top of page

అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయేం?

Writer: NVS PRASADNVS PRASAD
  • నిమ్మవారి పాలనపై రాయడానికి చేయి రాని మీడియా

  • ఇప్పుడు వర్సిటీ మీద పరిశోధనకు ఉత్సాహం

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

నిమ్మ వెంకట్రావు స్థానిక వర్సిటీకి వీసీగా వ్యవహరించిన మూడేళ్లు జరిగిన అక్రమాలు, అన్యాయాలు, ఆర్థిక అవకతవకలపై ప్రశ్నించడానికి, రాయడానికి ముందుకురాని కుహనా మేథావులు, జర్నలిస్టులు ఇప్పుడు వర్సిటీపై పరిశోధనాత్మక కథనాలు రాయడానికి ఉవ్విళ్లూరిపోతున్నారు. జగన్మోహన్‌రెడ్డి పాలనలో చిన్నపాటి తప్పు జరిగినా భూతద్దంలో చూపడానికి ప్రయత్నించిన ఒక వర్గం మీడియా వర్సిటీ పూర్తిగా భ్రష్టుపట్టుకుపోయినా అందుకు సంబంధించిన ఆధారాలన్నీ మీడియాకు సోషల్‌ యాక్టవిస్టులు అందించినా రాయడానికి సాహసించనివారు ఇప్పుడు మాత్రం వర్సిటీలో ఏదో జరిగిపోతోందని గగ్గోలు పెడుతున్నారు. సాక్షి మీడియా అయితే వర్సిటీకి వ్యతిరేకంగా రాస్తే జగన్మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా రాసినట్టేనని భావించింది. కానీ నిమ్మ వెంకట్రావు పాపాలు అప్పటి ప్రభుత్వానికి శాపాలుగా మారుతాయని భావించలేకపోయింది. దీనివల్ల పెద్ద నష్టమే జరిగిపోయింది. కోట్లకు కోట్లు కలెక్ట్‌ చేసుకుపోయిన నిమ్మ వెంకట్రావు జోలికి వెళ్లడానికి భయపడిన వీరంతా ఇప్పుడు వర్సిటీలో అధికారుల పెట్రోల్‌ ఖర్చులు తడిపి మోపెడవుతున్నాయని గగ్గోలు పెడుతున్నారు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం ప్రభుత్వ కారుపై అప్‌ అండ్‌ డౌన్‌ చేస్తున్న వర్సిటీ అధికారులు నిబంధనలను దాటి బిల్లులు పెట్టుకుంటున్నారని బాధపడిపోతున్నారు. ఇందుకు కారణాలేంటనేది మరో సందర్భంలో ప్రస్తావించుకున్నా నిమ్మ వెంకట్రావు చేసిన కోట్లాది రూపాయల కుంభకోణాల్లో కేవలం ట్రాన్స్‌పోర్ట్‌కు సంబంధించిన విషయాన్నే ఇక్కడ ప్రస్తావించుకుందాం. 2021 నవంబరు 29న రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల వీసీలతో విజయవాడలో సమావేశం నిర్వహిస్తే, దానికి అప్పటి వీసీ నిమ్మ వెంకట్రావు విమానంలో వెళ్లారు. కానీ ఆయన వాహనం శ్రీకాకుళం వర్సిటీ నుంచి విజయవాడకు ఉత్తినే ఊరేగి వెళ్లింది. గ్రేడ్‌`1 డ్రైవర్‌గా పని చేస్తున్న జనార్థనరావు నిమ్మవారు గాలిలో వెళితే.. తాను రోడ్డు మీద వెళ్లానని, ఆయన్ను విజయవాడలో తిప్పడానికి 12,234 రూపాయలు ఖర్చయిందని, దాన్ని ఇప్పించాల్సిందిగా అప్పటి రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. 29న మీటింగ్‌ అయితే, 28న వేహికల్‌ నెంబరు ఏపీ 30 ఏబీ 8289 వాహనంలో జనార్థనరావు ఇక్కడి నుంచి బయల్దేరారు. రోడ్డు మార్గంలో వెళ్తున్నందున శ్రీకాకుళంలో గోల్డెన్‌ టైర్‌వర్క్స్‌ వద్ద టైర్లు చెక్‌ చేయడానికి రూ.600, విజయవాడలో ఆయిల్‌ నింపినందుకు రూ.5,253, త్రోవలో భోజనం చేసినందుకు రూ.200, మళ్లీ రిటర్న్‌లో యలమంచిలి వద్ద ఆయిల్‌ నింపినందుకు రూ.2,580, నిమ్మ వెంకట్రావు స్టార్‌ హోటల్‌లో