అమరావతి భూసమీకరణకు అవరోధాలు
- DV RAMANA

- Jul 21
- 2 min read

రాష్ట్ర రాజధాని అమరావతేనని ఘంటాపథంగా చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. దాన్ని కేవలం రాష్ట్ర రాజధానిగానే కాకుండా అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు వేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయంలో పూర్తి నిబద్ధతతో పని చేస్తున్నారు. ముఖ్యంగా ఏఐ, క్వాంటమ్ సహా అనేక రంగాలకు అమరావతిని సెంటర్ పాయింట్‌గా అభివృద్ధి చేయాలన్నది ఆయన సంకల్పం. అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ దిశగా తీసుకున్న ఒక నిర్ణయం ఆయన సంకల్పానికి అవాంతరాలు కల్పిస్తోంది. అదే రెండోదశ భూ సమీకరణ. అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాలు చేపట్టడం, వివిధ రంగాల సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు సాగించేలా వాటికి భూములు కేటాయించడానికి అదనంగా 44వేల ఎకరాలు సమీకరించాలని చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయానికి అనూహ్యంగా అవాంతరాలు ఎదురవుతున్నాయి. గతంలో అధికారంలో ఉన్నప్పుడే విభజిత ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించిన తెలుగుదేశం ప్రభుత్వం.. రాజధాని నిర్మాణాల కోసం ఆ ప్రాంత రైతులను ఒప్పించి.. ఒప్పందాలు చేసుకుని పలు గ్రామాల నుంచి 34వేల ఎకరాలు సేకరిం చింది. అప్పట్లో ప్రభుత్వం ఇవ్వజూపిన నష్టపరిహారం ప్యాకేజీకి అంగీకరించి రైతులు ల్యాండ్ పూలింగ్ ద్వారా స్వచ్ఛందంగా భూములు అప్పగించారు. అయితే రెండోదశలో ప్రభుత్వం కోరిన మేరకు భూములు ఇవ్వడానికి మాత్రం రైతులు అంగీకరించడం లేదు. దీనిపై ఇటీవల నిర్వహించిన గ్రామసభల్లో మంత్రులు, ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఈ ప్రక్రియలో ఇప్పటివరకు 20 వేల ఎకరాలు ఇవ్వడానికే రైతుల నుంచి సమ్మతి లభించింది. మిగిలిన 24వేల ఎకరాల సేకరణ సందిగ్ధంలో పడిరది. రైతులు ముందుకు రాకపోవడమే దీనికి కారణం. రెండో దశలో తుళ్లూరు, అమరావతి మండ లాల్లోని ఏడు గ్రామాల నుంచి భూములు సమీకరించాలని నిర్ణయించారు. కానీ మూడు గ్రామాల రైతులే భూములు ఇవ్వడానికి అంగీకరించారు. మిగిలిన నాలుగు గ్రామాల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ససేమిరా అంటున్న రైతులపై అధికారాన్ని ప్రయోగించి ల్యాండ్ పూలింగ్‌కు అధికారులు సిద్ధమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు వారించినట్లు సమాచారం. రైతులకు నచ్చజెప్పి ఒప్పించడం ద్వారానే భూములు సమీకరిం చాలని అధికారులను ఆదేశించడంతోపాటు ఇటీవలి కేబినెట్ మీటింగులోనూ అదే విషయం తెలిపారు. రైతులకు నచ్చజెప్పే విషయంలో కూటమి పార్టీల నేతలను కూడా కలుపుకొనిపోవాలని టీడీపీ మంత్రు లు, ఎమ్మెల్యేలను ఆదేశించారు. చంద్రబాబు ఈ వైఖరి తీసుకోవడానికి కారణం.. రాజధాని రైతులు ఇంతకుముందులా ఏకపక్షంగా సహకరించే పరిస్థితి లేకపోవడంతో పాటు కూటమి భాగస్వాములైన జనసేన, బీజేపీలు కూడా రెండో విడత భూసమీకరణ విషయంలో అంటీముట్టన్నట్లు వ్యవహరిస్తుండటం ఒక కారణం. ఈ తరుణంలో బలవంతంగా భూసమీకరణకు ప్రయత్నిస్తే రచ్చ రచ్చ అవుతుందని చంద్ర బాబు భావిస్తున్నారు. అందువల్ల ఈ విషయంలో కాస్త వెనుకంజ వేస్తున్నారు. అయితే కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న జనసేన అదనపు భూ సమీకరణకు తీవ్ర అభ్యంతరం చెప్పడం కూడా చంద్ర బాబు వెనుకంజ వేయడానికి ఒక కారణమని వాదన కూడా ఉంది. రెండో విడత భూసమీకరణ పేరుతో జనాల్లోకి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులపై వ్యతిరేకత వ్యక్తమవుతుండటాన్ని గమనించిన జనసేన మంత్రులు అటువైపు చూడలేదు. కేబినెట్ భేటీలోనే భూసేకరణ వద్దని వారితోపాటు కొందరు టీడీపీ మంత్రులు కూడా సూచించారని అంటున్నారు. 2014`19 మధ్య అప్పటి టీడీపీ సర్కారు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ చేపట్టింది. అప్పట్లో దాన్ని వైకాపా వ్యతిరేకించగా జనసేన, బీజేపీలు మాత్రం మద్దతు ప్రకటించాయి. తర్వాత 2019లో వచ్చిన వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తీసు కొచ్చి.. అమరావతిని శాసన రాజధానిగానే పరిమితం చేస్తామని చెప్పినప్పుడు భూములిచ్చిన రైతులు ఉద్యమబాట పట్టారు. ఆ సమయంలో వారికి టీడీపీతో పాటు జనసేన, బీజేపీలు కూడా అండగా నిలి చాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో టీడీపీతోపాటు భాగస్వాములుగా ఉన్నప్పటికీ అమరావతికి అదనపు భూసమీకరణ వ్యవహారంలో మాత్రం భాగస్వాములు కావడానికి ఇష్టపడటం లేదు. దీనికి కారణం రైతు ల్లో సానుకూలత లేకపోవడమే. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్లాట్లు, భృతి చెల్లించకుండా మోసం చేశారని, అందువల్ల మళ్లీ మోసపోదలచుకోలేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. ఇలా అన్నివైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో భూ సమీకరణ ముందుకు సాగడంలేదు.










Comments