సహాయక చర్యల్లో మంత్రి అచ్చెన్నాయుడు
వరదలు తగ్గడంలో పారిశుధ్య పనులు వేగవంతం
బుడమేరును సందర్శించిన మంత్రి అచ్చెన్న

అమరావతి: వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అలుపెరుగక విశ్రమించక వరద బాధిత ప్రాంతాలలో పర్యటిస్తూ బాధితులకు భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వం తరఫున చేపడుతున్న సహాయక చర్యల్లో పాల్గొంటూ, యంత్రాంగంలో ఉత్తేజాన్ని నింపుతూ, కొత్త స్ఫూర్తిని చాటుతున్నారు. వరద ఉధృతి నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సుడిగాలి పర్యటన చేపడుతున్నారు. వారం రోజులుగా విజయవాడలోనే ఉంటూ బాధిత ప్రాంతాల్లో బృంద పర్యటన చేస్తూ, తన తోటి మంత్రులతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొని సూచనలు అందిస్తున్నారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా బాధిత వర్గాలకు ఆహార పంపిణీ, పాలు, తాగునీటి సరఫరా చేపడుతున్నామని మంత్రి అచ్చెన్న తెలిపారు. ఆయన వెంట మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, పలువురు కూటమి నాయకులు, అధికారులు ఉన్నారు. ముంపు ప్రాంతాల్లో ఆటో, ద్విచక్ర వాహనంపై పర్యటించి, బాధితులలో భరోసా నింపారు. కొన్ని పల్లపు ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని తక్షణమే మోటార్ల ద్వారా తొలగించేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి అచ్చెన్న తెలిపారు. మరోవైపు వరద ముంపునకు ప్రధాన కారణమైన బుడమేరు గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్చడం పూర్తి చేశామని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం మేరకు సమర్థంగా యంత్రాంగం అంతా పనిచేస్తున్నారని అన్నారు. 45వ డివిజన్‌లో రామరాజు నగర్, కబేళా సెంటర్, పవర్ స్టేషన్ రోడ్డు, జోజి నగర్‌లో వరద నీటి నిల్వలు తొలగించేందుకు ఇప్పటివరకూ చేపట్టిన చర్యలపై అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో మురుగు నీటిని తొలగించి తక్షణమే శానిటేషన్ కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని నిర్దేశించారు.
Comments