ధర్మానతో ఏకాంతంగా గంటకుపైబడి మాట్లాడిన విజయసాయిరెడ్డి
మౌనం వీడని ప్రసాదరావు
జగన్ తరుఫున రాయబారిగా వచ్చినట్లు భోగట్టా
ఒకరి బాధలు ఒకరు ఏకరువు పెట్టుకున్నారని చర్చ

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
వైకాపా అధిష్టానం వైఖరి పట్ల అలకతో ఉన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో ఆ పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జ్ విజయసాయి రెడ్డి గురువారం సాయంత్రం గంటకు పైగా ఏకాంతంగా చర్చిం చారు. జిల్లాలో అర్థాంతరంగా నిలిచిపోయిన వైకాపా కార్యాలయ పనులు మళ్లీ ప్రారంభించే విధంగా సూచనలివ్వడానికి శ్రీకాకుళం వచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నా అందులో ఏమాత్రం వాస్తవం లేదని అర్థమవుతోంది. నిజంగా పార్టీ కార్యాలయ పనుల మీదే వచ్చి ఉంటే ముందు ఆ పని చూసుకుని ఆ తరువాత ఆ పక్కనే ఉన్న ధర్మా న ఇంటికి వెళ్లి ఉండేవారు. అలా కాకుండా జిల్లాలో పార్టీ నాయ కులు అక్కడికి చేరుకోక ముందే ధర్మాన ఇంటికి నేరుగా వెళ్లి ఏకాం తంగా ఒక గదిలో వీరిద్దరూ గంటకుపైగా చర్చించారు. ఆ సమ యంలో విజయసాయిరెడ్డితోపాటు విశాఖపట్నం నుంచి వచ్చిన చిన్న శ్రీను, మాజీ మంత్రి గుడివాడ అమరనాధ్‌లు బయట విజిటర్స్ హాల్‌లోనే ఉండిపోయారు. గంటకుపైగా మాట్లాడిన తరువాత బయ టకు వచ్చినా ధర్మాన తన మౌనాన్ని వీడలేదు. ఏకాంతంగా నడిచిన చర్చలో ఇద్దరూ గడిచిన ఐదేళ్లలో పార్టీ చేసిన తప్పిదాలను, జగన్మో హనరెడ్డి వ్యవహారశైలిని చర్చించుకుని ఒకరినొకరు ఓదార్చుకున్నట్లు భావిస్తున్నారు. అయితే దీనిపై ఇరువురూ ఎటువంటి ప్రకటన చేయ లేదు. ఆ తరువాత కాసేపు విజిటర్స్‌హాల్‌లో అందరితోనూ కలివిడిగా విజయసాయిరెడ్డి మాట్లాడినా ధర్మాన పెద్దగా జోక్యం చేసుకోలేదని తెలుస్తోంది. పార్టీ అధికారం కోల్పోయిన తరువాత ధర్మాన ప్రసాద రావు ఆ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డిని కేవలం ఒక్కసారి మాత్రమే కలిశారు. ఆ తరువాత రెండుసార్లు జిల్లా నేతలతో జగన్ సమావే శమైనా ఆ కార్యక్రమానికి ధర్మాన వెళ్లలేదు. జిల్లాలో రాజ శేఖరరెడ్డి జయంతి, వర్థంతి కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనలేదు. చివరకు జిల్లా పార్టీ అధ్యక్షుడుతోపాటు, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, లీగల్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు పదవులు స్వీకరించే కార్యక్రమం జిల్లా కేంద్రానికి దూరం గా నరసన్నపేటలో పెట్టుకున్నారు. దానికి కూడా ధర్మాన ప్రసాదరావు హాజరుకాలేదు. కొద్దిరోజుల క్రితం జిల్లాలో పార్టీ ఆఫీసు పనులపై ఒక నిర్ణయం తీసుకోవడానికి జిల్లా లో వైకాపా ఇన్‌చార్జ్‌లంతా రావాలని ధర్మాన క్రిష్ణ దాస్ జిల్లా పార్టీ అధ్యక్షుని హోదాలో పిలుపునిచ్చారు. ఎలాగూ పార్టీ కార్యాలయం లేదు కాబట్టి ఆ పక్కనే ధర్మాన ప్రసాద రావు బంగ్లా ఉందని, అందులో సమావేశమవుతున్నట్లు ప్రకటించారు. ధర్మాన ఇంట్లో సమావేశం పెట్టుకుంటే తాము ఎందుకు వస్తామంటూ తమ్మినేని సీతారాం, రెడ్డిశాంతిలు ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. పోనీ ధర్మాన ప్రసాద రావు అయినా వచ్చారంటే ఆయన కూడా ఆయన బంగ్లాలో జరిగే సమావేశానికి రాలేదు. అంత వరకు తన మీటింగు లకు ధర్మాన ప్రసాదరావు రాకపోవడానికి సీరియస్‌గా పరి గణించని జగన్మోహనరెడ్డి ఇప్పుడు ఆయన ఇంట్లో జరిగిన సమావేశానికి ఆయన హాజరు కాకపోవడంపై దృష్టి సారించి విజయసాయిరెడ్డిని రాయబారిగా పంపినట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర