top of page

అమెరికా, ఇరాన్.. ఓ పాకిస్తాన్!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Apr 15
  • 3 min read

పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలు రగులుకుంటే వాటితో చలిమంటలు కాచుకోవాలని చూసిన పాకిస్తాన్ ప్రయత్నాలు ఫలించకపోగా కోట్ల రూపాయల చేతి చమురు వదిలింది. ఉగ్రవాద దేశంగా ఇప్పటికే ముద్రపడిన పాకిస్తాన్ యుద్ధం చేస్తున్న ఇరాన్`అమెరికా మధ్య శాంతి చర్చలకు ఇస్లామాబాద్‌ను వేదికగా ఇచ్చి, ఇరుపక్షాలకు మధ్యవర్తిగా వ్యవహరించడం ద్వారా తనపై ఉన్న ఉగ్ర ముద్ర కనిపించకుండా శాంతిదూత ముసుగు తొడుక్కోవాలని చూసింది. కానీ ఆ చర్చలు ప్రాథమిక స్థాయిలోనే విఫలం కావడంతో పాక్ ఇరకాటంలో పడింది. యుద్ధాన్ని నివారించి మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పాలన్న లక్ష్యంతో పాకిస్తాన్ వేదికగా రెండు రోజులపాటు జరిగిన అమెరికా-ఇరాన్ చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. ఈ పరిణామం మొత్తం పశ్చిమాసియాతోపాటు పాకిస్తాన్‌ను కూడా ఒక పెను దౌత్య, భద్రతా సంక్షోభంలోకి నెట్టివేసిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత వారం చివరిలో ఏకథాటిగా 21 గంటలపాటు ఇస్లామాబాద్‌లో జరిగిన ఈ చర్చల నుంచి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అసహనంతో వెనుతిరగడం.. పాకిస్తాన్ పాలిట శాపంగా మారుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్‌తో రెండో దశ చర్చలకు సిద్ధమని ట్రంప్ ప్రకటించినా, రెండు రోజుల్లో ఇస్లామాబాద్‌లోనే చర్చలు పున:ప్రారంభమవుతాయని అంటున్నా.. మొదటిదశ చర్చల ఫలితం నేపథ్యంలో పాకిస్తాన్‌ను కొన్ని అంశాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక రెండోదశ చర్చలు జరిగితే.. వాటి ఫలితం ఎలా ఉంటుందో.. దాని ప్రభావం తనపై ఎంత తీవ్రంగా ఉంటుందోనని పాక్ పాలకులు లోలోన భీతిల్లుతున్నా బయటకు మాత్రం గంభీరంగా కనిపిస్తున్నారు. ఇరాన్`అమెరికా చర్చలకు మధ్యవర్తిత్వం వహించడం ద్వారా ప్రపంచ వేదికపై తన పట్టు నిలుపుకోవాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. రెండు దేశాల మధ్య నలిగిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒకవైపు ఆర్థిక సాయం, ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్యనిధి) రుణాలు, రక్షణ సహకారం అంశాల్లో పాకిస్తాన్‌కు అమెరికా అండ అవసరం. మరోవైపు తనతో 900 కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దును పంచుకుంటున్న ఇరాన్‌తో శత్రుత్వం పాక్ ఆర్థిక, సైనిక వ్యవస్థలను దశాబ్దాల వెనక్కి నెట్టేసే ప్రమాదముంది. కాగా చర్చలు విఫలమైన తరుణంలోనే పాకిస్తాన్‌తన సైన్యాన్ని సౌదీ అరేబియాకు పంపడం కూడా ఇరాన్‌ను ఆగ్రహానికి గురిచేసింది. మొదటి దశ చర్చలు విఫలమైనప్పుడే ఇరాన్‌ను నాశనం చేస్తానని తీవ్రంగా హెచ్చరించిన ట్రంప్ రెండో దశ చర్చలు కూడా అదే ఫలితాన్నిస్తే ఇరాన్‌పై తదుపరి సైనిక చర్యల కోసం పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ సరిహద్దులో ఉన్న వైమానిక స్థావరాలను ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. ఆ స్థావరాల నుంచి ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేయడం అమెరికాకు సులభం. అయితే ‘మా శత్రువులకు స్థావరాలిచ్చే ఏ దేశాన్ని కూడా వదలబోం’ అని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. అదే