అవినీతికి వీఆర్.. రాజకీయాలకు సస్పెన్షన్
- Prasad Satyam
- Jul 29
- 4 min read
పోలీస్ శాఖపై రాజకీయ రెడ్‌మార్క్
జిల్లాలో అత్తారిల్లులా మారిన ‘వేకెన్సీ రిజర్వ్ ’
పలాస హిట్ అండ్ రన్ ఎపిసోడ్‌లో అరెస్టు కాని మరో ముగ్గురు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
పిడుగుకు, బియ్యానికి ఒకే మంత్రం అన్న సామెత ఉంది. దీనికి అర్థమేమిటో తెలియదు గాని అన్నిటినీ ఒకే గాటన కట్టడం సరికాదన్న భావన మాత్రం ఇందులో కనిపిస్తుంది. విక్రమార్కుడు సినిమాలో రవితేజ అన్నట్టు పోలీసోడు ట్రాన్స్‌ఫర్ అయితే పోలీస్‌స్టేషన్‌కే వెళ్తాడు గాని పోస్టాఫీసుకు కాదన్న డైలాగులో కంటిన్యూషన్ ఇవ్వడం మర్చిపోయినట్టున్నారు.. పోలీసోడు ఎక్కడికెళ్లినా బుద్ధి మాత్రం పోలీసుదేనన్న విషయం. జిల్లాలో పోలీస్ బాస్ మహేశ్వర్‌రెడ్డి నిజాయితీపరుడు కావడం వల్ల జిల్లాలో అవినీతి ఆరోపణలు, స్టేషన్ మామూళ్ళు వసూలు చేసే పోలీసులు తరచుగా వీఆర్‌లోకి వెళ్తున్నారు. అయితే అదే సమయంలో రాజకీయ నాయకులను సంతృప్తిపర్చడం కోసం పైస్థాయి ఉన్నతాధికారులు తీసుకునే చర్యల వల్ల ముక్కుసూటి పోలీసు అధికారులు కూడా వీఆర్‌లోకి వెళ్లిపోతున్నారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఆరోపణలున్నవారు వీఆర్‌లోకి, రాజకీయ కారణాలకు బలైనవారు ఏకంగా సస్పెన్షన్‌కు గురి కావడం ఇప్ప్పుడు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. పోలీస్‌స్టేషన్‌లో మామూళ్ళు, సెటిల్మెంట్లు సర్వసాధారణం. అయితే ఇందులో మానవీయ కోణం లేకుండా బాధితుడ్ని పిండి పిప్పి చేసినప్ప్పుడు మాత్రమే ఆరోపణలు బయటికొస్తున్నాయి. అది కూడా మహేశ్వర్‌రెడ్డి లాంటి నిజాయితీపరుడు ఎస్పీగా ఉండటం వల్ల పట్టుబట్టి మరీ చర్యలకు ఒత్తిడి తెస్తున్నారు. అదే సమయంలో జిల్లాలో కొన్ని సమస్యాత్మక స్టేషన్లలో పని చేస్తున్న ఆఫీసర్ల మీద రాజకీయ ఒత్తిడి వచ్చినప్ప్పుడు ఇదే మహేశ్వర్‌రెడ్డి కాపాడాలని చూసినా, ఆయన శక్తి సరిపోవడం లేదు. దీంతో జిల్లాలో రెండేళ్ల కూటమి పాలనలో పోలీసులకు వీఆర్ అనేది అత్తారిల్లులా మారిపోయింది. గతంలో ఇదే డిపార్ట్‌మెంట్‌లో వేకెంట్ రిజర్వ్.. అంటే పనిష్మెంట్ కిందే చూసేవారు. ఎప్ప్పుడైతే పార్టీలు మారి అధికారాలు చేతులు మారుతున్నాయో వీఆర్ అనేది ఇప్ప్పుడు పనిష్మెంట్ కాదనే భావన అందరిలోనూ ఏర్పడింది. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చినప్ప్పుడు టీడీపీకి సేవ చేశారంటూ అనేకమంది పోలీసు అధికారులను వీఆర్‌లో ఉంచింది. 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో అచ్చెన్నాయుడును అరెస్టు చేసిన టీమ్ దగ్గర్నుంచి రాష్ట్రంలో అడిషనల్ డీజీ హÃదా వరకు అనేకమంది పోలీసు అధికారులను వీఆర్‌కు పంపించింది. దీంతో వేకెంట్ రిజర్వ్ అనేది పనిష్మెంట్ కాకుండాపోయింది. ఇది కేవలం కక్షసాధింపులో భాగమని జనం ఒక అభిప్రాయానికి వచ్చేశారు. సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేయడం కూడా పనిష్మెంట్ కిందకు రాదు. కేవలం ఆరోపణలపై విచారణలు చేపడుతున్నారు కాబట్టి దానిపై సంబంధిత ఉద్యోగి ప్రభావం ఉండకూడదని సస్పెండ్ చేసి, మÖడొంతుల జీతం ఇస్తున్నారు. కాబట్టి దీన్ని