అర్హుల పొట్ట కొట్టి.. అనర్హులతో 50-50
- BAGADI NARAYANARAO

- Jun 9
- 2 min read
మత్స్యకారుల మధ్య చిచ్చు పెడుతున్న అధికారులు
భరోసాకు భారీ కన్నం
తిమింగలాల్లా మింగేసిన భృతి
ప్రభుత్వానికి ఇంటెలిజెన్సీ నివేదిక

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లాలో మత్స్యకార భరోసా సొమ్ముల వల్ల సముద్రపు వేట మీద ఆధారపడి జీవిస్తున్నవారిలో ఎంతమంది లబ్ధి పొందారో తెలియదు కానీ, ఆ పేరుతో మత్స్యశాఖ అధికారులు మాత్రం ఒక్కసారిగా భారీ తిమంగలాలుగా మారిపోయారు. జిల్లా వ్యాప్తంగా అడ్డదిడ్డంగా మత్స్యకార భరోసా లబ్ధిదారులను ఎంపిక చేసి, ఏమని ప్రశ్నిస్తే.. రాజకీయ కారణాలని తప్పించుకొని చివరకు ఎమ్మెల్యేలు ఎండార్స్‌మెంట్ ఇచ్చినా న్యాయం చేయని మత్స్యశాఖ వల్ల ప్రభుత్వానికి ఈదఫా అపఖ్యాతి వచ్చింది. ఈ ఏడాది జిల్లాలో 1200 మందికి అదనంగా భరోసాకు ఎంపిక చేసినా వైకాపా హయాంలో రూ.10వేలు ఇస్తే, కూటమి ప్రభుత్వం రూ.20వేలు ఇచ్చినా మత్స్యకారుల్లో ఇంకా ఎందుకు అసంతృప్తి కనిపిస్తుందంటే.. అందుకు ప్రధాన కారణం మత్స్యశాఖ అధికారులే. సాధారణంగా వేటే వృత్తిగా జీవిస్తున్న మత్స్యకారులందరూ ఒక కట్టుమీద ఉంటారు. ఇప్ప్పుడు ఈ శాఖ అధికారుల స్వార్థం వల్ల వీరిలో గ్రూపులు మొదలయ్యాయి. అప్పటికీ గంగపుత్రులు నిజాయితీగా ఉండటానికి నిశ్చయించుకున్నా మత్స్యశాఖ అధికారులు మాత్రం తమ లబ్ధికోసం వారిలో వారికి చిచ్చు పెడుతున్నారు. తన బోటులో ఉన్న కలాసీలకు భరోసా ఎందుకు రాలేదని ఎక్కడైనా ప్రశ్నిస్తే.. పక్క బోటులో ఉన్నవారందరికీ భరోసా అందించామన్న అక్కసుతో ఉన్నారంటూ వేరే బోటు యజమానికి పురిగొల్పుతున్నారు. దీంతో తమ భరోసాకు ఎసరొస్తుందన్న ఆలోచనతో ఎక్కడికక్కడ మత్స్యకారులు జుత్తులు పట్టుకుంటున్నారు. ఒక మరబోటుకు ఆరుగురు చొప్ప్పున ఒక్కొక్కరికి రూ.20వేలు జమ చేస్తారు. ఇందులో ఎంతమంది అనర్హులుంటే.. అన్ని రూ.10వేలు మత్స్యశాఖ అధికారులవే. మొదటి విడత మత్స్యకార భరోసా అందించినప్ప్పుడు రూ.20వేలు చొప్ప్పున అందరికీ అందేలా చూశారు. అక్కడక్కడ చేతివాటం ప్రదర్శించినా చాలామందికి పూర్తిస్థాయి భరోసా అందింది. ఎందుకంటే.. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాది మత్స్యకార భరోసా ప్రకటించలేదు. రెండో ఏడాది రూ.20వేలు ఇవ్వడంతో వైకాపా ప్రభుత్వం మాదిరిగా రూ.10వేలు చొప్ప్పున లెక్కేసుకున్నా రెండు సంవత్సరాలకు సరిపడా వచ్చిందని సంతోషించారు. అయితే ఈసారి మత్స్యశాఖ ఎఫ్‌డీవో, ఏడీ, వీఎఫ్‌ఏ, డీడీలు పెద్ద మొత్తం మీద కన్నేశారు. అందుకే మరబోట్లు కానివాటికి ఇంజిన్ ఉన్నట్టు, వేట ఆపేసిన కుటుంబాలు వేటకు వెళ్తున్నట్టు చూపించారు. అలాగే సముద్రం మీద వేటే ప్రధాన వృత్తిగా ఉన్న ఇతర