top of page

అప్పనంగా ఆయనకు అద్దె!

Writer: NVS PRASADNVS PRASAD
  • చల్లావారి సెల్లార్‌లో సచివాలయం

  • మున్సిపల్‌ నిబంధనలకు పూర్తి విరుద్ధం

  • అన్న ద్వారా మేనేజ్‌ చేసిన చల్లా శ్రీను

  • అధికారులు సైతం కన్నుచేరేసిన తీరు

  • సౌకర్యాలు లేక, పార్కింగ్‌కు చోటులేక ప్రజల ఇక్కట్లు

తమ్ముడు మనవాడైనా ధర్మమే చెప్పాలన్నాడు ధర్మరాజు భారతంలో. కానీ మన మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు మాత్రం తమ్ముడి కోసం ధర్మం తప్పినా తప్పు లేదన్నట్లు వ్యవహరించారు. దాని పర్యవసానమేమిటో ఎన్నికల ఫలితాల రూపంలో వెల్లడైంది. అయినా తన తమ్ముడి మీద అంత అసంతృప్తి ఎందుకుంది? ఇంతకీ ఆయనేం చేశాడు? అన్న అంశాల జోలికి ధర్మాన ఇప్పటికీ వెళ్లినట్లు కనిపించడంలేదని వైకాపా నాయకులే చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా పనుంటే తాను చేయలేనని నిర్మొహమాటంగా చెప్పే ధర్మాన ప్రసాదరావు తన తమ్ముడి విషయంలో ఎందుకు చూసీచూడనట్లు ఉన్నారూ అంటే.. దానికి ఎవరి వెర్షన్‌ వారికి ఉంది. కానీ జనం మాత్రం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయ పగ్గాలు ఆయన చేతిలో ఉండటం వల్ల తీవ్రమైన అవమానాలకు గురయ్యారు. ఆయన నిబంధనలకు విరుద్ధంగా తన షాపింగ్‌ కాంప్లెక్స్‌ సెల్లార్‌ను సచివాలయానికి ఆద్దెకివ్వడం వల్ల అవస్థల పాలయ్యారు.
(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

నగరంలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పక్కన ఉన్న పెన్‌ హాస్పిటల్‌ భవనం ధర్మాన సోదరుడు చల్లా శ్రీనుది. ఇది పూర్తిగా కమర్షియల్‌ కాంప్లెక్స్‌. ఈ కాంప్లెక్స్‌లో షాపులవారి పార్కింగ్‌ కోసం ఓ సెల్లార్‌ను నిర్మించారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను తీసుకురావడంతో వాటి ఏర్పాటుకు భవనాలు అవసరమయ్యాయి. ఇదే అదనుగా చల్లా కాంప్లెక్స్‌ సెల్లార్‌ను 19, 20 డివిజన్లకు సంబంధించిన సచివాలయానికి అద్దెకిచ్చేసిన చల్లా శ్రీను నెలకు రూ.13వేలు అద్దె తీసుకుంటున్నారు. వాస్తవానికి అపార్ట్‌మెంట్‌ కింద ఉండే స్టిల్ట్‌గానీ, షాపింగ్‌ కాంప్లెక్స్‌ల కింద ఉండే సెల్లార్లను గానీ పార్కింగ్‌కు మినహా మరో ప్రయోజనానికి ఉపయోగించకూడదని కచ్చితమైన నిబంధనలు ఉన్నాయి. కానీ ఇది చల్లా శ్రీనుకు లబ్ధి చేకూర్చే పని కావడంతో రెండు డివిజన్లకు సంబంధించిన సచివాలయంగా దీన్ని మార్చేసి ఇప్పటికీ అలానే కొనసాగిస్తున్నారు. పోనీ ఈ భవనమేమైనా అన్ని వసతులతో ఉందా? అంటే.. అదీ లేదు.

