top of page

అప్పుడే నయం!

Writer: ADMINADMIN
  • గతంలో బురద, నీరు ఉన్నా కాలువలపై వెళ్లే పరిస్థితి

  • ప్రస్తుతం షిల్ట్‌వేత పేరుతో కాలువ పలకలు విరగ్గొట్టిన వైనం

  • పలకల మధ్య దూరం.. గోతుల మయం

  • వాహనచోదకులు, పాదచారులకు గాయాలు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

చిన్న పిట్టకథ: పూర్వం పంచాయితీ జరిగే చెట్టు పైన ఓ కాకి ఉండేదట. అది ఎప్పుడూ కింద పంచాయితీ పెద్దల నెత్తిన రెట్ట వేసేదట. ప్రతిఒక్కరూ ఆ కాకిని తిడుతూవుండేవారు. కొద్దికాలం తర్వాత ఆ కాకి తన పిల్లతో అందరి నోటా తాను మంచిదాన్నని చెప్పించాలని చివరి కోరిక కోరి చచ్చింది. అసలే అందరూ తన తల్లిని అసహ్యించుకొని తిడుతున్న నేపధ్యం. మరి మంచిదానిగా వారి నోట ఎలా చెప్పించాలా అని పిల్లకాకి ఆలోచించింది. అప్పుడు దానికో ఆలోచన వచ్చింది. పంచాయితీ పెద్దలు కూర్చున్నప్పుడు చెట్టు పైనుంచి వారిమీద చిన్న కర్రపుల్ల వేసేదట. వారు నోరప్పగించి పైన చూసేసరికి సరిగ్గా వారి నోట్లో రెట్ట వేసేదట. అప్పుడు అక్కడి పెద్దలు దీని మీద తల్లే నయం అని అన్నారుట.

.. ప్రస్తుతం కాలువల పరిస్థితి ఈ పిట్టకథ మాదిరిగా తయారైంది. గతంలో కాలువలు నిండిపోయి నీరు, మురికి రోడ్లపై ప్రవహించినా ప్రయాణీకులు ముడుకు లోతు నీళ్లలో బండిపైన గాని, నడుచుకొని గాని భయం లేకుండా వెళ్లేవారు. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చీరాగానే కోటి రూపాయలకు కొందరు కాంట్రాక్టర్లకు కాలువల్లో షిల్ట్‌ తీత పనులు అప్పగించింది. వారు డబ్బులిచ్చిన ఇళ్ల దగ్గర సొంత పనిలా పలకలు తొలగించి, ఎవరూ డబ్బులివ్వనిచోట, ప్రశ్నించనిచోట పలకలు, రోడ్డు విరగ్గొట్టేశారు. పోనీ కాలువల్లో షిల్ట్‌ అయినా పూర్తిగా తీశారా.. అంటే అదీ లేదు. ఇప్పుడు అటుగా వెళ్లాలంటే టూవీలర్స్‌పై వెళ్లేవారు రిమ్ములు పాడవడమే కాకుండా అప్పుడప్పుడు కాలువల దగ్గర పడిపోతున్నారు. ఇక పాదచారుల సంగతి చెప్పక్కర్లేదు. చిన్నపాటి వర్షం వచ్చినా కాలువేదో, త్రోవ ఏదో తెలియక పలకల మధ్య ఖాళీల్లో కాలు ఇరుక్కుపోయి విరిగిన సందర్భాలు ఉన్నాయి. కోటి రూపాయలు ఖర్చుపెట్టి తమను ఆసుపత్రులపాలు చేస్తున్నారంటూ ప్రయాణీకులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా పలకలు విరిగినచోట కొత్తవి ఏర్పాటుచేయడమో, లేదా కనీసం దూరం దూరంగా చిందరవందరగా వేసిన పలకలను కనీసం సరిచేయాలని కోరుతున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page