కేడర్‌తో సీతారామ్ వరుస సమావేశాలు
రాష్ట్ర కార్యదర్శిగా కిల్లి సత్యనారాయణ
అలకో, అసంతృప్తో బయటపడని మాజీ స్పీకర్
జనసేనలో చేరుతారని ప్రచారం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఆమదాలవలస నియోజకవర్గం వైకాపా ఇన్‌ఛార్జిను మార్చిన తర్వాత ఆ పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు తమ్మినేని సీతారామ్ రెండు రోజుల నుంచి నియోజకవర్గంలో వైకాపా నాయకులతో చర్చలు జరుపుతున్నారు. శుక్రవారం మున్సిపాలిటీలో ఉన్న వైకాపా నేతలతో ఆయన మంతనాలు జరిపిన తర్వాత శనివారం నుంచి మిగిలిన మూడు మండలాల కేడర్‌తో మాట్లాడుతున్నారు.
సరుబుజ్జిలి మాజీ ఎంపీపీ కిల్లి వెంకట సత్యనారాయణ తన కుమారుడితో కలిసి వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం కలిశారు. ఈయనకు రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా నియమిస్తున్నట్లు జగన్మోహన్‌రెడ్డి చెప్పినట్టు భోగట్టా. అంతేకాకుండా ఆమదాలవలస నియోజకవర్గంతో పాటు జిల్లాలో కళింగ సామాజికవర్గం మీద ప్రభావం చూపే విధంగా వ్యవహరించాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తుంది.
విడివిడిగా చూస్తే ఈ రెండూ రెండు వార్తలు. ఒకదానికొకటి సంబంధం ఉందా..? అంటే ఉంది. లేదూ అంటే లేదు. కానీ జమిలీ ఎన్నికలు వస్తాయని భావిస్తున్న జగన్మోహన్‌రెడ్డి ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాపై దృష్టి సారించారు. అందుకే సీతారామ్‌ను పార్లమెంట్‌కు పంపించి, అక్కడ చింతాడ రవికుమార్‌కు అవకాశం ఇస్తున్నట్టు పార్టీ తరఫున ప్రకటించారు. అయితే సీతారామ్ అంత తేలిగ్గా అసెంబ్లీ స్థానాన్ని విడిచిపెడతారంటే ఆయన్ను ఎరిగిన రాజకీయ నాయకులెవరూ నమ్మడంలేదు. జగన్ వ్యవహార శైలి తెలిసినవారు ఆయన నిర్ణయంలో మరి మార్పు ఉండదని చెబుతున్నారు. ఇప్పుడు ఆమదాలవలస నియోజకవర్గంలో ఏం జరుగుతోందనేదే సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న. తన తర్వాత రాజకీయ వారసుడిగా కుమారుడు చిరంజీవి నాగ్‌ను నిలబెట్టాలని సీతారామ్ ఎప్పట్నుంచో భావిస్తున్నారు. తాను పార్లమెంట్‌కు వెళ్లాలంటే కొడుకుకు అసెంబ్లీ సీటు ఇవ్వాలని గత ఎన్నికల్లోనే సీతారామ్ జగన్మోహన్‌రెడ్డిని కోరారు. అది కుదిరే పని కాదనే మళ్లీ సీతారామ్‌కే టిక్కెటిచ్చారు. అయితే ఈసారి జగన్మోహన్‌రెడ్డి మొహమాటాలకు పోరని తెలుస్తుంది. తనకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ప్రకటించిన తర్వాత సీతారామ్‌ను కలిసి చింతాడ రవికుమార్ పుష్పగుచ్ఛం ఇచ్చారు. ఈ సందర్భంగా వైకాపా అధికార పత్రికలో వెలువడిన ఫొటోను చూసిన వైకాపా నేతలు సీతారామ్ ఎలా స్పందించివుంటారో చర్చించుకుంటున్నారు. ఎందుకంటే.. ఆ ఫొటోలో ఎక్కడా సీతారామ్ మోములో నవ్వు కనిపించలేదు. అలాగే సాక్షి సీతారామ్ చింతాడను అభినందించినట్టు కూడా రాయలేదు. అక్కడికి రెండు రోజుల వ్యవధిలో సీతారామ్ నియోజకవర్గంలో వైకాపా నాయకులతో సమావేశమవుతున్నారు. ఎక్కడా తాను అసెంబ్లీకే వెళ్తానని, ఏ సమయంలోనైనా మార్పు