top of page

అనుమతుల అక్రమాలు.. తెరవెనుక లీగల్ టైఅప్‌లు!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Jun 11
  • 2 min read
  • ప్రైవేట్ విద్యాసంస్థల్లో నిబంధనల ఉల్లంఘన

  • బోధన ఒకచోట.. పరీక్షలు మరోచోట

  • క్షేత్రస్థాయి పరిశీలనలు లేకుండానే కార్పొరేట్ పాఠశాలలకు అనుమతులు

  • కనీస సౌకర్యాలు కల్పించకపోయినా తగ్గని ప్రైవేట్ యాజమాన్యాల ఫీజుల బాదుడు

  • ప్రైవేట్ అధ్యాపకుల విద్యార్హతలు, బోధించే సబ్జెక్టులపై రికార్డులు శూన్యం

  • స్కూల్ బోర్డులు చూసి మోసపోతున్న పేరెంట్స్

  • పిల్లలను చేర్పించాక వైఫల్యాలు తెలిసినా సర్దుకుపోతున్న వైనం

  • విద్యార్థి సంఘాల పోరాటాలు - కాగితాలకే పరిమితమైన తనిఖీలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

జిల్లాలో ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో 402 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు నడుస్తున్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలగా గుర్తింపు తెచ్చుకొని, ఆ పై తరగతులు కూడా నిర్వహిస్తున్న విద్యాసంస్థలేవో జిల్లా విద్యాశాఖాధికారులకు తెలియదట. తమ వద్దకు ఏ స్థాయి పాఠశాలకు అనుమతులకు వచ్చారో ఆ స్థాయి లైసెన్స్ ఇచ్చిన తర్వాత అందులో అతిక్రమణలు ఉన్నాయని ఫిర్యాదులు వస్తే అప్ప్పుడు చర్యలు చేపడతారట. ఈ మొత్తం 402 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఎన్ని వాటికిచ్చిన అనుమతుల మేరకు నడుపుతున్నారో జిల్లా విద్యాశాఖ వద్ద రికార్డు లేదు. ఈ పని తల్లిదండ్రులదేనని పరోక్షంగా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కానీ సగటు పేరెంట్స్ పాఠశాల పబ్లిసిటీనో, లేదూ అంటే గత ఏడాది వచ్చిన రిజల్ట్‌ను బట్టో తమ పిల్లల్ని చేర్పిస్తుంటారు. కానీ ఆ స్కూల్‌కు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మాత్రమే అనుమతులు ఉన్నాయో, పదో తరగతి వరకు కూడా చెప్ప్పుకోవచ్చన్న వెసులుబాటు ఉందో తెలియదు. కాబట్టి ఫిర్యాదులు ఉండవు. సహజంగా పబ్లిక్ ఎగ్జామ్స్ జరిగినప్ప్పుడు కూడా సంబంధిత స్కూల్‌లోనే హాల్‌టిక్కెట్ జారీ చేస్తారు, లేదా ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోమంటారు. కానీ తెర వెనుక ప్రాథమిక పాఠశాల వేరే ప్రాథమికోన్నత పాఠశాలతో టైఅప్ పెట్టుకొని విద్యార్థులను పరీక్షలకు పంపుతున్నాయి. ఇవేవీ విద్యాశాఖకు తెలియవని భావించక్కర్లేదు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపైన, యÖనిఫాం, పుస్తకాల వ్యాపారం పైన ఎప్పటికప్ప్పుడు విద్యార్థి సంఘాలు ధర్నాలు చేస్తున్నాయి. కానీ ఏ రోజూ డీఈవో కార్యాలయం నుంచి ఈ మేరకు తనిఖీ జరిగినట్టు మనం చూడలేదు. బహుశా వారి రికార్డుల్లో ఆ మేరకు ఇన్‌స్పెక్షన్ జరిగినట్టు రాసుకొని ఉండొచ్చు. సాధారణంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో ప్రాథమిక పాఠశాలలంటూ ప్రత్యేకంగా లేవు. అన్నీ ప్రాథమికోన్నత పాఠశాలలే. అంటే పదో తరగతి వరకు ఇక్కడ నిరభ్యంతరంగా చదువుకోవచ్చని అర్థం. కానీ ఇందులో సగం స్కూళ్లకు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు నిర్వహించడానికే అనుమతులున్నాయి. ఎక్కడ చూసినా ప్రభుత్వ పాఠశాలలో చదివి పదో తరగతి పరీక్షలకు వెళ్తున్నవారికంటే ప్రైవేటు స్కూళ్ల నుంచి వెళ్తున్న విద్యార్థుల సంఖ్యే ఎక్కువ. ఇప్ప్పుడు ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడూ టెట్ పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలని కొత్త నిబంధన వచ్చిచేరింది. ఇందుకోసం ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పినదానికంటే ముందు టెట్ పాసవడం కోసం నానా కసరత్తు చేయాల్సివస్తోంది. ప్రైవేటు పాఠశాలల్లో చదువు చెబుతున్న ఉపాధ్యాయులకు టెట్ అవసరం లేదా? అనేదే ప్రధాన ప్రశ్న. ఎందుకంటే.. వీరు కూడా విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకు కేవలం భవనాలు ఉంటే చాలదని, ఆటస్థలాలు, తాగునీటి సౌకర్యాలతో పాటు బోధనా సిబ్బంది కూడా తగినంతమంది ఉండాలని ప్రభుత్వం చెబుతుంది. నిరంతరం మారుతున్న కాలానికనుగుణంగా పాఠం బోధించే ఉపాధ్యాయుడు కూడా మారాలని టెట్ పెట్టారు. మరి గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువులు చెబుతున్న గురువుల పరిస్థితి ఏమిటి? వేలాది ప్రైవేటు ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు టెట్ అర్హత లేదు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ లేకపోతే ఎలా కుదరదో ప్రైవేట్ ఉపాధ్యాయులకు కూడా టెట్ ఉండాలనే నిబంధన ఎందుకు పెట్టడంలేదన్నది కొందరి వాదన. అసలు ఎన్ని పాఠశాలలకు ఏ స్థాయి గుర్తింపు ఉంది? అక్కడ పని చేస్తున్న అధ్యాపకులు ఏం చదువుకున్నారు? ఏ సబ్జెక్ట్ చెబుతున్నారు? అనే లెక్కలేవీ విద్యాశాఖ దగ్గర ఉండవు. అడిగే తల్లిదండ్రులూ ఉండరు.