కులాల వారికి కూడా భరోసా ఇవ్వొచ్చన్న ఆదేశాల మేరకు అనేకమందిని ఇందులో చేర్చేశారు. ఇందులో ఎవరు ఒరిజినల్? ఎవరు డూప్లికేట్ అనేది కేవలం ఆ సముద్రం ఒడ్డున ఉన్న మత్స్యకారులు మాత్రమే చెప్పగలరు. అలా ఎవరైనా ముందుకొచ్చి తమకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేస్తే, వారిపైకి మిగిలిన మత్స్యకారులను ఎగదోస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణే పోలాకి మండలం అంపలాం పంచాయతీ పరిధిలోని సంబంధం లేనివారిని జాబితాలో చేర్చి నగదు జమ చేశారు. పంచాయతీ పరిధిలో నాలుగు గ్రామాలు ఉండగా, ఒక్క రాజారాంపురంలోనే 728 మందికి మత్స్యకార భరోసా అందజేశారు. వాస్తవానికి పంచాయతీని యూనిట్‌గా తీసుకొని అర్హులను గుర్తించాలి. కానీ గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని అధికారులు జాబితా రూపొందించినట్లు తెలుస్తుంది. ఇదే రాజారాంపురంలో 728 మందిలో అర్హులెంతమంది? అనర్హులెందరు? అనేది పక్కన పెడితే.. వెలమలు, కాళింగులు, యాదవ, కాపు, సెగిడి, నాయిబ్రాహ్మణ, రజక కులాలకు చెందినవారికి కూడా మత్స్యకార భరోసా డబ్బులు పడ్డాయి. పోనీ వీరెవరైనా మత్స్యకారుడి బోటులో కలాసీలుగా చేస్తున్నారా? అంటే అదీ లేదు. ఆ మాటకొస్తే వీరి పేరు మీద నమోదైన బోట్లు అసలు మనుగడలోనే లేవు. ఎప్ప్పుడో పాడవడంతో వాటిని తుప్పల్లో పడేశారు. వీటిని మరపడవలుగా చూపించి మరీ సొమ్ములు నొక్కేశారు మత్స్యశాఖ అధికారులు. ఇందులో ఫిఫ్టీ`ఫిఫ్టీ షేర్ ఉండటం వల్ల మత్స్యశాఖ అధికారులు చెప్పినదానికి అనర్హులంతా తలాడించాల్సి వస్తుంది. పోనీ అనర్హులకు ఇస్తే ఇచ్చారు, తమ పడవలో ఉన్న అర్హులకు ఇస్తే చాలని ప్రశ్నిస్తే, మిగిలినవారిని రెచ్చగొట్టి వారి మీదకు పంపుతున్నట్లు అంపలాం పంచాయతీకి చెందిన మైలపల్లి సూరిబాబు చెప్ప్పుకొచ్చారు. జిల్లాలో రూ.33.47 కోట్లు మత్స్యకారుల కోసం కేటాయిస్తే.. అందులో కనీసం మూడోవంతు మత్స్యశాఖ అధికారులు తినేసినట్లు ఒక అంచనా. ఎందుకంటే.. ఇక్కడ మత్స్యకారుల బోట్లకు సంబంధించి ముందస్తుగా ఎటువంటి రికార్డులూ లేవు. తెప్పతో నడిచే పడవలను మోటార్‌బోట్లుగా చూపించాలన్నా, మోటార్ బోట్లలో ఆరుగురికి కాకుండా యజమానికి మాత్రమే మత్స్యకార భరోసా ఇచ్చినా అడిగే నాధుడు లేడు. ఇప్ప్పుడు కొన్ని ప్రాంతాల్లో వేటకు వెళ్లిన మత్స్యకారుల కంటే బయటివారే ఎక్కువగా ఉండటం వల్ల మత్స్యశాఖ అధికారులకు మద్దతు బాగా లభిస్తోంది. అయితే దీనిపై ఇంటెలిజెన్సీ నివేదికలు ప్రభుత్వానికి వెళ్లడంతో త్వరలోనే మత్స్యశాఖ అధికారులకు శిక్షలు తప్పవని తెలుస్తుంది. ఎందుకంటే.. స్వయంగా కొన్నిచోట్ల ఎమ్మెల్యేలే భరోసా పంపిణీపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.






Comments