కూడా పనిష్మెంట్‌గా ఎవరూ చూడటంలేదు. కాకపోతే జిల్లా పోలీసు విభాగంలో అవినీతి ఆరోపణలు ఉన్నవారు వీఆర్‌లోకి, రాజకీయ అజెండాకు బలైపోయినవారు సస్పెన్షన్‌లోకి వెళ్లిపోవడమే ఇప్ప్పుడు ఆందోళనకు గురి చేస్తుంది. పలాసలో మాజీమంత్రి అప్పలరాజు తనయుడు జరిపాడని నమోదైన రోడ్డు యాక్సిడెంట్ కేసులో వాస్తవానికి అక్కడ సీఐ రామకృష్ణ, ఎసఐ సునీల్‌లకు ఎటువంటి ప్రమేయం లేదు. కాకపోతే అప్పలరాజు లక్ష్యంగా జరిగిన ఆపరేషన్‌లో సీన్ గ్రావిటీని పెంచడానికి పోలీసు అధికారులను సస్పెండ్ చేయాల్సి వచ్చింది. వాస్తవానికి జిల్లా పోలీస్ బాస్‌తో పాటు ఉత్తరాంధ్ర స్థాయి పోలీసు అధికారి వరకు ఎవరికీ ఇది ఇష్టంలేదు. చివరి వరకు వీరి సస్పెన్షన్‌ను అడ్డుకోడానికే ప్రయత్నించారు. అయితే అప్పలరాజును అరెస్టు చేయాలంటే సీన్‌లో సీరియస్‌నెస్ అవసరం. అందుకు వీరిని బలి తీసుకున్నారు. వాస్తవానికి బైక్ యాక్సిడెంట్ అప్పలరాజు తనయుడు ఆరవ్ వర్మనో, లేదూ బైక్ ఓనర్ సిద్ధార్థ త్యాడీనో చేయలేదని, అప్పలరాజు మేనేజర్ శ్రీనివాస్ చేశాడంటూ సీఐకి పదే పదే ఫోన్ చేసి కాన్ఫరెన్స్‌లో డాక్టర్ సీదిరి అప్పýరాజును ఉంచి మరీ మాట్లాడించిన వ్యక్తులు గాని, చనిపోయిన దానయ్య కుటుంబంతో ఒప్పందం చేసుకున్నవారు గాని, అందులో సాక్షి సంతకాలు చేసిన టీడీపీ నాయకులు గాని ఏ ఒక్కరూ పోలీసులను తప్ప్పుదోవ పట్టించినందుకు ఇప్పటికీ అరెస్టు కాలేదు. 16 రోజుల రిమాండ్ తర్వాత ఆరవ్ వర్మకు కూడా బెయిల్ వచ్చేసింది. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న మాజీమంత్రి అప్పలరాజును పరామర్శించడానికి స్వయంగా మాజీ ముఖ్యమంత్రి జగనే గురువారం అంపోలు జైలుకు వస్తున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు అప్పలరాజుకు కూడా బెయిల్ వచ్చేస్తుంది. ఆ తర్వాత పరామర్శలు, పొలిటికల్ మైలేజ్ పెరగడం సాధారణం. ఇంత సుదీర్ఘ ఎపిసోడ్ భవిష్యత్తులో అనేకమందికి మైలేజ్‌ను ఇస్తుంది. కానీ తమ ప్రమేయం లేని రాజకీయానికి బలైపోయిన పోలీసు అధికారుల ఎసఆర్‌లో మాత్రం రెడ్‌మార్క్ ఉండిపోతుంది. పలాస కేసులో సస్పెండయిన సీఐ రామకృష్ణనే తీసుకుంటే మంచి అధికారిగా పేరుంది. అన్నీ అనుకూలిస్తే త్వరలోనే డీఎస్పీ అయ్యే ఛాన్సుంది. కానీ బైక్ యాక్సిడెంట్ కేసులో రాజకీయం ఆయన్ను బలితీసుకుంది. అప్పలరాజు తనయుడు ఆరవ్ వర్మ పెట్రోల్ బంక్‌లో ఆయిల్ కొట్టించి రోడ్డు మీదకు వెళ్లిన ఫుటేజీ మాత్రమే ఉంది. రోడ్డు మీద దానయ్యను ఢీకొన్న రికార్డింగు ఎక్కడా లేదు. అలాగే యాక్సిడెంట్ తర్వాత ద్విచక్ర వాహనాన్ని నెట్టుకొస్తున్న మేనేజర్ శ్రీనివాస్ మాత్రమే ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులకు కనిపించాడు. అదే సమయంలో అప్పýరాజుతో అనుబంధం ఉన్న కొందరు శ్రీనివాసే యాక్సిడెంట్ చేశారంటూ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలం వద్ద కనిపించిన శ్రీనివాస్, అప్పలరాజు మనుషులు చెప్పింది ఒకటే కావడంతో పోలీసులు కేసు కట్టారు. కానీ అక్కడే మట్టి తోలుతున్న టిప్పర్ డ్రైవర్ ఈ ఘటనను చూశారన్న విషయం కనిపెట్టిందే రామకృష్ణ. ఎందుకంటే.. ఆ రోడ్డులో మట్టిని తోలుతున్న తమ వాహనమే ఢీకొట్టిందని పోలీసులు భావిస్తారన్న