
ఏపీ హైకోర్టుకు రెండు రోజులు సెలవులు ప్రకటించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సూచిం చారు. ఆ మేరకు మంగళవారం సాయంత్రం ఆమె హైకోర్టు రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. భారీ వర్షాలు, వరద లే దీనికి కారణమని వేరేగా చెప్పక్కర్లేదు. కలెక్టరే హైకోర్టుకు సెలవులు ప్రకటించారని సూచించారంటే ఆ ప్రాంతంపై వరదల ఎఫెక్ట్ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకూ రాష్ట్ర హైకోర్టు ఎక్కడుం దంటే.. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ఆధునిక రాజధానిగా తీర్చిదిద్దుతామని తెలుగుదేశం సర్కారు చెబుతున్న అమరావతిలోనే! అంటే అమరావతి ప్రాంతాన్ని వర్షాలు, వరదలు తీవ్రంగా దెబ్బతీశాయని ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. చాలా పత్రికలు, టీవీల్లోనూ ఆ ప్రాంతంలో జరిగిన నష్టాల గురించి, ముంపు ప్రాంతాల్లో కష్టాల గురించి ఫొటోలతో సహా వార్తలు వస్తున్నాయి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం అదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేస్తున్నారు. కావాలని చేస్తున్న దుష్ప్రచారమని ఖండిస్తూ.. ఆ విధంగా వార్తలు రాసేవారిపైనా, ప్రచారం చేసే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. ఆయన వైఖరి ఇప్పుడు విమర్శల పాలవుతోంది. భారీ వర్షాలకు ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాలు తీవ్రం గా దెబ్బతిన్నాయి. విజయవాడ నగరంతో సహా ఇంకా చాలా ప్రాంతాలు వరద ముట్టడిలోనే ఉన్నాయి. విజయవాడ నగరంలో స్వయంగా సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ పర్యటనలు జరుపుతున్న చంద్రబాబు కు సైతం ఆ విషయం తెలుసు. అదే రీతిలో గుంటూరు, విజయవాడ మధ్యలో ఉన్న రాజధాని అమరావతి ప్రాంతం కూడా వరద గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. దానికి ప్రత్యక్ష నిదర్శనం రాష్ట్ర హైకోర్టే. హైకోర్టు భవనంలోని చాలా గదుల్లోకి వరద నీరు ప్రవేశించడం, పైకప్పులు కారిపోతుండటంతో విధులకు హాజరైన ఉద్యోగులు ఫైళ్లు తడిసిపోకుండా తాము కూర్చునే కుర్చీల్లోనే పెట్టి, వారు మాత్రం నిలువుకాళ్ల జపం చేయాల్సి వచ్చింది. ఇక హైకోర్టులో సోమవారం కేసుల విచారణలు ప్రారంభమైనా పరిస్థితులు అను కూలించక మధ్యలోనే వాటిని వాయిదా వేసి జడ్జిలు, న్యాయవాదులు తిరుగుముఖం పట్టారు. పరిస్థితిని గుర్తించి ఆన్‌లైన్ విచారణలు జరపాలని నిర్ణయించారు. కానీ వర్షాలు ఇంకా అడపాదడపా పడుతుండటం, అమరావతి పరిధిలో కరకట్ట రోడ్డు మొత్తం దెబ్బతింది. రాష్ట్ర సచివాలయం, హైకోర్టుకు వెళ్లే మార్గాలన్నీ వరద తాకిడితో కోతకు గురయ్యాయి. వాటితో పాటు అమరావతి పరిధిలోని దాదాపు అన్ని రోడ్లు నాశన మయ్యాయి. తుళ్లూరు, మందడం, వెంకటాయపాలెం, వెలగపూడి తదితర సీఆర్‌డీఏ గ్రామాల దారులన్నీ మూసుకుపోయాయి. అంతేనా.. కరకట్టపైనే ఉన్న సీఎం చంద్రబాబు నివాసం