top of page

అలా వెళ్లిపోతే ఎలా సార్‌.. ఇదీ అడగాలి కదా!

Writer: ADMINADMIN

Updated: Aug 8, 2024

  • విధులకు హాజరుకాని ఎంఎన్‌వో

  • ఆరోగ్యశ్రీలో నైట్‌డ్యూటీ చేస్తున్నాడని కవరింగ్‌

  • నర్సులకు సహాయం అందక గగ్గోలు

  • ఎమ్మెల్యే సమీక్షలోనూ కనిపించని షన్ముఖరావు

(సత్యంన్యూస్‌, నరసన్నపేట)

నియోజకవర్గంలో బుడితి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు ప్రతీరోజు దాదాపు 200 మంది ఔట్‌ పేషెంట్లు వస్తుంటారు. బుడితి పెద్ద పంచాయతీ కాగా, ఆ పరిసర ప్రాంతాలకు ఇదొక్కటే పూర్తిస్థాయిలో వైద్యులున్న హెల్త్‌ సెంటర్‌. ఇటువంటి ఆసుపత్రిని బుధవారం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పరిశీలించారు. వైద్యసేవలు అందుతున్న విధానం, ఆసుపత్రిలో మందుల నిల్వలు వంటివి పరిశీలించి సిబ్బంది, రోగులతో మాట్లాడి సీహెచ్‌సీ పనితీరు బాగుందంటూ కితాబిచ్చి వెళ్లిపోయారు. పనిలో పనిగా మీడియాలో ఈ విషయం ప్రచురితం కావాలి కాబట్టి ఆసుపత్రిలో రోగులకు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించొద్దంటూ ఓ సూచన వదిలారు. అత్యవసర సేవల కోసం వచ్చే రోగుల పట్ల ప్రేమపూర్వకంగా ఉండాలని, అన్ని వసుతుల అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేనా.. బుడితి సీహెచ్‌సీలో అంతకు మించి సమీక్షించడానికి మరేమీ లేదా? అంటే.. ఉంది. కచ్చితంగా రోగులకు సేవలందించే చోటే ఇబ్బంది ఉంది. కానీ దీనిని అక్కడ వైద్యాధికారులు దాచేయడంతో ఎమ్మెల్యే సంతృప్తి వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు. వాస్తవానికి ఇక్కడ స్టాఫ్‌ నర్సులకు సహాయకారిగా ఉండాల్సిన ఒక ఎంఎన్‌వో కొన్నాళ్లుగా విధులకు రావడంలేదు. దీంతో మేల్‌ నర్సింగ్‌ అందించాల్సిన చోట సేవాలోపాలు తలెత్తుతున్నాయి. ఇక్కడ ఎంఎన్‌వోగా ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పని చేస్తున్న షన్ముఖరావు టీచర్‌ ట్రైనింగ్‌ శిక్షణ పూర్తిచేయడంతో మెగా డీఎస్సీ కోసం తర్ఫీదు పొందడంలో భాగంగా సీహెచ్‌సీలో విధులకు హాజరుకావడంలేదు. ఎంఎన్‌వో ఎక్కడని స్టాఫ్‌ నర్సులు ప్రశ్నిస్తే, ఆరోగ్యశ్రీ ఎంట్రీ కోసం కంప్యూటర్‌ ఆపరేటర్‌గా నైట్‌ డ్యూటీ చేస్తున్నారంటూ అక్కడి వైద్యాధికారి చెప్పుకొస్తున్నారట. వాస్తవానికి నైట్‌ డ్యూటీకి కూడా షన్ముఖరావు రావడంలేదు. ఆరోగ్యశ్రీ కింద సేవలు తీసుకోడానికి వచ్చే రోగుల కోసం ఇదే సీహెచ్‌సీలో నలుగురు ఆరోగ్యమిత్రలు పని చేస్తున్నారు. పోనీ వారి వల్ల కంప్యూటర్‌ డేటా ఎంట్రీ జరగడంలేదనుకుంటే ఇక్కడ మరో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ కూడా ఉన్నారు. లేదంటే జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టు కూడా ఇక్కడ ఉంది. కాని ఎంఎన్‌వో షన్ముఖరావే ఈ డ్యూటీ చేస్తున్నట్లు వైద్యాధికారులు వెనకేసుకొస్తున్నారు. వాస్తవానికి ఈ పనిని జీడీఏతో చేయించుకోమనే ఆదేశాలు ఉన్నాయి. కానీ షన్ముఖరావు నైట్‌డ్యూటీలో ఆరోగ్యశ్రీ పని చేస్తున్నారని ఓ శుద్ధ అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. స్వయంగా ఎమ్మెల్యే సమీక్షించిన సమయంలో కూడా షన్ముఖరావు విధుల్లో లేరు. ఆ విషయం ఎమ్మెల్యే రమణమూర్తికి తెలియదు, వైద్యాధికారులు చెప్పలేదు. అయితే ఇప్పుడు షన్ముఖరావు ఎంఎన్‌వో విధులు చేయాలని మెడికల్‌ ఆఫీసర్‌ సుజనకుమారికి తెలిసినా ఎందుకు ఆయనకు ఆ పని చేయమనట్లేదంటే షన్ముఖరావుది ఎమ్మెల్యే సొంతవూరు మర్రివలస అని చెబుతున్నారు. రమణమూర్తి బంధువర్గం పేరు చెప్పి షన్ముఖరావు బుడితి సీహెచ్‌సీకే రావడంలేదని, అటువంటప్పుడు సమీక్షలో ఎమ్మెల్యే ముందు ఈ విషయం పెడితే ఏమవుతుందోనన్న భయంతో సిబ్బంది గాని, మెడికల్‌ ఆఫీసర్‌ గాని బుధవారం నోరు మెదపలేదు. వార్డుల్లో నర్సులకు సహాయకారిగా ఎంఎన్‌వో లేకపోవడం వల్ల క్షతగాత్రులకు చికిత్స అందించడంలో, రోగులను వార్డుల్లోకి తరించడంలో ఇబ్బంది పడుతున్నారు. దీనిపై ఎమ్మెల్యే దృష్టి సారించాలని కోరుతున్నారు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page