top of page

అమ్మాయిల వేధింపుల్లోనూ కార్పొరేట్‌దే ఫస్ట్‌ర్యాంక్‌

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • విద్యార్థినులను వేధిస్తున్న ఆకతాయి అధ్యాపకులు

  • కాలేజీ ప్రతిష్ఠ పేరుతో దాటేస్తున్న మేనేజ్‌మెంట్‌

  • స్టేషన్లు, కోర్టులు తిరగలేక తగ్గుతున్న పేరెంట్స్‌

  • కొద్ది రోజుల క్రితం కీచక గురువుకు దేహశుద్ధి


‘ప్రభుత్వం’ అనే బోర్డు లేకుండా చదువు చెపుతామని ఎవరు ఓ ప్రకటన ఇచ్చినా అది కార్పోరేట్‌ సంస్థ కిందే విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తారు. ప్రభుత్వ కాలేజీలో చదివితే ర్యాంకులు రావనేది వారి మెదడు పొరల్లో నాటుకుపోయిన నమ్మకం. భార్యాభర్తల సంపాదన ఏం చేసుకోవాలో తెలీక కార్పోరేట్లకు సొమ్ములు పొయ్యడాన్ని వారి స్వవిషయంగా భావించినా తప్పులేదు. కానీ తమ పిల్లల, మరీ ముఖ్యంగా ఆడపిల్లల మనోవేదనకు, మానసిక ఘర్షణకు గురి చేస్తున్న కార్పోరేట్‌ అధ్యాపకుల తీరే ఇప్పుడు సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఇంతవరకు ర్యాంకుల కోసం, మార్కుల కోసం కార్పోరేట్‌ విద్యాసంస్థలు పెట్టే ఒత్తిడి భరించలేకే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విన్నాం, చదివాం. కానీ ఎలాంటి ఒత్తిడినైనా భరించగలిగి ర్యాంకుల రేసులో మొదటివరుసలో ఉన్న అమ్మాయిలు సైతం కొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారంటే అందుకు కారణం చదువుల ఒత్తిడి కాదు. అంతకు మించి కొన్ని కార్పోరేట్‌ కళాశాలల్లో ఏదో జరుగుతోంది. ఆ ‘ఏదో’ తల్లిదండ్రులకు సైతం చెప్పుకోలేనిదై ఉంటుంది. బయటకు చెబితే చదువు మాన్పించేస్తారని, కొద్ది రోజులు భరిస్తే గండం దాటిపోతామని భావిస్తున్న విరిసీ విరియని అమ్మాయిలు చివరకు ఎవరికీ చెప్పుకోలేక జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. దీన్ని ఒక్క ముక్కలో ఒత్తిడి తట్టుకోలేక తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చలేమనే భావనతో తనువు చాలిస్తున్నారని కేసును క్లోజ్‌ చేస్తున్నారు. కానీ కార్పోరేట్‌ కళాశాలల్లో జరుగుతున్నది వేరు. అక్కడేం జరుగుతుందో చెప్పడానికి సింపుల్‌గా రెండు ఉదాహరణలిస్తాం. ఇందులో ఏ ప్రాణం ఎందుకు పోయిందో ఆలోచించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

మన దేశంలో ఎప్పటికీ వన్నె తరగని వ్యాపారాలు రెండు. ఒకటి విద్య, రెండు వైద్యం. ఈ రెండు రంగాల్లోనే కార్పోరేట్లు బలంగా నాటుకుపోయి ఉంటారు. అందుకు కారణం.. పెట్టుబడికి పదింతలు పైగా లాభాలు రావడం. అయితే ఆమేరకు సేవలందించడానికి అవసరమైన నిపుణులు మన దగ్గర ఎక్కడున్నారు? అందుకే అప్పుడే పోస్టుగ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి హుషారుగా బయోడేటాను పట్టుకొచ్చిన ప్రతిఒక్కడికి కార్పోరేట్‌ కళాశాలల్లో అధ్యాపకుడిగా ఉద్యోగమిస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువుకు ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయో లేవో చూడకుండా కేవలం తమ కరిక్యులం విద్యార్థుల బుర్రలోకి ఎక్కించేవాడైతే చాలన్న కోణంలో డిగ్రీ విద్యార్థి కంటే రెండేళ్లు సీనియరైనవాడికి అధ్యాపకుడి పోస్టులు కట్టబెడుతున్నారు. మార్కెటింగ్‌ చేస్తారనో, తమవద్దే యూనిఫామ్‌, పుస్తకాలు, నోట్‌బుక్స్‌ కొనుగోలు చేసేలా భయపెడతారనో అధ్యాపకులను కార్పోరేట్‌ నిర్వాహుకులు ముద్దుబిడ్డల్లా చూస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకొని వయసొచ్చిన అమ్మాయిలతో ఈ కుర్ర అధ్యాపకులు ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ముందు చెప్పుకున్నట్టు ఉదాహరణలు చూద్దాం.

