ఆగష్టు 7న ఉత్తమ శాస్త్రవేత్తల పురస్కారాలు అందజేసిన రాష్ట్రపతి
తాము ఎంపిక చేసిన వారి పేర్లు లేవని శాస్త్రవేత్తల అనుమానాలు
నెమ్మదిగా రాజుకుంటున్న నిరసన ధ్వనులు

ప్రపంచంలో సైన్స్ రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం నోబుల్ బహుమతి కాగా, మన దేశం వరకు అతి గొప్ప శాస్త్రరంగ పురస్కారంగా భావించేది విజ్ఞాన్ యువ శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు. ఈ ఏడాది భట్నాగర్ పురస్కారానికి ఎంపికైన పేర్లలో మతలబులు ఉన్నాయని పెద్దఎత్తున నిరసన రేగుతోంది. భారతదేశంలో ప్రసిద్ధిచెందిన 26 మంది శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగ ముఖ్య కార్యదర్శికి ఈ విషయమై ఒక లేఖ రాశారు. ఈ ఏడాది శాంతిస్వరూప్ భట్నాగర్ పేరిట ఇస్తోన్న అవార్డులలో పైరవీలు జరిగినట్టు, అహేతుకంగా శాస్త్రవేత్తలు కానివారికి పురస్కారాన్ని ప్రకటించినట్టు వస్తోన్న వార్తల నేపథ్యంలో తమకు నిజానిజాలు వివరించాలని డిమాండ్ చేస్తూ వారు రాసిన లేఖలో డిమాండ్ చేశారు. అందులో తమ పేరు వెల్లడిరచడానికి ఇష్టపడని నలుగురు శాస్త్రవేత్తలు మీడియా ముందుకు వచ్చారు. భౌతిక శాస్త్ర విభాగంలో పురస్కారానికి దేశంలో మేలైన శాస్త్రవేత్తలున్న ఎంపిక కమిటీ సిఫారసు చేసిన మూడు పేర్లలో రెండిరటిని జాబితాలోంచి ప్రభుత్వం తొలగించిందని ‘స్క్రోల్’ పత్రిక ఆరోపించింది. మరో సైన్స్ విభాగంలో మూడో అభ్యర్థిని జాబితా లోంచి తొలగించినట్లు మంగళవారం ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ దినపత్రిక వెల్లడిరచింది.
ఎంపిక పద్ధతినే మార్చేసిన ప్రభుత్వం
ప్రముఖ శాస్త్రవేత్త శాంతిస్వరూప్ భట్నాగర్ పేరుమీద నెలకొల్పిన ఈ అవార్డును 1958 నుంచి ఇస్తున్నారు. ఈ పురస్కారాన్ని జీవ, రసాయన, గణిత, భౌతిక శాస్త్రాలు, వైద్యం, ఇంజనీరింగ్, భూ వాతావరణ పరిశోధన, సముద్రం, ప్లానెటరీ సైన్స్ విభాగాలలో ఇస్తుంటారు. ఈ పురస్కారాలను అందజేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వ సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్న సిఎస్‌ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్)కు అప్పజెప్పారు. దీనిపేరు మార్చాలని ముందు ప్రభుత్వం భావించింది. శాస్త్రవేత్తల నుంచి గట్టిగా నిరసన ఎదురయ్యేసరికి, పేరు వెనుక శాంతిస్వరూప్ భట్నాగర్ ఉంచారు. గడచిన ఆరు దశాబ్దాలుగా పాటిస్తున్న ఈ పురస్కారాల ఎంపిక సంప్రదాయానికి మోదీ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చినట్టు శాస్త్రవేత్తలు ఆరోపిస్తున్నారు. శాస్త్రవేత్తల కమిటీలు చేసిన సిఫారసులను ప్రభుత్వం ఎంపిక చేయడమనే ఆనవాయితీకి స్వస్తి చెప్పి, తమకు నచ్చినవారికి పురస్కారాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడినట్టు తెలుస్తోంది. అలా తొలగించబడిన ఒక పేరున్న శాస్త్రవేత్త మోదీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తుండడమే కారణమని వారు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ అవార్డుల పైన అల్లుకున్న నీలినీడల గురించి పూర్తి సమాచారాన్ని వెల్లడిరచి తమ అనుమానాలను నివృత్తి చేయాలని ఆగష్టు 30న శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. ఈ ఏడాది అవార్డు విధివిధానాలను, ఎంపిక పద్ధతిని పూర్తిగా ప్రభుత్వం మార్చేసింది. ముందుగా స్వతంత్రంగా ఉన్న ఈ అవార్డును ఒక సమూహంలో చేర్చింది. మొత్తం శాస్త్ర సాంకేతిక పురస్కారాలను రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలనే పెద్ద సమూహంగా ఏర్పాటు చేసింది. దానిని విజ్ఞాన రత్న, విజ్ఞానశ్రీ, విజ్ఞాన్ యువ శాంతిస్వరూప్ భట్నాగర్, విజ్ఞాన బృందం అని నాలుగు విభాగాలుగా విడదీసింది. అక్కడితో ఊరుకోకుండా, మరొక అతి ముఖ్యమైన మార్పు చేసింది. అది ఎంపిక విధానాన్ని మార్చింది. గత ఏడాది వరకు ప్రతి విభాగపు సెలక్షన్ కమిటీలోను గతంలో ఈ భట్నాగర్ అవార్డు పొందిన శాస్త్రవేత్తలు ఉండేవారు. ఆరు దశాబ్దాల తర్వాత ఈ ఎంపిక కమిటీలో శాస్త్రవేత్తలను భారీగా కుదించి, వారి స్థానంలో ప్రభుత్వ అధికారులను చేర్చింది. విజేతల వివరాలు వెల్లడిరచే అధికారం శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి చేతిలో ఉండేట్లు నిబంధనలు సవరించింది.
