
పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటంలా తయారైంది అమిత్ షా అంబేద్కర్‌ను ఉటంకిస్తూ పార్లమెంట్లో చేసిన లేకి వ్యాఖ్యల వల్ల ఆంధ్రప్రదేశ్లోని అన్ని పార్టీల నాయకులకు. గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టుగా పాపం దిగమింగుకోలేకపోతున్నారు. అంబేద్కర్‌ను ఏమన్నా కూడా ఓటు బ్యాంకు పరంగా బీజేపీకి పోయేదేమీ లేదు. నిజానికి పరోక్షంగా కొద్ది శాతం పెరుగుదల ఉంటుం దేమో కూడా. అందుకనే నష్ట నివారణ చర్యలకు ఏమాత్రం పాల్పడకుండా ఎదురు దాడితో కాంగ్రెస్ మీద కాలు దువ్వుతూ తెగ రెచ్చిపోయారు మన మోడీ గారు కూడా. కాకపోతే ఆంధ్రాలోని పార్టీలు అధినాయకులకి ఆ వెసులుబాటు లేదు. ఎందుకంటే మాది బీసీల పార్టీ అని ఒకరు, ఎస్సీలు మాతోనే ఉంటారంటూ మరొకరు తెగ ఎగబడిపోతుంటారు. పాపం అందులో ఒకాయన మోడీకి బంధంలో ఉన్నాడు, మరొక ఆయన మోడీకి ఆత్మబంధువు. ఇంకొక ఆయన మోడీకి భక్తుడు. కాబట్టి వీళ్లంతా ఎటూ పాలుపోక ఆకాశం వైపు దిక్కులు చూస్తూ కూర్చున్నారు. ఇది ఇలా ఉంటే నన్ను కొడితే సరి పోతుందా, మా బామ్మర్దిని కొట్టొద్దా, నిజానికి అతనే దీనంతటికి కారణం అనేటట్టుగా ఆ ఢల్లీి కేజ్రీవాలు మన చంద్రబాబుకి ఈ విషయం పట్ల మీ వైఖరి ఏంటో జాతికి చెప్పాలంటూ ఒక పెద్ద ఉత్తరం రాసేసాడు. జాతీయ నాయకుడిగా రూపాంతరం చెందాక అలాంటి ప్రశ్నలు కూడా ఎదురవు తాయి మన చంద్రబాబు గారికి, తప్పించుకుపోదామంటే కుదరదు మరి. నిజానికి మన రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ బీజేపీ తానులో ముక్కలే. బీజేపీతో కలిసి వెళ్లడం కోసం గత ఎన్నికల్లో అమిత్‌షా కాళ్లు, గడ్డం పట్టుకున్నానని స్వయంగా పవన్‌కల్యాణే చెప్పడం ఇందుకు తార్కాణం. మొన్నటికి మొన్న జెమిలీ ఎన్నికల కోసం ఓటింగ్ జరిగితే, టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసింది.. తప్పదు కాబట్టి. మరి జగన్ పార్టీ ఎందుకు జెమిలీకి అనుకూలంగా ఓటేసిందో తెలీదు. ఎవరూ అడగరు. కేంద్రంలో ఎన్డీయే ధైర్యం కూడా అదే. రాజ్యాంగ నిర్మాతను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం దారుణమని, ఆయన తక్షణం క్షమాపణ చెప్పటంతో పాటు తన పదవి నుంచి వైదొలగాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. పార్లమెంటు బయట పెద్దఎత్తున నిరసన తెలిపాయి. బుధ, గురువారాల్లో కూడా పార్లమెంటులోనూ, దేశవ్యాప్తంగానూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. ‘అంబేద్కర్.. అంబేద్కర్.. అంబేద్కర్.. అంబేద్కర్ అనటం ఫ్యాషనైపోయింది. అదేదో వందసార్లు భగవంతుడి పేరు ఉచ్ఛరించినా స్వర్గలోకంలో స్థానం దొరుకుతుంది.’ అంటూ అమిత్ షా విపక్షాలపై విరుచుకుపడ్డారు. అంబేద్కర్ అధ్యక్షతన భారత రాజ్యాంగం రూపొందించుకొన్న తరుణంలో నేటి బీజేపీ మాతృసంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్) తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తాము అత్యంత ప్రామాణికంగా భావించే మనుస్మృతికి స్థానం లేకుండా పోయిందే అని స్వయంగా గోల్వాల్కర్ తమ ‘ఆర్గనైజర్’ పత్రికలో వ్యాసాలు రాసుకున్నారు. దేశానికి ఈ రాజ్యాంగం పనికిరాదని, మూడు రంగుల జెండా అరిష్టమని పేర్కొనటమే కాదు.. కొంతమంది రాష్ట్ర ప్రేమి యువదళ్ కార్యకర్తలు 2021లో నాగ్‌పూర్ ఆర్‌ఆర్‌ఎస్ కార్యాలయం మీద బలవంతంగా మువ్వన్నెల జెండా ఎగురవేసేదాకా వాళ్లు జాతీయజెండాను గుర్తించలేదు. గత లోక్‌సభ ఎన్నికల తరుణంలో 400 సీట్లు సాధిస్తే రాజ్యాంగం మార్చి తీరుతామంటూ కొంతమంది బీజేపీ ఎంపీలు బాహాటంగా ప్రకటించిన సంగతి విదితమే! నోటితో నవ్వి నొసటితో వెక్కిరించిన తీరుగానే బీజేపీ అంబేద్కర్ పట్ల వ్యవహరిస్తూ ఉంటుంది. ఆయన విగ్రహానికి భారీగా పూలదండలు వేసి, ఘనంగా కబుర్లు చెప్పటం, రాజ్యాంగం నిర్దేశించిన విలువలను, రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేయడం ఆ పార్టీ కపట నీతి. మనుస్మృతి అత్యంత దుర్మార్గమైనదని, ఈ దేశానికి ఏమాత్రం పనికిరాదని అంబేద్కరే స్వయంగా దానిని దగ్ధం చేశారు. అలాంటి కాలం చెల్లిన క్రూరమైన మనువాదాన్ని నెత్తిన పెట్టుకొని, సనాతనమే తమ అభిమతంగా ఊరేగే బీజేపీగణం ఇక అంబేద్కర్ మహాశయుడి మార్గాన్ని ఎక్కడ గౌరవిస్తుంది? లోన ఒకటి బోధిస్తూ, అభిమానిస్తూ, బయట రకరకాల రంగులు మార్చే నటనా విన్యాసాలు చేయడం అధికార అవసరాలకు తగ్గట్టుగా అబద్ధాలకు తెగించటం ప్రభుత్వాలకు అలవాటే. వర్ణవ్యవస్థ విష వలయం నుంచి దేశం బయటపడాలన్న ఆధునాతన ఆచరణ అంబేద్కర్‌దైతే, దేశాన్ని మళ్లీ వెయ్యి పడగల విషపు నాగు నీడలోకి లాక్కుపోవడమే బీజేపీ సనాతన పన్నాగం. దీనికి ఈ రాష్ట్రంలో అన్ని పార్టీల మద్దతు ఉంది. వాస్తవానికి అమిత్ షా అంబేద్కర్‌ను ఎక్కడా తూలనాడలేదు. కాకపోతే ఈమధ్య అంబేద్కర్‌ను తమ సొంతం చేసుకోవాలని బీజేపీ భావిస్తుంది. దాన్ని గ్రహించిన కాంగ్రెస్ తమవాడంటూ క్లయిమ్ చేసుకోడానికి ప్రయత్నించడం వల్ల జరిగిన రాద్ధాంతమే గాని అంబేద్కర్ బతికిన రోజుల్లో ఇబ్బందులు పడిరది కాంగ్రెస్ వల్లనేనని మర్చిపోకూడదు.
Comments