నగరంలోని ఒక కార్పోరేట్‌ సంస్థ విద్యార్థినుల ప్రాంగణంలో మాథ్స్‌ అధ్యాపకుడు ముగ్గురు విద్యార్థుల పట్ల స్టడీ అవర్‌లో అసభ్యకరంగా కీచకబుద్ధి చూపించాడు. ఎవరికైనా ఫిర్యాదు చేస్తే ప్రాక్టికల్‌ మార్కులు తగ్గిస్తానని హెచ్చరించి వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధిత విద్యార్ధినులు ఒక మహిళా అధ్యాపకురాలి ద్వారా ప్రిన్సిపాల్‌ను ఆశ్రయించి సదరు మాథ్‌ó్‌్స అధ్యాపకుడు వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేశారు. సదరు ప్రిన్సిపాల్‌ ఈ వ్యవహారం బయటకు రానీయకుండా విద్యార్థినిలకు నచ్చజెప్పి మాథ్స్‌ అధ్యాపకుడికి కౌన్సిలింగ్‌ ఇచ్చి హెచ్చరించి విడిచిపెట్టేశారు. అయితే దీనికి ప్రతిగా కళాశాల ప్రిన్సిపాల్‌పై మరో విద్యార్థినితో మాథ్స్‌ ఉపాధ్యాయుడు యాజమాన్యానికి ఫిర్యాదు చేయించాడు. దీంతో యాజమాన్యం ప్రిన్సిపాల్‌ను విధుల నుంచి తొలగించింది. ఆ స్థానంలో గతంలో విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మాథ్స్‌ అధ్యాపకుడే ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టాడు.

స్థానికంగా ఉన్న మరో కార్పొరేట్‌ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్‌ అయిన యువకుడు అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఒకడుగు ముందుకేసి ప్రేమిస్తున్నానని, అందంగా ఉంటావని.. ఇలా వాట్సాప్‌ సందేశాలు కూడా పంపడంతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఆయన్ను ఈ కళాశాల వదిలించుకుంది. ముందే చెప్పుకున్నట్టు మార్కెటింగ్‌కు పనికొచ్చే అధ్యాపకుల కొరత ఉండటంతో ఈ కీచకుడ్ని తీసుకువచ్చి సమీపంలో ఉన్న మరో కార్పొరేట్‌ సంస్థ ఉద్యోగమిచ్చింది. అక్కడ కూడా అదే పనిగా విద్యార్థినుల వెంటపడటంతో కొన్నాళ్ల క్రితం అమ్మాయి కుటుంబ సభ్యులు వచ్చి క్లాస్‌రూమ్‌లోనే ఈ అధ్యాపకుడ్ని పిచ్చ కొట్టుడు కొట్టారు. ఈ కథ పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లినా సుఖాంతం కావడంతో కేసు లేకుండా బయటపడ్డాడు. విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా బుద్ధి చెప్పి పంపించేయాలని, కోర్టుల చుట్టూ తిరగలేమని చెప్పడం వల్ల ఇటువంటివారంతా కాలేజీలు మారి పబ్బం గడిపేసుకుంటున్నారు. ఆమధ్య ఓ కార్పోరేట్‌ డిగ్రీ కాలేజీలో కూడా పెళ్లాం వదిలేసిన ఓ కీచక అధ్యాపకుడు విద్యార్థినుల పట్ల ఇలాగే మొరటుగా వ్యవహరించడంతో కథ పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లింది. అయితే విచారణ చేస్తున్నామని, అనంతరం కేసు నమోదు చేస్తామని పోలీసులు దీన్ని తాత్సారం చేయడంతో ఈ వ్యవహారం నీరుగారిపోయింది. ఈలోగా కళాశాల యాజమాన్యం అధ్యాపకుడ్ని విధుల నుంచి తప్పించింది. ఇతగాడు గతంలో పనిచేసిన రెండుచోట్ల విద్యార్థినుల పట్ల ఇలాగే వ్యవహరించడంతో గతంలో కూడా రెండుచోట్ల దరువులు పడ్డాయని భోగట్టా.

ప్రాక్టికల్‌ మార్కులు తగ్గిస్తామని..

ఓవరాల్‌ స్కోరింగ్‌లో ప్రాక్టికల్‌ మార్కులు ముఖ్యం. ఇవి అధ్యాపకుల చేతిలోనే ఉంటాయని యాజమాన్యాలు ముందే భయపెడతాయి. ఎందుకంటే.. సంబంధిత ఫిజిక్స్‌, కెమిస్ట్రీ అధ్యాపకుల చేతిలో విద్యార్థులు ఉండాలని, వారి ద్వారా మార్కెటింగ్‌ చేసుకోవాలనేది వారి వ్యాపారం. దీన్ని అలుసుగా చేసుకొని ప్రాక్టికల్‌ మార్కులు తగ్గిస్తామని భయపెట్టే యువ అధ్యాపకులు దాదాపు అన్ని కార్పోరేట్‌ కళాశాలల్లోనూ ఎంతోకొంతమంది ఉన్నారు. వాస్తవానికి ప్రాక్టికల్స్‌ చేయించడానికి వేరే కాలేజీల నుంచి అధ్యాపకులు వస్తారు. వారికి విద్యార్థుల నుంచి వసూలుచేసిన అనధికారిక రుసుమును చెల్లించి ఏ విద్యార్థికి ఎన్ని మార్కులు వేయాలో అక్కడున్న ప్రిన్సిపాలే నిర్ణయిస్తాడు. కాకపోతే ఇక్కడున్న కార్పొరేట్‌ కళాశాలల్లోని ప్రిన్సిపాళ్లందరూ ఇంకా ప్రేమ, పరాయి స్త్రీ పేరు చెబితే ముసిముసిగా ముడుచుకుపోయేవారే. అటువంటిచోట విద్యార్థినులు బయటకు చెప్పలేక, లోపల దాచుకోలేక సతమతమవుతున్నారు.

Commentaires


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page