వర్షం వస్తే చెరువే

కేవలం పార్కింగ్‌ కోసం నిర్మించిన సెల్లార్‌కు షట్టర్లు వేసి సచివాలయంగా మార్చేశారు. పెన్‌ హాస్పిటల్‌ కింద ఉన్న ఈ కార్యాలయానికి వెళ్లాలంటే పది మెట్లు పాతాళంలోకి దిగాలి. వృద్ధులు, వికలాంగులు ఇందులోకి వెళ్లడం పూర్తిగా కుదరని పని. సెల్లార్‌ కావడంతో ప్రతి వర్షానికి సచివాలయం వరదనీటితో నిండిపోతుంది. ఆ నీటిని తోడిరచడానికి పంపుసెట్లు వాడుతున్నారు. మహిళా ఉద్యోగులకు కూడా కనీసం వాష్‌రూమ్‌లు ఇక్కడ లేవని తెలుస్తోంది. గాలి, వెలుతురు లేకుండా గొడౌన్‌లా ఉండే ఈ సెల్లార్‌లో పని చేయడం సిబ్బందికి కూడా కష్టంగానే ఉంది. 19, 20 డివిజన్ల పరిధిలో ప్రభుత్వానికి సంబంధించిన మరో భవనం లేదా? అంటే.. కచ్చితంగా ఉందనే సమాధానం వస్తుంది. ఈ డివిజన్‌లో కమ్యూనిటీ హాళ్లు, వైఎస్సార్‌ కల్యాణ మండపం, ఎన్టీఆర్‌ ఎంహెచ్‌ స్కూల్‌ వెనుక భాగంలో సచివాలయం ఏర్పాటుకు వెసులుబాటు ఉంది. కానీ ఖాళీగా ఉన్న సెల్లార్‌ నుంచి కూడా సొమ్ము దండుకోవాలన్న ఉద్దేశంతో చల్లా శ్రీను సచివాలయానికి దీన్ని అద్దెకు ఇచ్చేశారు. ప్రతి నెలా ఠంచనుగా అద్దె ఆయన ఖాతాలో పడిపోతుంది.

సెల్లార్‌లో కార్యాలయం.. రోడ్లపై పార్కింగ్‌

నగరంలో ఎవరైనా సెల్లార్‌లో వాచ్‌మెన్‌ గదిని నిర్మిస్తే ఊరుకునేది లేదంటూ కూల్చేసిన కార్పొరేషన్‌ సిబ్బంది టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పక్కనే, ఏడురోడ్ల జంక్షన్‌కు బెత్తుడు దూరంలోనే ఉన్న ఈ సెల్లార్‌లో ఏకంగా ప్రభుత్వ సచివాలయమే నడుస్తుంటే ఏం చేస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ రోడ్డు చిన్నది కావడం, పెన్‌ హాస్పిటల్‌, పుస్తకాల దుకాణాలు ఉండటంతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఇప్పుడు సచివాలయానికి వచ్చే వాహనాలు కూడా రోడ్డు మీదే నిలిపి ఉంచడం వల్ల ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. చల్లా శ్రీను తన మూడంతస్తుల భవన సముదాయంలో అద్దెకు ఉంటున్న వ్యాపారస్తుల వాహనాల పార్కింగుకు ఈ సెల్లార్‌ను కేటాయించాల్సి ఉంది. కానీ వారి పార్కింగ్‌ను రోడ్డుపైకి వదిలేసి సెల్లార్‌ను అద్దెకు ఇచ్చేశారు. రామలక్ష్మణ థియేటర్‌ పక్కన ఒక షాపింగ్‌ కాంప్లెక్స్‌ను రెనోవేషన్‌ చేసి మొదటి అంతస్తును స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు, 2, 3 అంతస్తులు జీషాన్‌ హోటల్‌కు అద్దెకిచ్చారు. ఇందుకోసం నిర్మాణంలో సెల్లార్‌ను ఉంచారు. కానీ హోటల్‌ పార్సిల్‌ సర్వీస్‌ కోసం ఈ సెల్లార్‌లో నిర్మాణాలు చేపట్టినప్పుడు నిర్మొహమాటంగా కూల్చేశారు. కారణం.. సెల్లార్‌ అనేది పార్కింగ్‌ కోసం మాత్రమే వాడాలనేది నిబంధన. అటువంటప్పుడు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పక్కనున్న పెన్‌ హాస్పిటల్‌ సెల్లార్‌ను ఎందుకు విడిచిపెట్టారో తెలుసుకోవడం పెద్ద విషయం కాదు. గత ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్‌ మొత్తాన్ని చల్లా శ్రీనే శాసించారు. ఆయన ఆజ్ఞల మేరకే అధికారులు పని చేశారు. అందుకే ఈ సచివాలయం జోలికి ఎవరూ వెళ్లలేదు.

Comentarios


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page