top of page

అవి‘నీతికి చెదలు’

Writer: NVS PRASADNVS PRASAD
  • గణనీయంగా తగ్గిన ఏసీబీ కేసులు

  • డబ్బున్న డిపార్ట్‌మెంట్స్‌పై దృష్టి సారించని అధికారులు

  • కొందరితో బంధాలు.. ఫిర్యాదులు పట్టించుకోరు

  • దీర్ఘకాలంగా ఏసీబీలోనే కొనసాగుతున్న అధికారులు



(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

రాష్ట్రంలో ఎక్కువ అవినీతి కేసులు నమోదు చేసే జిల్లాగా శ్రీకాకుళం ఏసీబీకి పేరుంది. దానిలో పనిచేసే సిబ్బంది పాత్ర ఉంది. అందుకే 2014 వరకు విజయనగరం ఏసీబీ డీఎస్పీ పరిధిలో ఉన్న శ్రీకాకుళం జిల్లాకు డీఎస్పీ స్థాయి అధికారిని నియమించి సిబ్బంది సంఖ్యను పెంచి ప్రభుత్వం ఏసీబీని బలోపేతం చేసింది. దానికి తగినట్లుగా ఇక్కడ ఏసీబీ డీఎస్పీలుగా పనిచేసిన రంగరాజు, రాజేంద్రల హయాంలో సంచలనం సృష్టించిన కేసులు నమోదు చేసి, అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెట్టేలా చేశారు. ప్రస్తుతం ఆ వేగం, పెద్ద తిమింగలాలు దొరక్కపోవడాన్ని ఇక్కడ లంచం తీసుకోవడం, ఇవ్వడం సాధారణమేనని ప్రజలు భావిస్తున్నారా? లేదూ అంటే ఏసీబీ తన వాడీ వేడిని కోల్పోయిందా? అర్థం కావడంలేదు.

రంగరాజు డీఎస్పీగా ఉన్న సమయంలో నిత్యం ప్రజల మధ్య ఉంటూ, అవినీతికి వ్యతిరేకంగా వారికి అవగాహన కల్పిస్తూ, మీడియా ప్రతినిధుల ద్వారా ఏసీబీకి విస్తృత ప్రచారం కల్పించారు. ఆయన డీఎస్పీగా ఉన్న సమయంలోనే జిల్లాలో ఐటీడీఏ అధికారిగా పని చేసిన జె.వెంకటరావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. సుమారు కోటి రూపాయల బీసీ సంక్షేమ ఉపకార వేతనాల కుంభకోణాన్ని వెలికితీసి, కేసు నమోదు చేశారు. 2015 డిసెంబర్‌లో ఎక్సైజ్‌ అధికారుల జీపును అడ్డగించి ఆకస్మిక దాడి, 2016 సెప్టెంబర్‌లో ఏ.పి.ఈ.ఐ.డి.సి. ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ మట్ట జగ్గారావు కార్యాలయంపై ఆకస్మిక దాడి, 2016 అక్టోబర్‌లో విశాఖపట్నం నుంచి వచ్చి జిల్లాలో సా`మిల్లుల వద్ద మామూళ్లు వసూలుచేస్తున్న అటవీశాఖ ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ సిబ్బందిపై ఆకస్మిక దాడి వంటివి గత వైభవంగానే మిగిలిపోయాయి.

రంగరాజు తర్వాత ఏసీబీ డీఎస్పీగా వచ్చిన రాజేంద్రకు జిల్లా నైసర్గిక స్వరూపంపై పూర్తి అవగాహన ఉండటం, జిల్లాలో పోలీస్‌ శాఖలో పనిచేసి ఉండటం వల్ల ఇన్ఫార్మర్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని అవినీతి అధికారుల సమాచారం సేకరించి దాడులు చేసేవారు. ఆయన కాలంలో జిల్లా ఎక్సైజ్‌ ఉన్నత అధికారిగా పనిచేసిన అధికారి ఇంటిపై ఆకస్మిక దాడి చేసి, లంచంగా తీసుకున్న సుమారు రూ.4లక్షలు సీజ్‌ చేయటం జిల్లా ప్రభుత్వ ఉద్యోగ వర్గాలలో సంచలనం సృష్టించింది. ఆయన కాలంలోనే, ఉపకార వేతనాల కుంభకోణంలో సుమారు 11 మంది అధికారులను అరెస్ట్‌ చేశారు. తర్వాత వచ్చిన అధికారులు సంఖ్యాపరంగా అత్యధిక కేసులు నమోదు చేస్తున్నప్పటికి, కొన్ని శాఖలపై వచ్చిన ఫిర్యాదులను పట్టించుకోవటం లేదనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. అదేవిధంగా ఆకస్మిక దాడుల విషయంలో కొంచెం వెనుకబడినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

