`రసవత్తరంగా ఇచ్ఛాపురం రాజకీయాలు
`కూటమి బలంతో నెగ్గుతామన్న ఆశతో టీడీపీ
`పిరియా విజయను బరిలోకి దించి సవాల్ విసిరిన వైకాపా
`మహిళా ఓటర్లలో ఆమెకు విశేష ఆదరణ
`దాన్ని ఎదుర్కొనేందుకు ప్రచార బరిలోకి ఎమ్మెల్యే సతీమణి
`ఏకపక్షం నుంచి హోరాహోరీ స్థాయికి మారిన ఎన్నికలు

వరుస క్రమాన్ని బట్టి రాష్ట్రంలో తొలి నియోజకవర్గంగా గుర్తింపు పొందిన ఇచ్ఛాపురంలో ఓటరు మూడ్ వారం వారం మారిపోతోంది. ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సిటింగ్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడానికి పెద్దగా అడ్డంకులు లేవని తొలుత ప్రచారం జరిగినా ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. టీడీపీ హ్యాట్రిక్ విజయానికి వైకాపా అభ్యర్థి పిరియా విజయ చెక్ పెడతారని ప్రస్తుతం చెప్పుకొంటున్నారు. ఇప్పటికే రెండుసార్లు నెగ్గడం ద్వారా ఎన్నికల మేనేజ్‌మెంట్‌లో ఆరితేరిపోయిన అశోక్‌ను కొట్టడం అంత ఈజీ కాదన్న చోటే.. కొద్దిరోజుల వ్యవధిలోనే వైకాపా అభ్యర్థి విజయ కనీసం ఐదువేల మెజార్టీతోనైనా గెలుస్తారన్న వాదన తెరమీదకు వచ్చింది. కూటమి కట్టడం వల్ల టీడీపీ మళ్లీ గెలుపు బాటలో పయనిస్తోందని భావించిన వారం రోజులకే వైకాపాలో అన్ని గ్రూపుల నాయకులు ఏకమై పిరియా విజయ గెలుపు కోసం ప్రచారం మొదలుపెట్టారు. ఈ మార్పునకు వైకాపా అభ్యర్థి మహిళ కావడం, ఆమె పట్ల సానుకూలత ఉండటమే కారణమని భావించిన టీడీపీ నాయకత్వం తమ తరఫున కూడా అభ్యర్థి సతీమణిని వ్యూహాత్మకంగా ప్రచార బరిలోకి దించింది. ప్రస్తుతానికి నువ్వా, నేనా అన్నట్లున్న ఇచ్ఛాపురంలో ఇరుపార్టీలు శక్తివంచన లేకుండా శ్రమ పడుతున్నాయి. ఇందులో ఎవరి బలాబలాలేంటో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నమే ఈ కథనం.

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఇచ్ఛాపురం నియోజకవర్గంలో మహిళా ఓటర్లే కీలకం. 1,36,998 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇదే ప్రస్తుత అధికార పార్టీ అభ్యర్థి పిరియా విజయకు బలం. గడప గడపకు వెళ్తున్న ఆమె మహిళా ఓటర్లను బాగా ఆకట్టుకుంటున్నారు. దీనికి తోడు ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపంలో ప్రతి ఇంటికి నగదు బదిలీ కావడం పిరియా విజయకు అదనపు బలంగా మారింది. ఈ విషయంలో వైకాపా ముందుందని గ్రహించిన టీడీపీ కూడా ఎమ్మెల్యే అశోక్ భార్య నీలోత్పలను రంగంలోకి దించింది. ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా అశోక్ మాత్రం సభలు, సమావేశాలు, వ్యూహాల్లో మునిగిపోయారు. ఇచ్ఛాపురం వైకాపా టికెట్ అక్కడి మున్సిపల్ చైర్‌పర్సన్‌కు ఇస్తారని మొదట ప్రచారం జరగడంతో ఆ పార్టీ క్యాడర్ మొత్తం చెల్లాచెదురౖౖెపోయింది. అలా అని పిరియా సాయిరాజ్‌కు ఇచ్చినా మనస్ఫూర్తిగా పని చేయని పరిస్థితిని గుర్తించిన పార్టీ నాయకత్వం వ్యూహాత్మకం సాయిరాజ్ సతీమణి పిరియా విజయను అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఇప్పుడు అదే ఆ పార్టీకి బలం. పిరియా సాయిరాజ్ మీద ఉన్న వ్యతిరేకతను స్థానిక క్యాడర్ విజయ మీద చూపించాలని ప్రయత్నించినా అధిష్టానం ఊరుకోపోవడంతో సాయి తమతో ఎలా ఉన్నా, పిరియా విజయ మంచివారన్న భావనతో అసమ్మతిని వీడి వైకాపా క్యాడర్ పని చేయడం ప్రారంభించింది. అయితే ఇది మనస్ఫూర్తిగా జరుగుతోందా? కడుపులో కత్తులు పెట్టుకుని చేస్తున్నారా? అన్నది మాత్రం ఫలితాల తర్వాతే తేలుతుంది.
