top of page

అమ్మా.. స్కూల్‌ భోజనం తిననే!

Writer: ADMINADMIN
  • విద్యార్థులు ‘డొక్క’లు మార్చుకుంటున్నారు

  • సోమ, బుధవారం బిర్యానీ చప్పగా ఉంటోంది

  • దుంపలు ఉడకడమే లేదు

  • బంగాళాదుంప కుర్మా కారం

  • అన్నం జావకారుతోంది

  • స్కూళ్లకు క్యారేజీ తీసుకురానీరు

  • పచ్చడి ప్యాకెట్లు ఆశ్రయిస్తున్న వైనం

  • ఇంటర్వెల్‌కు ఇచ్చే గుడ్లు ఉడకడమేలేదు

  • ఇంటికి వచ్చి గంజన్నాన్ని పరమాన్నంగా తింటున్నారు

  • నాఫ్కిన్స్‌ ఇచ్చి నాలుగు నెలలయ్యింది

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

‘‘అమ్మా స్కూల్‌ భోజనం తిననే.. బిర్యానీ చప్పగా ఉంటోంది.. దుంపలూ ఉడకవు.. కుర్మా కారంగా ఉంది.. అన్నం నీరు పట్టినట్టు ఉంటోంది.. ఇంటర్వెల్‌కు ఇచ్చే గుడ్డు ఉడకడమేలేదు.. పోనీ క్యారేజ్‌ పట్టుకెళ్దామంటే మేడం తిడతారు.. పచ్చడి ప్యాకెట్‌తో స్కూల్‌ అన్నం తినలేకపోతున్నాం..’’

.. ఇదీ స్కూల్‌ నుంచి రాగానే విద్యార్థులు తమ తల్లిదండ్రుల వద్ద వాపోతున్న వైనం. సాయంత్రం స్కూల్‌ నుంచి ఇంటికి రాగానే ఇంటిలో మధ్యాహ్నం వండిన అన్నాన్ని ఏమీ లేకపోయినా నీరు వేసుకొని ఉప్పు కలుపుకొని ఆవురావురని తింటున్నారు. దీన్నిబట్టి స్కూల్స్‌లో అందిస్తున్న భోజనం తినలేక ‘డొక్క’లు మాడుతున్నాయన్నది స్పష్టమవుతోంది.

ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చదువులు అర్థాకలితో సాగుతున్నాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు జగనన్న గోరుముద్ద పేరిట రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించగా, ప్రస్తుతం ఆ పథకం అస్తవ్యస్తంగా మారింది. స్కూల్‌ పిల్లలు తినలేకపోతున్నారు మహాప్రభో అనుకుంటున్న సమయంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరిట ఇంటర్‌ విద్యార్థులకూ ప్రభుత్వం భోజనం అందిస్తోంది.

వైకాపా హయాంలో జగనన్న గోరుముద్ద పేరిట ఏర్పాటుచేసిన మధ్యాహ్న భోజనాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంగా పేరు మార్చింది. ఇందుకు అయ్యే ఖర్చులో 70 శాతం కేంద్రం, 30 శాతం రాష్ట్ర ప్రభుత్వ భరిస్తుంది. ఈ భోజనాలను అక్షయపాత్ర సంస్థ ఆమదాలవలస, గార, శ్రీకాకుళం మండలాల్లో 22వేల మందికి అందిస్తున్నారు. చాలా మండలాల్లోని స్కూల్స్‌లో అక్కడికక్కడ వంటలు చేసి అందిస్తుండటంతో వాటి నుంచి ఫిర్యాదులు రాకపోయినప్పటికీ, అక్షయపాత్ర అందిస్తున్న భోజనం తినలేకపోతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. దీనికి కారణం అక్షయపాత్రకు ప్రభుత్వమే బియ్యం అందిస్తుందని, అదీ ఇప్పుడు కొత్త బియ్యం కావడం వల్ల అయితే ముద్దగానో, లేకపోతే రాళ్ల మాదిరిగానో ఉంటోందని తెలుస్తుంది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పాత బియ్యం ఇవ్వాలని కోరుతున్నారు కూడా. రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి సమస్యలే ఉన్నాయి.

