`గతంలోని భవనాలనే సిద్ధం చేస్తున్న అధికారులు
`ఏర్పాట్లకు రూ.13 లక్షలు చొప్పున విడుదల
`తొలుత శ్రీకాకుళం నగరంలో రెండు పునరుద్ధరణ
`దశలవారీగా నియోజకవర్గాల్లో ఏర్పాటుకు నిర్ణయం
`గత లోపాలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు

చిరుద్యోగులు, వివిధ పనులపై గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాలకు వచ్చే పేదల ఆకలి తీర్చేలా సరసమైన ధరలకు ఆహారం సరఫరా చేసేందుకు నిర్దేశించిన అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. గత వైకాపా సర్కారు నిర్ణయంతో మూలనపడిన వీటిని ఆగస్టు 15 నుంచి పునఃప్రారంభించాలని కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం పదవి చేపట్టిన వెంటనే చంద్రబాబు చేసిన ఐదు సంతకాల్లో అన్న క్యాంటీన్ల హామీ కూడా ఉంది. గతంలో ఈ పథకం అమల్లో ఉన్నప్పుడు జరిగిన లోటుపాట్లపై అప్పటి టీడీపీ ప్రభుత్వం సర్వే చేయించింది. అందులో బయటపడిన లోపాలు తిరిగి పునరావృతం కాకుండా పక్కాగా అన్న క్యాంటీన్ల నిర్వహణకు ఎక్కడికక్కడ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
రాష్ట్రంలో అన్నక్యాంటీన్లు 2018 అక్టోబర్‌లో ప్రారంభమయ్యాయి. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. అందులో భాగంగా శ్రీకాకుళం నగరంలోని ఏడురోడ్ల జంక్షన్, పొట్టిశ్రీరాములు జంక్షన్లల్లో రెండు క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. తర్వాత 2019 ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఆమదాలవలస, కోటబొమ్మాళిల్లో మరో రెండు తెరిచారు. శ్రీకాకుళంలోని రెండు క్యాంటీన్ల నిర్వహణకు చెరో రూ.37 లక్షలు వెచ్చించి టిడ్కో పర్యవేక్షణలో భవనాలు నిర్మించి అవసరమైన సామగ్రి, వసతులు కల్పించారు. అన్న క్యాంటీన్లలో ఐదు రూపాయలకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం సమకూర్చేవారు. నిర్ధిష్ట వేళల్లో టోకెన్లు జారీ చేసి అవి తీసుకున్నవారికే ఆహారం సరఫరా చేసేవారు. రోజుకు సగటున 350 మందికి భోజనం, 150 మందికి అల్పాహారం అందించేవారు. మొదట్లో అల్పాహారంగా రూ.5కు మూడు ఇడ్లీలు ఇచ్చేవారు. తర్వాత అదే రేటుకు రెండు ఇడ్లీలు మాత్రమే ఇచ్చి.. మొత్తం 200 మందికి సర్దుబాటు చేశారు. అన్న క్యాంటీన్ల నిర్వహణ, ఆహార పదార్థాల నాణ్యతపై ఐవీఆర్‌ఎస్, నిఘా విభాగాల ద్వారా అభిప్రాయాలు కూడా సేకరించారు. 2018లోనే 2041 మంది నుంచి అభిప్రాయాలు సేకరించగా 1478 మంది స్పందించారు. 91 శాతం మంది ఓవరాల్‌గా సంతృప్తి వ్యక్తం చేసినా ఆహార పదార్థాల నాణ్యత, పరిమాణంపై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే క్యాంటీన్ల నిర్వహణ సరిగ్గా లేదని మరికొందరు అసంతృప్తి ప్రకటించారు. అదే సమయంలో క్యాంటీన్ల చుట్టుపక్కల ఉన్న వ్యాపార సంస్థలవారు, తెలుగుదేశం నేతలు సూచించిన వారికే టోకెన్లు ఇచ్చేవారన్న ఆరోపణలు కూడా వినిపించాయి.
