడి తగ్గిపోయిన రైతుపై ఇప్పుడు ఫెయింజల్ తీరని వ్యథను మిగిల్చింది.
Comments