top of page

అనురాధ రిటర్న్స్..!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Apr 8
  • 1 min read
  • డైరెక్టర్ ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసిన కోర్టు

  • మళ్లీ శ్రీకాకుళం డీబీసీడబ్ల్యూవోగా నియమించాలని ఆదేశాలు

  • 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని డైరెక్టరేట్‌కు ఉత్తర్వులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిణిగా పని చేస్తున్న తనను ఏబీసీడబ్ల్యూవోగా రివర్ట్ చేసి, శ్రీకాకుళం నుంచి బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేయాలని హైకోర్టును ఆశ్రయించిన ఇ.అనురాధకు అనుకూలంగా కోర్టు స్టే ఇచ్చినట్లు తెలుస్తుంది. ఏబీసీడబ్ల్యూవోగా అన్నమయ్య జిల్లా పీలేరుకు బదిలీ చేస్తూ మార్చి 25న బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులును నిలుపుదల చేయాలని హైకోర్టులో మార్చి 31న 8624/26 నెంబరుతో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ శ్రీకాకుళం బీసీ సంక్షేమ శాఖ అధికారిగా కొనసాగించాలని, నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్‌కు ఆదేశించిందని భోగట్టా. కర్నూలులో విధులు నిర్వహిస్తున్న సమయంలో విచారణ చేపట్టిన ఏసీబీ సిఫార్సు మేరకు ఆమెపై క్రమశిక్షణా చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగా తాత్కాలికంగా పొందిన ఉద్యోగోన్నతిని రద్దు చేస్తూ మళ్లీ ఆమె పాత పోస్టింగ్‌కే పంపారు. బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్ మార్చి 25న ఉత్తర్వులు జారీ చేస్తే, కలెక్టరేట్ అధికారులు వారం రోజులు వేచిచూసి ఆమె హైకోర్టును ఆశ్రయించిన తర్వాత రోజు అంటే ఈ నెల ఒకటిన రిలీవ్ చేస్తూ, ఆమె స్థానంలో ఎస్‌సీ కార్పొరేషన్ ఈడీ వినాయకంకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అనురాధ అప్పటికే ఆ శాఖలో పనిచేసిన విశ్రాంత వార్డెన్లు, ప్రస్తుతం పనిచేస్తున్న వార్డెన్లతో శ్రీకాకుళంలో ఒక విశ్రాంత వార్డెన్ ఇంట్లో సమావేశమై న్యాయస్థానంలో సవాల్ చేయాలని నిర్ణయించారు. ఇందుకు కొందరు వార్డెన్లు ఆర్ధిక సహాయం కూడా చేశారని, ఆ మొత్తం డైరెక్టరేట్‌లో చెల్లించి కోర్టు ఉత్తర్వులు చెల్లుబాటయ్యే విధంగా చూసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. మళ్లీ ఇక్కడ డీబీసీడబ్ల్యూవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనకు సహకరించిన మాజీ, తాజా వార్డెన్లుకు అందలమెక్కిస్తానని హమీ ఇచ్చినట్టు తెలిసింది. కావాలనే కొందరు లీకులిచ్చి పత్రికల్లో వార్తలు రాయించారని, కక్షగట్టి శ్రీకాకుళం జిల్లా నుంచి సాగనంపే ప్రయత్నాలు చేశారని, వారిని వదిలిపెట్టనని డైరెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం సస్పెండ్ చేసిన వెంటనే వార్డెన్లు అందరికీ ఆమె తరఫున ఓ హెచ్చరిక వచ్చినట్లు చెబుతున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page