`గత ఎన్నికల్లో పని చేసిన నాయకులంతా దూరం
`మంత్రికి వ్యతిరేకంగా మున్సిపల్ ఛైర్మన్ ప్రచారం
`సంక్షేమ పథకాల లబ్ధిదారులే గెలిపిస్తారన్న ధీమా
`ఆలస్యంగా బరిలోకి దిగినా గట్టి పోటీ ఇస్తున్న శిరీష
`పలాసలో రంజుగా మారుతున్న ఎన్నికల రంగం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
పలాస ఓటర్లు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలోని పలాస`కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వర్గాల ప్రజలు, వ్యాపారుల్లో అత్యధికులు అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల బాధితులే. 2014`19 మధ్య టీడీపీ హయాంలో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకొని 2019లో వైకాపాకు అండగా నిలిచారు. అయితే వైకాపా ప్రభుత్వం వచ్చినా టీడీపీ హయాంలో ఎదురైన అనుభవాలే పునరావృతమయ్యాయి. ఈసారి ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీల నుంచి కొత్త అభ్యర్థులు బరిలో ఉంటారని ప్రచారం జరిగినా మళ్లీ పాత ముఖాలే పోటీలో నిలిచాయి. దీంతో పోటీలో ఉన్న ఇద్దరిలో ఎవరు సమర్ధులు అన్న అంశంపైనే ఓటర్లలో చర్చ ప్రారంభమైంది. 2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో మంత్రి సీదిరి అప్పలరాజు 16,247 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంతకు ముందు 2014లో చంద్రబాబు సమర్ధ నాయకత్వం కావాలన్న నినాదంతో గౌతు శివాజీ వైకాపా అభ్యర్ధి వజ్జ బాబూరావుపై 17,525 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తన రాజకీయ వారసత్వం కుమార్తె శిరీషకు ఇవ్వాలన్న ఉద్దేశంతో శివాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ పెత్తనం మాత్రం అల్లుడు చేతిలో పెట్టారు. శిరీష ఎమ్మెల్యేగా గెలుపొందాలంటే కార్యకర్తలను ముద్దుగా చూసుకోవాలన్న చంద్రబాబు సిద్ధాంతం మేరకు శివాజీ అల్లుడు వెంకన్నచౌదరి తిత్లీ పరిహారాన్ని పార్టీ మద్దతుదారులకు, సానుభూతిపరులకు అందించి అర్హులకు ముఖం చాటేశారు. దీంతో గౌతు కుటుంబానికి 2019లో ఎదురుదెబ్బ తగిలింది. ఇటు సీదిరి అప్పలరాజు గెలిచిన ఏడాదిలోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలకు మేలు చేయడం కంటే స్వప్రమోజనాలు తీర్చుకోవడంలో సఫలీకృతులయ్యారన్న విమర్శలు ఉన్నాయి. 2014లో టీడీపీని భ్రష్టుపట్టించినవారే ఇప్పుడు మంత్రి అప్పలరాజుకు ప్రధాన అనుచరులుగా ఉన్నారు.

చేరికల మంత్రాంగం
నియోకవర్గంలో వైకాపా, టీడీపీ అభ్యర్థులిద్దరూ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. శిరీష నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తునే పార్టీలో చేరికలపైనా దృష్టి పెట్టారు. టీడీపీకి ధీటుగా వైకాపా కూడా చేరికలను ప్రోత్సహిస్తోంది. అయితే వీటిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపేందుకు కార్యకర్తలకు, పార్టీ అభిమానులకే మళ్లీ కండువాలు వేసి చేరికల కలరింగ్ ఇస్తున్నారని ఇరుపార్టీలపై విమర్శలు ఉన్నాయి. పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారులంతా తమ పక్షానే ఉన్నారన్న ధీమాతో వైకాపా ఉంటే, స్థానిక నాయకుల బాధితులు, వ్యాపారులు, ఉద్యోగులు, మేధావులు, యువత తమ వైపు ఉన్నారని టీడీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. జనసేన, బీజేపీల ఓటింగ్ పోలరైజ్ అవుతుందన్న ఆశాభావం కూడా టీడీపీలో ఉంది. ‘మీ ఇంట్లో మేలు జరిగితే ఓటెయ్యండి’ అంటూ సీఎం జగన్మోహన్‌రెడ్డిని, టీడీపీతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని ప్రచారం చేస్తున్న చంద్రబాబునే అభ్యర్ధులుగా భావించి ఓట్లు వేయాల్సిన పరిస్థితి నియోజకవర్గంలో ఉంది.