కారణంతో గల్ఫ్ దేశాýపై విరుచుకుపడుతున్నది. పాక్ కూడా అమెరికాకు స్థావరాలు ఇస్తే ఇరాన్ మిసైళ్లు, డ్రోన్లు నేరుగా ఇస్లామాబాద్‌పై పడటం ఖాయం. అంతర్జాతీయ పరిణమాలకు తోడు పాకిస్తాన్ అంతర్గత పరిస్థితి కూడా నివురుగప్పిన నిప్పులా ఉంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద షియా జనాభా కలిగిన పాకిస్తాన్ కనుక ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికాతో చేతులు కలిపితే దేశంలో మతపరమైన అల్లర్లు చెలరేగి, అంతర్యుద్ధం చెలరేగే ప్రమాదం ఉంది. ఇప్పటికే బలూచిస్తాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతున్న పరిస్థితుల్లో ఆ భూభాగానికి అనుకునే ఉన్న ఇరాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు చెలరేగితే పాక్ సైన్యం రెండు వైపులా పోరాడాల్సి వస్తుంది. ఈ పరిణామాలు, ఆందోళనల నేపథ్యంలో ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. అటు అమెరికా ఆధిపత్యాన్ని భరిస్తూనే ఇటు ఇరాన్‌తో దౌత్య సంబంధాలు కాపాడుకోవడానికి వారు ఆపసోపాలు పడుతున్నారు. సౌదీ అరేబియాతో సైనిక ఒప్పందాన్ని అమలు చేయడం ఒక విధంగా రక్షణ కల్పించగలిగినా.. అది ఇరాన్‌ను మరింత రెచ్చగొట్టే అవకాశం ఉంది. మొత్తానికి పాకిస్తాన్ వేసే ప్రతి అడుగు ఇప్పుడు ఆ దేశ మనుగడతో ముడిపడి ఉంది. ఒక్క తప్పటడుగు వేసినా టెహ్రాన్ క్షిపణుల వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో శాంతిని పరిరక్షిస్తానంటున్న పాకిస్తాన్ తానే దౌత్యపరంగా అత్యంత విషమ పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తున్నది. అసలే అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థతో ముక్కుతూ మూలుగుతూ రోజులు నెట్టుకొస్తున్న పాకిస్తాన్‌కు చర్చల మధ్యవర్తిత్వం తక్షణ ఆర్థిక ఇబ్బందులు కూడా సష్టించింది. మింగ మెతుకు లేదు గానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్లు ఉగ్ర ముద్రను చెరిపేసుకోవడానికి, ప్రపంచ దేశాల్లో తన బ్రాండ్ మెరుగుపర్చుకోవడానికి శాంతి చర్చల మధ్యవర్తిత్వ వ్యూహాన్ని రచించిన పాక్ ప్రభుత్వానికి అందుకైన ఖర్చులు దిమ్మదిరిగేలా చేస్తున్నాయి. పాక్ ఆర్థిక డొల్లతనాన్ని బయటపెట్టాయి. ఇరాన్-అమెరికా మధ్య చర్చలకు వేదికైన ఇస్లామాబాద్‌లోని హోటల్ సెరెనాకు బిల్లు కూడా చెల్లించలేక ప్రపంచం ముందు పాకిస్తాన్ అవమానానికి గురైంది. ఈ నెల 10-12 తేదీల మధ్య జరిగిన ఈ చర్చలకు రెండు దేశాలకు చెందిన అగ్రనేతలు హాజరయ్యారు. వీరికి ఆతిథ్యం ఇచ్చిన పాక్ వాటి ఖర్చులను భరించాల్సి ఉంటుంది. మధ్యవర్తిత్వం వహించినందుకు ట్రంప్ పాకిస్తాన్‌ను తెగ పొగిడారు. కానీ మరోవైపు పాకిస్తాన్ ప్రపంచం ముందు అభాసుపాలైంది. ఆతిథ్యం ఇచ్చిన హోటల్ బిల్లులు కూడా చెల్లించలేకపోయింది. తక్షణమే బిల్లు చెల్లించాలని హోటల్ యాజమాన్య సంస్థ అయిన అగా ఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ సంస్థ డిమాండ్ చేస్తోంది. అయితే బొక్కసంలో డబ్బుల్లేక పాక్ ఆర్థికశాఖ బిక్కమొహం వేసింది. ఈ ఏర్పాట్లకు అయ్యే ఖర్చులకు సొమ్ము రాబట్టుకునేందుకు పెట్రోల్ ధరలు రూ.150 మేరకు పెంచేసినా సరిపోలేదు. ఈ పరిస్థితుల్లో రెండో విడత చర్చలకు ఎలా అతిథ్యం ఇస్తుందో.. ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూడాల్సిందే.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page