అధికార పార్టీకి అవరోధాలు
పిరియా విజయ విజయం సాధించాలంటే అనేక బాలారిష్టాలను దాటుకుని వెళ్లాల్సి ఉంది. అభ్యర్థిగా ఆమె అందరి మద్దతు పొందగలిగినా, పోల్ మేనేజ్‌మెంట్ చేయలేకపోతే మాత్రం ఇప్పటికే మూడో ఎన్నికకు వెళ్తున్న అశోక్‌ను ఎదుర్కోవడం కష్టమవుతుంది. గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థికి 72వేల ఓట్లు రాగా, బెందాళం అశోక్‌కు దాదాపు 79వేల ఓట్లు వచ్చాయి. అదే సమయంలో జనసేన అభ్యర్థికి 12వేల ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం జనసేన, టీడీపీ కలవడం వల్ల ఓట్ షేర్ టీడీపీకే ఎక్కువ కనిపిస్తోంది. దీనికి తోడు అధికార పార్టీ ఓటు చీల్చడానికి కాంగ్రెస్ నుంచి మాసుపత్రి చక్రవర్తి రెడ్డి పోటీలో ఉన్నారు. అలాగే రామచంద్రయాదవ్ పెట్టిన పార్టీ నుంచి అదే సామాజికవర్గానికి చెందిన మరొకరు నామినేషన్ వేస్తున్నారు. వీరిద్దరూ చీల్చే ఓట్లు వైకాపావే కావడం గమనార్హం. దీనికి తోడు కవిటి, సోంపేట మండలాల్లో ఉన్న 7,340 మత్స్యకార ఓట్లు ప్రస్తుతం టీడీపీతో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అలాగే కొత్తగా ఆరువేల మంది ఓటర్లు ఇచ్ఛాపురం నియోజకవర్గంలో చేరారు. వీటిలో నాలుగువేలు పోలైనా యువత కోటాలో పవన్‌కల్యాణ్ మద్దతిచ్చిన పార్టీకి ఆ ఓట్లు వెళ్లిపోతే వైకాపాకు కష్టమవుతుంది. ప్రచారంలో ఎంత దూసుకుపోయినా, పోల్ మేనేజ్‌మెంట్‌లో ఇటువంటి కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇచ్ఛాపురంలో ప్రతి ఎన్నికల్లో 60 శాతం ఓటింగ్ 44 గ్రామాల నుంచి వస్తోంది. ఈ 44 గ్రామాలు ఏవి? అక్కడ ఎవరికి పట్టుంది? అనేవి తెలుసుకోవడమే పోల్ మేనేజ్‌మెంట్. ప్రచారంలో పిరియా విజయ ఆకట్టుకున్నంతగా అశోక్ భార్య నీలోత్పల ఆకట్టుకోకపోయినా, సంప్రదాయబద్ధంగా టీడీపీకి అక్కడ బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఇప్పుడు అన్ని ప్రతికూలతలను అధిగమించాల్సిన బాధ్యత ఒక్క పిరియా విజయ మీదే ఉంది. ఆమె కాకుండా మరొకరు వైకాపా అభ్యర్థి అయి ఉంటే ఈపాటికే అధికార పార్టీ చేతులెత్తేసుండేది. గెలుపే అంతిమం కాబట్టి ప్రచారం ఎంత ముఖ్యమో, ఎన్నిక సవ్యంగా నిర్వహించుకోవడమూ అంతే ముఖ్యం. ఎందుకంటే ఈసారి ఏ పార్టీకీ రాష్ట్రంలో వేవ్ క్రియేట్ కాలేదు. స్థాేనికంగా బరిలో ఉన్న అభ్యర్థి గుణగణాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఓటేయడానికి సిద్ధపడుతున్నారు జనం.
