అబుదాబీలో అష్టకష్టాలు
- BAGADI NARAYANARAO

- May 28
- 2 min read
పనికి వెళ్లి ఇరుక్కుపోయిన గారవాసి
పాస్‌పోర్టు ఇవ్వని షా ఎమిరేట్స్ పైప్స్ మ్యానిఫ్యాక్చరింగ్ కంపెనీ
కేంద్రమంత్రి ఫోన్ చేసినా న్యాయం జరగలేదని బాధితుడు గగ్గోలు
‘సత్యం’కు వాట్సాప్‌లో గోడు వెల్లబుచ్చుకున్న సత్యనారాయణ

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
గార మండలం అంపోలు పంచాయతీ లింగాలవలసకు చెందిన పొట్నూరు సత్యనారాయణ గుప్తా అబుదాబీలో చిక్కుకున్నారు. గుప్తా పని చేస్తున్న సంస్థ ఆయన్ని ఉద్యోగం నుంచి తొలగించడంతో స్వదేశానికి రావడానికి నెలరోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. దీంతో గురువారం ‘సత్యం’ ప్రతినిధికి ఆయన వాట్సాప్ కాల్ చేసి జిల్లాలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం దృష్టికి తన గోడును తీసుకువెళ్లాలని కోరారు. ఆయన చెప్పిన వివరాల మేరకు..
కంపెనీ యాజమాన్యం స్వాధీనంలో ఉన్న పాస్‌పోర్టును ఇవ్వకుండా వేధిన్నారు. పాస్‌పోర్టు ఇవ్వడానికి 4వేల దిర్హమ్స్ డిమాండ్ చేయడంతో బాధితుడు ఇవ్వలేనని చేతులెత్తేశాడు. కనీసం 2వేల దిర్హమ్స్ ఇవ్వాలని కంపెనీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. వారు కోరినంత మొత్తం ఇవ్వనందుకు పాస్‌పోర్టు ఇవ్వడానికి యాజమాన్యం నిరాకరించింది. పాస్‌పోర్టు ఇచ్చినా స్వదేశానికి రావడానికి విమాన టికెట్ కొనుగోలు చేయడానికి డబ్బులు లేవని బాధితుడు ‘సత్యం’తో తన బాధను పంచుకున్నారు. నెల రోజుల వేతనం 800 దిర్హమ్స్‌తో పాటు ఓవర్ టైంగా అందాల్సిన 700 దిర్హమ్స్ ఖాతాలో జమ చేయలేదని బాధితుడు తెలిపారు. స్వదేశానికి వెళ్లడానికి బకాయి వేతనం చెల్లించాలని కోరితే 2వేల దిర్హమ్స్ చెల్లిస్తేనే పాస్‌పోర్టు ఇస్తామని కంపెనీ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారని బాధితుడు చెబుతున్నాడు. రెండేళ్ల కోసం ఉద్యోగంలో చేరిన గుప్తాను ఏడాది కాలపరిమితికే కంపెనీ యాజమాన్యం కాంట్రాక్టు కుదుర్చుకుంది. కానీ ఏడు నెలల్లోనే తొలగించారు. మానసికంగా తీవ్ర ఇబ్బంది పడుతున్న సత్యనారాయణకు ఇప్పటికే హార్ట్ ఎటాక్ వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం అబుదాబీలోని ఆల్‌రహ విలేజ్‌లోని చెయిన్ క్యాంప్‌లో ఉన్నట్టు బాధితుడు ‘సత్యం’కు వివరించాడు. గుప్తా 10 మందితో కలిసి ఒకే గదిలో ఉంటున్నట్టు చెబుతున్నాడు. గదిలో ఉన్నవారు ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నట్టు బాధితుడు వివరించాడు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి స్వదేశానికి తీసుకురావాలని బాధితుడు సత్యనారాయణ కోరుతున్నాడు. ఆయనతో పాటు కంచిలి మండలం నారాయణపుట్టుగకు చెందిన బి.చంద్రశేఖర్‌ను విధులు నుంచి అర్ధాంతరంగా తొలగించినట్టు ‘సత్యం’కు వివరించాడు. దీంతో బాధితుడు అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చేరినట్టు సత్యనారాయణ గుప్తా తెలిపారు.
సత్యనారాయణ గుప్త నరసన్నపేటలోని మారుతీనగర్ లో భార్య పిల్లలతో అద్దె ఇంట్లో ఉంటూ
పళ్లు, పూలు తోపుడు బండిపై విక్రయించేవాడు. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. ఆ సమయంలోనే దుబాయ్ వెళ్లాలని నిర్ణయించుకొని కోటబొమ్మాళిలోని శ్రీరామ వెల్డింగ్ ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకుడు ఎం.శ్రీను అనే ఏజెంట్‌ను సంప్రదించాడు. దుబాయ్ పంపించేందుకు రూ.70 వేలు ఖర్చవుతుందని చెప్పడంతో ఆ మొత్తాన్ని శ్రీను చేతిలో పెట్టి అబుదాబీలో పెయింటర్ అసిస్టెంట్‌గా షా ఎమిరేట్స్ పైప్స్ మ్యానిఫ్యాక్చరింగ్ కంపెనీలో గత ఏడాది ఆగస్టు 27న ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో చేరిన రోజునే బాధితుడు నుంచి కంపెనీ యాజమాన్యం పాస్‌పోర్టును స్వాధీనం చేసుకుంది. బాధితుడు సత్యనారాయణ పెయింటర్ సహాయకుడుగా చేరడంతో ఆయన్ని పెయింటింగ్‌కు సంuంధించిన పనిలో కార్మికుడిగా విధులను అప్పగించారు. పనిలో చేరిన కొన్ని రోజుల తర్వాత ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో డ్యూటీ మార్చమని సత్యనారాయణ గుప్తా కోరారు. దీంతో ఆయన్ని స్టిక్కరింగ్, వాటర్ సర్వీసింగ్, కటింగ్ పనిలోకి మార్చారు. అక్కడ పనిలో చేరిన కొన్ని రోజులకే తిరిగి పాత డ్యూటీలోకి మార్చేశారు. దీంతో సత్యనారాయణ పాత స్థానంలో చేరడానికి నిరాకరించాడు. దీంతో ఆయనపై కొన్ని అభియోగాలు మోపి ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నట్టు ఆయనతో బలవంతంగా సంతకం చేయించుకున్నట్టు గుప్తా ‘సత్యం’కు వివరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో కంపెనీ ప్రతినిధుల ఒత్తిడితో సంతకం చేసినా తర్వాత నెల రోజుల వేతనాన్ని నిలుపుదల చేసి పాస్‌పోర్టును అంటిపెట్టుకున్నారు. టికెట్‌కు డబ్బులు లేక స్వదేశానికి రావడానికి అష్టకష్టాలు పడుతున్నారు. బాధితుడు తన బాధను తండ్రి, తమ్ముడుకు తెలియపరిచి వారి ద్వారా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది. దీనిపై స్పందించిన రాము కంపెనీ యాజమాన్యంతో ఫోన్‌లో మాట్లాడినట్టు తెలిసింది. కేంద్రమంత్రి రాము అబుదాబీలో కంపెనీ యాజమాన్యంతో మాట్లాడినా పాస్‌పోర్టును వెనక్కు ఇవ్వలేదని బాధితుడు ‘సత్యం’కు వివరించారు.






Comments