బాధ్యతలు మళ్లీ స్వీకరించిన తరువాత శ్రీకాకుళంలో పెట్టిన తొలి అడుగే ధర్మాన ఇంట్లో పెట్టారు. జగన్మోహనరెడ్డి వ్యవహారశైలి మారితే రెండున్నరేళ్ల తరు వాత ఏదో ఒక నిర్ణయం తీసుకుందామన్న ఆలోచనలో ధర్మాన ప్రసాద రావు ఉన్నారు. ధర్మాన ప్రసాదరావు వస్తే గానీ జిల్లాలో పార్టీ కార్యక్ర మాలు ఊపందుకోవన్న రిపోర్టు క్రిష్ణదాస్ జగన్మోహనరెడ్డికి ఇచ్చి ఉన్నారు. ఈమేరకు విజయసాయిరెడ్డి ధర్మాన అలక ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలని వచ్చినట్లు కనిపిస్తోంది. వాస్తవానికి విజయ సాయిరెడ్డే మొన్నటి వరకు అలిగి ఉన్నారు. ఎప్పుడైతే తాను కోరు కున్న ఉత్తరాంధ్ర ఇన్‌చార్జ్ బాధ్యతలు ఆయనకు అప్పగించారో అప్పుడే ఆయన జగన్మోహనరెడ్డి కుటుంబ ఆస్థుల వివాదంపై చాలారోజుల తరువాత ట్వీట్ చేశారు. అధికారంలో ఉన్నపుడు ధర్మాన ప్రసాదరా వుతోపాటు అనేకమంది సీనియర్ నాయకులను కూరలో కరివేపా కులా చూసిన సందర్భాలు కోకొల్లలు. బీసీలకు టిక్కెట్ ఇవ్వాలన్న ఒకే ఒక కారణం చూపించి కనీసం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకు కూడా చెప్పకుండా అభ్యర్థిని ప్రకటించిన నియోజకవర్గాల్లో వైకాపా నాయ కులు అందరి పరిస్థితి ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు మాదిరిగానే ఉంది. 50 ఏళ్ల నుంచి ప్రకాశం జిల్లా కమ్మ సామా జికవర్గం బలంగా ఉన్న కందుకూరు నియోజకవర్గంలో మానుగుంట మహీధర్‌రెడ్డి అనుచరులైతే అక్కడ ఫ్లెక్సీల్లో జగన్మోహనరెడ్డి ఫోటో పెట్టడానికి కూడా ఇష్టపడడం లేదు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఉన్న మహీధర్‌రెడ్డి ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా, అవినీతి ఆరోపణలు లేని నాయకుడిగా నిలదొక్కుకున్నారు. ఇక్కడ రెడ్డిని కాదని, పక్కనే ఉన్న కనిగిరి నియోజకవర్గంలో బుర్రా మధుసూ ధన్‌యాదవ్‌ను తెచ్చి కందుకూరులో నిలబెట్టారు. ఆయన బీసీ కావడం ఒక కారణమైతే, ఆయన సొంతూరు కందుకూరు అనేది జగన్మోహనరెడ్డి ఆలోచన. బుర్రాకు టిక్కెట్ ప్రకటించినపుడు పక్కనే ఉన్న మహీధర్‌రెడ్డికి ఒక్క మాట కూడా జగన్మోహనరెడ్డి చెప్పలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇలా కేబినెట్ బయట ఉన్నవారికి, కేబినెట్‌లో ఉన్న ధర్మాన ప్రసాదరావు వరకు అనేక అవమానాలు ఎదురయ్యాయి. అంతెందుకు ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇవ్వకముందు ట్రబుల్‌షూటర్ అని చెప్పుకునే విజయసాయి రెడ్డి ఎక్కడ ఉన్నారో కూడా కనిపించలేదు. విజయసాయిరెడ్డి స్వస్థలం నెల్లూరు జిల్లా. గత ఎన్నికల్లో అక్కడే ఎంపీగా పోటీ చేశారు. విచిత్రం ఏమిటంటే ఆయనది నెల్లూరు అన్న విషయం ఆ జిల్లాలో ఎవరికీ తెలియదు. నాన్‌లోకల్ అయిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి విజయసాయి రెడ్డి మీద గెలిచారు. ఆ తరువాత విజయసాయి నాలుగు ట్వీట్లు... ఎంపీలకు బర్త్‌డే విషెస్ చెబుతూ ట్విట్టర్‌లో కాలం గడిపేశారు. వాస్త వానికి ధర్మాన ప్రసాదరావుతో రాయబారానికి జగన్మోహనరెడ్డి దిగి వచ్చి ఉండేవారు కాదు. కాకపోతే 2027లో జమిలి ఎన్నికలు వస్తాయని, అప్పటి సరికి కొత్త నాయకత్వాన్ని బలోపేతం చేయలే మన్న ఒకే ఒక్క కారణంతో రాయబేరాలు సాగించినట్లు తెలుస్తోంది. అసలు ధర్మాన అలక వెనుక ఉన్న వంద కారణాల్లో రీజనల్ కో`ఆర్డినేటర్ పదవి కూడా ఒకటి కావడం, ఇప్పుడే అదే కో`ఆర్డినేటర్ ధర్మాన దగ్గరకు రావడం వైకాపాలో మాత్రమే జరుగుతుంది. జిల్లాపరంగా ధర్మానకు డిమాండ్లు ఏమీలేవు. జగన్మోహనరెడ్డి మైండ్‌సెట్ మారడం తప్ప!!
Comments