top of page

అన్ని బ్రాంచీల్లోనూ..అదే తాకట్టు.. కనికట్టు!

Writer: ADMINADMIN
  • `గార కుంభకోణం బయటపడగానే అప్రమత్తం

  • `పలు ప్రైవేట్‌ బ్యాంకుల ఒకేసారి తాకట్టు బంగారం రిలీజ్‌

  • `పాత ఆర్‌ఎం వ్యూహం ప్రకారమే ఈ దందా

  • `దీనిపైనే ఇప్పుడు దృష్టి పెట్టిన సౌత్‌జోన్‌ విజిలెన్స్‌


కర్మ.. ఎవర్నీ విడిచిపెట్టదు. కాస్త ఆలస్యం కావచ్చేమో కానీ వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. గార ఎస్‌బీఐ తాకట్టు బంగారం కుంభకోణం మొత్తాన్ని అసిస్టెంట్‌ మేనేజర్‌ స్వప్నప్రియ మీదకు నెట్టేసి ఆమె ఆత్మహత్యకు పరోక్ష కారణమై.. ఆమె కుటుంబ సభ్యులను జైలుకు పంపించి కేసును ఛేదించేశామని పోలీసులు ప్రకటించినా.. ఈ కేసులో సూత్రధారులను కర్మ విడిచిపెట్టడంలేదు. నామమాత్రంగా విచారణ జరిపి మొత్తం కుంభకోణంలో ఉన్న వారందర్నీ ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టుకు పంపించి స్వప్నప్రియ తరఫున ఎలాంటి సహకారమైన అందిస్తామని ఆమె మొబైల్‌ ఫోన్‌తో పాటు వివరాలన్నీ పోలీసులకు ఇచ్చి జైలుపాలైన ఆమె కుటుంబ సభ్యులకు జరిగిన అన్యాయంపై ఇప్పుడు స్వయంగా ఎస్‌బీఐ ఉన్నత వర్గాలే ఆరా తీస్తున్నాయి. నరసన్నపేట బజారు బ్రాంచిలో నకిలీ రుణాల కుంభకోణాన్ని సంచలన సాయంకాల పత్రిక ‘సత్యం’ వెలుగులోకి తేవడంతో ఈ రీజియన్‌ పరిధిలోని అనేక ఎస్‌బీఐ బ్రాంచిల్లో జరిగిన అవకతవకలపై సౌత్‌ జోన్‌ సెంట్రల్‌ విజిలెన్స్‌ విచారణ వేగవంతం చేసింది.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

‘నిన్ను కొట్టినవాడు బలవంతుడైనా, వాడిపై పగ తీర్చుకునే సామర్ధ్యం నీకు లేకపోయినా కాలం మాత్రం విడిచిపెట్టదు’ అని గీతలో కృష్ణభగవానుడు చెప్పినట్టు టీఆర్‌ఎం రాజు (పాత ఆర్‌ఎం) పాపాలు పండిపోయే సమయం వచ్చినట్టే కనిపిస్తోంది. గార బ్రాంచిలో ఏం జరిగింది? నరసన్నపేట బజారు బ్రాంచిలో ఎన్ని కోట్లు నకిలీ అకౌంట్లలోకి వెళ్లాయో చెప్పలేకపోతున్న పాత ఆర్‌ఎం నెత్తి మీద ఇప్పుడు కొత్త పిడుగు పడిరది. గార బ్రాంచిలో తాకట్టు పెట్టిన బంగారం మాయమైన విషయం వెలుగుచూసినప్పుడే జిల్లాలో ఉన్న అనేక ప్రైవేటు బ్యాంకుల్లో ఒకేసారి తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించిన విషయాన్ని సెంట్రల్‌ విజిలెన్స్‌ సౌత్‌జోన్‌ అధికారులు గుర్తించినట్టు భోగట్టా. దీని వెనుక పెద్ద కుట్రకోణం ఉంది. అంటే.. గార ఎస్‌బీఐ బ్రాంచిలోనే కాకుండా జిల్లాలో అనేక ఎస్‌బీఐ బ్రాంచిల్లో బంగారాన్ని ఈ విధంగానే ప్రైవేటు బ్యాంకుల్లో కుదువ పెట్టి డబ్బులు పట్టుకుపోయారని అర్థమవుతోంది. గార వ్యవహారం బయట పడి, స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకోవడంతో మొత్తం వ్యవహారం బయటపడుతుందని గ్రహించిన అప్పటి ఆర్‌ఎం టీఆర్‌ఎం రాజు పోలీసు బూచి చూపించి అన్ని ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్న బంగారాన్ని మళ్లీ వెనక్కి రప్పించారు. అయితే ఈ వ్యవహారం బయటకు రాకుండా చూసుకున్నారు. ఇప్పుడు స్వప్నప్రియ ఆత్మహత్య, ఆర్‌ఎం రాజు పాత్రపై ‘సత్యం’ కథనాలు ప్రచురించడంతో పోలీసులకు కూడా తట్టని కోణంలో బ్యాంకు విజిలెన్స్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది.