ఇక ప్రభుత్వ పాఠశాలల విషయానికి వస్తే భోజనం మెనూలో సోమ, బుధవారాల్లో బిర్యానీ, కుర్మా అందిస్తుండగా, మంగళవారం పులిహోరా, టమాటా చట్నీ, గురువారం పులిహోరా, చట్నీ, శుక్రవారం పాలకూర పప్పు, అన్నం, శనివారం అన్నం, పప్పు, కుర్మా, స్వీట్‌ పొంగల్‌ అందిస్తున్నారు. అయితే సోమ, బుధవారాల్లో అందించే బిర్యానీ అస్సలు రుచి లేదని, చప్పగా ఉంటోందని, అందులో దుంపలు ఉడకడమేలేదని, కుర్మా కారంగా ఉంటోందని విద్యార్థులు వాపోతున్నారు. మంగళవారం, గురువారం అందించే పులిహోర, చట్నీ ఫర్వాలేదని, అయితే శుక్ర, శనివారాల్లో పెడుతున్న అన్నం నీరు పట్టినట్టు జారుతోందని విద్యార్థులు చెబుతున్నారు. ఇంక రోజూ ఇచ్చే గుడ్లు ఉడకడంలేదని వాపోతున్నారు. ఇంటి నుంచి క్యారేజీ తీసుకువెళ్దామంటే స్కూల్‌ భోజనం తాము తినగా లేనిది మీరు తినలేరా అని టీచర్లు కోప్పడుతున్నారని విద్యార్థులు తెలిపారు. విద్యార్థినీ విద్యార్థులు ఇంటి నుంచి వచ్చేటప్పుడు, స్కూల్‌ భోజనం సమయంలో పచ్చడిప్యాకెట్లు కొనుక్కుని తెచ్చుకోవడం కనిపిస్తుంది. ఇక నెల నెల ఆడపిల్లలకు ఇచ్చే నాఫ్కిన్స్‌ నాలుగు నెలలుగా ఇవ్వడంలేదని విద్యార్థినులు చెబుతున్నారు. ఉడికీ ఉడకని భోజనం సగం తిని వదిలేద్దామంటే ఎన్జీసీ లీడర్లంటూ కొందర్ని స్కూల్‌ హెచ్‌ఎంలు నియమించడంతో వారు ఎక్కడ ఫిర్యాదు చేస్తారోనని విద్యార్థులు భయపడిపోతున్నారు. లాభం లేదనుకుని భోజనం తినే ప్లేట్లకు బదులు కొద్దిగా అన్నం పట్టే టిఫిన్‌ ప్లేట్లు పట్టుకెళ్లి భోజనం అయిందనిపిస్తున్నారు. సాయంత్రం స్కూల్‌ విడిచిపెట్టిన సమయంలో ఇంటికి వచ్చి ఆకలికి తట్టుకోలేక ఏది ఉంటే దానితో సరిపెట్టుకుని, నీళ్లు వేసుకొని అన్నం తింటున్న సందర్భాలు ఉన్నాయి. దీనిపై కలెక్టర్‌, జిల్లా విద్యాశాఖాధికారి స్పందించి డొక్కా సీతమ్మ పేరిట అక్షయపాత్ర అందిస్తున్న మధ్యాహ్న భోజనాలను తనిఖీ చేయాలని, తమకు రుచికరంగా కాకపోయినా, తినగలిగేలా ఉండే భోజనాలు పెట్టే ఏర్పాటు చేయాలని, లేదా తమ ఇళ్ల నుంచి క్యారేజీలు తెచ్చుకునేందుకు అనుమతించాలని విద్యార్థులు కోరుతున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page