ఇచ్ఛాపురం మున్సిపాలిటీ కీలకం
వైకాపాలో జనసేన, బీజేపీ నాయకుల చేరికలు జోరుగా సాగుతుంటే, 2019లో పార్టీని వీడి వైకాపాలో చేరిన వారంతా మళ్లీ టీడీపీ గూటికి చేరుతున్నారు. సామాజికవర్గంతో సంబంధం లేకుండా పార్టీ బలం, వ్యక్తిగత ఇమేజ్‌తోనే గెలిచే నియోజకవర్గాల్లో ఒకటైన ఇచ్ఛాపురంలో ప్రస్తుత ఎన్నికలు అదే ప్రాతిపదికన జరగనున్నాయని జోరుగా చర్చ సాగుతుంది. డాక్టర్ బెందాళం అశోక్‌కు ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎంపీ అభ్యర్ధిగా బరిలో ఉండటం కలిసొచ్చే అంశం. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో 2014లో టీడీపీ కావాలన్న ప్రజల కోరక మేరకు బెందాళంను ఇచ్ఛాపురం ప్రజలు గెలిపించుకున్నారు. 2019లో వైఎస్ జగన్ గాలిని ఎదుర్కొని కూడా ఆయన గెలిచారు. దీనికి ప్రధాన కారణం తిత్లీ పరిహారం పంపిణీ. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు తిత్లీ పరిహారంగా సుమారు రూ.40 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశారు. గ్రామాల వారీగా జన్మభూమి కమిటీలు సూచించిన టీడీపీ మద్దతుదారులతో పాటు వైకాపాకు చెందిన కొందరికి పరిహారాన్ని జమచేశారు. అర్హుల కంటే అనర్హులకే ఎక్కువ శాతం పరిహారం జమైంది. ఇది బెందాళం అశోక్‌కు 2019 ఎన్నికల్లో కలిసొచ్చి సుమారు 7,145 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తుతో పోటీ చేస్తే 25,278 ఓట్ల మెజార్టీతో గెలిచారు. వరుసగా మూడోసారి అశోక్ బరిలో నిలిచి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 2014లో కలిసొచ్చిన పార్టీలతోనే ఇప్పుడు జత కట్టడం వల్ల నాటి ఫలితాలను పునరావృతం చేస్తామని టీడీపీ నాయకులు చెబుతున్నారు. కూటమికి సంబంధించిన నాయకులు టీడీపీ అభ్యర్థితో ఉన్నా, ఓటర్లను మాత్రం గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం అనేక రూపాల్లో ఆదుకోవడం వల్ల ఓటు తమకే దక్కుతుందన్న ధీమా వైకాపాలో ఉంది. నియోజకవర్గంలో సోంపేట, కంచిలి మండలాలు ఒక పార్టీకి అనుకూలంగా ఉండగా కవిటి, ఇచ్ఛాపురాల్లో మరో పార్టీ బలంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాల లబ్ధిదారుల లెక్క చూసుకున్నా పిరియా విజయకు గెలుపు నల్లేరు మీద బండినడక కావాలి. కానీ ఇప్పటికీ అక్కడ విజయం ఎటువైపు అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతుందంటే కారణం ఇచ్ఛాపురం మున్సిపాలిటీయే. ఇక్కడ ఓటింగ్ పర్సంటేజీని బట్టి గెలుపు నిర్ధారణ అవుతుంది.
コメント