ఒకరి ఆధార్‌ కార్డుతో మరొకరు తాకట్టు పెట్టొచ్చు

జిల్లాలో ఎస్‌బీఐ మినహా మిగిలిన బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టాలంటే స్వయంగా ఆ వ్యక్తే వెళ్లి ఆధార్‌ కార్డు చూపించి సీసీ కెమెరాకు ఫుటేజీ ఇచ్చాకే కుదువ పెట్టడానికి తెచ్చిన బంగారాన్ని అప్‌లోడ్‌ చేసి, దాని విలువ ఖరారు చేసి రుణాలు ఇస్తారు. కానీ శ్రీకాకుళం ఎస్‌బీఐ బ్రాంచిల్లో మాత్రం ఎవరి ఆధార్‌ కార్డును ఎవరు పట్టుకెళ్లినా, ఎవరి బంగారాన్నయినా తాకట్టు పెట్టుకుంటారు. అంటే.. జిరాక్స్‌ షాపులో దొరికే ఆధార్‌ కాపీని పట్టుకెళ్లి వేరే వ్యక్తి బంగారం కుదువ పెడితే, ఆధార్‌లో ఉన్న వ్యక్తి పేరు మీద బంగారం రుణం ఉన్నట్టు నమోదవుతుంది. బహుశా ఇటువంటి కుంభకోణాలు చేయడానికే వీలుగా ఉంటుందనేమో జిల్లాలోని 25 ఎస్‌బీఐ బ్రాంచిల్లోనూ సీసీ ఫుటేజీ లేదు. అదేమిటని అడిగితే కెమెరాలు పని చేయడంలేదని చాలా తేలిగ్గా చెప్పేవారు అప్పటి ఆర్‌ఎం. ఎన్నోసార్లు పోలీసులు హెచ్చరించినా కూడా ఆర్‌ఎం ఎప్పుడూ పట్టించుకోలేదు. కారణం ఏమిటంటే.. బంగారాన్ని బయటకు తెచ్చి ప్రైవేటు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి, ఆ డబ్బులతో వ్యాపారాలు చేసుకోవడంలో శ్రీకాకుళంతో పాటు మరో నాలుగు జిల్లాలు ఉన్నాయి. అక్కడ మరీ పెద్ద ఎత్తున జరుగుతుండటం వల్ల తనకేం పోతుందన్న ధీమాలో అప్పటి ఆర్‌ఎం రాజు వ్యవహరించేవారు. అయితే ఇక్కడ ఆయన భావించినట్టుగానే బంగారం ప్రైవేటు బ్యాంకుల నుంచి బయటకు వచ్చింది. రుణం తీసుకున్నవారి చేతికి అందిపోయింది. కానీ అకారణంగా గార బ్యాంకు ఉద్యోగి స్వప్నప్రియ చనిపోయింది. ఇప్పుడు ఈ నష్టాన్ని ఎవరు పూడుస్తారు? సరిగ్గా ఈ కోణంలోనే ఎస్‌బీఐ విజిలెన్స్‌ దర్యాప్తు చేస్తోంది. గార బ్రాంచిలో జరిగిన కుంభకోణంపై సోషల్‌ మీడియాలో ఏకపక్షంగా తీర్పులు రావడం వెనుక టీఆర్‌ఎం రాజు పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణం మొత్తం స్వప్నప్రియే చేసిందన్న కోణంలో వచ్చిన కథనాల వెనుక టీఆర్‌ఎం రాజు తన ముఠాతో ఓ పథకం ప్రకారం తప్పుడు సమాచారం అందించడమే కారణమని తెలుస్తోంది. ఇప్పుడు రాజుకు సహకరించినవారిలో కొంతమంది ఎస్‌బీఐ సిబ్బందితో పాటు పదవీ విరమణ చేసినవారు కూడా ఉన్నారు. రాజుకు, వీరికి ఉన్న బంధమేమిటన్న దానిపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. మరోవైపు టీఆర్‌ఎం రాజును లోకల్‌ హెడ్డాఫీస్‌.. అంటే అమరావతికి సరెండర్‌ చేశారు. మరిన్ని వివరాలతో మరో కథనంలో కలుద్దాం.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page