పోలీస్ సేవలను గ్రామస్థాయికి చేరాలి
డీఎస్పీ సిహెచ్ వివేకానంద్
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

గ్రామస్థాయిలో శాంతిభద్రతలకు భంగం కలిగించే వ్యక్తులు, పాత నేరస్థులు, అనుమానిత వ్యక్తులు కదలికలు, మద్యం, గంజాయి, నాటుసారా అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగం, క్రైమ్ ప్రదేశాలు, జూదం అసాంఘిక కార్యకలాపాల నిర్వహణ సమాచారాన్ని అందించాలని మహిళ పోలీసులకు డీఎస్పీ వివేకానంద్ సూచించారు. మంగళవారం ఆనందమయి ఫంక్షన్‌హాల్లో సచివాలయం మహిళా పోలీసులతో డీఎస్పీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వినాయక చవితి మండపాల ఏర్పాటు, నిమజ్జనం వివరాలు కమిటీ సభ్యులతో మాట్లాడి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలు జరిగేలా చూడాలన్నారు. ఉత్సవాల్లో గ్రామాల్లో అల్లరి సృష్టించే వ్యక్తుల వివరాలను ముందస్తుగా గుర్తించి సంబంధిత పోలీసు అధికారులకు ఇవ్వాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాల నిర్వహణపై సమాచారం అందించిన వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. అంకితభావంతో విధులు నిర్వర్తించి, ప్రజలకు, పోలీసులకు మధ్య వారధిగా వ్యవహరించి ప్రజా రక్షణకు, మహిళల భద్రతకు కృషి చేయాలన్నారు. నేర రహిత సమాజం కొరకు బాధ్యత, క్రమశిక్షణతో పని చేసి పోలీసు సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువెళ్లాలన్నారు. ప్రతిఒక్కరూ జాబ్‌రూల్స్ పాటిస్తూ ప్రతి విషయాన్ని సంబంధిత పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకొని ఎప్పటికప్పుడు సమస్యలను తెలుసుకొని స్థానిక పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. డొమెస్టిక్ వైలెన్స్, భూవివాదాలు, అసాంఘిక కార్యకలాపాలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జాతరలు, పండగల్లో నాటుసారా, గంజాయి క్రయవిక్రయాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకు తెలపాలని సూచించారు. మహిళలపై జరుగుతున్న నేరాలు, అసాంఘిక కార్యకలాపాల వల్ల కలిగే దుష్ప్రభావాలుపై అవగాహన కల్పించాలన్నారు.
ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తం
ఆన్‌లైన్ మోసాలు, సౖౖెబర్ నేరాల పట్ల ప్రజలకు అప్రమత్తం చేస్తూ అవగాహన కలిగించాలని ఒకటో పట్టణ సీఐ పైడపునాయుడు సూచించారు. ఓఎల్‌ఎక్స్, గిఫ్ట్ ఆఫర్ అంటూ ఆశ చూపి సైబర్ నేరగాళ్లు అనేక విధాలుగా మోసం చేస్తారని తెలిపారు. 1930 టోల్‌ఫ్రీ నెంబర్‌ను ప్రజల్లో విస్తృత ప్రచారం చేసి సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రణస్థలం సీఐ ఎం.అవతారం మాట్లాడుతూ కుటుంబ తగాదాలు కౌన్సిలింగ్‌తో నియంత్రించవచ్చన్నారు. రోడ్డు ప్రమాదాలు నియంత్రణకు రోడ్డు భద్రత నియమాలు, మైనర్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్ధాలు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. రెండో పట్టణ సీఐ వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గృహ సముదాయాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను నియంత్రించవచ్చని తెలిపారు. గ్రామాల్లో జరిగే దొంగతనాలు, ఆస్తినేరాలు, బైక్ అఫెండర్స్ చేసిన వ్యక్తులు కదలికపై వివరాలు తెలపాలని సూచించారు. పట్టణ శివారు ప్రాంతాల్లో యువకులు అనేకమంది గంజాయికి అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, అలాంటి వారిని గుర్తించి గ్రామాల్లో యువకులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సైలు కృష్ణప్రసాద్, వాసుదేవరావు, కృష్ణారావు సిబ్బంది పాల్గొన్నారు.
Comments