భావజాల నియంత్రణలో భాగమే!
ఈ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార కమిటీకి చైర్‌పర్సన్‌గా ఆ శాఖ ముఖ్య సాంకేతిక సలహాదారు ఉంటారు. ఈ కమిటీలో వివిధ సైన్స్, ఇంజనీరింగ్ అకాడమీల నుంచి నలుగురు అధ్యక్షులు, ఆరుగురు శాస్త్రవేత్తలు, ఆరుగురు వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. పురస్కార గ్రహీతలను నిర్ణయించే అధికారం మంత్రుల చేతిలో ఉంటుందని తమ వెబ్‌సైట్‌లో ప్రదర్శించకుండా రహస్యంగా ఉంచి, గత వారమే వెల్లడిరచారు. దాంతో శాస్త్రవేత్తలు ఎంపిక చేసిన పేర్లలో తమకు నచ్చని వ్యక్తుల పేర్లు జాబితాలో గల్లంతయ్యాయి. వారు భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా అందజేయాల్సిన ఈ అత్యున్నత పురస్కారాలు ఇప్పుడు నవ్వులపాలయ్యాయి. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారికి, ప్రతిపక్షాలకు సమర్ధనగా మాట్లాడిన వారికి ఇవ్వకూడదనే స్థాయికి దిగజారినట్లు ప్రభుత్వానికి లేఖ రాసిన 26మంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ లేఖ సంతకం చేయని మరెంతోమంది శాస్త్రవేత్తలు ప్రభుత్వ నిర్ణయానికి తీవ్రంగా అభ్యంతరం చెప్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం అంతా స్వీడన్ రాజు నోబెల్ బహుమతి గ్రహీతను తిరస్కరించినట్టు కనిపిస్తోందని వారు విస్తుపోతున్నారు. తాము ప్రతిపాదించిన శాస్త్రవేత్తల పేర్లు జాబితాలో లేకపోవడం వారికి శరాఘాతంగా తగిలింది. ప్రభుత్వం కొందరి పేర్లు ఉద్దేశపూర్వకంగా ఉపసంహరించుకున్నట్టు కనిపిస్తోందని, ఇదంతా కేవలం తమ భావజాలానికి అనుగుణంగా ఉండమని శాస్త్రవేత్తలను నేరుగా హెచ్చరిస్తున్నట్టు కనిపిస్తోందని, ఇది చాలా ప్రమాదకరమైన పరిణామమని వారు వాపోతున్నారు. గ్రంథచౌర్యం లేదా పని ప్రదేశంలో మహిళా ఉద్యోగినుల వేధింపు వంటి అంశాలపై ఫిర్యాదులున్న శాస్త్రవేత్తలను జాబితా నుంచి తొలగిస్తే తప్పు లేదు. లేదా వారు చేసిన తప్పును వెల్లడిరచి, జాబితాలను సవరించినా పరవాలేదు కాని, నిష్కారణంగా, రాగద్వేషాలకు లోబడి కొందరు శాస్త్రవేత్తల పేర్లను అవార్డుల జాబితా నుంచి తొలగించడం సహేతుకం కాదని వారు ఆరోపిస్తున్నారు. చివరి క్షణంలో మంత్రి ఇలా కొన్ని పేర్లను తొలగించడానికి తగిన కారణాలను వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం శాస్త్రవేత్తల నోర్లు ఎలా మూయిస్తుందో చూడాలి!
దుప్పల రవికుమార్
留言