top of page

అప్పలరాజుకు అష్టదిగ్బంధనం!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • May 10, 2024
  • 3 min read
  • `నియోజకవర్గంలో శరవేగంగా మారుతున్న పరిణామాలు

  • `కీలకంగా మత్స్యకారులు, కాళింగులు, జనసేన ఫ్యాక్టర్‌

  • `ఇవే టీడీపీ అభ్యర్థికి శిరీషకు కలిసి వస్తున్న అంశాలు

  • ` గెలుపు ఖాయం అన్న స్థాయి నుంచి పడిపోయిన వైకాపా గ్రాఫ్‌


రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం గాలి వీస్తున్నట్లు కనిపిస్తోంది. దానికి అనుగుణంగానే శ్రీకాకుళం జిల్లాలో కూడా గెలుపు గుర్రాలని మొదటి నుంచి ప్రచారం జరుగుతున్న అభ్యర్థులు గత నాలుగు రోజులుగా వెనుకబడిపోయారు. ఇది కేవలం పబ్లిక్‌ టాక్‌ను పరిగణనలోకి తీసుకొని అందిస్తున్న కథనం మాత్రమే. జిల్లాలో మొన్నటి వరకు నలుగురు వైకాపా అభ్యర్థులు కచ్చితంగా గెలుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ నలుగురు వెనుకబడిపోయినట్లు క్షేత్రస్థాయి పరిశీలనలు చెబుతున్నాయి. జిల్లాలో ఎవరి పరిస్థితి ఎలా ఉన్నా పలాస నుంచి మంత్రి అప్పలరాజు గెలుపు ఖాయమన్న ప్రచారం మొదట్నుంచి జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఆయన ప్రచారం, నామినేషన్ల దాఖలు కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగాయి. అదే సమయంలో శిరీష నామినేషన్‌, ప్రచారాలు సోసోగా సాగడంతో ఆమె ఎక్కడా డబ్బులు తీయడంలేదని, అప్పలరాజు ధాటికి నిలబడలేరని, ఇక్కడ గెలుపు ఏకపక్షమని ప్రచారం జరిగింది. అయితే నాలుగు రోజుల క్రితం నుంచి సీన్‌ రివర్స్‌లా ఉంది. ఇంతవరకు మంత్రి అప్పలరాజుకు కనిపించింది వాపే తప్ప, బలుపు కాదని నిరూపించేలా టీడీపీ బలమైన ఎత్తులు వేస్తూ దూసుకుపోతోంది.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

 జిల్లాలో పలాస అభ్యరి విషయాన్ని తెలుగుదేశంలో చివరి వరకు తేల్చలేదు. చివరి జాబితాలోనే గౌతు శిరీష పేరు ప్రకటించడంతో మొదట్లో ఆమె వెనుకబడ్డారు. దానికి తోడు పెద్ద ఎత్తున ప్రచార పర్వం జరగకపోవడంతో శిరీష కనీస పోటీ ఇవ్వలేరని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు నియోజకవర్గంలో పరిస్థితి మారిందని, టీడీపీ అభ్యర్థి గెలుస్తారని చాలమంది చెబుతున్నారు. పలాస నియోజకవర్గంలో వజ్రపుకొత్తూరు మండలమే కీలకం. ఇది వైకాపా అభ్యర్థి సీదిరి అప్పలరాజు సొంత మండలం. అయితే ఇక్కడ ఓటరు మొదట్నుంచి టీడీపీ మైండ్‌సెట్‌తోనే ఉంటున్నట్టు గతంలో జరిగిన ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. ఇదే మండలంలోని దేవునల్తాడ గ్రామం మంత్రి సొంతూరు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి శిరీష కొద్దిరోజుల క్రితం నిర్వహించిన ప్రచారానికి భారీ స్పందన లభించింది. దీంతో అక్కడ వైకాపా, టీడీపీ కార్యకర్తలు ఘర్షణ కూడా పడ్డారు. మంత్రి ఇలాఖాలో ఘన స్వాగతం లభించడమే ఆమె ఒకడుగు ముందున్నారన్న పాజిటివ్‌ సంకేతం పంపించింది. దీనికితోడు అమలపాడులో మాజీ జెడ్పీటీసీ దున్న వీరాస్వామితో పాటు మరికొందరు సీనియర్‌ నేతలు వైకాపాకు దూరంగా ఉన్నారు. అన్నింటికీ మించి నువ్వలరేవు అప్పలరాజుకు సామాజికవర్గపరంగా పెద్ద ఓటుబ్యాంకు. అయితే ఇక్కడ కూడా ఆయనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. నాలుగువేల ఓట్లు ఉన్న నువ్వలరేవులో ఏడాది క్రితం బీటెక్‌ చదువుతున్న ఓ విద్యార్థి ఎచ్చెర్లలోని ఒక ఇంజినీరింగ్‌ కాలేజీ హాస్టల్‌ నుంచి మాయమై మూడు రోజుల తర్వాత రణస్థలం తోటల్లో శవమై కనిపించాడు. దీనిపై నువ్వలరేవు గ్రామస్తులు పెద్ద ఎత్తున కళాశాల ముందు నిరసనకు దిగారు. ఈ వ్యవహారంలో మంత్రి అప్పలరాజు కళాశాల యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరించారన్న భావన నువ్వలరేవు గ్రామస్తుల్లో ఉంది.