ఉంటుందని ప్రస్తావించడం లేదు. అలా అని పార్టీ ఆదేశాల మేరకు పార్లమెంట్‌కు పోటీ చేస్తానని, ఆమదాలవలసలో రవికుమార్ ఉంటాడని కూడా కేడర్‌కు చెప్పడం లేదు. సో.. ఇప్పుడు సీతారామ్ ఏం చేస్తారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. కనీస ముందస్తు సమాచారం లేకుండా, జిల్లా పార్టీ అధ్యక్షుడికి సైతం చెప్పకుండా వైకాపా ఆమదాలవలస అసెంబ్లీ ఇన్‌ఛార్జిని మార్చింది. సహజంగానే అప్పటి వరకు ఇన్‌ఛార్జిగా ఉన్న నాయకుడికి అసహనం ఉంటుంది. ప్రస్తుతం సీతారామ్‌లో ఉన్నది అదేనా? లేదూ అంటే.. మరో ఆలోచన ఉందా? అనేది స్పష్టం కావడంలేదు. నియోజకవర్గ వైకాపా నేతలతో మాట్లాడినప్పుడు కూడా ఎక్కడా సీతారామ్ పరోక్ష సంకేతాలు ఇవ్వడంలేదు. కానీ, సీతారామ్ గత చరిత్రను దృష్టిలో పెట్టుకొని ఆయన పార్టీ మారుతారన్న సందేహాలే ఇప్పుడు చాలాచోట్ల వ్యవక్తమవుతున్నాయి. చివరి నిమిషం వరకు బయటపడకపోవడం సీతారామ్ లక్షణమని 2007లో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లేవరకు సీతారామ్ పార్టీ మారుతారని ఎవరికీ ఉప్పందించలేదు. నేరుగా హైదరాబాద్‌లో చిరంజీవి పక్కన కనిపించేవరకు ఆయన టీడీపీని వీడుతారని ఎవరూ భావించలేకపోయారు. ఎందుకంటే.. అంతకు ముందే తాను చనిపోతే, మృతదేహం మీద తెలుగుదేశం జెండాయే ఉంటుందని సీతారామ్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అటువంటి సీతారామ్ ఆకస్మికంగా పీఆర్పీలోకి వెళ్లి, 2009 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్లీ టీడీపీకి వచ్చారు. టీడీపీలో టిక్కెట్ రాదని తెలుసుకున్నాక అట్నుంచటే వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమైనా జనసేనలోకి వెళ్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కూడా ఈ మేరకే ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే సరుబుజ్జిలి మాజీ ఎంపీపీ కిల్లి వెంకట సత్యనారాయణను జగన్మోహన్‌రెడ్డి పిలిపించుకొని రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చినట్లు భావిస్తున్నారు. పురుషోత్తపురానికి చెందిన కిల్లి వెంకట సత్యనారాయణకు ఆమదాలవలస నియోజకవర్గం మీద పట్టుంది. అంతేకాకుండా వివాదరహితుడు. ఇటు ధర్మాన ప్రసాదరావు కోటరీలోను, అటు సీతారామ్ ఆంతరంగికుడిగాను మెసులుతున్న ఏకైక ఆమదాలవలస నియోజకవర్గ నేత కిల్లి సత్యనారాయణే. సీతారామ్ పార్టీ మారితే నియోజకవర్గంలో అసెంబ్లీ సీటుకు డ్యామేజ్ లేకుండా ముందుగానే కిల్లిని క్లియర్ చేసి పెట్టుకున్నారని భావిస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ను సముచిత స్థానంలో నిలుపుతారని జగన్మోహన్‌రెడ్డి మాటిచ్చారనే టాక్ నడుస్తోంది. పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే సీతారామ్ అసెంబ్లీకి వెళ్తే కచ్చితంగా మంత్రి అవుతారనే ఒక ఆశ ఉంటుంది. అటువంటిది ఇప్పుడు ఎంపీగా పోటీ చేసి ఏమీ చేయలేమన్న అసహాయత వల్ల సమావశాలు పెట్టుకుంటే తప్పులేదు కానీ, పార్టీ మారితే సరికాదనే భావనలో అక్కడి పార్టీ కేడర్ ఉన్నారు.
Comentários