వైకాపా హయాంలో మూత
టీడీపీ ప్రభుత్వ చివరి నెలల్లో ఏర్పాటైన అన్న క్యాంటీన్లు 2019 ఎన్నికల వరకు కొనసాగినా ఆ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని రద్దు చేయించింది. ఇంకా మెరుగైన పద్ధతులు తీసుకొస్తామంటూ అప్పటివరకు నడుస్తున్న క్యాంటీన్లను మూయించేసింది. ఈ చర్యను నిరసిస్తూ తెలుగుదేశం ఆధ్వర్యంలోనే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాంటీన్లను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు శ్రీకాకుళం నగరంలో ప్రస్తుత ఎమ్మెల్యే గొండు శంకర్ సొంత ఖర్చులతో ఏడురోడ్ల జంక్షన్, ఏపీఎన్జీవో హోం వద్ద గత 453 రోజులుగా సొంత సొమ్ముతో నిర్వహిస్తున్నారు. ఇదే మాదిరిగా రాష్ట్రంలో కొన్నిచోట్ల నిర్వహంచినా సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ నాటితో ఆగిపోయాయి. కానీ గొండు శంకర్ మాత్రం రుచి, సుచికి పెద్దపీట వేస్తూ ఇంటి వద్ద ఆహారం తయారు చేయించి ప్రతిరోజు మధ్యాహ్నం సుమారు 700 మందికి ఉచితంగా ఆహారం అందజేస్తున్నారు. రాష్ట్రంలో అక్కడక్కడా కొందరు నిర్వహించినా దాతల సహకారం తీసుకున్నారు. కోటబొమ్మాళిలో మంత్రి అచ్చెన్నాయుడు కూడా అన్న క్యాంటీన్ ప్రారంభించినా కొన్ని రోజులు మాత్రమే నడిచింది. ఇటీవలి ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు జిల్లా కేంద్రంలో గతంలో అన్న క్యాంటీన్లను నిర్వహించిన భవనాల్లోనే ప్రారంభించాలని నిర్ణయించింది. ఒక్కో క్యాంటీన్ పునరుద్దరణకు రూ.13 లక్షలు మంజూరు చేసింది. వచ్చే నెల 15 నుంచి వీటిని ప్రజలకు అందుబాటలోకి తేవాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించింది.
భవనాల్లో చురుగ్గా ఏర్పాట్లు
అన్న క్యాంటీన్లను గత వైకాపా ప్రభుత్వం మూసివేయడంతో ఏడురోడ్ల జంక్షన్‌లో ఉన్న క్యాంటీన్ భవనాన్ని నగరపాలక సంస్థ అధికారులు శరవణ హోటల్‌కు లీజుకు ఇచ్చేశారు. ఈ హోటల్ కొన్నాళ్లు పాటు నడిచి మూతపడిరది. హోటల్ నిర్వహణకు అనుగుణంగా లీజుదారులు భవనంలో కొన్ని మార్పులు చేశారు. ఇప్పుడు అన్న క్యాంటీన్ కోసం నగరపాలక సంస్థ అధికారులు దాన్ని సిద్ధం చేస్తున్నారు. పొట్టి శ్రీరాములు జంక్షన్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ భవనంలో ప్రస్తుతం వార్డు సచివాలయం నడుస్తోంది. దీన్ని ఏడురోడ్ల జంక్షన్‌లోకి తరలించారు. భవనాన్ని అన్న క్యాంటీన్ నిర్వహణకు వీలుగా సిద్ధం చేస్తున్నారు. ఒకేసారి 80 మంది బఫే పద్ధతిలో అల్పాహారం, భోజనం చేసేందుకు వీలుగా అన్ని సౌకర్యాల కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. టోకెన్ల జారీలో అవకతవకలకు వీల్లేకుండా ఆన్‌లైన్ విధానం అమలు చేయాలని, అందుకు అవసరమైన కంప్యూటర్, నెట్‌వర్క్ అందుబాటులో ఉంచాలని ఆదేశాలు అందాయి. నిర్వాహకులు సరఫరా చేసే ఆహారం పరిమాణం తెలుసుకొనేందుకు ఒక వెయింగ్ యంత్రాన్ని, బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు వినియోగదారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకునేందుకు ఒక టోల్‌ఫ్రీ నెంబర్ కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకానికి ఆహారం సరఫరా చేస్తున్న అక్షయపాత్ర సంస్థకే అన్న క్యాంటీన్ల బాధ్యత కూడా అప్పగిస్తున్నారు. దీని ఒక వ్యక్తికి రూ.76 సబ్సిడీని ప్రభుత్వం ఆ సంస్థకు అందిస్తుంది. ముందుగా జిల్లా కేంద్రంలో అన్న క్యాంటీన్లు ప్రారంభించిన తర్వాత దశలవారీగా నియోజకవర్గ కేంద్రాలకు విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Comments