ఉద్దేశంతో అప్పటికే జరిగిపోయిన యాక్సిడెంట్ కోసం టిప్పర్ డ్రైవర్ లారీ ఓనర్‌కు సమాచారమిచ్చాడు. ఆ మేరకు బండి ఓనరు సిద్ధార్థ్ త్యాడిని ప్రశ్నిస్తే అసలు విషయాలు బయటికొచ్చాయి. కానీ ఈలోగానే ఎస్ఐ, సీఐలు సస్పెండయిపోయారు. ఇదే పలాసలో డీఎస్పీ వెంకటప్పారావును పోలీసు ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపించారు. ఈయనపై పశువుల రవాణాకు సంబంధించిన ఆరోపణలు, పక్షపాతం చూపించడంతో పాటు సున్నితమైన కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం, ఆలస్యం వహించారనే ప్రచారం ఉంది. పోలీసులు మాత్రం ఇది పాలనాపరమైన సౌలభ్యం కోసమని చెప్పుకొచ్చారు.
ఆమదాలవలస సీఐ సత్యనారాయణను, సరుబుజ్జిలి ఎస్ఐ హైమావతిని వీఆర్‌కు పంపించారు. వీరిద్దరూ ఒక కేసు విషయంలో అవినీతికి పాల్పడినట్లు శాఖాపరమైన విచారణలో తేల్చి వీఆర్‌లో పెట్టారు. ప్రస్తుతం హైమావతిని శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది. ఆమదాలవలస మండలానికి చెందిన వైకాపా నాయకుడు తొమ్మిది బీమా సంస్థల నుంచి అడ్డగోలుగా రూ. కోట్లలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణను పక్కదోవ పట్టించినట్లు సత్యనారాయణపై ఆరోపణలు ఉన్నాయి. సీఎంవో నుంచి వచ్చిన ఆదేశాలను, జిల్లా ఎస్పీ సూచనలను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించి బాధ్యుడిని రక్షించే ప్రయత్నం చేశారని ఆరోపణలు ఉన్నాయి.
సోంపేట ఎస్ఐ లోవరాజును వీఆర్‌కు పంపించారు. శ్రీకాకుళం రూరల్ ఎస్ఐగా పనిచేసిన రామును ఒక భూవివాదానికి సంబంధించిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయడంలో బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో వీఆర్‌కు పంపించేశారు. నరసన్నపేట ఎస్ఐగా పనిచేసిన దుర్గాప్రసాద్‌పై వచ్చిన ఆరోపణలపై మొదట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు, ఆ తర్వాత కంచిలికి బదిలీ చేశారు.
రెండు రోజుల క్రితం కొత్తూరు పోలీసు అధికారుల నిర్వాకంపై బాధితుడు సెల్ఫీ వీడియో ద్వారా జిల్లా ఎస్పీకి మొరపెట్టుకున్నాడు. అక్కడ పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి భాగోతాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పుకొచ్చాడు. వాస్తవానికి జిల్లాలో అన్ని చోట్లా ఇలాంటి పరిస్థితినే బాధితులు, బాధ్యులు ఎదుర్కొంటున్నారు. పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడుతున్నట్లు తరచూ వార్తలకెక్కడం సర్వసాధారణమైపోయింది.
గత కొన్ని రోజులుగా వీఆర్‌లో ఉన్న 12 మంది ఎస్ఐలను ఈ నెల 7న జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు అటాచ్ చేస్తూ, పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత మరికొందరిని వీఆర్‌లో పెట్టారు. వీఆర్‌లో ఉన్న వారికి పోస్టింగ్‌లు ఇచ్చారు. అవినీతి ఆరోపణలు వచ్చిన వారిని, ఉన్నతాధికారులు ఇచ్చిన సూచనలు, ఆదేశాలకు వ్యతిరేకంగా స్థానిక రాజకీయ ప్రాపకంతో పనిచేస్తున్న వారిని పోలీసు ఉన్నతాధికారులు వీఆర్‌లో పెడుతున్నారు. వీఆర్‌లో ఉన్న పోలీసు అధికారులకు అధికార పార్టీలకు చెందిన నాయకుల సిఫార్సులతో పోస్టింగ్‌లు ఇవ్వడం సర్వసాధారణమైపోయింది.






Comments