కమ్ముకుంటున్న జనసేన, కాళింగ సేన

ఇది కాకుండా ఇక్కడ యువకులు పూర్తిస్థాయిలో జనసేనకు పని చేస్తున్నారు. ఇది కూడా గౌతు శిరీషకు కలిసొచ్చే అంశం. ఈ నియోజకవర్గంలో మత్స్యకారుల ఓట్లు 19.32 శాతం ఉన్నాయి. ఇందులో ఎన్ని తెగలు ఉన్నా మంత్రి అప్పలరాజు ఇదే సామాజికవర్గానికి చెందినందున ఈ ఓటు ఆయనకే పడాలి. కానీ అప్పలరాజు స్వయంకృతం వల్ల వజ్రపుకొత్తూరు మండలంలో ఉన్న ఈ ఓటుబ్యాంకులో పెద్ద ఎత్తున చీలిక మొదలైంది. మొదట్నుంచి మత్స్యకారులు టీడీపీతో ఉండటం ఒక ఎత్తయితే, ఇప్పుడు జనసేన కలిసిరావడం, అప్పలరాజు చేజేతులా చేసుకున్న పనుల వల్ల ఇక్కడ ఓటు భారీగా చీలిపోతుంది. ఇక పలాసను రెండు పార్టులుగా చూడాలి. అందులో ఒకటి ఉద్దానం, రెండోది పల్లం. ఉద్దానంలో జీడి రైతులు జీడిపిక్కల మద్దతు ధర కోసం మూడేళ్లకు పైగా పోరాడుతున్నారు. రూ.16వేలు ఉండే ధర రూ.7వేలకు పడిపోయిందని, దీనిపై మంత్రి చొరవ తీసుకోవాలని అనేకమార్లు విన్నవించారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఉద్దానం ప్రాంతంలో ఉన్న జీడి రైతులు, ఈ పరిశ్రమల మీద ఆధారపడిన కార్మికులు ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారు. ఇక పల్లం ప్రాంతానికి వస్తే.. ఇక్కడ కాపు, కాళింగ కులాలదే డామినేషన్‌. నియోజకవర్గంలో కాళింగులు 14.36 శాతం, తూర్పుకాపులు 13.50 శాతంతో దాదాపు సమానంగా ఉన్నారు. కాపులపై పవన్‌కల్యాణ్‌ పార్టీ జనసేన ప్రభావం కనిపిస్తోంది. ఇక కాళింగులు ఎప్పుడో మంత్రికి దూరమైపోయారు. అసలు ఈ ఎన్నికల్లో అప్పలరాజుకు టికెటివ్వకూడదని ఉద్యమం నడిపిందే కాళింగులు. ఇక ఆయనతో ఉన్న కీలక కాళింగ నేతలు పార్టీ మారకపోయినా అప్పలరాజు గెలుపు కోసం పని చేయడంలేదు. వీరిలో మాజీ జెడ్పీటీసీ వడిశ హరిప్రసాద్‌, మాజీ పీఏసీఎస్‌ అధ్యక్షుడు దువ్వాడ శ్రీధర్‌లు ప్రముఖులు. ఇక పలాస`కాశీబుగ్గ టౌన్‌లో గత నెల చివరి వరకు అప్పలరాజు చాలా బలంగా కనిపించారు. ఇక్కడ మంత్రిని విభేదించి సీనియర్‌ వైకాపా నాయకుడు దువ్వాడ శ్రీకాంత్‌ పార్టీ మారినా దాని ప్రభావం లేదని నిరూపించడం కోసం మంత్రి గట్టిగానే పని చేశారు. కాకపోతే మేడే రోజు జరిగిన కార్మికుల ర్యాలీతో దువ్వాడ శ్రీకాంత్‌ పట్టణంలో కథంతొక్కారు. దీంతో మున్సిపాలిటీ పరిధిలో కార్మిక వర్గం కూడా వైకాపా అభ్యర్థితో లేదన్న మెసేజ్‌ వెళ్లిపోయింది. అలాగే పట్టణ వైశ్య సంఘం అధ్యక్షుడు కోట్ని దుర్గాప్రసాద్‌ కూడా ఇటీవలే టీడీపీ గూటికి చేరిపోయారు.