ఉంటే తాను మామూలు లాడ్జిలో ఉన్నానని, దానికి రూ.2,400తో పాటు డీఏ రూ.1200 చెల్లించాలని కోరుతూ మొత్తం రూ.12,234కు బిల్లు మంజూరు చేయించుకున్నారు. ఇందులో జనార్థన్‌ తినేయడానికి ఏమీ లేకపోవచ్చు. కానీ నిమ్మవారు విమానంలో వెళ్లినప్పుడు రోడ్డు మీద నుంచి ఆయన వాహనాన్ని ఇక్కడి నుంచి ఎందుకు రప్పించుకున్నారో అప్పట్లో మేథావులు, ఆయనపై ఈగ వాలనివ్వకుండా కాపాడిన సోకాల్డ్‌ జర్నలిస్టులు రాసివుంటే బాగుండేది. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో వీసీలు, అప్పటి రిజిస్ట్రార్‌లు చేసిన అనేక అక్రమాలను ‘ఈనాడు’ ఎక్కడికక్కడ వెలికితీసింది. కానీ శ్రీకాకుళంలో మాత్రం అది జరగలేదు. నిమ్మ వెంకట్రావు ఏం చేశారు, ఎంత చేశారన్నది పక్కన పెడితే సొమ్ములు ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టడంలో ఇంతవరకు నిమ్మ వెంకట్రావును మించినవాడు యూనివర్సిటీకి రాలేదు. ఆయన పని చేసిన మూడేళ్లలో కేవలం మూడు నెలల కాలపరిమితికే రూ.1,28,464 జీడిపప్పును కొనుగోలు చేశారు. అదే మూడు నెలల కాలానికి రూ.3,89,170 భోజనాల కింద ఖర్చు చేశారు. ఇదే 90 రోజులకు రూ.7,26,522 రవాణా ఖర్చుల కింద విత్‌డ్రా చేశారు. వీటి దేనిపైనా ఎప్పుడూ ఎవరూ నోరు మెదపలేదు. కనీసం వీసమంత వార్త ప్రధాన పత్రికల్లో రాలేదు. కానీ ఇప్పుడు నెలకు రూ.60వేల వరకు వాహనాల ఆయిల్‌కు ఖర్చు చేయొచ్చనే నిబంధనలు మీరి వర్సిటీ అధికారులు వాహనాలు తిప్పేస్తున్నారని గగ్గోలు పెట్టేస్తున్నారు. ఫ్లెక్సీలు కట్టామని 1,88,995 రూపాయలు ఖర్చుల కింద చూపించారు. ఇందులో ఏ ఒక్కదానికీ లెక్కాపత్రం లేదు. సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగినా ఒక్క రోజు కూడా అప్పటి రిజిస్ట్రార్‌ సీహెచ్‌ఏ రాజేంద్రప్రసాద్‌ సమాధానమివ్వలేదు. తాను వీసీ నిమ్మ వెంకట్రావు అడుగులకు మడుగులొత్తడానికి వచ్చాను కానీ పబ్లిక్‌ సర్వెంట్‌ను కాదనే తీరుతోనే వ్యవహరించారు. ఇంత సొమ్ము ఒక్క మూడు నెలల్లోనే ఖర్చయితే అది ఏ పద్దు కింద రాశారో కూడా రాజేంద్రప్రసాద్‌ చెప్పలేకపోయారు. 2022లో జరిగిన రెండో కాన్వొకేషన్‌ కోసం ఖర్చు జరిగిందని ఒకరు చెబితే, కాదు కాదు విజయవాడలో జరిగిన 16వ ఈసీ మీటింగ్‌కని మరికొందరు, కాదు కాదు 18వ ఈసీ మీటింగ్‌ అని ఇంకొందరు చెప్పారు తప్ప, అసలు ఇంత ఖర్చు దేనికి అయిందో చెప్పలేదు. ఇక నిమ్మ వెంకట్రావు, అప్పటి రిజిస్ట్రారే కాకుండా ఆయన వందిమాగదుల కోసం ఎంత ఖర్చు పెట్టారో చెప్తే ఇప్పుడు చాలామందికి గుండె ఆగిపోతుంది. మూడేళ్లపాటు ఉన్నత విద్యను భ్రష్టుపట్టించి తన శిష్యుడ్ని కాపాడుకోవడం కోసం ఎంతోమంది జీవితాలతో ఆడుకున్న నిమ్మ వెంకట్రావును ప్రశ్నించడానికి లేవని నోళ్లు ఇప్పుడు ఆ పాప ప్రక్షాళనకు పూనుకొంటున్న కొందరిపై మాత్రం లేవడం విడ్డూరం. తప్పు ఎవరు చేసినా తప్పే. దాన్ని సమర్ధించడమూ తప్పే. కానీ నిమ్మ వెంకట్రావు చేసిన పాపాలు కూడా రాసుంటే ఇప్పుడు దేన్నయినా ప్రశ్నించే నైతిక హక్కు ఉండేది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page