వరదముట్టడిలో చిక్కుకుంది. ప్రముఖ ప్రకృతి వైద్యుడు మంతెన ఆశ్రమం వద్ద రోడ్డు కొట్టుకుపోయి కంకర బయటకొచ్చింది. అనేక రోడ్లు గుంతలతో నిండిపోయాయి. వీటన్నింటినీ యుద్ధప్రాతిపదికన రిపేర్ చేయించేందుకు గుంటూరు జిల్లా యం త్రాంగం సిద్ధమైంది. పనుల నిర్వహణ కోసం కరకట్ట మార్గాన్ని రెండు రోజులపాటు మూసివేయాలని నిర్ణ యించింది. అందువల్లే హైకోర్టుకు రెండు రోజులు సెలవులు ఇవ్వాలని స్వయంగా కలెక్టర్ సూచించారు. భారీ వర్షాలు, వరదలు అమరావతి ప్రాంతంలో విధ్వంసం సృష్టించాయని ఇవన్నీ చెప్పకనే చెబుతున్నాయి. అమరావతిని వరద ముంచెత్తడానికి కృష్ణానదికి ఊహించనంత వరద రావడంతో పాటు బుడమేరు, మున్నేరు వంటి వాగులు ఉప్పొంగడం వంటివి కారణంగా నిలుస్తున్నాయి. కానీ సీఎం చంద్రబాబు మాత్రం ఇవన్నీ తప్పుడు ప్రచారాలని ఖండిస్తున్నారు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అమరావతి నిర్మాణానికి కంకణబద్ధుడైన ఆయన అందుకు అవసరమైన నిధుల కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో చర్చలు జరుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో అమరావతి ప్రాంతమే వరదలకు మునిగిపోయిందని బయట ప్రపంచానికి తెలిస్తే రుణాలు ఇవ్వ డానికి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ముందుకు రావేమోనన్నది ఆయన భయం కావచ్చు. అలాగే విద్యా, ఇతర వ్యాపార సంస్థలు కూడా ఇక్కడ కార్యకలాపాలు చేపట్టడానికి వెనుకంజ వేయవచ్చన్న ఆందోళన కూడా ఉంది. అందుకే ఆయన అమరావతి వరదల్లో చిక్కుకోవడం వాస్తవమే అయినా ఆ వార్తలు మాత్రం రాయకూడదన్నట్లు మాట్లాడుతున్నారు. అసలు అమరావతి ప్రాంతం రాజధాని ఏర్పాటుకు అనుకూలమైనది కాదని గతంలోనే జస్టిస్ శ్రీకృష్ణ వంటి కమిటీలు తేల్చి చెప్పేశాయి. ఈ ప్రాంతంలో ప్రవహించే కొండవీడు వాగు వల్ల కొత్త రాజధానికి వరద ముప్పు ఉంటుందని నిపుణులు చెప్పారు. కానీ ఆ సలహాలను పట్టిం చుకోకుండా ఏటా మూడు పంటలు పండే సారవంతమైన భూములను అమరావతి కోసం సేకరించారు. అది ఒక లోపమే. ఎందుకంటే పంటలు, నీటివనరులతో ఈ ప్రాంతంలోని నేల చాలా వదులుగా ఉం టుంది. దాంతో భారీ నిర్మాణాలు చేపట్టడం కష్టతరంగా మారుతుంది. వాటి పునాదులను చాలా లోతుగా వేయాల్సి ఉంటుంది. దానివల్ల నిర్మాణ ఖర్చులు పెరిగిపోతాయి. పైగా వరదల ముప్పు ప్రతి వర్షాకాలం లోనూ వెంటాడుతుంటుంది. వర్షాలకు భూమి వేగంగా నానిపోయి నిర్మాణాలకు ముప్పు కలిగే ప్రమాదం ఉంది. అయితే రాజధాని నిర్మాణానికి ఒకేచోట అత్యధిక స్థలం అక్కడ తప్ప మరెక్కడా దొరకదన్న ఆలోచన తో మూడు పంటలు పండే సారవంతమైన భూములను రైతుల నుంచి సేకరించి రాజధాని నిర్మాణానికి అంకురార్పణ చేశారు. కానీ ఇప్పుడు సంభవించిన వరదలకే అక్కడ పరిస్థితి దయనీయంగా మారింది. ఇదే కృష్ణమ్మ ఉగ్రరూపం, బుడమేరు, మున్నేరు, కొండవీడు వాగుల వరద ఉధృతి భవిష్యత్తులోనూ దాడి చేయ వచ్చు. అప్పుడు అమరావతిలో పరిస్థితి ఎలా ఉంటుందో?!
Comments