పాఠశాల తరగతులకు అనుమతి మంజూరు చేసిన తర్వాత ప్రతి ఏడాది రెన్యువల్ చేస్తూ ఉండాలి. రెన్యువల్‌ను నెల నుంచి ఆరు నెలల గడువు ఉంటుండగానే చేయిస్తుంటారు. రెన్యువల్‌కు దరఖాస్తు చేసే సమయంలో తరగతులు అప్‌గ్రేడ్ చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కలిగివున్నట్టు డిక్లరేషన్ ఇవ్వాలి. పాఠశాలలకు ఆటస్థలాలు, తాగునీటి సదుపాయం, సౌండ్ సర్టిఫికెట్, ఫైర్ సేఫ్టీ, అర్హత కలిగిన ఉపాధ్యాయులు, విశాలమైన తరగతి గదులు ఉన్నట్టు ఆయా శాఖల అధికారుల నుంచి ఎన్‌వోసీ ఉండాలి. ఇవన్నీ ఉంటే విద్యాశాఖ వాటిని పరిశీలించి పాఠశాలలో తరగతులు నిర్వహించడానికి అనుమతులు మంజూరు చేస్తుంటారు. ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు మంజూరు చేసే సమయంలో విద్యాశాఖ అధికారులు, ఇతర శాఖల అధికారులు మామూళ్ల మత్తులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కనీస సదుపాయాలు లేకపోయినా పాఠశాల నిర్వహించడానికి అవకాశాలు ఇస్తున్నారు. పాఠశాలలో పిల్లలు చేరిన తర్వాత యాజమాన్యాల వైఫల్యాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు సర్దుకుపోతున్నారు. పాఠశాలలకు ఆటస్థలాలు, తాగునీటి సదుపాయం, ఫైర్ సేఫ్టీ, అర్హత కలిగిన ఉపాధ్యాయులు, విశాలమైన తరగతి గదులు లేకుండానే పాఠశాలకు అనుమతులు ఇవ్వడం పట్ల తల్లిదండ్రుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. పాఠశాలలో విద్యార్ధులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించకపోయినా ఫీజుల విషయంలో ప్రైవేట్ యాజమాన్యాలు వెనక్కి తగ్గడం లేదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page