అవినీతికి పాల్పడే అధికారులు కూడా ఏసీబీ అధికారుల విధివిధానాలపైన అవగాహనకు వచ్చి దరఖాస్తుదారులను లేదా లబ్ధిదారులను నేరుగా లంచం అడగకుండా వివిధ మార్గాలు అనుసరించటం, అదే సమయంలో ఏసీబీ అధికారులు బాధితుల నుంచి సాంకేతిక ఆధారాలు కావాలని అడగటం వల్ల చాలా ఫిర్యాదులు కేసు నమోదు వరకు వెళ్లటం లేదని తెలుస్తోంది. ఇంకా విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే.. ఏసీబీలో పనిచేసే అధికారులు అవినీతి అధికారుల నుంచి లంచాలు తీసుకొని వారిని విడిచిపెట్టేస్తారని, లేదంటే నివేదికలో వారిపై ఎటువంటి చర్యలకు సిఫార్సు చేయరని ఆరోపణలున్నాయి. దీనికి ఉదాహరణ జిల్లాలో సంచలనం సృష్టించిన బీసీ ఉపకార వేతనాల కుంభకోణంలో ముద్దాయిగా ఉండి, అరెస్ట్‌ అయి, బయటకు వచ్చిన అప్పటి కార్యాలయ సీనియర్‌ సహాయకురాలు, ఇప్పటి పర్యవేక్షకురాలు ఏసీబీ అధికారులకు లంచం ఇచ్చి తనపై అభియోగపత్రం దాఖలు చేయకుండా చేసుకున్నానని బహిరంగంగా చెప్పటం, ఈ వ్యాఖ్యలు దిన పత్రికలలో ప్రచురితం కావటం అందరికీ తెలుసు. అయినా సంబంధిత అధికారులు దీన్ని ఖండిరచలేదు. అందుకే ఈ అనుమానాలు కాస్తా ఆరోపణలుగా, ఆరోపణలు క్రమంగా వాస్తవాలుగా మారిపోతున్నాయన్న వాదన ఉంది.

ఏసీబీ అధికారులతో సన్నిహితంగా ఉండే ప్రభుత్వ శాఖలలో రవాణా శాఖ అధికారులు ప్రథమ స్థానంలో ఉంటారు. వీరు ప్రతినెలా ఏసీబీ అధికారులకు భారీ స్థాయిలో మామూళ్లు ఇవ్వటంతో పాటు వారి వ్యక్తిగత అవసరాలకు వాహనాలు సమకూర్చడంతో ఏసీబీ అధికారులను మచ్చిక చేసుకొని, వారి దాడుల నుంచి రక్షణ పొందుతారనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఇందుకు సాక్ష్యం 2007 తర్వాత జిల్లా రవాణా శాఖ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించకపోవడమే. అలా అని ఈ శాఖలో అవినీతి లేదని చెప్పగలరా? అలాగే నిత్యం ఆదాయం ఉండే రిజిస్ట్రేషన్‌, గనులు, అధిక ఆదాయం వచ్చే ఇతర శాఖల అధికారులు అందరూ ఏసీబీ అధికారులకు భారీ బహుమతులు ఇచ్చి రక్షణ పొందుతుంటారనే భావన ప్రజలలో బలంగా ఉంది. ఇచ్ఛాపురంలో సమగ్ర తనిఖీ ప్రాంగణం ఉండే సమయంలో ఏసీబీ సిబ్బందికి స్వర్ణయుగంగా చెప్తారు. 2017 జులై 1 తర్వాత సమగ్ర తనిఖీ ప్రాంగణం మూసివేసిన తర్వాత కూడా అక్కడ కొనసాగిన రవాణా శాఖ విభాగం చెక్‌పోస్ట్‌ అధికారులు ఏసీబీ అధికారులకు నెలవారి బహుమతులు ఇచ్చేవారని ప్రైవేట్‌ డిస్కషన్‌ నడుస్తుంది. ఆ బహుమతుల పంపకంలో తేడాలు వచ్చి 2022లో ఏసీబీ సిబ్బంది రవాణా శాఖ చెక్‌పోస్ట్‌పై దాడులు చేసి అధికారులను అరెస్ట్‌ చేశారనే గుసగుసలున్నాయి.

ఇక 2024లో ఏసీబీ నమోదు చేసిన కేసు వివరాలు చూస్తే కేవలం రెండు లంచం తీసుకున్న కేసులు, ఒక ఆదాయానికి మించిన కేసు మినహా మరి ఏ రకమైన కేసులు నమోదు చేయకపోవటమే ఏసీబీ పనితీరు మందగించిందనటానికి ఉదాహరణ. అదే విధంగా ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు సంబంధించి ఒకరే డీఎస్పీగా ఉండటం, సిబ్బంది ఎక్కువ మంది ఉన్నప్పటికీ వారంతా ఏసీబీలోకి వచ్చి సుమారు ఆరేళ్లు దాటిపోవటంతో ఏ క్షణమైనా మాతృశాఖకు వెళ్లిపోతామనే భావనలో ఉండటం, సిబ్బందిపై అధికారులకు సరైన నమ్మకం లేక వారికి పని అప్పచెప్పకపోవటం వంటివి ఏసీబీ పనితీరు మందగించటానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page