మందసలో కాంగ్రెస్‌ ప్రతిబంధకం

ఇక మంత్రికి మిగిలింది పెద్ద సంఖ్యలో ఓట్లు వస్తాయని భావిస్తున్న ఏకైక మండలం మందస. అయితే ఇక్కడ కాళింగులు ఒక వ్యూహం మేరకు మాజీ పీసీసీ అధ్యక్షుడు మజ్జి తులసీదాస్‌ కుమారుడు మజ్జి త్రినాథ్‌బాబును కాంగ్రెస్‌ అభ్యర్థిగా రంగంలోకి దించారు. కాంగ్రెస్‌ పార్టీయే వైకాపాగా అవతరించడం వల్ల ప్రతిచోటా కాంగ్రెస్‌ ఓటుబ్యాంకు వైకాపా అభ్యర్థికి బదిలీ అవుతుండేది. అలా జరగకుండా మంత్రి వెనుక ఉన్న కాళింగుల ఓట్లను చీల్చడానికి పెద్ద కుటుంబానికి చెందిన మజ్జి త్రినాథ్‌బాబును అడ్డు పెట్టారు. ఈయన కాళింగ, ఎస్టీ ఓట్లను చీల్చగలిగితే అవి కచ్చితంగా అప్పలరాజువే అయివుంటాయి. ఇది కాకుండా మాజీ ఎంపీపీ కొర్ల కన్నారావు లాంటి బలమైన నాయకులతో పాటు మకరజోల, తదితర గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు టీడీపీ గూటికి చేరిపోయారు. ఈ పరిస్థితులు చూస్తుంటే అప్పలరాజు వెనుకబడిపోయారని అర్థమవుతుంది. ఇక మొన్నటి వరకు శిరీషకు పోల్‌ మేనేజ్‌మెంట్‌కు మనుషులు లేరనే ప్రచారం జరిగిన చోట వైకాపాలో గతసారి బూత్‌లు ఆర్గనైజ్‌ చేసినవారు, టీడీపీ నాయకులు కలిసికట్టుగా పని చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో జరుగనున్న ఎన్నికల ఫలితాలు మాత్రమే ఏ విషయానైనా స్పష్టం చేయగలవు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page