పోటాపోటీ ర్యాలీలు
టీడీపీ అభ్యర్థిగా గౌతు శిరీషను ప్రకటించడంలో చాలా జాప్యం జరిగినా, టికెట్ ఖరారైన తర్వాత పలాస పట్టణంలో సుమారు ఏడువేల మందితో ఆమె నిర్వహించిన ర్యాలీ ఆ పార్టీ క్యాడర్‌లో జోష్ నింపి వైకాపాకు సవాల్ విసిరింది. కాగా ఈ నెల ఆరో తేదీన వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ నుంచి ప్రచారం ప్రారంభించిన మంత్రి సీదిరి నిర్వహించిన బైక్‌ర్యాలీకి పార్టీ క్యాడర్ నుంచి ఊహించినంత స్పందన రాలేదని ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. సుమారు రూ.50 లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండాపోయిందన్న అభిప్రాయం ఉంది. అన్ని ఖర్చులతో ర్యాలీలో పాల్గొన్న బైక్‌కు రూ.1,500, కారుకు రూ.4వేలు ముట్టజెప్పినా నిరాశే మిగిలిందంటున్నారు. పలాస`కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు మంత్రి ర్యాలీకి ముఖం చాటేశారు. మున్సిపల్ ఛైర్మన్‌గా గిరిబాబుకు దక్కాల్సిన గౌరవాన్ని మంత్రి సీదిరి ఇవ్వడం లేదని ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. చైర్మన్‌కు సమాంతరంగా ఇద్దరు కౌన్సిలర్లు డబ్బీరు భవానీ, బోర బుజ్జిని యాక్టింగ్ చైర్మన్లుగా తయారుచేసి పాలన వ్యవహారాలు నడిపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కౌన్సిల్‌లో అనేక సందర్భాల్లో ఈ వ్యవహారం వెలుగుచూసింది. దీంతో గిరిబాబు మీ మనసుకు నచ్చినట్టు ఓటు వేయండి అంటూ వార్డుల్లో ప్రచారం ప్రారంభించారని వైకాపా నాయకులే చెబుతున్నారు.
దూరమైన వైకాపా క్యాడర్
టీడీపీకి 2019లో దూరమైన కార్యకర్తలు, నాయకులు మళ్లీ శిరీష దరి చేరగా, 2019లో వైకాపాకు పని చేసిన ప్రముఖులంతా దూరమయ్యారు. దీనికి మంత్రి సీదిరి తీరే కారణమన్న వాదన పార్టీలో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి వైకాపాలో అసమ్మతికి బీజం పడిరది. అసమ్మతి నేతలంతా ఒక్క తాటిపైకి వచ్చి సీదిరికి వ్యతిరేకంగా సమావేశాలు పెట్టినా అధిష్టానం పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నికల వేళ అసమ్మతిని చల్లార్చడానికి పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు చర్యలే తీసుకోలేదు. దీంతో కొందరు పార్టీని వీడి తటస్థంగా ఉంటే మరికొందరు టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో వైకాపా విజయంలో కీలకంగా వ్యవహరించిన కాళింగ, కాపు, వైశ్య, మత్స్యకార, యాదవ సామాజిక వర్గాలకు చెందిన ముఖ్య నాయకులు సీదిరికి వ్యతిరేకంగా జతకడుతున్నారు. మాజీ ఎంపీపీ కొయ్య శ్రీనివాసరెడ్డి, దువ్వాడ శ్రీకాంత్, వడిశ హరిప్రసాద్, దున్న వీరాస్వామి, కోట్ని దుర్గాప్రసాద్, జుత్తు నీలకంఠం, దువ్వాడ హేమబాబు చౌదరి, కొర్ల కన్నారావు, మరడ భాస్కరరావు, విజయ్‌కుమార్‌లతో పాటు సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు 2019లో సీదిరి విజయానికి పని చేశారు. ఇప్పుడు వీరంతా పార్టీకి దూరంగా ఉన్నారు. వీరిలో కొందరు ఇప్పటికే టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వీరంతా మండల స్థాయిలో వివిధ నామినేటెడ్, పార్టీ పదవుల్లో పనిచేయగా నలుగురు కార్పొరేషన్ డైరెక్టర్లుగా పని చేశారు. మంత్రి అవినీతి, అక్రమాలు, బంధుప్రీతికి సంబంధించి 200 పేజీల పుస్తకాన్ని అసమ్మతి నేతలు పార్టీ అధిష్టానానికి అందించారు. తాయిలాలతో వారిని మచ్చిక చేసుకునేందుకు సీదిరి ప్రయత్నించినా కొందరు అసమ్మతి నేతలు తిరస్కరించినట్టు తెలిసింది. వివిధ సంస్థలు నిర్వహించే సర్వేలను మేనేజ్ చేస్తూ ప్రత్యర్థులపై పైచేయి సాధించినట్లు కవరింగ్ ఇచ్చిన సీదిరి ఓటర్లతోనూ మైండ్ గేమ్ ఆడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే టీడీపీ, వైకాపా ప్రచారం ఊపందుకున్నందున ఓటర్ల నాడి ఎలా ఉంటుందో ఇప్పుడే అంచనా వేయలేం.
Comentários